‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2025’లో ప్రథమ బహుమతి రూ.50 వేలు పొందిన కథ.
‘ముగ్గులు చూడాలని మబ్బులు నిలిచేనా?
రంగవల్లికల తోడు రమ్మని జాబిలి పిలిచేనా?’
అవును! మా అక్క మా ఇంటి ముంగిట దిద్దిన ముగ్గులు చూస్తూ మబ్బులు కూడా అలా నిలిచిపోవటమే గాదు… జాబిలి వాటిని తన చెలిమికి రమ్మని రేయంతా పిలిచిపిలిచి అలసిపోవటమే గాదు… అక్క వేసే ముగ్గులు చూసి నింగి తాను కొంతభాగం నేలనై ఎందుకు పుట్టలేదని చింతిస్తుంది! ఆ నింగిపై తారలు కూడా తామూ పిండిచుక్కలై పోవాలని ఉబలాటపడతాయి. ఎంత పాషాండుడైనా మా వీధిన పోతూపోతూ ఆగి ఓ పరి మా అక్కవేసిన సంక్రాంతినాటి రథం ముగ్గును చూసి చిన్నదైనా అక్కకు, ఆ ముగ్గుకూ మొక్కకుండా ముందుకు అడుగేయలేడు. హరిదాసు గంగయ్య తన్మయత్వంతో చలించిపోతూ..
“అమ్మా… వసుంధరమ్మా! ఆ సంకురుమయ్య తొలుత నీ రథమే ఎక్కి లోకమంతా తిరుగుతూ ప్రతి లోగిలినీ దీవిస్తూ సాగిపోతాడు తల్లీ… సిరిగల లచ్చిమి నీవు… శ్రీహరి వంటివాడే నీకు వరుడై వస్తాడమ్మా!” అంటూ మురిసిపోతూ, తన తంబురాలో రంగనాథుని నామస్మరణ శ్రావ్యంగా పలికిస్తూ ముందుకు సాగేవాడు.
మా వసుంధరక్కకు తెలియని, రాని ముగ్గేలేదు! ఆమె చూపుడువేలు, బొటనవేలు సందులనుండి జాలువారే ప్రతి చిటికెడు ముగ్గుపిండీ.. ఓ కళాఖండమై నేలపై వెలిగేది వేకువ సందెపొద్దుల్లో. ఎలాంటి ముగ్గయినా, ఎవరితోనైనా పోటీపడి గీయటంలో అక్క బస్తీ మేఁ సవాల్! ముత్యాల ముగ్గులు, మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు, దీపావళి ముగ్గులు, ధనుర్మాసపు ముగ్గులు, ఏకాదశి, రథ సప్తమి వంటి శుభదినాల ప్రత్యేక ముగ్గులు… పెళ్లి ముగ్గులు, పొయ్యి ముగ్గులు, పాము ముగ్గులు, తేళ్లు, తాబేళ్లు, విస్తళ్ల ముగ్గులు… పాటిమన్ను, ఆవుపేడల కలగలుపుతో అలికిన చుట్టుపక్కల వాళ్ల చుట్టిళ్ల మట్టిగోడలపైన అయినా, ఆనాటి అమ్మలక్కల వాడివేడి తాజా కబుర్ల కచ్చేరీలు సాగే అరుగులపైన అయినా, మునివాకిళ్ల మీదైనా, అలుకుపూసిన పెరటి పందిళ్ల కిందైనా తన నాజూకైన మునివేళ్లతో అద్దే తడిముగ్గులైనా…
ఏ ముగ్గు వేసినా సరే అది ధరణి కాన్వాసుపైన రంగులద్దిన చిత్రరాజమే! ఆఖరికి తులసికోట ముంగిట అష్టదళ పద్మం వేసినా అది నిజపుష్పమే అనుకుని ఆ శ్రీమహావిష్ణువో, తథాగతుడో తిరిగొచ్చి దానిపై ఆసీనులై యోగముద్రలోకి వెళ్లిపోతారేమో అనిపించేది చూసే ప్రతి కన్నుకి. ప్రతి శుక్రవారం అక్క వేసే దీపాల ముగ్గులో గీతలన్నీ విద్యుల్లతల్లా విరాజిల్లేవి. ప్రతి సాయంత్రం ఎక్కడా పేడ ముద్దలుగా కొంచెంకూడా కన్పించకుండా ఎంతో కుదురుగా కళ్లాపి చల్లిన మా లోగిలి.. లోకప్రశస్తి సాధించిన నృత్యకారుల ప్రదర్శనకు సిద్ధంచేసిన రమణీయ రంగమండపంలా వెలిగేది. అక్కడ నాలుగు గుప్పెళ్లు ముగ్గుపిండి, మూడు పిడికిళ్ల రంగుల్లోంచి పుట్టుకొచ్చే ఎన్నో కళారూపాలు ఈ భూమిపై వాటి అసలు సజీవ మూర్తులకు ప్రతిసృష్టిలా నిలిచేవి.
