ప్రస్తుతం అంతా యాప్స్ మయం. తినడానికి ఫుడ్ యాప్స్! ఆరోగ్యానికి మెడికల్ యాప్స్! వినోదానికి ఎంటర్టైన్మెంట్ యాప్స్! చదువుకోవడానికి ఎడ్యుకేషన్ యాప్స్! ప్రయాణానికి ట్రావెల్ యాప్స్! వ్యాపారానికి బిజినెస్ యాప్స్! ఇలా ప్రతి పనికి యాప్స్ పుట్టుకొచ్చాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. అవసరమైన యాప్ డౌన్లోడ్ చేసుకుని పని పూర్తిచేసుకోవడం సెకన్ల పని. దీంతో దేశవిదేశాల్లో యాప్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో యాప్స్ అంటే ఏమిటి? ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయి? యాప్స్ ప్రాముఖ్యత ఏమిటి? యాప్ డెవలపర్‌గా ఎదగాలంటే ఏయే కోర్సులు చదవాలి? దేశంలో ఆయా కోర్సులను అందించే కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? మొదలైన అంశాలపై సమగ్ర సమాచారం మీకోసం..
ఒకప్పుడు మొబైల్ అంటే మాటలు ముచ్చట్లకే పరిమితం. కానీ ఇప్పుడది హస్తాభరణమైంది. స్నేహితులతో టైంపాస్ చాటింగ్ మొదలుకొని, ముఖ్యమైన బ్యాంకు లావాదేవీల వరకు ఏదైనా సరే.. చేతిలో మొబైల్ ఉంటే చిటికెలో పనైపోతుంది. దీనికి వివిధ రకాల యాప్స్ ఉపయోగపడుతున్నాయి.
యాప్ అంటే కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్. స్మార్ట్ ఫోన్లతో ప్రత్యేకమైన సౌకర్యాలు పొందడానికి వీలుగా ఈ మొబైల్ అప్లికేషన్స్‌ను తయారు చేస్తారు. ఈ అప్లికేషన్ (APPLICATION)కు సంక్షిప్తరూపమే యాప్ (APP). ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో లెక్కకు మించిన యాప్స్ సందడి చేస్తున్నాయి.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో వినియోగిస్తున్న యాప్స్ సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ యాప్స్‌ను కేటగిరీలుగా వర్గీకరిస్తే వెయ్యికిపైగా విభాగాలున్నాయి. వాటిలో బిజినెస్ యాప్స్, కమ్యూనికేషన్ యాప్స్, ఎడ్యుకేషన్ యాప్స్, మెడికల్ యాప్స్, ఎంటర్టైన్మెంట్ యాప్స్, ఫైనాన్స్ యాప్స్, షాపింగ్ యాప్స్, గేమ్స్ యాప్స్, హెల్త్ యాప్స్, మీడియా యాప్స్, మ్యూజిక్ యాప్స్, రైల్ యాప్స్, జీపీఎస్ రూట్ మ్యాప్ యాప్స్ మొదలైనవి ముఖ్యమైన విభాగాలు.
స్మార్ట్ యుగంలో ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక యాప్ పై ఆధారపడటం తప్పనిసరి అయ్యింది. బ్యాంకింగ్, దుస్తులు, యోగా, రెస్టారెంట్ భోజనం, షాపింగ్ ఇలా ప్రతి పని యాప్ ద్వారా చిటికెలో పూర్తవుతుంది. ప్రతి వ్యాపారంలో యాప్స్ సృష్టించడంవల్ల అందివచ్చిన సౌలభ్యం ఇది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్స్ రంగంలో స్థిరపడాలంటే.. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో సర్టిఫికెట్‌తోపాటు ఏదైనా డిగ్రీ చేసిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేయకపోయినా ఎంచుకున్న కెరీర్‌ను బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం తప్పనిసరి. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ మొదలైన ప్లాట్‌ఫామ్స్‌కు యాప్స్ రూపొందించాలంటే సీ, సీ++, జావా, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు తెలిసి ఉండాలి.
సీ: ఇది అత్యంత ప్రాథమికమైనది. మిగతా లాంగ్వేజ్‌లకు పునాది లాంటిది. దీనిలో ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవడంతోపాటు హార్డ్‌వేర్‌కు అనుబంధంగా సీ లాంగ్వేజ్‌లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో నిరంతరం గమనిస్తుండాలి. దీనివల్ల డీ బగ్గింగ్, మెమరీ మేనేజ్మెంట్, సమర్థంగా కోడింగ్ రాయడంలో నైపుణ్యం వస్తుంది.
జావా: ప్రోగ్రామింగ్‌లో విస్తృతంగా వినియోగిస్తున్న రెండో లాంగ్వేజ్ ఇది. సీ++, పెర్ల్, పైతాన్‌లో అవసరమయ్యే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపుల్స్ రూపకల్పనలో ఉపయోగపడుతుంది.
పైతాన్: ఈ లాంగ్వేజ్‌ను చాలా తేలికగా నేర్చుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఇందులో ప్రోగ్రామింగ్ రాయడానికి పట్టే సమయం తక్కువ. కొన్ని లైన్లలోనే పూర్తవుతుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నవారు ఈ లాంగ్వేజ్‌ను వేగంగా నేర్చుకోగలుగుతారు.
