ఒకే ఒక్క చాన్స్… పేదను రాజునుచేస్తుంది. మధ్య తరగతి త్రిశంకు స్వర్గంలో ఉన్న వారిని సౌకర్యాల కుర్చీలో కూర్చోబెడుతుంది. ఆ ఒక్క చాన్స్… ఆన్లైన్లో ఉచితంగా ఇంగ్లిష్, కామర్స్ పాఠాలు చెప్పే దేవిక తలుపులూ తట్టింది. కానీ ఇక్కడో సమస్య. చేతినిండా డబ్బా, పేద పిల్లల చదువా?.. అంటే రెండో దానికే ఓటేశారామె. యూట్యూబ్‌లో డాక్టర్ దేవికా భట్నాగర్గా లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. తన చానెళ్ల విజయాన్నీ, జీవితంలోని ఒడుదొడుకుల్నీ జిందగీతో పంచుకున్నారిలా…
కొన్నిసార్లు, మనం వెనకబడి ఉన్నామన్న విషయం ఎవరో ఒకరు చెబితేనే అర్థమవుతుంది. చిన్నప్పుడు నా పరిస్థితీ అదే. ఎనిమిదీ, తొమ్మిదీ తరగతుల్లో చదువులో వెనకబడి ఉండేదాన్ని. పదో తరగతిలో ఉండగా, ఒకసారి పరీక్షల తర్వాత మా మోరల్ సైన్స్ టీచర్ కృష్ణవేణి నాతో మాట్లాడారు. నాలాంటి ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో విడమరచి చెప్పారు. ఆ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. జీవితంలో నిలబెట్టాయి. అప్పటికే నేను వీణ చక్కగా వాయించేదాన్ని. నాకు చదువు మాత్రం ఎందుకు రాదూ అనుకున్నా. ఆ తర్వాత నుంచి ప్రతి సబ్జెక్టునూ అర్థం చేసుకుంటూ చదవడం మొదలుపెట్టా. యాభై అయిదు శాతంతో పదో తరగతి పాసయ్యాను. ఇంటర్లో క్లాస్‌లో మూడోస్థానంలో నిలిచాను. డిగ్రీ దాకా తెలుగు మాధ్యమమే. కానీ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా అదే మీడియం చదివిన వాళ్ల మధ్య ఇమడటం కష్టంగా అనిపించింది. కానీ ప్రొఫెసర్ల సాయంతో పట్టుదలగా చదివాను. ఎంకామ్‌లో టాపర్‌గా నిలిచాను. నేను కబడ్డీ నేషనల్ ప్లేయర్‌ని కూడా. వీణలోనూ మంచి పేరు సంపాదించాను. దాంతో నేను చదివిన ప్రగతి మహావిద్యాలయలోనే లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది.
నేను లెక్చరర్ అయ్యాక ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అసలు ఇబ్బంది ఇక్కడే వచ్చింది. మా సామాజిక వర్గంలో కట్నాలు విపరీతం. నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్లూ, చిన్నచిన్న పనులు చేసేవాళ్లూ కూడా లక్షల కట్నం అడిగారు. దాంతో విసిగిపోయాను. అమ్మను ఒప్పించి.. మా కులం కాకపోయినా పర్వాలేదు, కట్నం వద్దనే వాళ్లనే చేసుకోవాలని నిశ్చయించుకున్నా. నా నిబంధనలకు తగిన వరుడి కోసం దినపత్రికల్లో పెళ్లి ప్రకటనలు చూసేదాన్ని. అలా మా వారు సువీర్ భట్నాగర్ను కలిశాను. వాళ్లది ఢిల్లీ. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారు. బాగా చదువుకున్న కుటుంబం. మాకు ఒక బాబు, ఒక పాప. నా ప్రతి విజయం వెనుకా నా కుటుంబం ఉంటుంది. పెళ్లికి ముందూ, తర్వాతా నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. ప్రొఫెసర్‌గా, హెచ్ఓడీగా, డిప్యూటీ డైరెక్టర్‌గా ఎన్నో విధులు నిర్వర్తించా. చదువుకుంటూనే కామర్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశాను.
