మేధో సంపత్తి అందరిలోనూ ఎంతోకొంత ఉంటుంది. దానికి సృజనాత్మకత జత అయితే.. ఆ మేధస్సు వన్నెకెక్కుతుంది. ఈ రెండిటికీ ఆత్మవిశ్వాసం కూడా తోడైతే ఆమె శక్తి దూబె అవుతుంది. ఈ ముప్పయ్ ఏండ్ల మహిళ ఇప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్‌గా మన్ననలు అందుకుంటున్నది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీస్ పరీక్షల టాపర్‌గా నిలిచిన శక్తి విజయం వెనుక కేవలం పుస్తకాలు మాత్రమే లేవు, గంటల తరబడి చదువుకున్న వైనం ఒక్కటే లేదు.. ఎందరికో స్ఫూర్తినిచ్చే ఆత్మవిశ్వాసం ఆమె మాటల్లో టన్నుల కొద్దీ ఉంది. ఇంతకీ ఆమె శక్తియుక్తులేంటంటే..
బనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్…. అర్ధరాత్రి దాటాక శక్తి దూబె ఒంటరిగా క్యాంపస్‌లో పచార్లు చేసేది. ఇలా నడక సాగించడం ఆమెకు అలవాటు. ఈ వాహ్యాళిలోనే తను పొద్దంతా చదువుకున్నవి మననం చేసుకునేది. తను చదువుకున్న వాటిని మరో కోణంలోనూ తర్కించేది. ఈ విశ్లేషణతో ఆ విషయంపై పూర్తి సాధికారత సంపాదించేది. ఇలా అపరాత్రులు ఒంటరిగా తిరగడంపై ఆమెకు భయం లేదా! అంటే.. ‘ఏ ధైర్యం లేకుంటే అలా క్యాంపస్‌లో ఒంటరిగా ఎలా తిరగ్గలను! చుట్టూ ఉన్న ఎన్నో అంశాలు మనకు తెలియని ధైర్యాన్నిస్తాయి. క్యాంపస్‌లో చక్కర్లు కొట్టే పోలీస్ పెట్రోల్ వ్యాన్ నాకెంతో భరోసానిచ్చేది. మన రక్షణ చూసుకునేవాళ్లు ఉన్నారన్న నమ్మకం ఎంతో బలాన్నిస్తుంది. ఆ వ్యవస్థ నాలో పబ్లిక్ సర్వీస్‌కు ప్రేరణగా నిలిచింది’ అని చెబుతుంది శక్తి.
శక్తి వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్. తండ్రి దేవేంద్ర దూబె పోలీస్ దళంలో పనిచేస్తారు. తల్లి ప్రేమ గృహిణి. ఈ దంపతుల రెండో సంతానంగా జన్మించింది శక్తి. ఇంటర్ వరకు ఆమె విద్యాభ్యాసం ప్రయాగ్‌రాజ్‌లోనే సాగింది. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. ఆ విశ్వవిద్యాలయం ఆమెలోని తృష్ణకు సరైన వేదికగా నిలిచింది. అక్కడ జరిగే చర్చలు, కార్యక్రమాలు శక్తిని ఎంతో ప్రభావితం చేశాయి. ఈ తరహా డిబేట్లు జరిగేటప్పుడు మొదట్లో ఎక్కడో వెనకాల ఉండే శక్తి.. కొన్ని రోజులకు ముందు వరుసలోకి వచ్చింది.
మరి కొన్నాళ్లకు తన గళాన్ని స్పష్టంగా వినిపించడం మొదలుపెట్టింది. ఇంకొన్నాళ్లకు స్టుడెంట్ డిబేటింగ్ కమిటీకి హెడ్‌గా ఎంపికైంది. ఈ చర్చలే తనను రాజకీయాలు, న్యాయవ్యవస్థ, ఇతర విషయాలపై పట్టు సాధించేలా చేశాయి.‘ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించేదాన్ని. అంతేకాదు, అది ఇంకా ఎలా బాగా పనిచేయగలదో కూడా ఆలోచించే దాన్ని’ అని చెబుతుంది శక్తి.
డిగ్రీ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ చేసింది శక్తి. 2018లో పట్టా అందుకున్న తర్వాత.. సివిల్స్ తన లక్ష్యంగా ఎంచుకుంది. కుటుంబం అండాదండా కూడా లభించాయి. ‘నువ్వు చదువుకో తల్లీ’ అన్నాడు తండ్రి. ‘భగవంతుడి ఆశీస్సులు నీకు ఉంటాయి’ అంది తల్లి. వారిచ్చిన ప్రోత్సాహంతో సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (రాజనీతి శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలు) ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుంది.
ఏడేండ్ల పోరాటంలో రెండుసార్లు కష్టపడినా, లక్ష్యాన్ని అందుకోలేపోయింది. మూడోసారి మరింత అకుంఠిత దీక్షతో చదివింది. టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ప్రధాన ఇంటర్వ్యూకు ముందు చాహల్ అకాడమీ నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూలో శక్తి ఇచ్చిన సమాధానాలు ఇన్‌స్టాలో వైరల్ అయినవీ ఉన్నాయి. విషయం పట్ల ఆమెకు ఉన్న అవగాహనకు వేలల్లో హిట్లు తెచ్చిపెట్టాయి. టాప్ ర్యాంకర్‌గా నిలిచింది మొదలు యూట్యూబ్ రీల్స్‌లో శక్తి మాక్ ఇంటర్వ్యూ షాట్ రీల్స్ వైరల్ అవుతున్నాయి.
పుస్తకాలతో కుస్తీ పట్టడం శక్తికి అస్సలు ఇష్టం ఉండదు అంటుంది వాళ్లమ్మ. రాత్రింబవళ్లూ అదే పనిగా పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం తనెప్పుడూ చూడలేదని చెబుతుంది. కవితలు రాయడం శక్తి అభిరుచి. ‘మీరు రాసిన ఒక కవిత వినిపించండి’ అని మాక్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు శక్తి ఇచ్చిన సమాధానం ఆమె ఆలోచనా పరిధి ఎంత విస్తృతమైనదో చెబుతుంది. నువ్వేం రాయగలవు శీర్షికతో ఆమె రాసిన కవిత ఇది.. ‘ఆకాశం గురించి రాస్తాను..
అందులో చందమామ గురించీ రాస్తాను/ చీకటి గురించి రాస్తాను.. ఉదయం గురించీ రాస్తాను../ సంగీతం గురించి రాస్తాను.. దాని వెనుకున్న బాధ గురించీ రాస్తాను..’ ఇలా రెండు పార్శాలనూ కలగలిపి తానేం రాసిందో కాదు… ఐఏఎస్‌గా తానేం సాధిస్తానో కూడా చెప్పకనే చెప్పింది శక్తి. పేరులోనే పవర్‌ను ఇముడ్చుకున్న శక్తి దూబె.. మంచి అధికారిణిగా అందరి మన్ననలూ అందుకుంటుందని మనమూ ఆశిద్దాం!