‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
పువ్వులన్నీ కొలువు తీరాయి. పూలవనాలు బారులు తీరాయి. వీర జవానులకు స్వాగతం చెప్పడానికి.. అన్నట్టు. పూలతోటల స్వర్గంగా భాసిల్లుతున్న ప్రాంతం.. ‘ఈశాన్య రాష్ర్టాలలో అక్కాచెల్లెళ్లు’ అని పేరు గాంచిన రాష్ర్టాలలో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్. వీర జవానుల కవాతును విస్ఫారిత నేత్రాలతో వీక్షిస్తూ.. తమకు తాముగా కొమ్మలను వీడి.. వారి శిరస్సులను పూలవర్షంతో అభిషేకిస్తున్నాయి. తల మీదుగా నేలరాలిన పువ్వులు.. వీర జవానుల పాదాల స్పర్శను తమ వీపున మోస్తూ, సగర్వంగా తలెత్తి చూసి సెల్యూట్ చేస్తున్నాయి.
మెక్‌మోహన్ రేఖ. సరిహద్దులో భారత సైన్యం డేగ కళ్లతో పహరా కాస్తున్నది. సరిహద్దుకు ఆవలివైపున.. ఓ కొండ ప్రాంతంలో ఓ గుడారం. అక్కడ వందల సంఖ్యలో చైనా సైనికులు మోహరించి ఉన్నారు.క్రమంగా చీకటి పడింది. గుడారం చుట్టూ లైట్లు వెలిగాయి. ఇంతలో రెండు వాహనాలు దుమ్ము లేపుకొంటూ వచ్చి, ఆ గుడారం వద్ద ఆగాయి. అందులోంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఇద్దరు ఆర్మీ కమాండర్లు దిగారు. వారిని చూసి అక్కడ ఉన్నవారంతా సెల్యూట్ చేశారు. వారిద్దరూ గుడారంలోకి ప్రవేశించి, ఏదో మాట్లాడుకుంటూ.. ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉండిపోయారు. మరికాసేపటికి అక్కడికి మరో వాహనం వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఒక కెప్టెన్.. వడివడిగా గుడారంలోకి ప్రవేశించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గుడారంలో రహస్య సమావేశం మొదలైంది. ఇద్దరు కమాండర్లలో ఒకరు తన దగ్గరున్న మ్యాప్‌ను బయటికి తీశాడు. మ్యాప్‌ను కెప్టెన్‌కు చూపిస్తూ వివరించడం మొదలుపెట్టాడు.
“భారత భూభాగంలో మన సైనికులు ఎంత మేరకు ఆక్రమించారో తెలిపే మ్యాప్ అది”.. అని చెప్పాడు. అది చూసిన కెప్టెన్..
“మనం అనుకున్నది సాధించడానికి చాలా దగ్గరలో ఉన్నాం!” అన్నాడు.ఇంకొక కమాండర్‌ను చూస్తూ..
“మనం ఇక్కడినుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని డోక్లామ్ వరకూ తవ్విన సొరంగం ఉంది కదా.. దానికి సరైన రక్షణ ఏర్పాటు చేశారా?” అని అడిగాడు. దాంతో ఆ కమాండర్..
“మన సైనిక బలగం ఆ పరిసర ప్రాంతంలో బంకర్లు ఏర్పాటు చేసుకుంది. ఆ బంకర్ల నుంచే వారు తమ విధులు నిర్వహిస్తున్నారు కెప్టెన్!” అని చెప్పాడు.
“నేను మీకు ఆయుధాలతో నింపిన మిలటరీ వాహనాలు, కొన్ని డిస్ట్రాయర్లు, ఇంకా రాకెట్ ప్రొజెక్టర్లు ఏర్పాటుచేస్తాను. మీరు ఎంత తొందరగా గ్రామాలు నిర్మిస్తే అంత తొందరగా మనం ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవచ్చు” అన్నాడు కెప్టెన్.
