‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
కళ్లుమూసుకుని చేతులు జోడించిందే గానీ.. తనూజ మనసంతా ఘుమఘుమలాడుతూ చవులూరిస్తున్న నైవేద్యం మీదే ఉంది!
తనకి బలంగా ఉండాలని ఎత్తుకెత్తూ జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి.. కమ్మని నెయ్యి పోసి, చిక్కని పాలతో చేసుకుందా పరమాన్నం. అదిప్పుడు ఒకటే నోరూరించేస్తోంది.
“ఇదిగో! మన తిండిపిచ్చి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలా తింటూంటే ఇద్దరం మోటూల్లా తయారవుతాం. డాడీ వెక్కిరిస్తారు. నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి.. విన్నావా!” ఎత్తుగా కనిపిస్తున్న పొట్టని అపురూపంగా చూసుకుంటూ ముద్దుగా చెప్పింది.
అంతలో..
“నీ దండాలింకా అవలేదా…!” అంటూ వెనకనుంచి రాకేశ్ స్వరం వినిపించింది.
ఆ మాట వింటూనే గబుక్కున కళ్లు మూసుకుని దేవుడికి రోజువారీ దండం అప్పజెప్పేసింది తనూజ.
“స్వామీ! నాకు రాముడిలాంటి బాబో, లక్ష్మీదేవిలాంటి పాపో కావాలి. ఎవరైనా ఫర్వాలేదు గానీ.. చక్కగా, బుద్ధిగా, మంచి మనసుతో ఉండాలి. నా పొట్టలోనే బాగా తీర్చిదిద్దు. ఓకేనా..!”
ఇద్దరూ ఆఫీసులకి తయారయ్యారు.
బయల్దేరబోతూ.. ఏడో నెల గర్భంతో ముద్దబంతి పువ్వులా ఉన్న భార్య పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు రాకేశ్..
“బంగారూ! ఇవాళ ఎలాగైనా మమ్మీకి హైక్ తెప్పించెయ్యాలి నువ్వు. వచ్చే నెలకల్లా మనం లగ్జరీ కారు కొనెయ్యాలి!”
“రాకీ! పిల్లలకి చిన్నప్పటి నుంచే లగ్జరీలు అలవాటు చేసేట్టున్నావు నువ్వు!” కినుకగా అంది తనూజ.
“లేకపోతే నీలా సన్యాసి కబుర్లు చెప్పమంటావా!? చాల్లే.. హైక్ రాగానే ఫోన్ చేసి చెప్పు. మర్చిపోకు!”
“నువ్వు కల్లోక్కూడా వచ్చి చెబుతున్నావు. ఇంక మర్చిపోవడం కూడానా..” నవ్వింది తనూజ.
“నీక్కూడా ఆ ధ్యాస ఉంటే నాకీ యాతన లేకపోను. సన్యాసమ్మవి నువ్వు.. నాకెలా దొరికావో గానీ..”
తనూజ మాట్లాడలేదు. రాకేశ్ మాటలు నిజమే. ఉప్పుకీ నిప్పుకీ ముడిపెట్టి వింత చూస్తాడా దేవుడు. బహుశా మనిషి స్వభావానికి అతీతంగా ప్రేమించాలని కాబోలు. తనకి పర్ణశాల ఇష్టం. రాకేశ్‌కి మైసూర్ప్యాలెస్ కావాలి. తనకి పరమాన్నం ఇష్టం.. రాకేశ్ డ్రై ఫ్రూట్ హల్వా తప్ప మరేమీ తినడు. రాకేశ్ కోరికలనే తన ఇష్టాలుగా స్వీకరించి, అతను దుడుకుగా మాట్లాడినా తను మౌనంగా ఊరుకుంటుంది.. కాబట్టి ఇద్దరి మధ్యా గొడవలేమీ లేవు.
