యురోపియన్ దేశాల్లో పిల్లలు అన్నప్రాశన నాడే ఫుట్‌బాల్ పట్టుకుంటారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో చిన్నారులు కాళ్లతోనే విన్యాసాలు చేస్తూ.. ఫుట్‌బాల్‌ను నేల తాకకుండా బడి దాకా మోసుకెళ్తారు. మరి మనదేశానికి వస్తే.. మహా నగరాల్లోనూ ఫుట్‌బాల్ అంటే అంతగా ఎవరికీ పట్టదు. అలాంటిది మారుమూల తండాలో పుట్టిన ఓ బాలిక దృష్టి ఫుట్‌బాల్‌పై పడింది. చిరుతలా పరిగెత్తే వేగం ఆమె సొంతం. ప్రత్యర్థిని బురిడీ కొట్టించగల నేర్పు అదనపు అర్హత. ఇంకేముంది.. ఫుట్బాల్ని పాదాక్రాంతం చేసుకుంది. అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా ఎదిగింది మన ఇందూరు బిడ్డ గుగులోతు సౌమ్య. ఇటీవల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నుంచి బెస్ట్ ప్లేయర్‌గా అవార్డు అందుకున్న తెలంగాణ తేజం సౌమ్య ప్రస్థానం ఇది..
సౌమ్య స్వస్థలం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కునేపల్లి కిషన్ తండా. ఆమె తల్లిదండ్రులు ధనలక్ష్మి, గోపి. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అక్కలిద్దరిలో స్వప్నరాణికి వివాహమైంది. రెండో అక్క స్వర్ణలత ఉన్నత విద్య అభ్యసిస్తున్నది. తమ్ముడు వివేకానంద చదువుకుంటున్నాడు. తండ్రికి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఆ నిరుపేద కుటుంబం నిదానంగా దిగువ మధ్యతరగతి స్థాయికి చేరుకుంది. చిన్నప్పటినుంచి సౌమ్య చిరుతలా పరిగెత్తేది. ఆరో తరగతి దాకా ఆమె చదువు నవీపేట ప్రభుత్వ పాఠశాలలో సాగింది. బడిలో పరుగు పందెం ఉందంటే చాలు మొదటి బహుమతి సౌమ్యనే వరించేది. అయితే, ఆ చిన్నారి ప్రతిభకు అక్కడ అంతగా గుర్తింపు రాలేదు.
ఇలా కొన్నాళ్లు గడిచాయి. పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో సౌమ్య తండ్రి గోపి కుటుంబాన్ని నిజామాబాద్‌కు తరలించాడు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాడు. వేలకు వేలు ఫీజులు భారం అనుకోలేదు. తన పిల్లలకు మంచి చదువొస్తే చాలు అని భావించాడు. అదే బడిలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు.. సౌమ్యలోని ప్రతిభను మొదటగా గుర్తించాడు. ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారిలో ఏదో స్పార్క్ ఉందని గ్రహించాడు. మెరుపు వేగంతోపాటు సునిశిత దృష్టి కూడా ఆ చిన్నారిలో ఉందని గమనించాడు. వెంటనే సౌమ్య తండ్రికి ఫోన్ చేసి.. ‘మీ అమ్మాయికి సరైన శిక్షణ అందిస్తే.. క్రీడల్లో మెరికలా తయారవుతుంద’ని చెప్పాడు. తండ్రి నుంచి అంగీకారం రావడంతో.. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతారమెత్తింది సౌమ్య. కేర్ ఫుట్‌బాల్ అకాడమి సహకారం అందించగా.. శిక్షణ మొదలైన రెండేండ్లకే ఆటలో ఆరితేరింది. అండర్- 14 ఫుట్‌బాల్ జట్టులో అరంగేట్రం చేసింది. రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా చాటుతూ 19 ఏండ్లకే భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకొని ‘ఔరా!’ అనిపించుకుంది. ఈ ప్రస్థానంలో ఎందరో ఆమెకు అండగా నిలిచారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిజామాబాద్‌లోని రాఘవ హైస్కూల్లో చదివిన సౌమ్య, ఇంటర్ అదే పట్టణంలోని ఎస్ఆర్ కాలేజీలో, డిగ్రీ కేర్ కళాశాలలో చదివింది. ఒకవైపు చదువుకుంటూనే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొంటూ తన సత్తా చాటుతూ వచ్చింది.
