సైదులు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. మంచం పక్కన చెంబులోని మంచినీళ్లు గటగటా తాగేసి, మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు. కానీ, ఎంతసేపటికీ నిద్రాదేవి కరుణించలేదు. రాత్రి తాగిన మత్తు పూర్తిగా వదిలిపోయినట్టుంది. లేచి లైటు వేసుకుని అటూ ఇటూ పచార్లు చేశాడు. ఇంక లాభం లేదనుకుని.. గోడ గూట్లో ఉన్న లిక్కర్ సీసా తీసి, అటూ ఇటూ ఊపి చూశాడు. అడుగున ఏకాస్తయినా మిగిలుందేమో.. తాగేస్తే మళ్లీ నిద్రపోవచ్చని. ఆశ ఫలించలేదు. ఉస్సూరంటూ మళ్లీ మంచం మీద కూర్చుని గోడకేసి చూశాడు. గోడకు తగిలించిన ఫొటోలో ఉన్న ఏడాది పాపను చూసేసరికి.. దుఖం ఆపుకోలేక పోయాడు సైదులు. అతనికి తెలియకుండానే బిగ్గరగా ఏడ్చేశాడు. అది విని.. పక్క పోర్షన్లో నిద్రపోతున్న సావిత్రి, ఆమె మనవరాలు వయసున్న అమ్ములు గబుక్కున లేచి కూర్చున్నారు.
“ఈ తాగుబోతు సచ్చినోడు.. ఆడు నిద్దరోడు. మనల్నెవ్వర్నీ నిద్రోనీడు” అంటూ గొణుగుతూ.. సావిత్రమ్మ పరుగెట్టుకొస్తే, వెంట అమ్ములు వచ్చి సైదులు వంక జాలిగా చూసింది.
“ఒరే.. సైదులు! రెండేళ్లయింది. ఇంక మరిచిపోనాకి పయత్నించవేటి!? మాకు మాత్రం బాధ లేదా ఏటి!? అలగని.. ఇలగ పూటుగ తాగేసి అర్దరేతిరి అందరికి నిద్ర పోగొడుతున్నామా!? ఆ మాయదారి రోగం వచ్చినప్పుడు నీకులాగనే మేంకూడ నట్టపోయాం కదేటి!? నాకేమో శుక్లాలొచ్చి సరిగ సూపానటం నేదు. ఎవరేటి చేత్తాం.. పోయినోల్లని మరిచి పోనేకపోతే.. ఉన్నోల్లమి ఎలగుంటం”.. మందలిస్తూనే సైదుల్ని ఓదార్చింది.
“బాగ రేతిరైపోనాది తొంగో! మేం కూడ నిద్రోతేనే గంద తెల్లారి పనికెల్లేది. లేకుంటే కూడెలగొత్తాది? నువ్వంటే కొంప అమ్మేస్కుని ఆ డబ్బుల్తో సారా కొనుక్కుని తాగేసి తొంగుంటున్నావు. అలగని తిండీతిప్పలు నేకుండ తాగేత్తుంటే సచ్చిపోతావు. జాలిపడి కంచంలో కూడెట్టిత్తే తినవు. తెల్లారి అది కుక్కల పాలె గదేటి!? ఏనాటికి కోలుకుంటావో తెలిట్నేదు”.. అంటూ వాళ్ల పోర్షన్లోకి వెళ్లి, నిద్ర పోవడానికి ప్రయత్నించారు సావిత్రి, అమ్ములు.
రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ సినిమా రీలులా కళ్ల ముందుకొస్తుంటే.. సావిత్రికి, అమ్ములుకు కూడా నిద్రాదేవి దూరంగా వెళ్లిపోయింది.
రెండేళ్ల క్రితం నెల్లిపాక బంజరు నుంచి హైదరాబాదుకు వలస వచ్చింది మంగవేణి. కూతురు అమ్ములు చిన్న పిల్లయినా.. ఉన్న ఊళ్లో ‘నా’ అనే వాళ్లులేని మంగవేణి, కూతుర్ని చదువు మానిపించి తనతోపాటు తీసుకొచ్చింది. ఆమె పనిచేసే అపార్ట్మెంట్ల నిర్మాణ పనికోసమే.. సావిత్రి, ఆమె భర్త ఓబులేసు అనకాపల్లి నుంచి, సైదులు మాడుగుల నుంచి వలస వచ్చారు.