వసుంధర అక్క ముగ్గులో ముగ్గుగా గీసే చెరకుగడల కోసం దాపున వనంలోవున్న ఏనుగుపిల్లలు ఊళ్లోకి ఉరికొస్తాయా అన్నట్లు ఆశ్చర్యం! జంట నెమళ్లను గీస్తే అవి ఇంకొద్దిసేపట్లో పురివిప్పి నాట్యమాడతాయన్నట్లు… పచ్చని రామచిలుకల్ని చిత్రిస్తే అవి ప్రాణంపోసుకుని లేచి పెరటి జామచెట్లపై వాలి దోరదోర పండ్లను ముక్కులతో పొడుచుకుని తింటాయేమో అన్నట్లు ఉండేవి… వాడికొమ్ముల ఎద్దుల ముఖాలను వర్ణాలలో అద్దినపుడు ఊరి బసవన్న రాచఠీవితో అటుగా కదులుతూ ఆగి మోరదింపి తన నల్లగవ్వలవంటి బారు నేత్రాలలో విస్మయాన్ని నింపుకొని తన మూపురాన్ని ఓ గోపురంలా పైపైకి ప్రశంసాపూర్వకంగా ప్రదర్శించేది.
ఒకసారి మా అక్క వసుంధర వేసిన మీనాల ముగ్గు చూసి వలలతో వేటకెళ్తున్న బెస్తోళ్ల గోపన్న తాత తనతోటి మత్స్యకారులతో ఆ ముగ్గు దగ్గరే అదాటున ఆగిపోయి..
“వసుంధరమ్మా… ఈ చేపల ముగ్గు చూస్తంటే పెద్ద చెరువుకు పోకుండా ఈడనే వల ఇసరాలనిపిస్తుంది తల్లీ. ఏమి చెయ్యమ్మా నీది. లచ్చిందేవి ఎక్కడో వైకుంఠంలో లేదమ్మా… రాజారావు బాబాయి కడుపునే పుట్టిందీ ఇంట” అంటూ మహా పొంగిపోయేవాడు.
ఆ మాటలకు ఆ ముగ్గులోని చేపలన్నీ కన్నులు, మొప్పలు ఆడిస్తూ జాలరి గోపన్న వైపు బెదురుబెదురుగా చూస్తున్నట్లు నా లేత ఊహలకు తట్టేది! అలాంటి పొగడ్తలు విన్నప్పుడల్లా మా పెద్దమ్మ, పెదనాన్న సంతోషంతో తబ్బిబ్బయిపోయేవారు. అన్నట్లు వసుంధరక్క నాకు సొంత అక్క కాదు. మా పెదనాన్న కూతురు. మగపిల్లలు లేని వారింట నేనే ప్రచ్ఛన్న వారసుడిలా పెరిగాను.
అక్క వేసే విభిన్న బహుళవర్ణ రంగవల్లికల్లో ఎన్నెన్నో వృత్తాలు, త్రిభుజాలు, దీర్ఘచతురస్రాలు, బహుభుజులు, సరళ, వక్రరేఖలు, బహుకోణాల జ్యామితీయ రూపాలెన్నో పరస్పరం గాఢ బంధాలతో పెనవేసుకుని మా ఇళ్ల లోగిళ్లలో అవి సవన్నా వనాల లయానాల పొదరిళ్లలా శోభిల్లేవి.
ధనుర్మాస ప్రారంభ తిథి నుండి ముక్కనుమ నాటి వరకూ నాటి సంక్రాంతి పండుగ సంబరాల్లో అక్క ప్రతిరోజూ వేసిన ముగ్గు వేయకుండా పెద్దపెద్ద ముగ్గులు వేసి తన చేతితో గొబ్బెమ్మలు చేసి మధ్యన ఉంచేది. వాటి మధ్యలో గరిక గుచ్చి, పసుపు, కుంకుమలు, ముగ్గుపిండితో, నవధాన్యాలతో, రేగుపండ్లు, పెరటి కాయగూరలతో అలంకరించేది. గౌరమ్మల్లా శోభిల్లే వాటిని చూసే సిరిలక్ష్మి మా ఉమ్మడి కుటుంబపు లోగిట దర్శనమిచ్చేది అనటానికి నిదర్శనం మా గ్రామాల కైవారం మొత్తం క్షామం వచ్చిపడినా మా చేలల్లో మోటబావుల్లో నీటి ఊటలు మాత్రం పుష్కలం! శ్రీకృష్ణుని చుట్టూ గోపికలు చేరి పాటలు పాడుతూ నర్తించినట్లే.. మా వసుంధరక్క, ఆమె తోటి పడుచులతో కూడి తెలుపు, గన్నేరు, చిలకపచ్చ, పసుపు, కనకాంబరం, రాణీరంగు, మావిచిగురు రంగుల ఓణీలలో నెమలి పిట్టల్లా ఆ గొబ్బెమ్మల దగ్గర ఆడిపాడేవారు. మా వీధి పెద్దముత్తయిదువలు నరసత్త, బేబమ్మ, సరోజిని పెద్దమ్మ, మంగవ్వ, మిద్దింటి నారాయణత్త వంటి వాళ్లంతా అక్కడ చేరి మహా సందడిగా గౌరమ్మ పాటలు పాడుతూ, పాడిస్తూ ఆ పడుచులకు రామసక్కదనం ఉట్టిపడే పెనిమిట్లు రావాలని దీవించేవారు.