“మీరు ఆయుధ సంపత్తిని మాత్రం అందజేయండి. మిగిలింది మేం చూసుకుంటాం” అన్నారు ఇద్దరు కమాండర్లు. క్రూరమైన నవ్వు మొహంలో కదలాడుతుండగా.. ఒక కమాండర్ పైకి లేచి, ఇండియా మ్యాప్ తీసుకున్నాడు. కెప్టెన్ ఎదుట ఉన్న టేబుల్ మీద పరిచాడు. మ్యాప్‌ను చూపిస్తూ.. బలంగా కొట్టి కెవ్వున అరిచాడు. అతని చేయి టేబుల్ మీద ఉన్న మేకును బలంగా తాకింది. రక్తం చివ్వున పొంగి.. మ్యాప్‌లో తాము ఆక్రమించిన భాగంలో చిమ్మింది. మ్యాప్‌లోని ఆ ప్రాంతం రక్తవర్ణంతో తడిసిపోయింది. ఆ కమాండర్ తన కుట్రకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అది చూసిన కెప్టెన్ వారిద్దరిని చూస్తూ..
“ఇదే పనికిరాని ఆవేశం.. ఇదే తెలివి తక్కువతనం.. ఇదే మూర్ఖత్వం.. మనల్ని చావుదెబ్బ తీసింది తెలుసా?” అన్నాడు. ఆ మాటలు వింటూ, రక్తమోడుతున్న చేతిని చూస్తూ తల కిందికి వంచుకున్నాడు ఆ కమాండర్.
“సరిగ్గా యాభై ఎనిమిది సంవత్సరాల కింద మనం ఇలాగే తల వంచుకున్నాం!” అంటూ కుర్చీలోంచి పైకి లేచాడు. సిగరెట్ వెలిగించుకుని, గుప్పున పొగ వదులుతూ గుడారం బయటికి నడిచాడు. దూరంగా అక్కడక్కడా సైనికులు గస్తీ తిరుగుతున్న భారత భూభాగం. ఆ భూమిని తదేకంగా చూస్తున్న కెప్టెన్‌కు ఒక్కసారిగా వెన్ను జలదరించింది. ఆ జలదరింపు.. తెలియని ఒక హెచ్చరికలా అనిపించింది. తిరిగి గుడారంలోకి వచ్చి, అక్కడున్న కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకున్నాడు. దీర్ఘమైన శ్వాస తీసుకుని వదులుతూ వారిని చూస్తూ గతాన్ని చెప్పడం ఆరంభించాడు.
“అది 1962వ సంవత్సరం. మనకు ఇండియాకు నూరనాంగ్ యుద్ధం మొదలైన కాలం. ఆ యుద్ధంలో చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న తీరులో మనం విజయం సాధించాం. శత్రువైనా మెచ్చుకోక తప్పనిసరి పరిస్థితి. కారణం.. జస్వంత్ సింగ్ రావత్ అనే ఇండియన్ రైఫిల్ మాన్. మన సైనికులు ఇండియా సైన్యాన్ని విజయవంతంగా ఎదుర్కోవడంతో వారందరూ వెనుతిరిగారు. కానీ, వారిలో ఒకే ఒక్కడు.. అతడే ఒక సైన్యమై.. మనవాళ్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒక్కడే మూడు రోజులపాటు పోరాడి మన సైనికులను దాదాపు మూడొందల మందిని మట్టుబెట్టాడు. ఇదంతా ఆ ఒక్కడు కొండ మీద ఉన్న కనుమల్లో ఉండి, ఎంతోమంది సైన్యం ఉన్నట్టు మనకు భ్రమ కల్పించాడు. ఈ వ్యూహంలో అతడు ఎంతో విజయం సాధించాడు. మన సైనికులను ముప్పుతిప్పలు పెట్టి ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితిని కలిగించాడు. ఆ వీరోచిత పోరాటం చూసిన మన సైనికులు భయంతో వెనక్కి తగ్గారు. ఏం చేయాలో తెలియక మన సైనికులు.. జస్వంత్ సింగ్ ఉన్న కనుమల చుట్టూ కాపలా ఉండిపోయారు. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయసాగారు. అదే సమయంలో ఆ వీరుడికి ఆహరం తీసుకెళ్తున్న ఒక వ్యక్తి మన సైనికులకు దొరికాడు. మన సైన్యం అతణ్ని పెట్టిన చిత్రహింసలను భరించలేక అతడు నిజం చెప్పేశాడు. అది విన్న మన సైనికులతోపాటు నేను కూడా ఆశ్చర్యపోయాను. కారణం.. అప్పుడు మన బెటాలియన్‌కు నాయకుణ్ని నేనే. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మన సైన్యం జస్వంత్ సింగ్ శిబిరాన్ని చుట్టుముట్టింది. అతడి వీరత్వాన్ని, దేశభక్తిని చూసి నేను క్షణకాలం అసూయ చెందాను. దేశభక్తికి నిజమైన నిర్వచనం జస్వంత్ సింగ్ రావత్.