హైక్ గురించే ఆలోచిస్తూ కంప్యూటర్ ఆన్ చేసిన తనూజకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్ కనిపించింది. అంతే.. ఒక్కక్షణం గుండె కొట్టుకునే వేగం పెరిగింది. హైక్‌తోపాటు ప్రమోషన్ కూడా వచ్చినట్టుంది. నిజానికి తనకి కిందటేడాదే రావాల్సింది.. ఇప్పుడు ఇస్తున్నట్టున్నారు. రాకీ కోరిక తీరిపోతుందిక. పొట్టలో బుజ్జినీ తననీ ఒకటే ముద్దుచేస్తాడు.
ఆనందంతో మెయిల్ ఓపెన్ చెయ్యకుండానే రాకేశ్‌కి వీడియో కాల్ చేసింది.
రాకేశ్ వెంటనే లైన్లోకి వచ్చాడు. తనూజ మొహంలో ఉద్వేగం చూస్తూనే హుషారుగా..
“వచ్చేసిందా.. ఎంత?!” అంటూ ప్రశ్నించాడు
“ఏమో!? నేనింకా మెయిల్ ఓపెన్ చెయ్యలేదు. నువ్వే చూడు..” అంటూ, ఫ్రంట్ కెమెరాలో రాకేశ్‌కి చూపిస్తూ మెయిల్ ఓపెన్ చేసింది తనూజ.
మొదటి వాక్యం చదివేసరికే ఆమె ఆనందమంతా ఇంకిపోయింది. సారాంశం బుర్రకెక్కేసరికి మెదడు ఏడుస్తున్నట్టూ తల్లోంచి చెమటలు పట్టడం ప్రారంభమైంది. ఎలాగో నిగ్రహించుకుంటూ కెమెరా తిప్పుకొని చూసింది.
రాకేశ్ మొహం సీరియస్‌గా ఉంది.
తనూజని చూస్తూనే..
“పింక్ స్లిప్! సర్లే.. డోంట్ వర్రీ. యూ కెన్ ట్రై ఫర్ అనదర్. బై!” అనేసి ఫోన్‌పెట్టేశాడు.
దుఃఖానికి భాషాజ్ఞానం లేదు. ఆనందం ఎన్ని భాషల్లోనైనా కబుర్లు చెబుతుంది గానీ.. దుఃఖం మాత్రం అమ్మభాషలోనే ఏడుస్తుంది! అలాగే ఓదార్పుకీ భాషలు తెలియవు. అమ్మభాష అయితేనే ఆ ఓదార్పు అమ్మ చేతి స్పర్శలా మనసును చేరుతుంది. పరాయి భాషలో అయితే పక్కింటివాళ్ల కంటి తుడుపులాగే ఉంటుంది.
తనూజకి బాహ్యస్పృహ పోయింది. పంచభూతాలూ చెవిలో ఒకటే మాట చెబుతున్నాయి..
‘ట్రై ఫర్ అనదర్’..
రెండు నిమిషాలు అయ్యేసరికి తనూజ గుండె.. చావుడప్పులా కొట్టుకోవడం ప్రారంభించింది. ఘుమఘుమలాడుతూ నోరూరించిన పరమాన్నం అసహ్యంగా వాంతి రూపంలో బైటికి వచ్చేసింది. తిన్నదంతా వమనం చేసుకుని వేలాడిపోతూ వాష్ రూం బైటికొచ్చేసరికి.. ఈదురుగాలికి కంపిస్తున్న గులాబీపువ్వులా ఉంది. చెమటలు దిగకారుతున్నాయి. సన్నగా వస్తున్న వెక్కిళ్ల వల్ల ఛాతీతోపాటు నిండు గర్భం కూడా అదురుతోంది. ఏడుస్తున్నానన్న స్పృహ కూడా లేని తనూజ కళ్ల నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి.
అప్పటికే తనూజ పింక్‌స్లిప్ విషయం నలుగురికీ తెలిసింది. అంత పొట్టతో ఆమె పరిగెడుతున్నట్టూ వాష్రూంకి వెళ్లడం చూసిన కొలీగ్స్ గబగబా ఎదురువెళ్లి.. నెమ్మదిగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హారిక మంచినీళ్లు అందించింది.. రమ వెన్ను నిమరసాగింది. జగదీశ్ వెళ్లి వేడిగా కాఫీ తీసుకొచ్చాడు.