గోదాదేవి కల్యాణంతో ధనుర్మాసం ముగిసే భోగినాటి ఉత్సవాలలో మా ఊరి సంతానం వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అక్కతో ‘వైకుంఠ వాకిలి’ ముగ్గు వేయించేవారు పెద్దయ్యవార్లు. కొందరు ఆ ముగ్గును ‘స్వర్గవాకిళ్లు’ అని కూడా అనేవాళ్లు. అక్క వేసిన ఆ పెద్ద ముగ్గు పసుపుకుంకుమలు పల్చగా కలిపి జల్లిన మృణ్మయ చిత్రాసనం అనదగిన ఆ కళ్లాపి నేలపై ప్రభాతవేళల్లో తేజోమానంగా వెలుగుతూ శిల్ప భరితమైవున్న ఆలయ గాలిగోపురంతో పోటీపడుతున్నట్లు ఎంతో శోభతో సమున్నతంగా నిలిచేది. ఊళ్లో వేరెవరైనా వేస్తే ఆ ముగ్గు మధ్య నాలుగు దారులతో ముగుస్తుంది. కానీ, నాలుగు స్వర్గవాకిళ్లు కలుపుతూ పదహారు దారులతో ఆ ముగ్గేసి, రంగవల్లికల్లో నవకల్పనలు చేయగల ఈస్తటిక్ జీనియస్ నా సోదరి. ఆ ముగ్గు నడిమధ్యలో పూర్ణకుంభాన్ని వేసి దానిపై ఉంచిన పెద్ద గొబ్బెమ్మ తిరు ఆండాళ్ స్వరూపిణిలా భాసిల్లేది. ఆలయ ధ్వజస్తంభానికి, గర్భాలయానికి మధ్య స్థలంలో వేసే ఆ దివ్య రంగవల్లికకు కూడా భక్తిపూర్వకంగా నమస్కారం చేసేవారు కొందరు గ్రామస్తులు. అదీ అక్క చేతి ముగ్గుల దివ్యత్వం!
అలాంటి మా కలికి ముగ్గుల కలకంఠిని నీలకంఠుడి లాంటివాడని ఊరంతా మెచ్చుకునే రంజిత్ బాబు ప్రేమించాడు. అతను మా ఊరి మాజీ పటేలు బహద్దూర్ బసవారావు గారి మనవడు. మొదట మా వసుంధర తిరస్కరించింది. అతడేమో అక్క ముగ్గులకు మస్తు ఫిదా అయ్యాడు. ఆమె కాదంటే తనను తాను మా గుమ్మం ముందే నిప్పంటించుకుని బూడిద కుప్పనౌతానని, దానిని ముగ్గులో కలుపుకొని జీవితాంతం కుమిలిపోతూ రంగవల్లికలు వేసుకొమ్మని మూర్ఖంగా వెంటబడేవాడు. అక్క కోసం పిచ్చి సాహసాలు చేసేవాడు. ఒక ధనుర్మాసపు సందెలో అక్క వేసిన వైకుంఠవాకిలి ముగ్గు మధ్యలో అడ్డంగా పడుకొని బ్లేడుతో గాయాలు చేసుకొని రక్తపుసాక పోశాడు. ఆఖరికి తప్పలేదు. వసుంధర అతని వశమైంది. బాగా బతికిన బహద్దూర్ల కుటుంబం కదా అని అంతా ఒప్పుకొన్నారు. తమ పెళ్లయిన తర్వాత రంజిత్ బావ ఊరొదిలి కొంత పొలం అమ్మేసి సిటీకొచ్చి ఒక చక్కని రెస్టారెంట్ కమ్ లాడ్జ్ మొదలుపెట్టాడు. అది బాగా నడిచి లాభాలు తెచ్చిపెట్టడంతో ఇంకొన్ని రెస్టారెంట్లు, లాడ్జీలు, పీజీ హాస్టళ్లు తెరిచాడు రంజిత్ బావ. అలా ఆ దంపతులిద్దరూ పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనతికాలంలోనే భోగభాగ్యాలు సంపాదించారు.
“ముదనష్టపు ముండ… ఎంత పని చేసిందిరో నాయనో…”
“ఏడవటం కాదే… అందరమెల్లి దాని పీక కోద్దాం రండి!”
“ఆగండి చిన్నమ్మా… పెద్దబ్బాయి కేసుపెట్టాడుగా… జీవితఖైదు ఖాయం ఆ కసాయి దానికి!”
“అయ్యో రామ… తాటిమానంత మనిషి వీడు… ఎంత రౌడీముండ గాకుంటే ఇలా కట్టేసి కోస్తదా?”
“రెండు లీటర్లపైనే రక్తం లాగిందటరా… పిశాచి రా అది పిశాచి…”
తెగ పేలుతున్న ఈ ఆడ గొంతుకలకు మగగొంతులు వంత కలిపాయి.
“చేసిందంతా చేసి మళ్లీ అంబులెన్స్‌కు ఫోన్ చేసింది చూడు బద్మాష్ది!”