అంతమంది తన శిబిరాన్ని చుట్టుముట్టినా, అంతటి క్లిష్ట సమయంలోనూ జస్వంత్ తన పోరాటాన్ని వదలలేదు. ఒక్కడే చివరి నిమిషం వరకు వీరోచితంగా పోరాడి.. మన సైనికులను రెండొందల మందిని మట్టుబెట్టాడు. చివరికి ఎవరికీ దొరకకుండా తనను తాను కాల్చుకుని మరణించాడు”..
మాటలు పూర్తికాగానే.. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని, కళ్లు మూసుకుని అలా ఉండిపోయాడు కెప్టెన్. ఆ శిబిరంలో జస్వంత్ సింగ్ గురించి వివరిస్తుంటే గాలి కూడా స్తంభించిపోయింది.జస్వంత్ సింగ్ వీరత్వం గురించి ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి వింటున్న ఇద్దరు కమాండర్లు తెప్పరిల్లి నోటమాట రాక ఉండిపోయారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత.. కెప్టెన్‌ను చూస్తూ ..
“ఇప్పటికీ తవాంగ్ జిల్లాలో బాబా జస్వంత్ పేరుతో స్థానికులు ఆరాధిస్తున్న వ్యక్తి. మరణించిన తర్వాత కూడా సరిహద్దుల్లో ఇప్పటికీ అతడి ఆత్మ విధులను నిర్వహిస్తున్న వ్యక్తిగా పేరు పొందిన జస్వంత్ సింగ్! మీరు చెప్పిన జస్వంత్ సింగ్..” అంటూ అర్ధ్దోక్తిలో ఆగిపోయాడు ఒక కమాండర్. ఆ మాటలకు కెప్టెన్ తలూపుతూ..
“ఆ ముగ్గురూ ఒక్కడే!” అన్నాడు. కెప్టెన్ మాటలను విన్న ఇద్దరు కమాండర్లు జస్వంత్ సింగ్ దేశ భక్తికి తలవంచి అలా ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత కెప్టెన్ పైకి లేచాడు.
“మనం ఇక సమావేశం ముగిస్తున్నాం. మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రవర్తించండి. ఇండియా సైన్యం మనకంటే ఎన్నో రెట్లు బలమైనది. ఇండియన్ ఆర్మీలో ఒక్కో సైనికుడు ఒక్కో మిసైల్‌తో సమానం. మన ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మన దగ్గర ఆయుధాలు మాత్రమే ఉంటాయి. కానీ, వారి దగ్గర దేశభక్తి అనే మారణాయుధం.. హ్యూమన్ బాంబ్ లాంటిది. దేశం కోసం మృత్యువుతోనైనా కలబడే తెగింపు వాళ్లది. అప్రమత్తంగా మెలగండి” అని చెప్పి, అక్కడి నుంచి నిష్క్రమించాడు.