ఎవరు ఎన్ని చేస్తున్నా తనూజకి పట్టలేదు. వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమె ఉన్నట్టుండి..
“అమ్మా” అని ఆర్తనాదం చేస్తూ కడుపు పట్టుకుని కుర్చీలో ముందుకి వాలిపోయింది!
చూస్తున్నవాళ్లు మరింత గాబరాపడ్డారు.
“నా పాప.. నా పాప” అని ఏడుస్తూ, విలవిలలాడుతున్న తనూజని ఆసుపత్రికి తీసుకువెళ్లడమే మంచిదని నిర్ణయించుకుని.. రాకేశ్‌కి కబురందించి బయల్దేరారు.
రాకేశ్ వచ్చేసరికి తనూజ ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఆ కోమల హృదయిని ఆరునెలలపాటు పాలూ పరమాన్నం పెట్టి, కడుపారా పెంచి పోషించుకున్న బిడ్డ, ఉన్నపాటున తల్లి శరీరంలో ఉధృతంగా పెరిగిన బీపీకి బలైపోయింది. ఉద్యోగాన్నీ, బిడ్డనీ ఒకేసారి పోగొట్టుకుని, లోతుకి పోయిన పొట్ట, తగ్గని బీపీ, ఆగని బ్లీడింగ్‌తో స్పృహలేని స్థితిలో ఐసీయూ పాలైంది తనూజ!!
దాదాపు పదిహేను రోజుల తర్వాత.
రాకేశ్ కోపంగా అరుస్తున్నాడు..
“గోరంతని కొండంత చేసుకుని, ఎక్కడలేని సమస్యలూ తెచ్చిపెట్టింది నీ కోడలు! ఇందులో నా తప్పేముంది?! ఆవిడగారి ఉద్యోగం పోయినందుకు నేను పల్లెత్తు మాట అనలేదు సరికదా.. ‘డోంట్ వర్రీ!’ అని కూడా చెప్పాను. అయినా సరే నానా గాబరా పడిపోయి నిక్షేపంలాంటి పిల్లని పొట్టన పెట్టుకుంది. ‘అయిందేదో అయింది. ఇకనైనా ధైర్యంగా ఉండవమ్మా!’ అని చెబుతుంటే కూడా వినకుండా మంచాన్ని అంటిపెట్టుకుపోతోంది. నోరువిప్పి మాట్లాడదు.. తిండి తినదు, లేచి తిరగదు. అలా మంచాన పడి ఉంటే పోయిన ఉద్యోగమూ, పిల్లా తిరిగొచ్చేస్తాయా!? ధైర్యంగా ఉంటే ఈపాటికి హాయిగా మరో ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉండేది. లక్షణంగా బాబో పాపో పుట్టి ఉండేవారు! నువ్వేమో ఆవిడగారికి చెప్పడం పోయి నేనేదో తప్పు చేసినట్టు నన్ను పట్టుకు తిడుతున్నావు!”
కొడుకు మాట్లాడుతున్నంతసేపూ నిశ్శబ్దంగా కూర్చుంది హేమలత. తర్వాత..
“అంటే.. అంతా తనూజ పిరికితనం వల్లే జరిగిందంటావు..” అంది
“కచ్చితంగా..”
“సరే! బాగానే ఉంది. ఉద్యోగం పోతే పోయిందిలే అని ఆ పిల్ల ధైర్యంగా ఇంటికి వచ్చేసిందే అనుకో. ఏమై ఉండేది.. వెంటనే మరో ఉద్యోగం దొరికేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా! తన ఏటీఎం కార్డు కూడా నీ పర్సులోనే పెట్టుకు తిరిగే నువ్వు.. నెలనెలా తనూజ తెచ్చే లక్షా అరవై వేలూ లేకపోయినా మామూలుగా నవ్వుతూ తుళ్లుతూ ఉంటావా!? దయచేసి అబద్ధం చెప్పాలని చూడకు. నేను నీ గురించి సమస్తం తెలిసిన నీ తల్లినని మర్చిపోకు” అంటూ ఆగింది.