ఉన్నచోట సరిగా పనులు లేవు. ఉన్నా సరిపడా డబ్బులు రావడం లేదు. దాంతో దూరంగా ఉన్నా.. సిటీలో అపార్ట్మెంట్లు ఎక్కువ కడుతున్నారని, కూలీ ఎక్కువ ఇస్తున్నారని చాలా ఊళ్లనుంచి ఎన్నో కుటుంబాలు మూటాముల్లే సర్దుకుని హైదరాబాదుకు వలస వచ్చాయి.
కొన్ని రోజులు బాగానే సాగింది. అందరూ డేరాలు కట్టుకుని, కాస్త వండుకుని తింటూ పనిచేస్తూ కాలం గడిపేవాళ్లు. అందరి ఆశ ఒకటే.. ఊరు కాని ఊరొచ్చినందుకు వెళ్లేటప్పటికి కొంత డబ్బు మిగుల్చుకుని వెళ్లాలని.
ఒకరోజు దురదృష్టకరమైన సంఘటన జరిగింది. సైదులుకు తీరని నష్టం జరిగింది. అతని కూతురు కనిపించకుండా పోయింది. సైదులుకు పెళ్లయిన పదేళ్లకు సంతానం కలిగింది. అన్నేళ్లకు పుట్టిన కూతురంటే సైదులుకు ప్రాణం. అందుకే.. తనతోపాటు భార్యనూ, కూతుర్నీ పనిచేసే చోటుకు తీసుకొచ్చాడు. అప్పటికి పాప వయసు రెండేళ్లు. సైదులు, అతనికి హితులుగా మారిన మంగవేణి, సావిత్రి, ఆమె భర్త ఓబులేసు చుట్టుపక్కల మొత్తం రెండు రోజులపాటు వెతికారు. పిల్లతల్లి పిచ్చి పట్టినట్టు ఏడుస్తూనే ఉంది.
మిగతా పనివాళ్లు అక్కడే ఉన్న కంకర దిబ్బలోంచి కంకర ఎత్తి పోస్తుంటే.. దుర్వాసన వస్తున్నదని పరిశీలించి చూశారు. పాప శవం.. రాళ్ల బరువుకు నుజ్జునుజ్జు అయిపోయి ఉంది. సైదులు, అతని భార్య గుండెలవిసిపోయేలా ఏడ్చారు.
విషయం అందరికీ అర్థమయింది. పాప కనిపించకుండా పోయిన రోజే.. గోడ పక్కన ఆడుకుంటూ, అలసి అక్కడే నిద్రపోయి ఉంటుంది. ఈలోపు లారీవోళ్లు చూసుకోకుండానే కంకర దిమ్మరపోసి వెళ్లిపోయి ఉంటారు. ఏ లారీ డ్రైవరన్నది గుర్తుపట్టడం కూడా కష్టమే! రోజురోజుకు మారుతూ ఉంటారు. యజమాని నష్టపరిహారం అంటూ కొంత డబ్బివ్వబోయాడు. కానీ, సైదులు తీసుకోలేదు. అందరూ సైదులుపై జాలిపడటం తప్ప ఏమీ చెయ్యలేక.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. సైదులు ఇంక అక్కడ ఉండలేక ఊరెళ్లి పోవడానికి బయల్దేరితే.. రమణ రానని చెప్పింది.
పాప చనిపోయిన రాళ్ల గుట్ట దగ్గర కూర్చుని..
“నా బుజ్జి ఇక్కడే ఉంది. ఎతుక్కోవాలి. నేను రాను” అంటూ మొరాయించింది.