కెప్టెన్ వెంటే.. ఆ కమాండర్లు కూడా అక్కడినుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత డ్రాగన్ సైనికులంతా ఏమరుపాటుగా ఉన్న సమయంలో.. ఒక సైనికుడు ఆ ప్రదేశం నుంచి మెల్లగా ముందుకు వెళ్లడం మొదలుపెట్టాడు. గస్తీ తిరగడానికే అన్నట్టు మరింత ముందుకు నడిచాడు. అక్కడ కొద్దిసేపు అటూఇటూ తిరిగాడు. చుట్టుపక్కల నిశితంగా పరిశీలించి, తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత.. ఆ సైనికుడు చీకటిలో కలిసిపోయాడు. వడివడిగా అడుగులు వేస్తూ మెక్‌మోహన్ సరిహద్దు రేఖను చేరుకున్నాడు. ఒక పెద్దగుట్ట చాటున నెగడు ఏర్పాటు చేసి.. తన దుస్తులపై ధరించిన డ్రాగన్ సైనిక దుస్తులను ఆ మంటలో తగలబెట్టాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను ఒకసారి చూసుకున్నాడు. తన భుజం మీదుగా.. యూనిఫాంపై ఉన్న ‘మువ్వన్నెల జెండా’.. ఆ మంటల వెలుతురులో మరింత వెలిగిపోతూ కనిపించింది. అది చూసిన ఆ వ్యక్తి పెదాలు సన్నగా విచ్చుకున్నాయి. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. సుదూరంగా కనిపిస్తున్న శిబిరాన్ని చేరుకోవాలని ముందుకు నడిచాడు. అప్పటికే తూర్పు దిక్కున వెలుగురేఖలు విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
భారత భూభాగంలోని శిబిరం. లోపల ఇద్దరు మేజర్ జనరల్స్. ఇద్దరు బ్రిగేడియర్స్. సరిహద్దు ఉద్రిక్తతల గురించి, డ్రాగన్ దురాక్రమణల గురించి తీవ్రమైన చర్చలు కొనసాగిస్తున్నారు. డ్రాగన్ సరిహద్దుల నుంచి వచ్చిన ఆ సైనికుడు భారత శిబిరం వద్దకు చేరుకున్నాడు. ఆ సైనికుణ్ని చూసిన అక్కడున్న సైనికుల వదనాలలో చిరునవ్వు విరిసింది. శిబిరం లోపలికి అడుగుపెట్టి.. అక్కడున్న అధికారులకు సెల్యూట్ చేశాడు.
“దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం భారత సైన్యం తన శ్వాసగా జీవిస్తున్నది” అని ఒక బ్రిగేడియర్.. పక్కనున్న మరో బ్రిగేడియర్‌తో చెప్పాడు.
ఈ సైనికుడు తన భుజాన ఉన్న మువ్వన్నెల జెండాను జాగ్రత్తగా తీసి, ఆ జెండా వెనుక అమర్చి ఉన్న శక్తివంతమైన చిన్న రికార్డర్‌ను బయటికి తీశాడు. దాన్ని జాగ్రత్తగా మేజర్‌కు అందించాడు. తిరిగి వారికి సెల్యూట్ చేసి.. శిబిరం బయటికి వచ్చాడు. తన తోటి సైనికుల దగ్గరికి వెళ్లి.. ఏమీ జరగనట్టే తన విధుల్లో మునిగిపోయాడు.శిబిరంలో ఉన్న నలుగురు ఆ రికార్డును జాగ్రత్తగా వినసాగారు. అది వింటుంటే వారందరి వదనాలు జేవురించాయి. డ్రాగన్ దేశ కుట్రలు, పన్నాగాలు విన్న వారందరూ.. వాటిని ఎలా నిలువరించాలో తమలో తామే చర్చించుకోసాగారు.
“ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మన సైనిక బలగం సరిపోయినా, ఇది సైన్యం మాత్రమే ఎదుర్కోగల విషయం కాదు” అని ఒక బ్రిగేడియర్ అన్నాడు.
“డ్రాగన్ దేశాన్ని, వారి ఆగడాలను ఎదుర్కోవడానికి వారి వ్యూహాలను తిప్పికొట్టడానికి తగిన సమర్థులు కావాలి” అని ఇంకొక బ్రిగేడియర్ చెప్పాడు.
“వారి ఎత్తులను చిత్తు చేస్తూ.. పైఎత్తు వేసే సమర్థుడు ఇప్పుడు ఎంతో అవసరం” అని అక్కడున్న ఒక మేజర్ అన్నాడు. ఇంకొక మేజర్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత..
“డ్రాగన్ దేశం ఆగడాలను నిలువరించడానికి నా దృష్టిలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు” అన్నాడు ఆ మేజర్. మిగిలిన ముగ్గురూ కుతూహలంతో.. ‘ఆ వ్యక్తి ఎవరా? మేజర్ ఏం చెప్తాడా?’ అని చూడసాగారు. మేజర్ అక్కడున్న ప్రొజెక్టర్ ఆన్ చేశాడు. స్క్రీన్‌పైన ఒక వ్యక్తి. చురుకైన చూపులతో కొదమసింహంలా కనిపిస్తున్నాడు. ఉరుమును ఒడిసిపట్టగల పిడుగులా ఉన్నాడు. మేజర్ ప్రొజెక్టర్ ఆఫ్ చేసి..
“విక్రమ్ సింగ్ రావత్! ఆవేశం కొండంత.. దేశభక్తి ఆకాశమంత..” అని చెప్పాడు. ఇంకొక మేజర్ మిగిలిన వారిని చూస్తూ..
