ఫిన్‌టెక్ సంస్థ కినారా క్యాపిటల్స్ సీయీవో హార్దిక షాకు చిత్రలేఖనం అంటే ఇష్టం. టీనేజ్లోనే కుంచెతో స్నేహం మొదలైంది. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతున్నది. ‘ఇప్పుడిప్పుడే పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నా. ముఖ్యంగా పోర్ట్రెయిట్స్ మీద దృష్టి పెడుతున్నా. మొదట్లో పెన్సిల్‌తో గీసేదాన్ని. ఆ తర్వాత చార్కోల్ ఎంచుకున్నా. ఆయిల్ పెయింటింగ్స్ కూడా అలవోకగా వేస్తున్నా. ఒత్తిడి నుంచి బయట పడటానికి కళలను మించిన మాధ్యమం లేదు’ అంటారామె.
కినారా క్యాపిటల్స్‌కు తెలంగాణ సహా ఆరు రాష్ర్టాల్లో నూటపాతిక శాఖలు ఉన్నాయి. గత ఏడాది రూ. 2,500 కోట్ల మొత్తాన్ని చిన్న వ్యాపారులకు రుణంగా ఇచ్చింది. ‘దేనికీ సులభంగా తలవంచకూడదు. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు. అందుకే నేను పట్టుబట్టి కుండలు చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు ఆ కుండల మీద పెయింటింగ్స్ వేస్తున్నా. మొత్తానికి మనకంటూ కొంత సమయం కేటాయించుకోవాల్సిందే’ అని తోటి మహిళలకు చెబుతారు హార్దిక. ఆమె వయసు యాభై ఒకటి. రిటైర్మెంట్ ఆలోచనలు లేవు కానీ.. భవిష్యత్తు గురించి లోతుగానే ఆలోచిస్తున్నారు.