Sowmini Sunkara | ఆలోచిస్తే ఆవిష్కరణలు చేయొచ్చు. ల్యాబ్‌లో కూర్చొని ప్రయోగాలు చేయొచ్చు.. కొత్త కొత్త వంగడాలు, వ్యవసాయ పద్ధతులు సృష్టించొచ్చు. కానీ.. రైతు లాభపడాలంటే ఇవేవీ సరిపోవు. ఇంకేదో చేయాలి. అదే.. ఫుడ్ ప్రాసెసింగ్. తాను పండించిన పంటను తానే ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మితే.. మరిన్ని లాభాలు రైతన్న గల్లాపెట్టెలో పడుతాయంటున్నారు అగ్రిఘర్ వ్యవస్థాపకురాలు సౌమిని సుంకర.
ఈ ప్రపంచంలో రైతును మించిన శ్రమజీవి ఉండరు. తనకంటూ గుప్పెడు గింజలు ఉంచుకొని.. పండించిన పంటనంతా పరుల కడుపు నింపడానికే ఇచ్చేస్తాడు. రాల్చిన చెమటచుక్కలకు వెల కట్టుకోని ఒకే ఒక్క కష్టజీవి రైతు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించినా.. అతనెప్పుడూ లాభాల్లో ఉండడు. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయాణంలోనే అగ్రిఘర్ ఆలోచన పురుడు పోసుకుంది. తాను పండించిన పంటను మార్కెట్లో ఏదో ఒక ధరకు అమ్ముకొని.. తనకు కావాల్సిన దినుసులను అదే మార్కెట్లో కొంటున్నాడు రైతు. తనకు అవసరమైన వంట దినుసులను తానే ఎందుకు ప్రాసెస్ చేసుకోకూడదు అంటున్నారు అగ్రిఘర్ వ్యవస్థాపకురాలు సౌమిని సుంకర. ఎఫ్‌పీవో (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లకు.. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తిని, ఉపాధిని అందించేందుకు అగ్రిఘర్ సంస్థను ప్రారంభించారు సౌమిని. యువత ఉపాధి కోసం పల్లెలను, వ్యవసాయాన్ని వదిలి వెళ్లిపోతుంటే.. సాగుకు భవిష్యత్ ఎలా అని ఆలోచించారామె. వారిని ఉత్పాదకత వైపు అడుగులు వేయించేలా, రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసేందుకు చౌటుప్పల్‌లోని దండుమల్కాపురంలో ఓ యూనిట్ ప్రారంభించారు.
సరైన విజన్ ఉంటే.. విజయం తప్పక దరిచేరుతుందని నమ్ముతారు సౌమిని. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పాదకతను పెంచి గ్రామీణ జీవనోపాధిని మెరుగు పరచడం సౌమిని విజన్. అందుకు రైతులను, వారి పంటలను మార్గంగా ఎంచుకున్నారు. అయితే.. ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావడం సహజం. తన ఆలోచనను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ.. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో యూనిట్ కోసం భూమిని కూడా సేకరించారు. ఈ క్రమంలోనే కరోనా విజృంభించింది. ఏం చేయలేని పరిస్థితి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందనే ఉద్దేశంతో.. సరైన సమయం కోసం ఎదురుచూశారు. కరోనా గడ్డుకాలం నుంచి ప్రపంచం గట్టెక్కింది. మెల్లమెల్లగా ఒక్కో రంగం గాడిన పడింది. అయితే.. వైరస్ వ్యాప్తి సమయంలో అంతా ఇంటికే పరిమితమైపోయారు. ఆహారం విషయంలో అందరికీ ఆందోళన, ఆలోచన పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా అడుగులు వేసింది. ఈ పరిస్థితులు సౌమినికి కలిసి వచ్చాయి. రైతులతో కలిసి ‘మీరు పండించిన పంటను మార్కెట్లో అమ్ముకుంటే వచ్చే మొత్తం కంటే ఎక్కువ లాభం అందించే ఆలోచన నా దగ్గరుంది’ అంటూ వందలాది రైతు సమాఖ్యలకు తన అగ్రిఘర్ ఆలోచన వివరించారు. చాలామంది రైతులు సుముఖత వ్యక్తం చేశారు కూడా. పంటను నిత్యావసర సరుకులుగా మార్చి అమ్ముకుంటే వచ్చే లాభం గురించి వివరంగా చెప్పడంతో.. క్రమంగా రైతులు ప్రాసెసింగ్ యూనిట్‌కు రావడం మొదలైంది.