దేశం తరపున ఫుట్‌బాల్ ఆడేందుకు అవకాశం దక్కించుకునే సమయానికి గుగులోతు సౌమ్యకు 19 ఏండ్లు. సీనియర్ జట్టులో అందరితో సమానంగా గేమ్ ఆడుతూ మంచిపేరు తెచ్చుకుంది. ఇప్పటివరకు అండర్-14, 16, 17, 18, 19 ఈవెంట్స్‌లో సౌమ్య ఎన్నో రికార్డులు సాధించింది. మైదానంలో ప్రత్యర్థులకు చిక్కకుండా తన ప్రతిభను చాటుకుంది. బంతిని తన అధీనంలో ఉంచుకోవడంలో దిట్ట అనిపించుకుంది. సాధారణంగా ఫుట్‌బాల్ జాతీయ సీనియర్ జట్టులో చోటు సంపాదించడం అంటే ఆషామాషీ కాదు. అలాంటిది చిన్న వయసులోనే అవకాశం అందిపుచ్చుకుని తెలంగాణకు గర్వ కారణంగా నిలిచింది. 2020లో గోవాలో జరిగిన భారత మహిళల ఫుట్‌బాల్ జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపికై ఆటలో మరిన్ని మెలకువలను సాధించింది.
2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్ 17 బ్రిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు సౌమ్య కెప్టెన్‌గా వ్యవహరించింది. 2020 ఆరంభంలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ లీగ్‌లో ముంబయి జట్టుకు నాయకత్వం వహించిన సౌమ్య ఆ టీమ్‌ను సెమీస్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పటివరకు 26 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2022లో నేపాల్‌లో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ గోల్‌ను నమోదు చేసింది. ఇదే ఈవెంట్లో మాల్దీవులతో జరిగిన పోరులోనూ గోల్ సాధించింది. ఇండియన్ ఉమెన్స్ లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఆడిన సౌమ్య ఏకంగా తొమ్మిది గోల్స్ సాధించింది.
అలుపెరగని పోరాట పటిమతో ఫైనల్స్‌లో 42వ నిమిషంలో గోల్‌తో జట్టును గెలిపించింది. ఇండియన్ ఉమెన్స్ లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న సౌమ్యకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ఉత్తమ క్రీడాకారిణి అవార్డుకు (ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2024-25) ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా సౌమ్య రికార్డు సృష్టించింది. ఈ నెల 2న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ కల్యాణ్ చౌబె, ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్‌వర్ధన్ సింగ్‌దేవ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నది. ఓ మారుమూల గిరిజన తండాలో జన్మించిన సౌమ్య కఠోర సాధనతో దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకుంది. మన తెలంగాణ బిడ్డ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ నుంచి ఉత్తమ ఉమెన్ ప్లేయర్‌గా అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. తండాలో పుట్టి పెరిగిన నేను ఫుట్‌బాల్‌లో ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది. ఫుట్‌బాల్ ఆటలో మరింతగా రాణించేందుకు ఈ అవార్డు ఎంతగానో దోహదపడుతుంది. నా ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైంది. మున్ముందు మరింత మెరుగైన ఆటతీరుతో మరిన్ని విజయాలు సాధించాలి. జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించడమే సరైన ప్రతిభ అనిపించుకుంటుంది. ఆ దిశగా నిరంతరం పాటుపడతాను. ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను.
…? జూపల్లి రమేశ్, నిజామాబాద్