జావాస్క్రిప్ట్: ఇది చాలా మెరుగైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్రౌజర్లలో చాలావరకు జావాస్క్రిప్టుతో రూపొందించినవే. కావడంతో తక్కువ సమయంలో నైపుణ్యం సాధించవచ్చు.
పై వాటితోపాటు ఎంచుకున్న ఉద్యోగాన్ని బట్టి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పీహెచ్‌పీ, ఓపెన్జీఎల్, యానిమేషన్, డాట్ నెట్ వంటి వెబ్‌డిజైనింగ్ ప్రోగ్రామ్‌లను కూడా నేర్చుకోవచ్చు.
యాప్ డెవలప్మెంట్కు అవసరమైన సాఫ్ట్వేర్ కోర్సులు, ప్రోగ్రామ్‌లు నేర్పడానికి దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఢిల్లీ, కాలికట్, చండీగఢ్, గోరఖ్‌పూర్), రోహ్తక్లోని ఎన్ఐఐటీ, ముంబైలోని ఎన్ఐఐటీ లిమిటెడ్‌తోపాటు పలు ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీలు యాప్డెవలప్మెంటుకు అవసరమైన కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో సైతం పలు సంస్థలు యాప్ డెవలప్మెంటుకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లలో చాలావరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తున్నాయి. దీంతో ఆండ్రాయిడ్ స్కిల్స్ ఉన్న యువతను ఉన్నత కొలువులు ఊరిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లే కాకుండా ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, నోట్‌బుక్స్, ఐప్యాడ్ లాంటి గాడ్జెట్ల వినియోగం పెరగడంతో.. వాటిలో ఉపయోగించే అప్లికేషన్స్‌ను రూపొందించడానికి నిపుణుల అవసరం బాగా పెరిగింది. మొబైల్ కంపెనీలన్నీ వినియోగదారులను ఆకట్టుకునేలా తాజా అప్లికేషన్స్‌ను రూపొందించే నిపుణుల కోసం జల్లెడ పడుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో మూడు లక్షల మందికిపైగా యాప్ డెవలప్మెంట్ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారు. వీరిలో దాదాపు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 2012లో ప్రారంభమైన గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు 22 లక్షలకుపైగా ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి. 2008లో 500 యాప్స్‌తో ప్రారంభమైన యాపిల్ స్టోర్‌లో 2016 జూన్ నాటికి 20 లక్షల యాప్స్ ఉన్నాయి.
అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య నాలుగేండ్ల కిందట రూపొందించిన నివేదిక ప్రకారం.. 2020 నాటికి మొబైల్ ఫోన్ల రంగంలో 41 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 400 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇండియన్ మొబైల్ టాలెంట్-2016 నివేదిక ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగాలిచ్చే కంపెనీల్లో ఇప్పటికీ ఐటీ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. ఐటీ కంపెనీల నుంచి బయటకు వచ్చే వారిలో 53 శాతం మంది మొబైల్ కంపెనీల్లో చేరుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సొమ్ము చేసుకోవడం కోసం మొబైల్ కంపెనీలు పోటీపడి కొత్తకొత్త యాప్స్‌ను కనిపెడుతున్నాయి. దీంతో యాప్ డెవలపర్లకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది.
పనిచేసే సంస్థ స్థాయిని బట్టి యాప్ డెవలపర్లకు ప్రారంభంలోనే ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనాలు లభిస్తాయి. పనితీరు, అనుభవం ఆధారంగా నెలకు రూ. 50 వేలకుపైగా పొందవచ్చు.
గూగుల్, యాపిల్, బ్లాక్‌బెర్రీ, హెచ్‌టీసీ, శామ్సంగ్, ప్యానసోనిక్, సోనీ ఎరిక్సన్, మైక్రోమ్యాక్స్, ఎల్జీ మొబైల్స్, కార్బన్ మొబైల్స్, ఆర్థిక సేవల సంస్థలు, నోకియా, వీడియోకాన్ మొదలైనవి.
బ్యాక్-ఎండ్ (సర్వర్ సైడ్) ప్రోగ్రామర్: దీని కోసం జావా, పైతాన్, పీహెచ్‌పీ, రూబీ లేదా డాట్ నెట్ నేర్చుకోవాలి. వీటితోపాటు డేటాబేస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉంటే మంచిది.
ఫ్రంట్-ఎండ్ (క్లయింట్ సైడ్) ప్రోగ్రామర్: హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్తోపాటు కొన్ని డిజైనింగ్ స్కిల్స్ అవసరం.
మొబైల్ ప్రోగ్రామర్: మొబైల్ వెబ్‌సైట్స్‌ను అభివృద్ధి చేయాలంటే సీ లేదా జావా (ఆండ్రాయిడ్ కోసం), హెచ్‌టీఎంఎల్ ఏదా సీఎస్ఎస్తోపాటు సర్వర్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
త్రీడీ ప్రోగ్రామర్/గేమ్ ప్రోగ్రామర్: సీ లేదా సీ++, ఓపెన్జీఎల్, యానిమేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తోపాటు కళాత్మక దృష్టి ఉంటే గేమ్స్ ప్రోగ్రామర్‌గా స్థిరపడొచ్చు.
హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామర్: దీనికి కూడా సీ లేదా సీ++, జావా నేర్చుకోవాలి. అదేవిధంగా మ్యాథ్స్, క్వాంటిటేటివ్ అనాలసిస్‌లో పట్టు ఉండాలి.