బాపు వారసత్యానికి బాపూజీ అవార్డు
మాది వరంగల్‌లోని ఉర్సు (కరీమాబాద్). సాధారణంగా తివాచీలు మగ్గంపై అడ్డంగా నేస్తారు. కానీ, వాటిని నిలువు మగ్గంపైన నేసేవారు అరుదుగా ఉంటారు. తెలంగాణలో మా ఒక్క కుటుంబం మాత్రమే ప్రస్తుతం నిలువు మగ్గంపై నేస్తున్నది. మా బాపు నర్సింగరావు 50 ఏండ్ల క్రితం ఆల్ఇండియా హ్యాండ్ క్రాఫ్ట్స్ బోర్డ్ వారు ఇచ్చిన శిక్షణలో ఈ కళను నేర్చుకున్నాడు. ఇక అప్పటినుంచి కుటుంబ పోషణ కోసం దీన్నే ఆధారం చేసుకున్నాడు.
తన తండ్రి చేపట్టిన కళకు వన్నెలద్దింది ఆ కూతురు. ఆయన వారసత్వాన్ని ఘనంగా చేపట్టింది. చిన్ననాటి నుంచి తండ్రి పడుతున్న కష్టాలకు చలించిపోయి ‘నేతన్నల జీవితం సముద్రంలోని పడవ ప్రయాణం లాంటిది’ అన్న సందేశాన్ని తివాచీపై కళాత్మకంగా అల్లింది. ఆ పనితనానికి గానూ చేనేత దినోత్సవం సందర్భంగా ‘ కొండా లక్ష్మణ్ బాపూజీ’ అవార్డును అందుకున్నది కంచ సమత. నిలువ నీడలేకున్నా నిలువు మగ్గంపై తివాచీలు తీర్చిదిద్దుతూ తన ప్రతిభను చాటుకుంటున్న సమత జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది వరంగల్‌లోని ఉర్సు (కరీమాబాద్). సాధారణంగా తివాచీలు మగ్గంపై అడ్డంగా నేస్తారు. కానీ, వాటిని నిలువు మగ్గంపైన నేసేవారు అరుదుగా ఉంటారు. తెలంగాణలో మా ఒక్క కుటుంబం మాత్రమే ప్రస్తుతం నిలువు మగ్గంపై నేస్తున్నది. మా బాపు నర్సింగరావు 50 ఏండ్ల క్రితం ఆల్ఇండియా హ్యాండ్ క్రాఫ్ట్స్ బోర్డ్ వారు ఇచ్చిన శిక్షణలో ఈ కళను నేర్చుకున్నాడు. ఇక అప్పటినుంచి కుటుంబ పోషణ కోసం దీన్నే ఆధారం చేసుకున్నాడు. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. అందులో నేను పెద్దదాన్ని. ముగ్గురం ఆడపిల్లలమే కావడంతో ఈ కళ తనతోనే అంతరించిపోతుందని బాపు చాలాసార్లు బాధపడేవాడు. కానీ, మేము చదువుకుంటూనే మగ్గం పనిలో ఆయనకు తోడుగా నిలిచాం. బాపే మాకు గురువై ఈ కళను నేర్పించాడు. అయితే ఇందులో కొన్ని మెలుకువలు నేర్చుకునేందుకు గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ వారి దగ్గర కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాను. మరోవైపు ఇంటికి పెద్దదాన్ని కావడంతో ఇంటర్మీడియట్ పూర్తి చేయగానే పెండ్లి చేశారు. కారణాంతరాల వల్ల ఒంటరిగా నా ఇద్దరి పిల్లల బాగోగులు చూసుకుంటున్నాను.

