(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ
కళింగ రాజ్యంలో హఠాత్తుగా రాజభటులు కుసుమ శ్రేష్ఠిని బంధిస్తారు. చంద్రహత్థి పోటిసుణ్ని ప్రేమిస్తున్న విషయం తెలుపుతుంది. కానీ, పోటిసుని అంతరంగం తెలియదు. రోహ తన సేవకురాలైన అలసుద్దిని చెల్లెలుగా భావిస్తుంది. తనను ‘అక్కా!’ అని పిలువ మంటుంది. తర్వాత…
“నీవు నా మేలుకోరేవాడవు. నీ మాటలను నేను తప్పు పట్టను కానీ, నేను ఉన్న పరిస్థితిలో ఈ రెండూ తప్పలేదు. నాయన గారికి సంబంధించిన సమాచారం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆయన కళింగలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో! పోటిసునికి ఎటువంటి ఉపద్రవం సంభవించిందో! సాధ్యమైనంత తొందరగా తెలుసుకోవడం కొడుకుగా, ఒక యజమానిగా నా బాధ్యత. ఈ విషయం గురించి అక్కడ మల్లగుల్లాలు పడుతూ కూర్చోవడం కంటే బయలుదేరితే సగం ప్రయాణమైనా పూర్తి అవుతుంది కదా! అందుకే రాత్రి అయినా, తప్పనిసరిగా ప్రయాణమైనాను” అన్నాడు జాయసేనుడు
వేగంగా పరుగెత్తుతున్న రెండు గుర్రాలు అశ్మకరాజ్యం పొలిమేరలలో ఆగిపోయినాయి. అప్పుడు రాత్రి రెండవ జాములో సగం దాటింది. అంటే అర్ధరాత్రికి ఇంకా గడియ సమయం ఉంది.
కృష్ణానది తీరంలో గుర్రాలపై నుంచి దిగిన యువకుల్లో ఒకడు..
“మిత్రమా! పొలిమేర దాటితే కళింగ రాజ్యంలోకి ప్రవేశిస్తాం. అర్ధరాత్రి సైనికుల కంటబడితే ప్రమాదం. దారి దోపిడీగాళ్లం అనుకొని బంధిస్తారు. ఒక్కసారి
రాజ నిర్బంధంలోకి వెళితే బయటపడటం కష్టం” అని, అక్కడి పరిస్థితులను గురించి చెప్పినాడు. అతడు జయసేనుడు.
తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరినాడు. అంతకుముందు పంపిన పోటిసుడు తిరిగి రాకపోవడంతో ఏం చేయాలనే విషయంలో తల్లి సిరిసత్తి, అతని మిత్రుడు వామదేవునితో కలిసి బాగా చర్చించిన తర్వాత..
కళింగ రాజ్య పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన కలిగిన తాను వెళ్లడమే కార్యసాధనకు ఉత్తమ మార్గమని నిర్ణయించుకున్నాడు.
తల్లికి, కుటుంబానికి తోడుగా మిత్రుడు వామదేవుణ్ని పోదనలో ఉంచి రావాలనుకున్నాడు. కానీ, ఈ పరిస్థితుల్లో కొడుకును ఒంటరిగా పంపడానికి సిరిసత్తి ఒప్పుకోలేదు. ఇంటి రక్షణకు యాభై మంది భటులు, పదిమంది సేవకులు ఉన్నారు. అందరినీ మించి మహా బలవంతుడు, నమ్మిన బంటు కువిందుడు ఉన్నాడు. తాను అన్నీ చక్కబెట్టుకోగలనని, ఒంటరిగా వెళ్లిన పోటిసుడు తిరిగి రాలేదనీ.. అందుకే వామదేవుణ్ని వెంటబెట్టుకొని పొమ్మన్నది సిరిసత్తి. ఆ రెండవ యువకుడే వామదేవుడు.
“మిత్రమా! నీవేమైనా అను. రెండు పొరపాట్లు చేసినావు” గుర్రం జీను లోనుంచి మట్టి పాత్రలో ఉన్న నీళ్లు తీసుకొని తాగబోతూ అన్నాడు వామదేవుడు.
“రెండా! ఏమిటవి?” అడిగినాడు జయసేనుడు.
“మొదటిది.. ఈ అర్ధరాత్రి ప్రయాణం. రెండవది.. మాటమాత్రమైనా నీ భార్య రోహకు ఈ విషయం
చెప్పకుండా రావడం” స్నేహ ధర్మంగా జయసేనుని తప్పులను ప్రకటించినాడు వామదేవుడు.
ఒక్క క్షణం ఆలోచించి, ఈ విధంగా జవాబు ఇచ్చినాడు జయసేనుడు.