“ఈ వ్యక్తిని ఆర్మీలోకి తీసుకోవడానికి మనం తిరస్కరించాం కదా!” అన్నాడు.
“ఎస్.. విక్రమ్ సింగ్ రావత్ ఆర్మీలో సెలెక్ట్ కాకుండా తిరస్కరించడానికి కారణం.. అతని ఆవేశం మాత్రమే!” అన్నాడు మేజర్.
“ఇంటర్వ్యూలో ‘శత్రుసైనికులు దాడి చేస్తేనో.. ఎదురైతేనో ఏం చేస్తావు?’ అని అడిగిన ప్రశ్నకు ఇతని సమాధానం.. ‘శత్రు సైనికులు కంటబడితే చంపేస్తాను!’ అని. క్రమశిక్షణను కటువుగా పాటించే భారత ఆర్మీలో, ఇలాంటి ఆవేశపరుణ్ని ఎలా తీసుకోవాలి? అనే కారణంతో అతన్ని పక్కన పెట్టాం. కానీ, అతడి రికార్డు చూస్తే.. ఆ వ్యక్తి ఊరి నుంచి కొన్ని వివరాలు మనకు చేరాయి. విక్రమ్ అన్యాయాన్ని సహించే మనిషి కాదనీ, న్యాయం కోసం ఎంతవరకైనా తెగించి పోరాడుతాడని ఆ రికార్డులు చెప్తున్నాయి. దేశభక్తి, ఆవేశం, ఆలోచన.. అన్నిటికీ మించి యునిఫామ్ ధరించాలన్న అతనిలోని బలమైన కోరిక మనకు అనుకూలంగా ఉన్నాయి. విక్రమ్ సింగ్ రావత్ ఈ సర్జికల్ స్ట్రయిక్‌కు సమర్థుడని నా అభిప్రాయం!” చెప్పాడు మేజర్. అతని మాటలతో అంతా ఏకీభవించారు. అత్యవసర సమావేశంలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాధిపతి.. రాష్ట్రపతి తమ ఆమోదముద్ర వేశారు. ‘లైసెన్స్ టు కిల్’.. అంటూ డ్రాగన్‌పై యుద్ధానికి అండర్ కవర్ వన్‌మ్యాన్ ఆర్మీగా విక్రమ్ సింగ్ రావత్‌ను ఎంపిక చేశారు.
మెక్‌మోహన్ రేఖ దాపునే ఉన్న శిబిరం.. లోపల ఉన్న ఓ వ్యక్తిని చూస్తూ..
“మిస్టర్ విక్రమ్ సింగ్ రావత్! జరిగినదంతా విన్నావు కదా! నీతో ఒక సైనిక బెటాలియన్ వస్తుంది. డ్రాగన్ దేశాన్ని, ఆ దేశ ఆగడాలను నిలువరించాలి. అవసరమైన ఆయుధాలు కూడా మీతో వస్తాయి” అన్నాడు కల్నల్. అందుకు విక్రమ్ సింగ్ ఏదో చెప్పబోయేంతలో.. శిబిరానికి కొద్ది దూరంలో ఏదో కలకలం. ఇంతలో శిబిరంలోకి ఒక సైనికుడు పరుగుపరుగున వచ్చాడు.
“కల్నల్ సాబ్.. డ్రాగన్ సైనికులు మన సైనికుల మీద దాడి చేశారు. సరిహద్దు వెంట యుద్ధ వాతావరణం నెలకొని ఉంది” అని చెప్పాడు. అది విన్న విక్రమ్ సింగ్ ఆవేశంతో పైకి లేచాడు. కల్నల్ వెంటనే..
“విక్రమ్ సింగ్.. మీరు వెళ్లండి. మీకు కావాల్సిన ఆయుధాలను మన బెటాలియన్ మీకు అందజేస్తుంది” అన్నాడు.
“కల్నల్ సాబ్! నాకు మామూలు ఆయుధాలతో పని లేదు. ఈ ఆపరేషన్‌కు నాకు కావాల్సినవి ఇవే!”.. అంటూ ఒక పేపర్‌పై రాశాడు. దాన్ని కల్నల్‌కు అందించి అక్కడి నుంచి బయల్దేరాడు.