ధనం, ధాన్యం పంచితే తరుగుతుందేమో కానీ.. జ్ఞానం మాత్రం ఎంత పంచితే అంత పెరుగుతుంది. అందుకే.. సౌమిని రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ స్కిల్స్ నేర్పేందుకు సంకల్పించారు. తన దగ్గరికి వచ్చే రైతులకు కందులను పప్పుగా ఎలా మార్చాలి? పొద్దు తిరుగుడు గింజలను సన్ ఫ్లవర్ నూనెగా ఎలా ప్రాసెస్ చేయాలి అనేది బోధిసున్నారు. ‘నేను స్థాపించిన యూనిట్లానే.. ఆసక్తి ఉన్న రైతులతో సొంతంగా యూనిట్ ఏర్పాటు చేయిస్తా.. ట్రైనింగ్ కూడా ఇస్తా’ అంటున్నారామె. అంతా కలిసి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటే రైతులు చాలా లాభపడుతారు. ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. మండలానికో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే సాగు పరిశోధనలకు ఒక రిసోర్స్ సెంటర్లా ఉంటుంది. ఈ ఆలోచన సార్క్-2022 గ్లోబల్ స్టార్టప్ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకుంది. మేధావుల ప్రశంసలు కూడా అందుకుంది.
వరంగల్‌లో పుట్టి పెరిగిన సౌమిని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదివారు. అదే సమయంలో పెండ్లయింది. ఇక ఇంటికే పరిమితం అనుకుంటున్న సమయంలో భర్త, అత్తామామలు ‘నీకేదైనా సాధించాలనిపిస్తే ప్రయత్నించు.. అస్సలు ఆగకు’ అని ప్రోత్సహించారు. ఆ మాటలు సౌమిని ఉత్సాహానికి మరింత ఊతమిచ్చాయి. జేఎన్టీయూలో చేరి ఎంటెక్ బయో టెక్నాలజీ చేశారు. ఆ తర్వాత ఇక్రిశాట్ నుంచి పీహెచ్డీ పట్టా ఖాతాలో వేసుకున్నారు. వేరు శనగలు నిల్వ చేసినప్పుడు విడుదలయ్యే టాక్సిన్ల మీద ఆమె చేసిన అధ్యయనం శాస్త్రవేత్తలను మెప్పించింది. ఆ తర్వాత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేశారు. రైతుల కోసం పనిచేసే సెర్ప్‌లో చేరి.. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్కు కన్సల్టెంట్‌గా సేవలందించారు. ప్రాజెక్టులో భాగంగా గ్రామాలకు వెళ్లి రైతులతో ముచ్చటించారు. వారి ఇబ్బందులు, ఆలోచనలు, పద్ధతులు అధ్యయనం చేశారు. సాగు మీద రైతు సహాయక, స్వయం సహాయక బృందాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు తన మనసులో వచ్చిన ఆలోచనకు రూపంగా.. అగ్రిఘర్ స్థాపించారు. ‘రైతు పండించిన పంట ద్వారా వచ్చే ప్రతి పైసా లాభాన్నీ.. రైతే అనుభవించాలి. అందుకే నా ఈ ప్రయత్నం’ అంటున్నారు సౌమిని సుంకర.
…? ప్రవీణ్ కుమార్ సుంకరి
– చిన్న యాదగిరి గౌడ్