“నీ మూలంగనే కదేటి ఇలగయింది. నువ్వు నా కూతుర్ని కనిపెట్టుకునుంటే.. నాకూతురు నాకు దూరమయి ఉండేదా!? నువ్వే నా కూతుర్ని చంపేసినావు” అంటూ సైదులు కోపంతో ఊగిపోతూ, రమణ జుట్టు పట్టుకుని వీపుమీద నాలుగు దెబ్బలేశాడు.
తప్పు చేసినట్టు వెంటనే రమణను పట్టుకుని ఏడ్చేశాడు. నిజానికి అతనికి భార్యంటే చాలా ప్రేమ.
‘ఇన్నాళ్లయినా పిల్లలు పుట్టట్నేదు. దాన్నొగ్గేసి మారు మనువు చేసుకో!’ అంటూ అతని తల్లి పోరుపెట్టినా.. రమణపై ప్రేమ కాస్తయినా తగ్గనీయలేదు.
ఏనాడూ చిన్నమాట అనని సైదులు, ఆమెపై చేయి చేసుకున్నందుకు తన చేతకానితనానికి కుమిలిపోతూ కూర్చుండి పోయాడు. కూతుర్ని పోగొట్టుకున్న అతనికి లోకమంతా చీకటి అయిపోయినట్టు.. ఎవర్నీ నిందించలేని నిస్సహాయ స్థితిలో తప్పంతా భార్యపై నెట్టేశాడు. పాపం.. ఆ పిచ్చితల్లి అతనన్న మాట నిజమే అనుకుంటూ..
“నా బుజ్జిని నానే చంపేసినాను.. నా బుజ్జిని నానే చంపేసినాను” అంటూ రోడ్డు మీదికి పరుగెట్టుకుంటూ వెళ్లింది. అప్పుడే అట్నుంచి స్పీడుగా వచ్చిన బస్సు.. ఆమెను బలంగా ఢీకొట్టింది. అంతే.. చూస్తుండగానే ప్రాణాలొదిలేసింది రమణ.
అక్కడున్న వారంతా బస్సు డ్రైవర్‌పై కేసు పెడదామన్నారు. కానీ, సైదులు నిరాసక్తిగా..
“ఏ కేసూ వద్దు. పెట్టినా నావోళ్లు తిరిగిరారుగా స్టేసను చుట్టూ తిరిగే ఓపికనేదు. పెళ్లాం బిడ్డల్ని కూడ సరిగ్గ చూసుకోలేని సేతకానోడ్ని చేసాడా దేవుడు. ఒగ్గేయండి.. నా బతుకే బుగ్గయిపోనాది” అంటూ, రాళ్లగుట్ట వైపూ.. రోడ్డు వైపూ పిచ్చివాడిలా చూస్తూ ఉండిపోయాడు.
డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఓ కుటుంబం మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఈలోపు కరోనా కలకలం మొదలయింది. భవన నిర్మాణాలు ఆపేశారు. ‘లాక్డౌన్’ ప్రకటించారు. పది రోజులు గడిచినా, పరిస్థితి మారలేదు. అందరికి చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయి పోయాయి. బయటికెళ్తే పోలీసులు కొడుతున్నారు. అప్పటికే కరోనాతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అందరి గుండెల్లో భయం మొదలయింది.
‘ఈ రోగం అంటుకుని ఊరుగాని ఊర్లో చచ్చిపోతామేమో! ఎలాగోలా సొంతూళ్లకు వెళ్లిపోవాలి’ అని అందరూ నిర్ణయించుకున్నారు. తెచ్చుకున్న వంట సామగ్రి అక్కడే వదిలేసి, మోయగలిగినన్ని బట్టలు మాత్రం బ్యాగుల్లో సర్దుకుని బయల్దేరారు.
సైదులు రానని ఏడుస్తున్నా.. ఒక్కణ్ని వదిలేయలేక బలవంతంగా బయల్దేరదీశారు.
