The Secret Kitchen | గుజరాత్‌కు చెందిన ఆనల్ కొటక్‌కు చిన్నప్పటి నుంచీ వంటలంటే ఇష్టం. అమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర పాక శాస్త్రంలో మెలకువలు నేర్చుకునేది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసినా, మనసులో మాత్రం రెస్టారెంట్ స్థాపించాలనే కోరిక బలంగా ఉండేది. ఎక్కడ వంటల పోటీ జరుగుతున్నా ఠంచనుగా హాజరయ్యేది. తన మెహందీ ఫంక్షన్ రోజున కూడా ఓ వంటల పోటీకి వెళ్లింది. బహుమతితో తిరిగొచ్చింది. ఓ టీవీ షోలో పాల్గొని ‘యంగెస్ట్ చెఫ్’ బిరుదు అందుకున్నది.
తన స్వప్నం ఫలించి The Secret Kitchen అనే రెస్టారెంట్‌నూ ప్రారంభించింది. అందరికీ తెలిసినా, ఎవరూ పెద్దగా వాడని దినుసులతో అనూహ్యమైన రుచిని సాధించడం ఆనల్ ప్రత్యేకత. ఒక్క రెస్టారెంట్‌తో మొదలైన ప్రయాణం, ప్రస్తుతానికి 13 బ్రాంచీలకు చేరుకుంది. కొత్త రుచులు, సరికొత్త ప్రయోగాలతో ‘ద సీక్రెట్ కిచెన్’ మంచిపేరు సంపాదించుకుంది. త్వరలోనే.. వివిధ భారతీయ నగరాలతోపాటు దుబాయ్, అమెరికాలకు విస్తరించే ప్రయత్నంలో ఉంది ఆనల్.