‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
మాగి పొద్దు. చీకటి చీరకొంగు విప్పి ఊరిపై పరుస్తున్నది. పొద్దు ఎప్పుడో వాలిపోయింది. పశుపక్ష్యాదులు గూళ్లవైపు మళ్లుతున్నాయి. మోట కొడుతున్న శివలింగం.. ఎడ్లను మోటబారిలో ఆపి, దొయ్యలవైపు నడిచాడు. నడుస్తున్నవాడు ఏదో యాదికొచ్చినట్లు, వెంటనే వెనక్కివచ్చి మోటబావిలోకి తొంగిచూశాడు. అప్పటికే ఆకాశంలో విహరిస్తున్న చంద్రుని ప్రతిబింబం.. నీటిలో తళతళా మెరవసాగింది. బావిలో ఎన్నో నీళ్లు లేవని శివలింగం గ్రహించాడు. అంతలోకే నీటిలోంచి ఒక చేపపిల్ల పైకి దూసుకొచ్చి.. చంద్రుణ్ని చూసి సిగ్గుపడి వెంటనే నీటిలోకి తుర్రుమన్నది. దాని పరుగుకు నీటిలోని అలలు అలాఅలా వయ్యారంగా బావి ఒడ్డును తాకుతూ ఉంటే, చంద్రుడు చేపపిల్ల బేలతనాన్ని చూసి చిలిపిగా నవ్వుతున్నాడా?! అన్నట్లుగా ఉంది. దొయ్యల దగ్గరికి వెళ్లి పార చూశాడు శివలింగం. ఏదో తనలో తానే గొణుక్కుంటూ వెనుదిరిగాడు. పొట్టకొచ్చిన వరి పచ్చకోక కట్టుకున్న చూలాలిలా.. అందాల్ని ఒయ్యారంగా ఒలకపోస్తున్నది. దాని జాణతనాన్ని చూసి పరవశించిన మిణుగురు పురుగులు.. మిణుకు మిణుకు మంటూ నక్షత్రపు ముత్యాల్ని వరిచేనుపై వెదజల్ల సాగాయి.
మహమ్మదు అటుగా వెళ్తూ.. “ఏందోయ్ లింగులూ! మోట ఇప్పినవా?” అంటూ పలకరించాడు.“ఏమిప్పుడో ఏమో! ఇంకో రెండుదొయ్యలకు నీల్లు పారనేలేదు. బాయిలనేమో ఐదారు బొక్కెండ్లకన్నా ఎక్కువ నీళ్లులేవు. ఏం జెయ్యాల్నో ఏమో మనుసున వడతలేదు. ఏం దోస్తలేదు! బాయిల నీళ్లూరేదాకా ఉందామంటే.. అద్దుమనాత్రి అయ్యేటట్లుంది. మాగిపొద్దాయె! ఎన్నెల గూడా జల్దినే గుంకుతది” అంటూ నిరాశగా, దిక్కులు చూస్తూ చెప్పసాగాడు.
శివలింగం ముగించకముందే.. “నీళ్ల మాట జెప్పకు. గయి నా బాయి బొందల లేనందుకే గదా! యాతం బోసుడు ఆపి ఇంటిదారి వట్టిన!” అన్నడు మహమ్మదు, నోట్లో నుంచి చుట్ట తీస్తూ..
“నీకేంది బావా! నీది యెవుసం. నాది పాలేరుతనం. నీ దొయ్యలు పారినా, పారకున్నా.. అడిగేటోడు లేడు. నాది గట్ల గాదుగదా!? నీ యవ్వ.. నా బతుకు మీద నాకే రోత పుడుతంది. ఇంట్ల జూత్తే కుంచెడు గాసం లేదు. ఇవుతల జూత్తే బాంచెల బతుకు. సీసీసీ! బతికిందాని కన్నా.. ఉరేసుకొని సచ్చిందిమేలు!”.