“అసలా కొంపతో సంబంధం వద్దంటే అప్పట్లో వినడాయె వీడు. పాలెగాళ్ల పాదునుండి పాలుతాగేటోళ్లు పుడతారా ఏందన్నా? రక్తం… రక్తమే కావాలి వాళ్లకు…”
“కొంచెం ఆగండన్నా… చూడు… రంజిత్ కదులుతున్నాడు…”
“నా బిడ్డ… వాడు లేవాలి… సామిరంగా అది వీడి మణికట్టు ఎట్ల కోసిందో అలాగే దాని మెడగూడా బరబరా కోయించాలిరా”
వాడి వేడి పగతో సిగమెత్తి ఊగుతున్నారు రంజిత్ బావ బంధువులు.
ఇంతలో డ్యూటీ నర్స్ వచ్చి అందర్నీ మర్యాదగానే గదమాయించింది.
“ఏంటండీ ఆ మాటలు ఇక్కడ? నోమోర్ టైమ్ ప్లీజ్. ఏజీఎం సార్ చెప్పారని ఇంత టైం ఇచ్చాం… దయచేసి ఇక వెళ్లండి… ప్లీజ్…”
ఆ వీఐపీ ఐసీయూలో ఓ మూలన క్యూబికల్ కర్టెన్స్ మాటున అదంతా వింటూ దాక్కొని ఉన్న నేను.. బయటకొచ్చి నర్స్‌కు నిండు నమస్కారం చేశాను. ఆమె పర్లేదులెండి అన్నట్లు తలాడించింది.
ఎంతో రక్తంపోయి అక్కడ పాలిపోయిన దేహంతో ఎండు జొన్నచొప్ప మోపులా పడివున్న రంజిత్ బావను మరోసారి నుదురు తడిమి చూసుకొని ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా ఆ పేరున్న కార్పొరేట్ ఆస్పత్రి నుండి బయటపడ్డాను.
ఆరోజు అలా మనుషుల చూపునుండి భయంతో దొంగలా తప్పించుకుని తప్పుకోవటం నా జీవితంలోనే మొదటిసారి!
మా వసుంధరక్క బావపై హత్యాప్రయత్నం చేసిందనే వార్త తెలియగానే బ్యాకప్ గైకి పెండింగ్ వర్క్ వదిలేసి బెంగుళూరు నుండి ఆఘమేఘాలమీద సిటీ చేరుకుని తిన్నగా హాస్పిటల్‌కి వెళ్లాను. చావుతో పోరాడుతున్న రంజిత్ బావను ఆ స్థితిలో చూసి అక్కడ అతని బంధువుల మాటలు విని పొర్లుకొస్తున్న కన్నీళ్లను అదిమిపట్టి అక్క, బావ ఈ మధ్యనే కొత్తగా కట్టించుకున్న ఖరీదైన పాలరాతి సౌధంలోకి భయంభయంగా అడుగుపెట్టాను. గేటుకు దగ్గర్లో ఫైబర్ చైర్స్‌లో ఓ ముగ్గురు కానిస్టేబుల్స్, కొంచెం దగ్గర్లో లాన్ చైర్లో సబ్ ఇన్స్పెక్టర్ కూర్చొని ఉన్నారు. సాయంత్రం ఆరు తర్వాత స్త్రీలను అరెస్టు చేయకూడదు కాబట్టి బందోబస్త్ ఏర్పాటుచేసారు. ఎస్సై నన్ను చూసి ముఖం చిట్లించాడు. దగ్గరకెళ్లి సెల్యూట్ చేసి వివరాలు చెప్తే లోపలికి వెళ్లనిచ్చారు.
అమోఘమైన చిత్తరువులు, నగిషీలు చెక్కివున్న ఆ రోజ్ ఉడ్ దర్వాజాను దాటి లోపలికి అడుగులు వేస్తుంటే నా వొళ్లంతా చల్లబడింది. అక్కడి దృశ్యం చూసి వాంతి రాబోతుంటే నోరు గట్టిగా చేతుల్తో బంధించి తమాయించుకున్నాను.
ఆ విశాలమైన, ఖరీదైన పాలరాతి హాలు మధ్యగా… సగం ఎండిపోయి సగం పచ్చిగా ఉన్న రక్తసానుపు… ఆ నెత్తుటి కళ్లాపిపై వైకుంఠవాకిలి ముగ్గు! ఆ ముగ్గు మధ్యలో మా వసుంధరక్క జ్వలనమవుతున్న ఓ గొబ్బెమ్మలా… రక్త చందనాలు అద్దుకున్న గౌరమ్మలా ఉంది… అగ్ని ఆవాహన తర్వాత చల్లారి భస్మంతో నిండిన హోమగుండంలా నల్లకప్పు కట్టిన ఆమె వదనం… రాక్షసగణ సంహారం పూర్తిచేసిన దుర్గమ్మ హస్తాల్లా ఆమె చేతులు రుధిరకాంతులతో మెరుస్తున్నాయి.
“అయ్యో అక్కా…. ఎందుకిలా చేశావే?”
నేలపైబడి భళ్లున పగిలిన నిండుకుండలా నేనూ పగిలి పొగిలిపొగిలి ఏడ్చాను.