రోడ్డు మీద ఒక్కవాహనం కూడా లేక నడక మొదలు పెట్టారు. పోలీసులు అడ్డగించి.. అందర్నీ కలిసి నడవద్దనీ, దూరం దూరంగా నడవమనీ చెప్పారు. కొందరు పొగరుగా ఉన్న పోలీసులైతే.. దగ్గరగా నడిచినా, మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోయినా లాఠీలకు పని చెప్పేవారు. దాహం వేసి ఏ ఇంటి తలుపు తట్టినా తీసేవారు కాదు. తీసినా.. ఏ సహాయం చేసేవారు కాదు.
“మనుసుల్లో మానవత్వమే లేకుండా పోయింది. కనీసం నీళ్లయినా ఇవ్వట్లేదు” అని కొందరంటే..
“మానవత్వం లేక కాదు. ఈ పరిస్థితుల్లో అంతకుమించి సావు భయం ఎక్కువగుంది” అని కొందరు సరిపెట్టుకునే వారు.
దారిలో ఎవరైనా దయతలచి మంచి నీళ్ల పాకెట్లు, పులిహోర పాకెట్లు పంచితే.. జీవితంలో ఎప్పుడూ ఆహారం తిననట్టుగా ఆబగా తినేవారు.
ఎండవేడికి తట్టుకోలేని వాళ్లు ఏ చెట్లకిందో సేద దీరేవారు. నడిచి నడిచి కాళ్లకు బొబ్బలెక్కితే.. కాళ్లకు గుడ్డలు కట్టుకుని నడిచేవారు. ఎంత దూరం నడిచినా దూరం తరిగేది కాదు. స్వర్గం, నరకం అన్న రెండిటిలో నరకమన్నది భూమ్మీదే అనుభవమైంది వారికి.
ఓ సినిమా నటుడు తన సొంతడబ్బుతో వలస కార్మికుల కోసం బస్సు వేస్తున్నారని విని.. అంతా తమ కష్టాలు తీరిపోయినట్టేనని సంబరపడిపోయారు. కానీ, వారి దాకా ఏ బస్సూ రాలేదు.
సరైన తిండి, నిద్ర లేకుండా రోజుల తరబడి నడుస్తూ జీవన పోరాటం చేస్తున్న వారి మానవత్వానికి సవాలులా.. వారితోపాటు వస్తున్న మంగవేణి కూతురు అమ్ములు కడుపు పట్టుకుని..
“ఓమ్మో ఓమ్మో! కడుపు నొస్తుంది..” అంటూ కూర్చుండిపోయింది.
“బిడ్డా! లే బిడ్డా! అందరు పోతుండ్రు. మనం ఎనకయిపోతాం. జర ఓపిక జేసుకుని నడు బిడ్డా..” అంటూ కూతుర్ని బతిమాలింది మంగవేణి.
“లే.. అమ్మా! నాతోటిగాదు. మస్తుగ కాళ్లు పీకుతుంటే ఎట్ల నడిచేది. మీరు బోండి. నేనీడ్నే ఉంటా..” అంటూ నొప్పితో విలవిల్లాడింది అమ్ములు.
ఆ తల్లికి ఏం చెయ్యాలో తోచక.. కూతుర్ని ఎత్తుకోడానికి ప్రయత్నించింది. కానీ, పన్నెండేళ్ల పిల్ల బరువును మోస్తూ నడిచే బలం ఆమెకు లేక విఫలమైంది.
“అన్నా! ఎవరన్నా సాయం జేయండే! బిడ్డను కాసింత దూరం ఎత్తుకోండే! దండం పెడతా..” అంటూ మగవాళ్లందన్నీ అడిగింది. కానీ, సైదుల్ని మాత్రం అడగలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు.. ఈమధ్య సరిగా తిండి తినక, అతను నీరసంగా ఉన్నాడని.
“ఈ బేగులనే మోస్తూ నడవలేకపోతున్నాం. ఇంక పిల్లనెలగ మోసేది. మావల్ల కాదమ్మ” అంటూ ముందుకెళ్లి పోతున్నారు. సాయం చెయ్యాలని ఉన్నా.. అప్పటికే అలసిపోయి కాదని చెప్పేశారు.
“జర దయుంచండన్నా! మీ బిడ్డే అనుకోండన్నా..” అంటున్న మంగవేణి మాటలకు.. ఠక్కున
ఆగిపోయాడు సైదులు.