“అందరు నీ లెక్కనే అనుకుంటే, లోకం నడుస్తదా? సరే! నువ్వు ఉరేసుకుంటవోయి. మరి పోశవ్వ బతుకూ, పొల్లగాని బతుకూ ఏమైతదో సీమంత ఆలోసించినవా? ఏదో నిన్ను జూసుకొని బతుకుతంది పోస”. “నీకు ఎరుక లేందేముంది బావా!? అది కైకిలి గంబడి జేత్తెనేగదా కసికెడు గంజి పుడుతంది. అదే లేకపోతే”.. అర్ధోక్తిలోనే ఆగిపోయాడు శివలింగం.. కంఠం గద్గదమైపోయి మాట పెగల్లేదు.
“మనందరి బతుకులు గట్లనే సచ్చినయి తియ్యి! ఎగిలివారంగ లేసి.. మల్ల మోటగట్టు! గప్పటికి బాయిల గిన్ని నీళ్లూరుతై! గీ నడుమ నాకైతే.. పొద్దు గుంకుతుందంటే కండ్లు సరింగ కనవడుతలేవోయ్! జరీనాను ‘నాల్గు బొక్కెండ్లు యాతం బొయ్యే!’ అంటే.. అది ‘నాకు నడుం నొప్పి, కీళ్ల నొప్పులు!’ అనుకుంట గొంగట్ల మల్సుకు పంటున్నది. దాని గోస దాందే! మా బద్మాష్ పోరగాన్ని ‘పొయ్యిరా!’ అంటే.. ఆడు నా మీదికే మర్లవడుతుండు. ఏం జేయాలె జెప్పు?!”.. తన కష్టాల్ని ఏకరువు పెట్టబోయాడు మహమ్మదు.
“ఆనికేం జెపుతవ్ బావా! పసి విల్లగాడు. యాతం బోత్తాడు!?”.
“ ఆ..డా! పసి విల్లగాడు!? ఈ పీరీల పండుగత్తే పదేండ్లు దాటుతై ఆనికి. నాగలి పట్టరాకపాయే! పొలం దున్నరాకపాయే! ఈ యేడాది ఆయిటికి ఎట్లనన్నజేసి ఆనికి నాగలి పట్టుడు నేర్పాలెనోయ్! అరే! ఆనికన్న గింతగింత పొట్టేగాండ్లు యాతాలు గూడా పొయ్యవట్టిరి. ఈడేమో ఎప్పుడు జూసినా.. ‘నేను సదువుకుంటా! నేను సదువుకుంటా!’ అని ఊళ్లె బల్లెకు ఉరుకుతండు. సదువు మనకు యాతం బోత్తదా?! కూడు వెడుతదా?! గింజలు పండిత్తదా?! ఆఁ నువ్వే జెప్పు. దీనియవ్వ.. ఆని తల్లేమో ఆన్ని అన్నిటికీ ఎన్కేసుకస్తది. గందుకని.. ఆనికి ఇంకింత అలుసైపోయింది”.. తన ఎతనంతా చెప్పుకొంటున్నడు. “పోనీ బావా! ఆడు సదువుకుంటనంటే సదువుకోనీ! నువ్వు సంపాదించిందంతా ఆనికేగదా. సదువుకుంటే దొరైతడు”.
“గందుకే గదా.. నా ఎతంత! ఆనిమీద సిట్టి సిటికె గూడ ఎయ్యనియ్యది మీ అక్క! యెవ్వారం జూత్తెనేమో గిట్ల నాయే! నన్నేంజెయ్యమంటవ్!? ఇగ నా పుట్టు వాడికేంది గానీ, మోట ఇప్పు” అంటూ ముందుకు వెళ్లి, ఎడ్ల మూతికి కట్టిన చిక్కాలను విప్పసాగాడు.శివలింగం మోట బక్కెనను పైకి గుంజిపట్టి, గిరికకు చిన్న తాడును అడ్డంకట్టి, ఎడ్ల మెడమీది కానిని విప్పి కిందపెట్టాడు. దండెడ తాడును వెనక్కి లాగి, ఎడ్లను గదమాయించి పక్కకు తోలాడు. పరోపకారమే పరమావధి అనే సుకర్మకు ప్రతిరూపాలైన బసవన్నలు.. కాళ్ల తీపులతో భారంగా తలలు ఊపుకుంటూ, మోట బారిలోనుంచి భారంగా బయటికి నడవసాగాయి.