నిజానికి నేను కామర్స్ చెప్పేదాన్ని. కానీ మాట్లాడేప్పుడు నా ఆంగ్లభాషా నైపుణ్యాన్ని చూసి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా తీసుకున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్వ్యూలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో విద్యార్థులకు చెప్పడం నా బాధ్యత. నా క్లాసులు మా విద్యార్థులకు బాగా ఉపయోగపడేవి. అప్పుడే అనిపించింది, క్లాసులో ఉన్నవారికే కాదు, బయట ఉన్న పేద పిల్లలకు కూడా ఇవి ఉపయోగపడితే బాగుంటుంది కదా అని. అందుకే ఖాళీ సమయాల్లో వీడియోలు తీసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించాను. చానెల్‌కు నా పేరే పెట్టాను.. ‘డాక్టర్ దేవికా భట్నాగర్’. విపరీతమైన స్పందన వచ్చింది. మూడు నెలల్లోనే ముప్పై అయిదు వేల మంది సబ్‌స్ర్కైబ్ అయ్యారు. గూగుల్ నుంచి కొంత డబ్బు కూడా అందింది. దీంతో ఉద్యోగం మానేసి పూర్తిగా యూట్యూబ్ మీదే దృష్టి పెట్టాను.
ప్రస్తుతం ఈ చానెల్‌కు పదిలక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అయితే నాకు పట్టు ఉన్న కామర్స్నీ నలుగురికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ‘దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడెమీ’ అనే చానెల్‌ను ప్రారంభించాను. కంటెంట్ ఆంగ్లంలో ఉండటంతో, తెలుగు మీడియం విద్యార్థులు మా కోసం కూడా చెప్పండంటూ మెసేజ్‌లు పెట్టేవారు. దీంతో ‘అకౌంట్స్ ఇన్ తెలుగు బై దేవికా భట్నాగర్’ చానెల్ ప్రారంభించాను.
తెలుగు వాళ్లకు ఇంగ్లిష్ మాట్లాడటం నేర్పించడానికి ‘దేవికా భట్నాగర్స్ తెలుగు చానెల్’ మొదలు పెట్టాను. దీనికి ప్రస్తుతం పది లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. బజ్జీల బండివాళ్ల నుంచి విశ్వవిద్యాలయాల విద్యార్థులూ, వివిధ రంగాల ఉద్యోగులూ నా చానెల్‌కు ఫాలోయర్లుగా ఉన్నారు. పాకిస్థాన్, ఉగాండా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, అమెరికా దేశాల స్టూడెంట్లూ అనుసరిస్తుంటారు. వీణావాద్యంలో మెలకువల్ని, నా ప్రయాణ అనుభవాలనీ పంచుకునేందుకు ‘కర్ణాటిక్ వీణా క్లాసెస్ బై దేవికా భట్నాగర్’, ‘ట్రావెల్ విత్ దేవికా భట్నాగర్’ పేరిట మరో రెండు చానెళ్లూ నడుపుతున్నాను. మొత్తం మీద మూడు వేలకు పైగా వీడియోలు పెట్టాను.
కొన్నాళ్ల క్రితం నాకో ఆఫర్ వచ్చింది. అన్అకాడెమీ, స్కూల్ప్లస్లాంటి సంస్థలు తమతో చేతులు కలపమంటూ నన్ను ఆహ్వానించాయి. అది అనుకోని అవకాశం. ఒక యాప్ కూడా తయారు చేసిస్తామన్నారు. అందులో నా మెటీరియల్ కూడా అమ్ముకోవచ్చని చెప్పారు. నేను ఊ అంటే.. ఊహించనంత డబ్బు వస్తుంది. ఒప్పుకొంటే మాత్రం రోజూ చెప్పే పాఠాలు ఆపేయాలి. ఏం చేయాలన్న మీమాంస రెండు రోజులు నిద్రపోనివ్వలేదు. కష్టపడి చదువుకున్న నా చిన్నతనం గుర్తొచ్చింది. అందుకే, ఆ సంస్థలకు నో చెప్పా. అప్పుడప్పుడూ కొందరు పిల్లలు ‘మీ యూపీఐ ఐడీ ఇవ్వండి డబ్బులు పంపుతాం…’ అని అడుగుతుంటారు. ‘మీ మార్కులే నాకు ఫీజు…’ అని చెబుతాన్నేను. విద్యాదానం చేయగలగడం గొప్పవరంగా ఫీలవుతాను.
…?లక్ష్మీహరిత ఇంద్రగంటి
-కేశమౌని మహేష్ కుమార్ గౌడ్