‘బిడ్డ’ అన్నమాట అతని చెవిన పడగానే..
కాలు ముందుకు వెయ్యలేకపోయాడు.
“మంగొదినా నేనెత్తుకుంటా!” అంటూ అమ్ములు దగ్గరకెళ్లి కూర్చుని.. తన భుజంమీద ఎక్కించుకుని, లేచి నడవడం మొదలుపెట్టాడు.
కొంతదూరం నడిచేసరికి ఆగాడు. భుజం మీద వెచ్చగా, తడిగా అనిపించి చూసుకున్నాడు.
అతని అంగి జేబు వరకు కారిన రక్తపు మరకను చూసి.. ఒక్కసారిగా భయపడి..
“ఓరి దేవుడా! పిల్లకేటయింది!?” అంటూ అమ్ముల్ని కిందికి దింపాడు.
అతని మెడ వంక చూసిన సావిత్రి..
“మంగా! పిల్ల పెద్ద మనిసయినట్టుగున్నదే! చూడు మన కట్టాలకి తోడు ఇప్పుడయిందేటే..” అని మంగతో అన్నది.
“ఓమ్మో! ఇప్పుడేం జేసెడిది? ఈ దార్ల దీన్ని ఎట్ల జూసుకోవాల్న? తాటాకేసి ఇశ్రాంతిగా కూసోబెట్టి.. సక్కగ అన్ని తినబెట్టి జూడాల్సిన దినమాయే! నేనేం జేసేడిది దేవుడా..” అంటూ మంగవేణి ఏడుపు మొదలుపెట్టింది.
“ఇకూర్కో.. అసలికి తప్పంత నీదే! ఈ ఈడుపిల్లను తీసుకుని నువ్వు ఊరొదిలి రావడం తప్పేగాదేటి!? అల్లదిగో.. ఆ చెట్టు పక్కన మరుగున్నది. తీసుకెళ్లి ఆ గుడ్డలు మార్చి, ఏటి సెయ్యాలో సేసి తీసుకురా!” గదమాయిస్తూ అన్నాడు సావిత్రి భర్త ఓబులేసు.
“బిడ్డ ఎదుగుతాంది. నాయన లేడు గందా! నేనే పైసలు కూడబెట్టి, దాసిపెట్టాల్నని ఆశ పడ్నగానీ.. గింత కస్టమైతదనుకోలా! అత్తా.. గది అమ్మోరు తల్లి చెట్టులాగుందే!? ఎట్టా!? అంటయితదేమో”.. అమ్ముల్ని తీసుకెళ్లబోయి ఆగి అన్నది మంగ.
“ఏటి మాటాడుతున్నవు వదినా? ‘అంటు గింటు’ అంటవేటి? అమ్మోరు ఆడది గాదేటి? ఆ తల్లికి లేకుండ ఇలాంటి కట్టాలు మీ ఆడోల్లకిచ్చిందేటి? ఎల్లొదినా పనిసూడు”.. ఒంటి మీది అంగీ విప్పి పక్కకు విసిరేసి.. అక్కడున్న బోరు కొట్టుకుని, భుజాలు శుభ్రంగా కడుక్కుంటూ అన్నాడు సైదులు.
“నావల్న మీకందర్కి ఆలస్యం అయిపోతుండే.
నా తిప్పలు నేం బడత.. మీరంత బోండ్రి. ఈడే యాడో ఈ రాత్రికి బండి.. తెల్లారె బిడ్డా నేను నడిచొస్తం”.. అన్నది మంగ.
‘సరే!’ అంటూ నడక మొదలు పెట్టారంతా. కానీ, చుట్టూ ఒక్క ఇల్లన్నా లేకుండా, అంత నిర్మానుష్యంగా ఉన్న ఆ చోట.. ఆ తల్లీబిడ్డల్ని వదిలి పోడానికి మనసు రాలేదు సైదులకు, ఓబులేసుకు, సావిత్రికి.