“బావుంది. బాధపడటం సహజమమ్మా..” రాకేశ్ కోపంగానే అన్నాడు.
“భార్య ఉద్యోగం పోతే నీకు బాధ కలగడం సహజం. తనకి బాధ కలగడం అసహజం..”
“బాధపడొచ్చు. కానీ అంతలా పిచ్చెక్కిపోవాలా!? ప్రయత్నిస్తే మరో ఉద్యోగం దొరుకుతుంది”
“దొరకొచ్చు. కానీ దొరికేదాకా నువ్వు మామూలుగా ఉండవుగా! ముళ్ల మీద నడుస్తావు. ఏదేదో మాట్లాడతావు. ఉద్యోగం పోయినా ధైర్యంగానే ఉండొచ్చు గానీ, మనతో కలిసి బతికే మనిషి మొహం మాడ్చుకుని, చిరాకు పడిపోతూ ఉంటే భరించడం కష్టం. అవునా కాదా..”
“నేనేమీ నీ కోడల్ని కాల్చుకు తినడం లేదు..” రాకేశ్ మొహం ముడుచుకున్నాడు.
“నువ్వు కాల్చుకు తినవు. కానీ నీ ప్రవర్తన మనసులో ముళ్లు గుచ్చుతుంది. నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఆ పిల్ల కడుపులో బిడ్డని మోస్తూ కూడా అహర్నిశలూ వేరే ఉద్యోగం కోసం తాపత్రయపడాలి. నెలతప్పిన తర్వాత అసలు ఉద్యోగమే మానెయ్యాలనుకుంది తను. మెటర్నిటీ లీవ్ తీసుకునే దాకా చెయ్యమన్నావు నువ్వు. నీ ఇష్టానికి తను తలొగ్గింది. మామూలుగా ఆఫీసు పని చేసుకు పోవడంవేరు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం వేరు. ఏవో పాట్లు పడినా కూడా మెటర్నిటీ లీవ్ తీసుకునే పరిస్థితిలో ఉన్న మనిషికి కంపెనీలు వెంటనే ఉద్యోగం ఇస్తాయన్న గ్యారంటీ లేదు. అంచేత నెలలు నిండుతున్న వేళ నీ అసంతృప్తినీ, చిరాకునీ భరించక తప్పదు”
రాకేశ్ మాట్లాడలేదు.
“మనిషికి మనిషే తోడూ.. నీడా.. ధైర్యం అన్నీ! మనిషి అంటే భౌతికమైన శరీరం కాదు.. మనసు!! నీతో కలిసి బతికే మనిషి మనసును నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో.. కష్టానా సుఖానా నీకు నేనున్నానన్న భరోసాని ఎంత కల్పిస్తావో.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనసుకు సాంత్వన కలిగే మాటలు ఎంత చెబుతావో.. అవతలిమనిషి అంత ధైర్యంగా, నిబ్బరంగా, ఆనందంగా ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో మీతరం మనుషులు చేస్తున్నదేమిటో తెలుసా!? భార్య లేదా భర్త గురించి కించిత్తూ ఆలోచించకపోవడం. పట్టించుకోకపోవడం. నోటికొచ్చిందేదో మాట్లాడెయ్యడం. అదే మీరు చేస్తున్నది. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతూ ఉండటానికి, చాలా వివాహాలు విచ్ఛిన్నమవడానికి కారణం ఇదే! మనసుతో సంబంధంలేని బతుకు! నీకు డబ్బు పిచ్చి, మరొకడికి అహంకారం, ఇంకొకడికి ఛాందసం.. మరో ఆడదానికి అనుమానం.. ఇంకో ఆడపిల్లకి ధనదాహం.. కారణాలేవైతేనేం గాక, ఎవరు పెత్తనం చెలాయించగలిగితే వాళ్లు చెలాయిస్తున్నారు. రెండోవాళ్లు తలొగ్గుతున్నారు. లేదా ఎదురు తిరుగుతున్నారు”
రాకేశ్ మౌనంగా తలవంచుకుని ఊరుకున్నాడు.
“ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి తప్పులు మరొకరు దిద్దుతూ మనసా వాచా ఐక్యం కావడం మీకు చేతకావడం లేదు. స్వార్థం, అహంకారం అడ్డొస్తున్నాయి. ఎడమొహం పెడమొహం బతుకులు బతుకుతున్నారు. అబద్ధాలకూ, మోసాలకూ అలవాటు పడుతున్నారు. వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఎన్నిచేసినా ఒకటిగా బతకలేక విడిపోతున్నారు. ఇక తనూజ విషయానికొస్తే తను చాలా సెన్సిటివ్.. అంటే సున్నిత మనస్కురాలు. అటువంటి ఆడవాళ్లు మొగుడు ఆనందంగా లేకపోతే భరించలేరు. ఎందుకంటే వాళ్లు మొగుడి చుట్టూనే తమ ప్రపంచాన్ని అల్లుకుంటారు కాబట్టి. వాళ్ల ఆనందమేదో మొగుడి సంతోషంలోనే ఉంటుంది కాబట్టి. తనూజ కూడా అంతే! నీ ఆనందమే తన సంతోషంగా బతుకుతోంది. ఇప్పుడు తన ఉద్యోగం పోయింది. నువ్వు చిరాకు పడిపోతావు. వెంటనే మరో ఉద్యోగం వెతుక్కుని నిన్ను సంతోషపరిచే శక్తి, ఓపిక తనకిప్పుడు లేవు. దాంతో గాబరా పడిపోయింది. ఏడో నెల నడుస్తున్న మనిషి కాబట్టి ఆ గాబరాతో బీపీ పెరిగి మొదటికే మోసం వచ్చింది. అంచేత జరిగిన దానికంతటికీ కారణం నువ్వు..! అయినా నీకు నీ తప్పు తెలియడం లేదు. ఎదురు తనూజనే తిడుతున్నావు. మెత్తనివారిని చూస్తే మొత్తబుద్ధి అని.. ప్రపంచం మొత్తం సున్నితంగా ఉండేవాళ్లతో ఇలాగే నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని తిడుతున్నట్టే! తనూజ ఉద్యోగం పోయింది అనగానే నువ్వు తన పరిస్థితి గురించి మనసు పెట్టి ఆలోచించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు..”
“ఆంటీ..”
ఒక్కతీరుగా కొడుక్కి హితబోధచేస్తున్న హేమలత, ఉన్నట్టుండి వినిపించిన ఆ పిలుపుకి ఉలికిపాటుగా తిరిగి చూసింది.
ఎప్పుడొచ్చిందో తనూజ.. బెడ్రూమ్ గుమ్మంలో నిలబడి ఉంది.
హఠాత్తుగా వచ్చిన ఆమెని చూసి రాకేశ్ కూడా ఉలిక్కిపడ్డాడు. వడిలిపోయిన గులాబీలా ఉన్న భార్య రూపం ఆ క్షణంలో అతని మనసుని కదిలించి, ఆమె గురించిన ఆలోచనకి బీజం వేసింది.
“ఆంటీ! మీరు అనవసరంగా నా కోసం శ్రమ పడకండి. నేను మా అమ్మా వాళ్లింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.. మరిక రాను!”
తనూజ నెమ్మదిగానే అయినా స్పష్టంగా చెప్పింది.
శ్రోతలిద్దరూ మరోసారి తుళ్లిపడ్డారు. ఇద్దరికీ నోట మాట రాలేదు.
తనూజే మళ్లీ మాట్లాడుతూ..