విక్రమ్ రాసిన వివరాలు చూసి కల్నల్ ఆశ్చర్యపోయాడు. శత్రు సైనికులను విక్రమ్ ఎలా నిలువరిస్తాడో అర్థమైన కల్నల్ మోముపై చిరునవ్వు విరిసింది.
సరిహద్దు ప్రాంతాన్ని చేరుకున్నాడు విక్రమ్. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎదురుగా ఉన్న కొండల చాటు నుంచి డ్రాగన్ సైనికులు విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. మన సైనికులు దీటుగా ఎదుర్కొంటున్నారు. అక్కడికి వెళ్లిన విక్రమ్ సింగ్ పరిసరాలన్నీ జాగ్రత్తగా పరికిస్తున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న బెటాలియన్ సైనికులు విక్రమ్ దగ్గరికి వచ్చారు. వారు తెచ్చిన వస్తువులను తాను చెప్పినట్టు అమర్చమని కోరాడు విక్రమ్ సింగ్. అన్ని వస్తువులనూ విక్రమ్ సింగ్ చెప్పినట్టుగానే ఆ ప్రాంతంలో అమర్చారు సైనికులు. వారందరినీ పక్కకు వెళ్లమని చెప్పి తన పని మొదలుపెట్టాడు విక్రమ్ సింగ్.
విద్యుదయస్కాంత వికిరణ రూపాలైన మైక్రోవేవ్ తరంగాలు అవి. వాటినే తన ఆయుధాలుగా మార్చుకున్నాడు విక్రమ్. డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అయిన మైక్రోవేవ్ కిరణాలను దూరంగా కనిపిస్తున్న కొండల మీదికి ప్రసరింప చేయసాగాడు. క్రమంగా ఆ కిరణాల వేవ్‌లెంగ్త్ (తరంగ ధైర్ఘ్యం) ఒక మిల్లీ మీటర్ నుంచి ఒక మీటర్ వరకు మారింది. హై ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీలు కంటికి కనిపించని వేగంతో, తరంగాల రూపంలో దూసుకెళ్తున్నాయి. ఆ ఫ్రీక్వెన్సీని క్రమంగా పెంచసాగాడు విక్రమ్.
ఫిరంగులు, తుపాకులు, బుల్లెట్లు ఉపయోగించకుండా.. కేవలం అతి నీలలోహిత కిరణాలను ప్రయోగించి శత్రుమూకలతో యుద్ధం చేస్తున్నాడు విక్రమ్.
ఆ నాన్-కాంటాక్ట్ వార్ ఫేర్‌లో.. ఎక్కడో కొండలలో, గుట్టల మాటున ఉన్న కొన్ని వందలాది మంది డ్రాగన్ సైనికులు ఆ కిరణాల ప్రభావంతో ఎక్కడి వారక్కడ కుప్పకూలిపోసాగారు. కేవలం కొన్ని గంటల్లోనే వారందరూ నిర్వీర్యులై ఒక్కరు కూడా ప్రతిదాడి చేయడానికి వీలు లేకుండా చేశాడు విక్రమ్ సింగ్. అది చూసిన మన సైనికులు హర్షధ్వానాలు చేస్తూ విక్రమ్ సింగ్‌ను అభినందించారు.తర్వాత అక్కడున్న బెటాలియన్ సైనికులకు కొన్ని సూచనలు అందచేసి, వారితోపాటు డ్రాగన్ దేశం సొరంగాలు, గ్రామాలు నిర్మించిన ప్రదేశానికి బయల్దేరాడు విక్రమ్ సింగ్. ఎదురుగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ దేశం నిర్మించిన సొరంగాలు, గ్రామాలు ఉన్నాయని గుర్తించాడు. తనతో వచ్చిన బెటాలియన్ సైనికులకు.. ‘టి.. రెక్స్’ అనే నిఘా పరికరాలను అందించాడు. లాంగ్ రేంజ్ అబ్జర్వేషన్ సిస్టం అని పిలిచే ఆ నిఘా వ్యవస్థ పరికరాల ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ దేశం నిర్మించిన గ్రామాలను చూడటం మొదలుపెట్టారు. ఎదురుగా ఉన్న గ్రామాలలో ఇళ్లలాంటి నిర్మాణాలు దాదాపు వంద వరకూ ఉన్నాయి. గ్రామాలను కలిపే తారు రోడ్లు అప్పటికే పూర్తయ్యాయి. అవన్నీ భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి మరీ నిర్మించారు. ఎక్కడ చూసినా ఆలివ్ గ్రీన్ రంగు ట్రక్కులు నిలబెట్టి ఉన్నాయి. సొరంగాలు తవ్వుతున్నట్టు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవన్నీ గమనిస్తున్న మన సైనికులకు ఆవేశం ఉప్పొంగుతున్నది. అన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్న విక్రమ్ సింగ్ ఆదేశాల కోసం వేచి ఉన్నారు వారందరూ. ఒక్కసారిగా..