‘ఏనాటి బంధమో!?’ అనుకుంటూ అక్కడే ఆగిపోయారు. ఆ చెట్టు కిందే ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని.. తెల్లవారి లేచి, బ్యాగులో ఉన్న రొట్టెలను పంచుకు తిని, నడక మొదలుపెట్టారు.
ఇంచుమించు ఖమ్మం దరిదాపులకొచ్చేశాక.. వలస కూలీలను ఎక్కించుకునే బస్సు వచ్చింది.
అయితే ఎక్కించుకోడానికి ముందు కొవిడ్ టెస్టు చేసి, నెగిటివ్ వచ్చిన వార్ని ఎక్కనిచ్చారు.
పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు పంపించారు. సైదులుకు, ఓబులేసుకు, మంగవేణికి పాజిటివ్ అని క్వారంటైన్‌కు పంపారు.
సావిత్రి, అమ్ములు తమ వాళ్లను వదిలేసి వెళ్లలేరు కాబట్టి అక్కడే ఉండిపోయారు. పద్నాలుగు రోజుల తర్వాత సైదులు మాత్రం ఆరోగ్యంగా బైటికి వచ్చాడు. మంగ, ఓబులేసు అనంతలోకాలకు వెళ్లిపోతే..మోయలేనంత దుఃఖాన్ని మోసుకుంటూ.. మిగిలిన ముగ్గురూ సావిత్రివాళ్ల ఊరికి చేరుకున్నారు.
క్వారంటైన్‌కు వెళ్తూ..
‘అత్తా! నా బిడ్డే..’ అని మంగ జాలిగా అన్న మాట గుర్తొచ్చి.. అమ్ముల్ని తనతోనే ఉంచుకుంది సావిత్రి.
ఎప్పుడో పదేళ్ల క్రితం తాగుడుకు బానిసై, మంగవేణిని వదిలేసిన ఆమె భర్త గురించి మాటల సందర్భంలో చెప్పిన విషయం గుర్తొచ్చి.. అమ్ముల్ని అతని దగ్గరికి పంపిద్దాం! అనుకొని.. అతని గురించి వాకబు చేసింది.
కానీ, బెల్టుషాపులు మూసి ఉండటం వల్ల మందు దొరకక.. మత్తు కోసం రెండు మూడు శానిటైజర్ బాటిల్స్ తాగి.. అతను ప్రాణాలు పోగొట్టుకొన్నాడని తెలిసింది. దాంతో అమ్ములుకు తోడుగా నిలబడింది మనసున్న సావిత్రి.
ఈలోపు సైదులుకు కూడా తన తల్లి కరోనాతో కన్ను మూసిందని ఫోన్ వచ్చింది. ఉన్న ఒక్క పాశమూ కడసారి చూపులకు కూడా నోచకుండానే దూరమైతే.. ఊరికి వెళ్లి తల్లికి, భార్యా బిడ్డలకు పిండ ప్రదానం చేశాడు. మనసును పిండేసే తనవాళ్ల జ్ఞాపకాలు పదేపదే గుర్తుకు వస్తుంటే.. బాధను పంచుకోడానికి సావిత్రి దగ్గరికే వచ్చాడు. ఇంక మళ్లీ తన ఇంటికి వెళ్లాలనిపించక.. సావిత్రికున్న చిన్న పెంకుటింట్లో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. బాధను తట్టుకునే నెపంతో తాగుడుకు బానిసయ్యాడు. కరోనా అలజడి తగ్గాక.. మళ్లీ ఊరెళ్లి, ఇల్లు అమ్ముకుని వచ్చాడు. ఇంటి అద్దెకన్నట్టు సావిత్రికి కొంత డబ్బిచ్చి.. మిగతాది తను మిథ్యాలోకంలో ఉండటానికి ఖర్చు చేస్తున్నాడు.
ఉదయం లేస్తూనే.. సైదులు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నది అమ్ములు.
ప్లేట్లో ఇడ్లీలు పట్టుకొచ్చి..
“చిన్నాయనా.. లే! మొఖం కడుక్కో.. ఇడ్లీలు తిందువు” అంటూ కుదిపిలేపింది.