* * *
గుడిసెలో ఏదో చప్పుడయ్యింది.
చటుక్కున మెలకువ వచ్చింది పోశమ్మకు. లేచి కూర్చోని అటూఇటూ పార చూసింది. ఇంట్లో చిమ్మన చీకటి నిండి ఉంది. తల్లి స్పర్శ, వెచ్చదనం తగలకపోయే సరికి.. పక్కలో పడుకున్న యాడాదినర్ధపు కొడుకు ఒక్కసారిగా ‘కేర్ కేర్’ మంటూ ఏడ్వసాగాడు. ఆ ఏడుపు శబ్దానికి అక్కడే చాప మీద పడుకున్న శివలింగం నిద్ర ఎగిరిపోయింది. “ఏందే! సంటోడెందుకేడుస్తుండు?!” అంటూ నిద్ర మత్తులోనే అడిగాడు. “ఇంట్ల ఏందో సప్పుడైతే తెలివచ్చి లేసిన, పాలు చీకుడు ఆగిపోయినందుకు ఆడు ఏడుత్తాండు”అంటూ, కొడుకును ఎత్తి రొమ్ముకు ఆనించుకుంది. వాడు తిరిగి అమ్మపాలు తాగడంలో నిమగ్నమైపోయాడు.“ఏం సప్పుడైంది?” తిరిగి ప్రశ్నించాడు శివలింగం. “పిల్లిముండ ఎలుకను పట్టవోయి, సెంగున దుంకినట్టుంది. గిన్నె, సెంబులు తగిల్నయేమో.. సప్పుడైంది. ఇశిరెలన్ని కిందవడ్డయో.. ఏంపాడో?!” అన్నది ఆవలింపులు తీస్తూ. “బంగారమసొంటి నిదుర జెడగొట్టింది పిల్లి ముండ. దీన్ని దొమ్మరోడు పొడ్సుకుపోను!”.. అంటూ విడిపోయిన కొప్పును తిరిగి ముడుచుకుంది. మళ్లీ ఆవలింత దీసింది. కొంగుతో మూతి తుడుచుకుంది. తలాపునున్న మట్టి ముంతలోని నీళ్లు తాగింది. శివలింగం లేచి, గుడిసెకున్న పనుగడి పక్కకు జరిపి బయటికి వెళ్లాడు. ఘడియ సేపైనా అతను మళ్లీ గుడిసెలోపలికి రాకపోయేసరికి.. ఒళ్లో నిద్రపోతున్న కొడుకును నేలపైనున్న చాపమీద పడుకోబెట్టి, ఓ బొంత కప్పి.. తనూ బయటికి నడిచింది పోశమ్మ. అటూ, ఇటూ, పైకీ పరికించి చూసి..