“నీవు నా మేలుకోరేవాడవు. నీ మాటలను నేను తప్పు పట్టను కానీ, నేను ఉన్న పరిస్థితిలో ఈ రెండూ తప్పలేదు. నాయన గారికి సంబంధించిన సమాచారం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆయన కళింగలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో! పోటిసునికి ఎటువంటి ఉపద్రవం సంభవించిందో! సాధ్యమైనంత తొందరగా తెలుసుకోవడం కొడుకుగా, ఒక యజమానిగా నా బాధ్యత. ఈ విషయం గురించి అక్కడ మల్లగుల్లాలు పడుతూ కూర్చోవడం కంటే బయలుదేరితే సగం
ప్రయాణమైనా పూర్తి అవుతుంది కదా! అందుకే రాత్రి అయినా, తప్పనిసరిగా ప్రయాణమైనాను”
“మరి ఈ విషయం నీ భార్యకు ఎందుకు
చెప్పలేదు?” వామదేవుడు అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేదు జయసేనుడు.
“ఇట్లా రా!” అంటూ స్నేహితుడిని చేరువలో ఉన్న బండరాళ్ల మీదికి తీసుకొని పోయినాడు.
అక్కడ కూర్చొని కృష్ణ వైపు చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నది.
మబ్బులు లేని ఆకాశంలో సగం చంద్రుడు పూర్ణశక్తితో ప్రకాశిస్తున్నాడు. పడమటి కనుమల వైపు
వెళుతున్న అతని కిరణాలతో కృష్ణ వెండి వెలుగులతో మిలమిలలాడుతున్నది.
తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆకాశంలోకి చూస్తున్న మిత్రునితో వామదేవుడు..
ఎందు కాకాశ మందున్న చందురుడిని
చూసి లోలోన నింతగా చొక్కుటిట్లు?
ఇంట చందమామను మించు నింతి సొగసు
కాదనక వచ్చుటిది ఏమి కర్మఫలము
(ఆకాశంలోని చంద్రుడిని చూస్తూ లోలోన ఇంతగా బాధపడతావ్ ఎందుకు? ఇంటిలో చందమామను మించిన అందగత్తెను వదిలి వచ్చి, ఈ విధంగా
చింతించడం నీవు చేజేతులా చేసుకున్నదే! కర్మఫలం అంటే ఇదే మరి!)” అన్నాడు.
వెంటనే కన్నీళ్లు తుడుచుకొని..
“నాయన గారు ఇంటికి చేరుకోని విషయం నన్ను అక్కడ నిలువనీయడం లేదు దేవా! మనసులో ఇంత ఆందోళన పెట్టుకొని మగువతో సుఖించగలనా? ఆమెను నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. ఒక్కసారి ఆమె కౌగిలిలో కరిగితే నా కర్తవ్యం పట్ల కూడా నేను శ్రద్ధ చూపలేనేమో!” అన్నాడు జయ.
జీవితం పట్ల, భార్య పట్ల ఇంత స్పష్టత కలిగిన మిత్రుణ్ని చూసి గర్వంగా అనిపించింది వామదేవునికి.
కానీ, కాలం వాళ్లని ఎక్కడికి గుంజుకొని పోతున్నదో ఎవరికి ఎరుక!
రాయహత్థి అనుమానాన్ని వెంటనే నివృత్తి చేసినాడు పోటిసుడు.
“అమ్మా! చంద్రహత్థి అంటే నాకు ప్రాణం!”
ఆ మాట వినగానే చంద్రహత్థి ఆనంద బాష్పాలతో కన్నీటి ముద్దయిపోయింది.
ఆ రోజు నుంచి వాళ్లిద్దరూ ఒకరి లోకం మరొకరైనారు.
గూడెంలో కూడా అందరూ.. ప్రాణాలకు తెగించి తమ ఊరి ఆడబిడ్డల మానప్రాణాలను కాపాడిన మహావీరుడని ప్రతి ఒక్కరూ పోటిసుణ్ని అభిమానించ సాగినారు.
వైద్యుడు చెప్పిన దానికంటే వేగంగా పోటిసుని ఆరోగ్యం మెరుగుపడుతున్నది. చంద్రహత్థి ప్రేమ కూడా దానికి తోడైంది. మానసిక ఆరోగ్యం శారీరక రుగ్మతను తొలగించడంలో మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు లేచి కర్ర సాయంతో నడవగలుగుతున్నాడు.
ఒకరోజు రాయవగ్గు దంపతులు పనిమీద పొరుగూరు వెళ్లినారు. ఆరోజు చంద్రహత్థి ఎప్పటికంటే అందంగా తయారై వచ్చింది.
కన్నార్పకుండా చూస్తున్నాడు పోటీసుడు.
ఎక్కడెక్క డతడు చక్కగా జూచునో
అక్కడక్కడొడలు నదియు దాచు
దాచుకొనును గాని దానినే అతడును
చూడ గోరును మనసున దృఢముగ
(అతను తన శరీరంలోని ఏఏ భాగాలను చూస్తున్నాడో గమనించి, ఆయా భాగాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నదామె. కానీ.. అతను అలాగే చూడాలని దాని మనసు కోరుకుంటున్నది)
చంద్రహత్థి అవస్థను గమనించి, కళ్లతోనే దగ్గరికి రమ్మని సైగ చేసినాడు పోటిసుడు.