“చివరికి ఆ చీడ నీడ చిన్నారి మొగ్గలపై కూడా పడుతుందిరా తమ్ముడూ… తప్పలేదు” అంటూ అక్క నా భుజాలపై తలవాల్చి కన్నీరు మున్నీరయింది.
చాలాకాలం నుండే నాకు చెప్తున్నది అక్క. బావలో రోమరోమమూ కామమే! ఊరిలో ఉన్నంతకాలం కుదురుగానే ఉన్నాడు. సిటీకొచ్చి ఈ బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, హోమ్ స్టేల బిజినెస్ మొదలుపెట్టాక రంజిత్ బావ చేతినిండా డబ్బు… మదినిండా ఆ గబ్బు! మెల్లగా అతనిలో హైపర్ సెక్సువల్ బైటికొచ్చాడు. తన దగ్గర పనిచేసే ఆడవాళ్లకు అతిగా పెత్తనం, లేదంటే ప్రమోషన్స్ ఇవ్వటం, ఖరీదైన బట్టలో, నగలో, ఐఫోన్లో ఆశగా చూపి వాళ్లని లొంగదీసుకోవటం చేసేవాడు. క్రమంగా బావ ‘వుమన్ ఈటర్ టైగర్’ అయ్యాడు! బార్టెండర్ నుండి మేనేజర్ దాకా చక్కటి అమ్మాయిల్నే రిక్రూట్ చేసేవాడు. పడుచుపిల్ల కనపడితే కన్నుగొట్టి నాందీవాచకం- కడుపుజేసి మంగళవాచకం పలకాలి అనే బావగారు తన శృంగార రంగభోగం రసభంగం కాకుండా నిత్యం నడుస్తున్నందుకు మీసాలు మెలేసేవాడు.
మనిషి జీవితంలో రసాత్మకమవ్వాల్సింది రంజిత్ బావకు రుగ్మతగా ముదిరిపోయింది. అక్క చెవినిల్లు కట్టుకుని చెప్పేది. పెద్దవాళ్లతో చెప్పించింది. అతని దగ్గరి దోస్తులతో హెచ్చరికలు చేయించింది. ఆ మధ్య బావ నడిపే రెస్టారెంట్లో రిసెప్షనిస్టుగా చేస్తున్న ఒక ఉత్తరాది అమ్మాయిని లోబరుచుకున్నాడు. ఆమెకు అబార్షన్ చేయించే క్రమంలో ప్రాణాపాయం జరిగింది. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా లంచాలు తినిపించి తప్పించుకోవటంలో బావ దిట్ట. పోలీసులకు పేటీయం… ఆమె కుటుంబానికి ఏటీయం! దెబ్బకు కేస్ మాఫీ. దీనివల్ల వ్యాపారం వెనుకబడింది.
మనాదితో వసుంధరక్క సగం మనిషయింది.మగాళ్లు మృగాళ్లయి తాగుతారు. తిరుగుతారు. జూదమాడతారు. ఇంట్లో స్త్రీలను హింసిస్తారు. కానీ రంజిత్ బావ ‘గృహ హింస’ ఎంత హీనమైనదో వసుంధరక్క చెప్తుంటే విని విస్తుపోయేవాడిని. బావ తెల్లవార్లూ ట్యాబులో పోర్న్ చూస్తూ అశ్లీల పాతాళలోకాల్లో విహరిస్తూ అక్కను సరిగా నిద్రపోనివ్వకుండా గలీజుతనం అంతా ప్రదర్శించేవాడట. ‘శయనేషు రంభ’ అనే మాటనే మనం తిరస్కరిస్తున్న నేటి కాలంలో కూడా రంజిత్ బావ ‘శయనేషు వేశ్య’లా ఉండాలన్నట్లు అక్కను సతాయించేవాడట. బావ దృష్టిలో ఇల్లాలికి, వెలయాలికి తేడా చెరిగిపోయింది. భార్య తనకు సంసారంలో ‘కో ఆపరేట్’ చేయదని అందుకే తాను తిరుగుబోతునయ్యానని నిస్సిగ్గుగా పదిమందితో వాగేవాడట. ‘సుద్దముగ్గులద్దుకునే ముద్దపప్పా… నీకేం తెలుసే సెక్స్ అంటే!’ అని తూలనాడుతూ హింసించేవాడు ప్రతిరేయీ.