సైదులు లేచి..“నాకేటి వద్దు ఎల్లు..” అని విసుక్కున్నాడు.
“లే! నేనుబోను. ఏం దినకుండ మందు తాగితే సచ్చిపోతరని రాత్రి నాయనమ్మ అన్నది. నువు సచ్చిపోతే నేనెట్లా బతికేది!? ఆ దినం నన్ను నీ బిడ్డననుకుని ఎత్తుకుంటివిగా.. నాకైతే మా నాయనెత్తుకున్నట్లే అనిపించే..” అంటూ మొండిగా గ్లాసుతో నీళ్లిచ్చి.. పుక్కిలించమని బలవంతంగా నోట్లో ఇడ్లీ పెడ్తున్న అమ్ములు వంక చూస్తూ..
‘ముందే పుట్టుంటే.. నా కూతురు ఇంతుండేది’అనుకున్నాడు.
“అమ్మూ!” అన్నాడు.
తన కూతుర్ని ‘బుజ్జి’ అని పిలిచినా.. ‘అమూల్య’ అని పేరు పెట్టుకున్నాడు. అందుకే అలా పిలిచాడు.
“ఏంది చిన్నాయన..” అన్నది.
“చిన్నాయన కాదు.. ‘నాన్న’ అని పిలుత్తావా! నీ మీదొట్టుగ మందు మానేత్తా. పనికెల్తా.. నిన్ను బడికి పంపుతా..” అని సైదులు అంటుంటే.. గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది అమ్ములుకు.
ఆనందంతో వెళ్లి సావిత్రికి విషయం చెబితే.. ఆమె నమ్మలేదు. కానీ, అమ్ములు తృప్తికోసం తనతో కలిసి సైదులు గదిలోకొచ్చింది.
అతను లేడు. అతని చెప్పులు లేవు.
సావిత్రి ఏదో అర్థమైనట్టు..
“ఆ తాగుబోతోడి మాట నమ్మినావా.. ఆడు మందుకొట్టుకు పోనాడు.. కావాల్తే సూద్దం నడు” అంటూ బెల్టు షాపువైపు అమ్ముల్ని లాక్కెళ్లింది. దారిలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర నమస్కరించుకుంటున్న సైదుల్ని చూసి.. ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లారు. అతను వాళ్లను వేలితో చూపుతూ..
“బాబా! నీ తోడు. ఈ పొద్దునించి ఇది నా కూతురు. అది మాయమ్మ!” అని చెప్పి, వాళ్లద్దరి చేతులు పట్టుకుని ఇంటికి తీసుకెళ్తూ.. సావిత్రితో అన్నాడు.
“అమ్మా.. నీకు కంటాప్రీసను చేయిత్తా. ఇంట్లో పని నువ్వే చూస్కో! నా కూతురు బడికెల్తాది. దాన్ని బాగ సదివించి కలక్టర్ని సేత్తా!” అంటున్న సైదులును చూస్తున్న అమ్ములుకు, సావిత్రికి కొండంత అండ దొరికినట్టు అనిపించింది.
ప్రేమగా చూసే తల్లి పక్షిని పోగొట్టుకున్న బుజ్జి పక్షికి, కడవరకు తోడుగా ఉంటుందనుకున్న జంట పక్షికి దూరమైన ముసలి పక్షికి.. ఏదో ఆసరా దొరికినట్టు సైదులుకు దగ్గరగా జరిగి, అతని చేతుల్ని మరింత గట్టిగా పట్టుకున్నారు ఇద్దరు.
సైదులుకు మాత్రం తన రెండు చేతులూ పట్టుకుని నడుస్తున్న వాళ్లను చూస్తుంటే.. తనలాంటి రెక్కలు తెగిన వలస పక్షికి కొత్తగా రెండు రెక్కలు మొలిచినట్టుగా.. మళ్లీ ఎగిరేందుకు బలం వచ్చేసినట్టుగా అనిపించింది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
-దుద్దుంపూడి అనసూయ
96182 72630