ఆమె ఎత్తు ఐదు అడుగుల పైచిలుకు. అందాల పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఇదొక అనర్హతే. అయినా అహ్మదాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ నిరాశపడలేదు. బంధుమిత్రులు ‘పొట్టి పిల్ల’ అంటూ కామెంట్లు చేసినా పట్టించుకోలేదు. ధైర్యంగా అందాల పోటీకి దరఖాస్తు పంపింది. వివిధ వడపోతల తర్వాత బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చేతుల మీదుగా అందాల కిరీటం అలంకరించుకున్నది.
మిసెస్ ఇండియా క్వీన్ హోదా స్వీకరించింది. అప్పటికే తను ఓ మేనేజ్మెంట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. పీహెచ్డీ సిద్ధాంత వ్యాసం చివరి దశలో ఉన్నది. పరిచయ కార్యక్రమం, బీచ్ వేర్, డెజర్ట్ షూట్.. ఇలా అన్ని దశలూ దాటుకుని ఇంటర్వ్యూకు చేరుకుంది. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు ‘మహిళ కోసం మరో మహిళ నిలబడాలి’ అంటూ పదునైన సమాధానం ఇచ్చింది శిబానీ.