వంగసీమలో పుట్టి తెలుగునాట సత్తా చాటుతున్నది బెంగాలీ నటి అంతర స్వర్ణాకర్. అనుకోకుండా నటిగా మారిన ఆమె బుల్లితెరపై దూసుకుపోతున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న
‘లక్ష్మీనివాసం’ సీరియల్లో తులసి పాత్రతో అలరిస్తున్నది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ అనిర్వచనీయమని మురిసిపోతున్నది. హైదరాబాద్ రెండో పుట్టిల్లులాంటిదని చెబుతున్న అంతర అంతరంగం ఆమె మాటల్లోనే..
మాది కోల్‌కతా. నా బాల్యమంతా ఆ మహానగరంలోనే సాగింది. యాక్టింగ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పెద్దయ్యాక నిర్మాతగా రాణించాలని మాత్రం ఉండేది. కానీ, అనుకోకుండా ఓ బెంగాలీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. కొన్నాళ్లకు ఓ తెలుగు సీరియల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పింది. భయపడుతూనే వెళ్లాను. నా ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని అందులో సెలెక్ట్ చేశారు. అలా నా మొదటి తెలుగు సీరియల్ ‘మౌనరాగం’లో భాగమయ్యా. తర్వాత ‘గీతగోవిందం’ సీరియల్లో నటించా. చాలామంచి పేరొచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా గీత, గీతమ్మ అని పిలుస్తుంటారు. కొన్నాళ్లకు తమిళంలోనూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘లక్ష్మీనివాసం’తోపాటు జీ తమిళ్లో ‘సంధ్యారాగం’ సీరియల్స్ చేస్తున్నా.
తెలుగులో మొదటిసారి అవకాశం వచ్చినప్పుడు భాష రాదని భయపడ్డా. ‘మౌనరాగం’ సీరియల్ వాళ్లు మేమే మీకు తెలుగు నేర్పిస్తామని చెప్పి ఒప్పించారు. నాలుగైదు నెలలు భాష అర్థం కాక చాలా ఇబ్బందిపడ్డా. సెట్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలిసేది కాదు. వాళ్ల హావభావాలు చూస్తూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించేదాన్ని. కొంతమంది నాకు హిందీలో వివరించి చెప్పేవారు. ఇప్పుడైతే తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టం. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనేదాన్ని. మా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నేను సీరియల్స్ చేస్తానంటే అమ్మానాన్న అస్సలు అంగీకరించలేదు. చివరికి ఒప్పుకొన్నారు. ఇప్పుడు వాళ్లు సంతోషంగా ఉన్నారు. నాకు సాయిపల్లవి నటన అంటే ఇష్టం. ఆమె చాలా సహజంగా నటిస్తుంది.
సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ హైదరాబాద్, చెన్నైలో సీరియల్స్ చేస్తుండటంతో అటూ ఇటూ తిరగాల్సి వస్తున్నది. అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదు. అమ్మానాన్న బాగా సపోర్ట్ చేస్తున్నారు. ‘లక్ష్మీనివాసం’ సీరియల్లో తండ్రి పాత్ర నాకు బాగా ఇష్టం. ఆయనలాగే నాకు కూడా సొంతిల్లు ఉండాలనే ఆశ ఉంది. నన్ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే! హైదరాబాద్ రెండో ఇల్లు లాంటిది. ఇక్కడి బిర్యానీ అంటే పిచ్చి. నగరంలోని పర్యాటక ప్రదేశాలు చూడటం అంటే సరదా! ఇండస్ట్రీలోకి రావాలంటే, ఇక్కడ స్థిరపడాలంటే చాలా కష్టపడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆత్మవిశ్వాసం, హార్డ్‌వర్క్ రెండూ ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది.
– హరిణి