ఆడవాళ్లకు మగాళ్లని భరించటమే ఓపాటి చిన్నబడి చదువుగా ప్రారంభమయ్యే ఈ నేలపై అక్క కూడా రంజిత్ బావను భరిస్తూనే వచ్చింది. కానీ ఆ విపరీతకాముడు ఇంక అన్ని పరిధులూ దాటడం మొదలుపెట్టాడు. అక్క ఆ మధ్య సంక్రాంతికి ఇంటికి వెళ్లింది. బావ తను చాలా బిజీ అంటూ రానన్నాడు. అది భోగి పండుగ రోజు. తమ ఇంటికి కాపలాగా పెట్టుకున్న గార్డుకు ఇంటి వెనుక రెండు గదులు కట్టించారు. ఆ కాపలామనిషి, అతని భార్య బైటకు వెళ్లిన సమయంచూసి బావ వాళ్ల పన్నెండేళ్ల పాపమీద చేతులు వేశాడు. చిన్ని దోర జామపండులా ఉన్న ఆ ముద్దుల పాపాయిని లోపలికి పిలిచి, కేక్ తినిపించి నీచంగా వెకిలిచేష్టలన్నీ చేస్తుండేసరికి ఆ పాప భీతితో ఏడుస్తూ బైటకు పరిగెత్తిన దృశ్యాలన్నీ తన మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న ఇంటి సీసీ కెమెరాల ద్వారా చూసిన అక్క రగిలిపోయింది. కోపంతో శివాలెత్తింది. మా ఊళ్లో గుడిముందు వైకుంఠవాకిలి ముగ్గును ఇంకా అక్కతోనే వేయిస్తున్నారు. అది పూర్తిచేసి అక్క అదేరోజు వాయువేగంతో ఇల్లు చేరుకుంది. చౌకీదార్, వంటమనిషి కుటుంబాల్ని పిలిచి డబ్బులు చేతిలో పెట్టి వాళ్లకు నాలుగు రోజులు సెలవులు ఇచ్చి పంపేసింది.
వసుంధరక్క ఓ కఠిన నిర్ణయానికొచ్చింది. ‘లాభం లేదు… తప్పదుగాక తప్పదు… ద రాటెన్ ఆర్గాన్ మస్ట్ బీ మ్యూటిలేటెడ్’ అని గట్టిగా నిశ్చయించుకుంది. పండక్కి ఒక్కతే వెళ్లటంవల్ల బోర్ కొట్టి తిరిగొచ్చానని చెప్పి ఆ రోజు బావతో నమ్మకంగా మెలిగింది. అతను ఎంత తాగితే అంత తాగనిచ్చింది. ఆ రాత్రి ఇష్టమైన పదార్థాలు వండి బావకు అదిరిపోయే డిన్నర్ తినిపించింది. బావ పడుకొని గాఢనిద్రలో ఉండగా తెల్లవారుజామున నిద్రలేపింది. కళ్లు నలుపుకొంటూ నిద్రలేస్తున్న బావను అమాంతం పట్టుకుని చేతులు కట్టేసి బలంగా లాక్కెళ్లి ఇరువైపులా సింహాల బొమ్మలు గంభీరంగా చెక్కివున్న హాలు మధ్యలోని రాయల్ రాకింగ్ చైర్‌లోకి నెట్టివేసింది.
అతను వెల్లకిలా కుర్చీలో పడిపోయి లేచి తేరుకునేలోపే సివంగిలా దూకి గట్టి తాళ్లతో అతణ్ని కదలకుండా కట్టేసింది. బావ బూతులాడుతూ మొత్తుకుంటున్నాడు. సకల వర్ణాల చక్కని రంగవల్లికలు దిద్దే అక్క చేయి ఆ ఘడియలో పరమ కసాయి అయింది. కొత్త బ్లేడు తీసుకుని అతని కుడి మణికట్టు దగ్గర సర్రుసర్రున కోసింది. బావ బాధతో పెట్టిన కేకలకు పైన సీలింగ్ కంపించినట్లయింది. ఎగజిమ్ముతున్న రక్తాన్ని అక్క ఒక మగ్గునిండా పట్టసాగింది. బావ వెర్రిగా తాళలేని నొప్పితో తిడుతూ శోకాలు పెడుతున్నాడు. రక్తం తీస్తుంటే అతని శరీరం పాలిపోతూ ముఖంలో నీలినీలి మృత్యుఛాయలు కమ్మాయి. అతను స్పృహ కోల్పోకమునుపే అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. భయం కమ్మిన రంజిత్ బావ కళ్లకు ఆ ఘడియలో అక్క రక్తబీజుడనే అసురుని నెత్తురు తాగబోతున్న మహాకాళిలా ఉగ్రరూపంలో కనిపించింది.
అంబులెన్స్ వచ్చేలోగా అక్క బావ రక్తాన్ని అతను మూలుగుతూ అర్ధ స్పృహలో చూస్తుండగానే అతని కుర్చీముందు కల్లాపిలా బారుగా చల్లింది. ఆ వెంటనే ముగ్గందుకుని ప్రపంచ నాదబ్రహ్మలుగా పేరుమోసిన సంగీతకారులంతా ఓ చోట కూడి సింఫనీ కచేరీలో ఎంతో లలితంగా స్వరాలు మోగిస్తుంటే వారి చేతుల్లో మెరుస్తున్న వయోలిన్ విల్లులా తన చేతివేళ్లను కదిలిస్తూ కొద్ది నిమిషాల్లోనే పెద్ద ముగ్గు వేసింది. ఎర్రెర్రని నెత్తుటి వేదికపై తెలతెల్లని పున్నమి జాబిలిలా తళుక్కున మెరిసింది ఆ ముగ్గు… అది వైకుంఠవాకిలి ముగ్గు! ముగ్గు పూర్తవగానే లేచి భర్త దగ్గరకెళ్లి ఆ పెద్ద కుర్చీని ముందుకు లాగి జరిపి ఆ ముగ్గును చూపిస్తూ…
“చూడు రంజిత్ చూడు… నా కోసం ఒకనాడు ఈ ముగ్గుపైబడి రక్తం కార్చావుగా… చూడు. గుర్తుందా? రంజిత్… ఈ ముగ్గు పేరు స్వర్గవాకిలి. నాకిది రేపటినుండి స్వేచ్ఛాలోగిలి!” అంటూ పెద్దగా రోదిస్తూనే అతని రెండు చెంపలూ వాయించింది.