“ఫైర్!” అని ఆదేశించాడు విక్రమ్ సింగ్.
అందుకోసమే ఎదురుచూస్తున్న సైనికులంతా ఒక్కసారిగా ఆ నిర్మాణాలపై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించారు. దీంతో నిర్మాణాలన్నీ ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా కుప్ప కూలిపోయాయి. అది చూసిన భారత సైనికులు దేశభక్తిని అణువణువునా నింపుకొని హర్షధ్వానాలు చేయసాగారు. డ్రాగన్ దేశంపై సర్జికల్ స్ట్రయిక్‌ను విజయవంతంగా పూర్తిచేసిన విక్రమ్ సింగ్ రావత్.. కల్నల్ ఎదురుగా ఉన్నాడు. తాను ధరించిన సైనిక యూనిఫామ్‌ను కల్నల్ ఎదుట ఉంచాడు.
“ఇక నాకు ఈ యూనిఫామ్‌తో పనిలేదు. ఒక్కసారైనా ఈ యూనిఫామ్ ధరించాలనే కోరిక ఉండేది. దేశభక్తినే యూనిఫామ్‌గా ధరించాను. ఈ దేశంకోసం ఎప్పుడైనా.. నా ప్రాణాలు త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను”.. సెల్యూట్ చేస్తూ చెప్పాడు విక్రమ్ సింగ్ రావత్.శత్రువులను వేటాడిన సింహం వెనుతిరిగింది.
“మిస్టర్ విక్రమ్ సింగ్ రావత్.. గ్రాండ్ సన్ అఫ్ గ్రేట్ వారియర్ జస్వంత్ సింగ్! మీ తాత రక్తం, దేశభక్తి నీలో నిలువెల్లా నిండి ఉంది. ఈ క్షణం నుంచి యూనిఫామ్ లేని సైనికుడివి నువ్వు. దేశాన్ని కాపాడే యోధుడివి. రాష్ట్రపతి ప్రత్యేక అనుమతితో నియమించబడ్డ సోల్జర్వి. నీ సాహసాన్ని భారతసైన్యం విస్మరించదు!”.. విక్రమ్ సింగ్ రావత్ భుజం తట్టి, చెప్పాడు కల్నల్.
సాహసమే శ్వాసగా ముందుకు నడుస్తున్నాడు విక్రమ్ సింగ్ రావత్.
శ్రీసుధామయి స్వస్థలం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, గంజికుంట గ్రామం. ఎంబీయే చేశారు. నాలుగేళ్లుగా రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు 80 కథలు, 16 నవలలు రాశారు. హారర్, కామెడీ, క్రైమ్, థ్రిల్లర్, ఫిక్షన్, రొమాన్స్, మానవ సంబంధాలు.. ఇలా అన్ని జానర్లలో కథలు రాస్తున్నారు. డిటెక్టివ్ సిద్ధార్థ, జ్వాలాముఖి మంత్రాలదీవి, మాయాద్వీపం, పచ్చల లోయ – పాతాళసుందరి, అద్భుతలోకం, నాగకిరీటం, మణిద్వీప రహస్యం, మహాతలం – మాయాదర్పణం, భూతాల దీవి – బేతాళమాంత్రికుడు, అదృశ్యవనం, గుప్పెడంత ఆకాశం కథలు పాఠకుల ప్రశంసలు పొందాయి. వివిధ కథలు ప్రముఖ దిన, వార, మాస పత్రికలతోపాటు అంతర్జాల పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించే సైనికులకు రచయిత్రి ఈ కథను అంకితం ఇస్తున్నారు. సైనికుల సాహసానికి స్ఫూర్తినిచ్చే కథను బహుమతికి ఎంపిక చేసిన నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-శ్రీసుధామయి
79810 85444