ఆ అవార్డుతో గుర్తింపు
నా కాళ్లపై నేను నిలబడాలనే సంకల్పంతో అప్పటికే నేర్చుకున్న మగ్గం పనిని తిరిగి ప్రారంభించాను. బాపు తాను నేసే తివాచీలపై తాబేళ్లు, ఫ్లవర్స్ లాంటివి మాత్రమే వేసేవాడు. అందుకు భిన్నంగా ఈ తరానికి నచ్చే ఆకృతులను అందులో ప్రతిబింబించాలని నా ప్రయత్నాన్ని కొత్తగా మొదలుపెట్టాను. అందులో భాగంగానే గోడలపై వేసే పెయింటింగ్ బొమ్మలను, పర్వదినాలు, ప్రత్యేక రోజులప్పుడు శుభాకాంక్షలను తెలిపే వివిధ ఆకృతులను తివాచీలపై నేయడం మొదలుపెట్టాను. పదేండ్ల క్రితమే ఈ రంగంలోకి పూర్తిస్థాయిలో దిగినా.. నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది మాత్రం 2024లోనే. చీకటి నుంచి వెలుగుల వైపు నా ప్రయాణం సాగుతుందనే కోణంలో ‘నీలాకాశంలో చుక్కలు మెరుస్తున్నట్టుగా’ తివాచీని నేశాను. దానికి గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్లు రాష్ట్రస్థాయి అవార్డును అందించారు. ఆ గుర్తింపు నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటివరకు నేను తయారు చేసిన తివాచీలు అంతగా అమ్ముడయ్యేవి కావు. దాంతో ఎప్పుడూ కష్టాలే ఉండేవి. ఆ అవార్డుతో నేను నేసే తివాచీలకు డిమాండ్ పెరిగింది. కొనుగోలుదారులు అడ్రస్ తెలుసుకొని మరీ నా దగ్గరికి వచ్చేవారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నాకు ఒక ఆసరా దొరికినట్టయింది. అలా నెమ్మదిగా నా కుటీర పరిశ్రమ వృద్ధిలోకి వచ్చింది.
50 మందికి శిక్షణనిచ్చా
చిన్నప్పటినుంచి మాది పేద కుటుంబమే అయినా నాన్న మమ్మల్ని చదివించాడు. ఆ చదువు విలువ తెలిసిన నేను నా కష్టాలను పాఠాలుగా చెప్పడం మొదలు పెట్టాను. ఓ వైపు చేనేత పనులు చేస్తూనే మరోవైపు మా ఇంటి సమీపంలోని ఎయిడెడ్ పాఠశాలలో తక్కువ వేతనానికే పార్ట్‌టైమ్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో పాఠాలు చెబుతూ, ఇంటికి రాగానే నా పనిలో నిమగ్నమవుతాను. ఈ కళను పదిమందికీ నేర్పించాలనే ఆలోచనతో ఇప్పటివరకు 50 మంది మహిళలకు ఇందులో శిక్షణనిచ్చాను. మా కస్టమర్లు హైదరాబాద్, జైపూర్, బెంగళూర్ వంటి ప్రాంతాల్లోనూ ఉన్నారు. నేను శిక్షణనిచ్చిన మహిళల్లో కొంతమంది నా వద్దకే మగ్గం నేసేందుకు వస్తుండగా వారికి పీస్ రేట్ కట్టిస్తున్నాను. పెట్టుబడి పోను మిగిలిన దాంతో కుటుంబం గడుస్తున్నది. అయితే తివాచీలు నేసేందుకు కావాల్సిన డైయింగ్ మెటీరియలంతా ఏపీ నుంచి కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతున్నది. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు వీవర్స్ సర్వీస్ సెంటర్ సహకారంతో డైయింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఇది సక్సెస్ అయితే పెట్టుబడి వ్యయం తగ్గడమే కాదు, పదిమందికీ ఉపాధి కూడా లభిస్తుంది.

చొరవ చూపండి
పనిచేసేంత సత్తువ ఉన్నా చేయడానికి ఆవాసం కరువైంది. మేము ఉంటున్న ఇల్లు తప్ప మాకెలాంటి స్థలం లేదు. ప్రస్తుతం మాకున్న ఎనిమిది మగ్గాల్లో అయిదు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇంటిముందు తెలిసినవాళ్ల స్థలంలో రేకుల షెడ్ వేసుకొని అందులో మగ్గాలు పెట్టుకొని తివాచీలు నేస్తున్నాం. 2025లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్లు రాష్ట్రస్థాయి అవార్డును అందించినా, ఈ ఏడాది చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అందుకున్నా నా ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నాకొచ్చిన బహుమతి డబ్బులతోనే ఆ శిథిలావస్థకు చేరిన షెడ్‌కు మరమ్మతులు చేయించుకుంటున్నా. ప్రభుత్వం చొరవ తీసుకుని ఓ స్థలం ఇప్పించి, శాశ్వత షెడ్ నిర్మించి ఇస్తే.. ఈ కళను మరింత మందికి అందించినదాన్నవుతాను.
…? రాజు పిల్లనగోయిన
గొట్టె వెంకన్న
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