“ఇప్పుడు రక్తం తోడా… ఇంకోసారి ఆడపిల్లలపై చేయేస్తే ప్రాణం తోడేస్తా” అని హెచ్చరించింది.
ఇంతలో అంబులెన్స్ సైరన్ మోతలు సమీపంలో వినిపించగానే భర్త కట్లు విప్పేసింది అక్క. ఆ రోజు బావ దేహం చావలేదు. అక్క హృదయం మాత్రం హంతకి అయింది… ఇదంతా తన పెనిమిటిలో కోరలు చాచిన కామమహిషుడిని చంపటానికి మాత్రమే. పోలీసుల ముందు అక్క చేసిన కన్ఫెషన్స్ వల్ల మాకు ఈ విషయమంతా తెలిసింది.
ఆ రోజు బావ తండ్రి, అన్నలు విషయం తెలుసుకుని అక్కపై కేసు పెట్టేసరికి సాయంత్రమయ్యింది. ఆ మరుసటిరోజు అక్కను అరెస్టుచేసి తీసుకెళ్లారు. ఆ వెంటనే నేను సిటీలో టాప్ క్రిమినల్ లాయర్ కోసం పరుగులు తీశాను.
మన కథ కంచికి చేరక మునుపే మా బావ మారిపోయాడు. తను చాలా పోరాడాడు. తనను తాను కాపాడుకోటానికి… ముందు మృత్యువునుండి… తర్వాత క్రమంగా పాపం నుండి. ఆ రోజు అక్క వేసిన ఆ రక్తపు ముగ్గు అనుక్షణం అతని అకృత్యాలను గుర్తుచేస్తూ ఉండేదనుకుంటా. అందుకే బావ పూర్తిగా మారాడు. అక్క నేర కళంకాన్ని తుడిచేయటానికి తన విశృంఖల, విపరీత ప్రవర్తనే కారణమని మీడియా ముందు, న్యాయపీఠాల సాక్షిగా మోకరిల్లి ఒప్పుకున్నాడు… వేడుకున్నాడు. తన ఇల్లాలి ఆక్రోశం అర్థమై అటువంటి ఉత్తమురాలితోనే తన జీవితం ముగిసిపోవాలని ఆరాటపడ్డాడు. అన్నపానీయాలు మర్చిపోయి న్యాయవాదుల, ఉన్నత న్యాయస్థానాల గుమ్మాల దగ్గర నెలల తరబడి పడిగాపులు కాశాడు. తాను చేసిన చీకటి పనుల వల్లనే వసుంధర నిస్పృహ, ఆవేశంలో అలా చేసిందని చట్టం ముందు ఆర్తిగా తన తప్పుల్ని ఏకరువు పెట్టాడు. తమ తమ్ముడు చేసిన తప్పులను గురించి క్రమంగా తెలుసుకున్న రంజిత్ బావ అన్నలు, అక్కలు కూడా ఓ మెట్టు దిగొచ్చి తమ మరదలు చేసిన పనికి అప్పుడు కోపించి కేసు పెట్టామని మానవతా దృక్పథంతో సెషన్స్ కోర్టు తీర్పును రివ్యూ చేయమని ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకున్నారు. ఒక సంవత్సరంపాటు అందరూ చేసిన ప్రయత్నాల వల్ల అక్క చేసిన నేరం ‘కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్’ గా పరిగణించి.. వసుంధరక్క శిక్ష పదేళ్లనుండి ఐదేళ్లకు తగ్గించారు.
మహిళా జైలు ప్రాంగణం.
వసుంధరక్క శిక్షాకాలం ముగిసింది. ఆమె విడుదలవుతున్న ఆ రోజు కూడా యాధృచ్చికంగా ధనుర్మాసం ఆఖరి రోజు.
“వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిళైయ్యార్ శెన్రి రైంజి…”
…దగ్గర్లోని హరిహరక్షేత్రంలో ఎవరో ఓ అమ్మ కమ్మగా ఫలశ్రుతి పాశురం పాడుతున్నది. ఆలయ గోపురం పైన మైకునుండి అక్కడికి మంద్రంగా, మధురంగా వినిపిస్తున్నది.