‘ఎందుకు?’ అన్నట్లు మొఖం పెట్టి, ఆ వెంటనే దగ్గరగా వచ్చి కూర్చున్నది చంద్రహత్థి.
అతను నులక మంచం మీద కాళ్లు కిందికి వేసి కూర్చున్నాడు. ఆమె ఆ రెండు కాళ్ల నడుమ నేల మీద కూర్చుని, అతని మోకాలి మీద తన మోచేతిని ఆనించి అతని ముఖంలోకి చూసింది.
అతను ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని, ఎర్రని ఆమె పెదవులను అందుకోబోయినాడు.
ఠక్కున లేచి, దూరంగా పరిగెత్తింది నవ్వుతూ.
“నేను నీ వెంట పరుగెత్తలేననే కదా.. దూరంగా పోతున్నావ్!” తన నిస్సహాయతను గుర్తు చేసుకుంటూ, దిగులుగా అన్నాడు పోటిసుడు.
అది అర్థం కాగానే, అంతే వేగంగా వెనక్కి వచ్చి, తనే మృదువుగా బుగ్గన ముద్దు ఇచ్చింది చంద్రహత్థి.
“మహావీరా! ఈ చంద్ర బతుకు నీకోసం! బతుకంతా నీకోసమే!!” అన్నది ఆర్ద్రంగా.
“చంద్రా! అట్లా బయటికి పోవాలని ఉన్నది. తోడుగా నువ్వు వస్తావా?” ప్రేమగా అడిగినాడు పోటిసుడు, కర్రను చేతిలోకి తీసుకుంటూ.
“వద్దు!” అన్నది చంద్రహత్థి.
“వద్దా?” ఆశ్చర్యంగా అన్నాడు పోటిసుడు..
“ఎందుకు?”
“నేను వద్దన్నది బయటికి పోవడానికి కాదు! ఈ కర్రను!” అంటూ చేతి ఊతకర్రను లాక్కొని పక్కన పెట్టేసి,
“నేనే నీకు ఊతగా ఉండగా ఇక ఈ కర్రతో పనేముంది?” అంటూ నవ్వుతూ.. అతని చేతిని తన భుజాల చుట్టూ వేయించుకొని, అతని నడుము చుట్టూ చేయి వేసి బయటికి నడిపించింది.
ఆ ప్రయాణం వాళ్ల జీవితం మీద తీవ్ర ప్రభావం చూపగలదని ఆ క్షణంలో వాళ్లకు తెలియదు.
“చెల్లీ! పువ్వులను ఇట్లా పెట్టుకుంటే బాగున్నదా?” తెల్లని చీరను బిగుతుగా చుట్టుకొని, బారెడు మల్లెపూలను సిగలో తురుముకొని అలసుద్దికి చూపిస్తూ అన్నది రోహ.
“ఇట్లా కాదు గానీ, అరగడియలో ఈ అపరంజి బొమ్మను సింగారాల చందమామగా మార్చేస్తాను రాణి గారూ!” అన్నది ఉత్సాహంగా అలసుద్ది.
“ఏయ్! మళ్లా అట్లానే పిలుస్తావేందే? నేను ఎంతో ప్రేమతో నిన్ను చెల్లీ అంటుంటే.. నీవు నన్ను పరాయి దానిలా ‘రాణి గారూ!’ అంటావేంది?” ముద్దుగా మందలించింది రోహ.
తన తప్పు గ్రహించి రెట్టించిన ఆనందంతో..
“తప్పయి పోయింది మహారాణీ! ఇకపై మనం ఇద్దరమే ఉన్నప్పుడు మాత్రం నిన్ను ‘అక్కా!’ అనే పిలుస్తాను. నాకు అక్కలు కూడా ఎవరూ లేరు. దేవుడిచ్చిన ఈ రోహమ్మగారు తప్ప!” అంది ధైర్యం కూడగట్టుకుంటూ.
“ఊఁ… ఇప్పుడు నిజంగా నా చెల్లెలివి అనిపించుకున్నావ్! మాట తప్పితే ఇక మాటలుండవు. చెవి మెలిపెట్టి, చెంప మీద ఒక్కటిస్తా!” అన్నది నవ్వుతూ.
అంతలో అణులచ్చి అనే వృద్ధపరిచారిక వాళ్ల మందిరంలోకి వచ్చింది చొరవగా.
“ఏందే ఆ ఇకయికలు? ఎక్కడ ఉండాల్సిన దానివి అక్కడ ఉండు! రాచనగరి మర్యాదలు నీకు తెలియవా?” గట్టిగా అలసుద్దిని మందలించి..
“చిన్న రాజావారు ఈ సాయంత్రమే కళింగదేశానికి వెళ్లినారు. ఎప్పుడు వస్తారో తెలవదు!” అని చెప్పి.. అంతే వేగంగా వెళ్లిపోయింది. రోహ కాళ్ల కింద నేల
కదిలినట్లయింది.
(సశేషం)
దోరవేటి
89788 71961