“నా తరఫున ఇంతలా మాట్లాడుతున్నారు. నా మనసులో మాట మీకు చెప్పి వెళ్లడం న్యాయమని వచ్చాను. నాకు పింక్ స్లిప్ వచ్చిందనగానే రాకేశ్.. ‘పోన్లే! కొంప మునిగిపోయిందేమీ లేదు. ఎటూ నీకు డెలివరీ దగ్గరపడుతోంది. కొన్నాళ్లపాటు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో’ అంటాడేమో అని ఆశపడ్డాను. కానీ తను అలా అనడని నాకు తెలుసు. అనుకున్నట్టే మొక్కుబడిగా ‘డోంట్ వర్రీ!’ అనేసి, ‘ట్రై ఫర్ అనదర్!’ అన్నాడు. నాకు అర్థమైపోయింది. నాకు అదే జీతం మీద గానీ, లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీ మీద గానీ ఉద్యోగం వచ్చేవరకూ తనకి నిద్రపట్టదు. నాకు ప్రశాంతత ఉండదు. నేను మరో నాలుగు రోజుల్లో లీవ్ తీసుకుని హాయిగా నా పాప గురించి కలలు కంటూ కాలక్షేపం చేద్దామనుకున్నాను.
ఇప్పుడిక నాకు హాయీ, ప్రశాంతతా కల్లో మాటే. నెలలు నిండినా కూలిపనికి వెళ్లే ఆడదానికీ నాకూ తేడా లేదు. ఆ ఆలోచనలతో ఒక్కసారిగా గాబరా వచ్చేసింది. ఆ గాబరా నా పాపని బలి తీసుకుంటుందన్న ఆలోచన నాకు లేకపోయింది. అదే ఉంటే బహుశా రాకేశ్‌ని లక్ష్యపెట్టక పోయేదాన్నేమో. ఆ క్షణం నా ఆలోచనల్లో రాకేశ్ తప్ప మరెవరూ లేరు. దాంతో నా గాబరా నా పాపని మింగేసింది. ఐసీయూలో కూడా ఎలా ఏడ్చానో అక్కడి నర్సులకీ ఆ భగవంతుడికే తెలుసు. అయిపోయిందేదో అయిపోయింది.. అయినా నాకు రాకేశ్ మీద ఇంకా ఆశే. మా అమ్మ తీసుకువెళతానంటే రానని చెప్పి ఆసుపత్రి నించి నేరుగా ఇక్కడికే వచ్చాను.
ఎందుకో తెలుసా ఆంటీ.. నా బిడ్డకి తండ్రి అయిన వాడితో నా దుఖాన్ని షేర్ చేసుకుందామని! పుట్టబోయే బిడ్డ గురించి నేను ఎన్ని కలలు కన్నానో రాకేశ్‌కి బాగా తెలుసు. తను వెక్కిరించేవాడు నన్ను. నేను ఆనందంగా నవ్వేదాన్ని. ఇప్పుడు ఆ బిడ్డ నాకు దక్కకుండా పోయాడు. ‘పోనీలే.. ఏడవకు. ఏడాది తిరక్కుండా మనకి మళ్లీ బాబో పాపో పుడతారు. ఈసారి జాగ్రత్తగా ఉందాం..’ లాంటి మాటలన్నీ ఆశించి ఇక్కడికి వచ్చాను. కానీ, నాకు దక్కినదేంటి? తిట్లు! ఒక ఓదార్పు లేదు. ఒక సానుభూతి లేదు. ‘నీకు బుద్ధి లేదు. పిచ్చెక్కిపోయి అంతా నాశనం చేశావు. బిడ్డని పొట్టన పెట్టుకున్నావు..’ అదే మాట.. అవే తిట్లు!! మీరు చెప్పండి ఆంటీ.. నా బిడ్డని నేను చంపేశానా!?” తనూజ ఒక్కసారిగా సోఫాలో కూలబడి వెక్కివెక్కి ఏడ్చింది.
కొడుకు వైపు తీక్షణంగా చూసి.. చప్పున వెళ్లి కోడలి పక్కన కూర్చుని ఆ పిల్లని దగ్గరగా పొదువుకుంది హేమలత. ఒక్క నిమిషం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత రాకేశ్ వంటింట్లోకి వెళ్లి వేడిగా టీపెట్టి తీసుకొచ్చి.. తల్లికీ, తనూజకీ ఇచ్చాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా తీసుకున్నారు.