ఆ పాశురాలు వింటూ తన దేహంలోని ప్రతి జీవకణం పులకరిస్తుండగా… మూసిన నేత్రాలనుండి హర్షాశ్రువులు ధారలుగా జాలువారుతుండగా… సింధూర వర్ణపు దుస్తుల్లో, చందన తిలకాలతో… ఆ జైలు ఆవరణలో ఎంతో శాంతంగా నిలబడి ఉన్నాడు అమ్మవారి మాల ధరించిన రంజిత్ బావ. అతని వెనుక అతని కుటుంబసభ్యులు, పక్కనే నేను. మా ఇరు కుటుంబాల వాళ్లం కలిసి అక్క కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం… ఆ రోజు వేకువనే మా పెద్దమ్మ, ఊరినుండి అక్క కోసం వచ్చిన మిగతా ముత్తయిదువులు కలిసి జైలు అధికారిణి అనుమతితో సుందరంగా తీర్చిదిద్దిన వైకుంఠవాకిళ్లు ముగ్గు… మధ్యలో ఓ చిన్న బతుకమ్మ!
వసుంధరక్క కారాగారపు ద్వారందాటి మెట్లు దిగి అక్కడ తనకై ఎదురుచూస్తూవున్న మమ్మల్నందర్నీ చూసి ఎంతగానో భావోద్వేగ ప్రకంపనాలకు గురైంది. తన భర్తను చూడగానే అతనివైపే తన చిరుపాదాలను కదిలించింది. కానీ అంతలోనే తనకు, బావకు మధ్యగా మెరుస్తున్న ఆ రంగవల్లికను చూసి… సగం దూరం మాత్రమే నడిచి ఆ ముగ్గు ముంగిటే నిలిచిపోయింది. అలనాటి నిండు తేజస్సు కొంత కోల్పోయిన అక్క కన్నులనుండి బొటబొటా నాలుగు అశ్రువులు రాలాయి. రంజిత్ బావ అమాంతం ముందుకు కదిలి అక్కముందు కూలబడి ఆమె మోకాళ్లకు తనను తాను అల్లుకుపోయాడు. చంటివాడిలా రోదిస్తూ..
“నన్ను క్షమించు వసుంధరా” అని పదేపదే అంటూ వెక్కిళ్లు పడసాగాడు.
సుడిగుండపు అగాధంలోకి జారిపోతున్న ఓడను వొడిసిపట్టి పైకితేల్చే ఒక తెప్పను సృష్టించి దానిని తిరిగి జలతలానికి భద్రంగా దరిజేర్చే గంగమ్మలా అక్క బావను మృదువుగా భుజాలు పట్టుకొని పైకిలేపి తల్లి చూపే అమిత వాత్సల్యంతో బాహువులు చాపి అతణ్ని దగ్గరకు తీసుకున్నది.
సకల వర్ణాల చక్కని రంగవల్లికలు దిద్దే అక్క చేయి.. ఆ ఘడియలోపరమ కసాయి అయింది. కొత్త బ్లేడు తీసుకుని అతని కుడి మణికట్టు దగ్గర సర్రుసర్రున కోసింది. బావ బాధతో పెట్టిన కేకలకు పైన సీలింగ్ కంపించినట్లయింది. ఎగజిమ్ముతున్న రక్తాన్ని అక్క ఒక మగ్గునిండా పట్టసాగింది. బావ వెర్రిగా తాళలేని నొప్పితో తిడుతూ శోకాలు పెడుతున్నాడు.
వేణు మరీదు
‘ఏ ఒక్కరి మేఘంలోనైనా నువ్వు ఓ ఇంద్రధనుస్సువై విరియాలి..’ అని ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి, ఉద్యమకర్త అయిన మయా ఏంజెలూ మాటను దృఢంగా నమ్మే అధ్యాపకుడు వేణు మరీదు. బోధనపై మక్కువతో అధ్యాపక వృత్తిలోకి వచ్చారు. కష్టమైనా.. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాష బోధించడాన్ని ఇష్టంగా చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రభుత్వ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థుల జీవితాలను ప్రేమతో, సునిశితంగా పరిశీలించడం వల్లే.. తనకు రచనలు చేయగలిగే శక్తి అబ్బిందని చెబుతున్నారు. ఆలస్యంగా రచనా వ్యాసంగం ప్రారంభించిన ఈయన.. ఇప్పటికి 16 కథలు రాశారు.
వాటిలో నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన కథల పోటీల్లో కాటుక కన్నుల సాక్షిగా, అతడి నుండి ఆమె దాకా కథలు బహుమతులు గెలుచుకున్నాయి. డోలాయమానం, నిర్వర్ణం, ది టాయిలెట్ గర్ల్, నాక్కొంచెం ఇంగ్లీషు కావాలి!, అచ్చమ్మవ్వ ఆరో నాణెం, ప్రెజెంటెడ్ బై వసుధ, అవ్వా బువ్వ పెట్టవే!, ఆ నలుగురు లేని నాడు, పూలకోసం.. పుడమి కోసం.., తప్పిపోని గొర్రెపిల్లల కథ, ఇది ఏం బ్రీడు?, డెడ్ ఎండ్, జీవనది కథలు.. రచయితకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో కథలు రాయటంతోపాటు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హన్స్ ఇండియా పత్రికలు, ఆల్ పోయెట్రీ డాట్ కామ్ వంటి వెబ్సైట్లలో ఆంగ్ల కవితలు రాస్తున్నారు.
వేణు మరీదు
85550 53547