“అమ్మా! ఇప్పుడు నేనేం మాట్లాడినా డ్రామాలా ఉంటుంది. పైగా నామీద నాకే నమ్మకం కలగడం లేదు కూడా. ఉన్నపాటున నాకు బుద్ధొచ్చేసింది అనడానికి ఇది కథ కాదు.. జీవితం. కాకపోతే మీ ఇద్దరి మాటల వల్లా నాలో అంతర్మథనం మొదలైందన్నది నిజం. అలాగే తనూజ అంటే నాకు చాలా ఇష్టం అన్నదీ నిజమే. తను ఉద్యోగం చేసి సంపాదించకపోయినా కూడా.. ఐ లవ్ హర్ అండ్ ఐ వాంట్ హర్ ఫరెవర్. నువ్వు చెప్పినట్టు తను మెత్తగా ఉండబట్టి తిట్టినా పడుతుందిలే అన్నట్టుగా తిట్టాను గానీ.. తన మనసు బాధ పడుతుందన్న ఆలోచన లేకపోయింది. ఇక మీదట ఐ విల్ మేకోవర్ మైసెల్ఫ్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం..” నెమ్మదిగా చెప్పి, తనూజ చేతిలో ఖాళీ టీ కప్పు తీసుకున్నాడు రాకేశ్.
భయంగానే కోడలి మొహంలోకి చూసిన హేమలతకి ఆ మొహంలో పునరుత్తేజం పొందుతున్న ప్రేమా, ఆశా, ఆనందమూ కనిపించి.. మనసు కాస్త కుదుటపడింది!
నేను మరో నాలుగు రోజుల్లో లీవ్ తీసుకుని హాయిగా నా పాప గురించి కలలు కంటూ కాలక్షేపం చేద్దామనుకున్నాను. ఇప్పుడిక నాకు హాయీ, ప్రశాంతతా కల్లో మాటే. నెలలు నిండినా కూలిపనికి వెళ్లే ఆడదానికీ నాకూ తేడా లేదు. ఆ ఆలోచనలతో ఒక్కసారిగా గాబరా వచ్చేసింది. ఆ గాబరా నా పాపని బలి తీసుకుంటుందన్న ఆలోచన నాకు లేకపోయింది.
లక్ష్మీ గాయత్రి
భర్త నుంచి భార్య ఆశించేది గుప్పెడంత ప్రేమ.. కాస్తంత ఓదార్పు మాత్రమే! అవికూడా దక్కనప్పుడు ఆ భర్తతో కలిసి ఉండటం వృథానే! అని చెప్పే ఓ యువతి కథే.. మనసున మనసై. రచయిత్రి లక్ష్మీ గాయత్రి. వీరి స్వస్థలం విశాఖపట్నం. 1980లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. విశాఖలోని ఒక స్థానిక పత్రికలో పన్నెండేళ్లపాటు పాత్రికేయురాలిగా పనిచేశారు. 1983 నుంచీ ‘చందమామ’ పిల్లల మాసపత్రికలో అనేక కథలూ, సీరియల్స్ రాశారు.
‘చందమామ’ ఆగిపోయేదాకా.. 30 సంవత్సరాలపాటు అక్కడే పనిచేశారు. ఆ తర్వాత పదేళ్ల పాటు రచనకు విరామం ఇచ్చారు. మళ్లీ రెండు మూడు సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నారు. వివిధ సాహితీ సంస్థలు, పత్రికలు నిర్వహిస్తున్న కథల పోటీల్లో.. ఇప్పటివరకు మూడు ప్రథమ బహుమతులు, ఒక ద్వితీయ బహుమతి, ఒక తృతీయ బహుమతి, కొన్ని ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీలో బహుమతి రావడం ఇది రెండోసారి. వీరి కథలు ఆంధ్ర పత్రికతోపాటు స్వాతిలో కూడా ప్రచురితమయ్యాయి.
లక్ష్మీ గాయత్రి
63025 55947