“అవ్వో! మొగుల్ జూడు.. సుక్కలిప్పుడిప్పుడే మొలుస్తున్నట్లున్నయి!” అని తనలో తానే అనుకుంటున్నట్లుగా.. బిగ్గరగానే అన్నది. మళ్లీ ఇటూఇటూ పరీక్షగా చూడసాగింది. చిమ్మెటల కీచు శబ్దాలతో ఆ ప్రాంతమంతా రాత్రి సంపూర్ణత్వాన్ని విశ్వానికి చాటి చెబుతున్నట్లుగా ఉంది. ‘బైటికి పోయిండా అంటే.. పోనట్లే ఉంది! కంచుముంత ఈన్నే ఉంది. మరి యాడికి పోయిండో?!’ అని మనసులో అనుకుంటూ, పశువుల కొట్టం వైపుచూసి.. “దొడ్లేంజేస్తున్నవ్?” అంటూ పలకరింపుగా ప్రశ్నించింది భర్తనుద్దేశిస్తూ.. అవతలి నుంచి సమాధానం రాకపోయే సరికి, తనే పశువులకొట్టం దగ్గరికి నడిచింది. శివలింగం చేస్తున్న పనిని చూసి, “ఏందీ?! యాల్లగాని యాల్ల, ఎడ్ల తలుగులిప్పుతున్నవ్?! అద్దుమనాత్రి, అపరాత్రి అని ఏమీ లేదా ? పొద్దు మాపు పటేలు పనులు జేత్తె, పెండ్లాం పిల్లల మాటేంది? అది జూడవా ? అటు మొగులు దిక్కు జూడు!?” అంటూ ఆకాశం వైపు చూస్తూ.. “గొరుకొయ్యలు నడి నెత్తిమీదున్నయి. తెల్లారి సుక్క బొడువనే లేదు! గీ నాత్రి పొలం పారియ్య బోతవా?! పురుగూ, బూసీ, జీవాలు తిరుగుతై అన్న బుగులే లేదు!!” అన్నది నిష్టూరంగా. “రెండు దొయ్యలు పారలేదే! నిన్న పొద్దుమీకి జాముల బాయిల నీల్లు గుంజుకున్నయ్. ఏగిలి వారకముందే నీళ్లు పారియ్యకపోతే, పొట్టకచ్చిన వరిపోసలు ఎండిపోతయ్. వరి కర్రలు పొట్టకొచ్చినయే! గందుకనీ..” అతను ఇంకా ముగించనే లేదు.. పోశమ్మ స్వరం పెంచి.. “నీకు సిగ్గూ, శరం ఏమన్న ఉన్నదా? పాపం! ఆ నోరులేని బసవన్నల జూడు. బొక్కలు దేలినయ్. అయ్యిటికి ఏమన్న రికామున్నదా? పొద్దంత సెలుక దున్నితివి. పొద్దూకినంక మోట గడ్తివి. ఆటి కాళ్ల డెక్కలు పచ్చిపుండ్లయిపోవా? నువ్వూ, ఆ పటేలు గల్సి ఈ మూగజీవాల గోస పోసుకుంటున్నరు. ఆటి ఉసురు తగుల్తది. జెర్ర ముత్తెమంత ఆటికి ఇరాం ఇయ్యి” అంటూ కసిరింది.
“అదిగాదే!”.. ఏదో చెప్పబోయాడు శివలింగం.
“ఏందిగాదు?! రేపు నీకు దగ్గొచ్చి, దమ్మెచ్చి రోగమచ్చి మూలకు వడితె.. పటేలత్తడా? ఆయిన పెండ్లమత్తదా? నీకు సేవలు జేసెతందుకు? నా గండానికి తగిలిండ్రు.. నువ్వూ, ఆ పటేలు! నడువ్. ఇంట్లకు వోయి, గొడ్సెపంత కునుకువెట్టు. నడువ్. మబ్బుల లేసి పో!” అంటూ భర్త చెయ్యిపట్టుకొని వెనక్కి తిరిగింది. “అదిగాదే! మల్ల కన్నంటుకుంటె తెలివి రాదే!”.. నసిగాడు శివలింగం. “ఆఁ ఇంకా నాత్రంత అక్కన్నే పన్జేసి, బొక్కలన్ని కలికలి జేసుకొని ఇంటికి రానుంటివి. కాళ్లు పిస్కెతందుకు, ఏళ్లు పిస్కెతందుకు, పిక్కెలు, నడుము వొత్తడానికి ఎట్టికివడ్డ నేను సచ్చినగదా!? నేను సత్తె నీ కండ్లు సల్లవడుతయ్”.. ఈసడింపుగా అనసాగింది పోశమ్మ. శివలింగం మారు మాట్లాడకుండా ఆమె వెనకాలే గుడిసెలోకి నడిచాడు. ఎక్కడో ఆకాశంలో సీతువ పిట్ట అరుచుకుంటూ ఎగిరిపోతున్నది. గుడిసె లోపలే కప్ప బెకబెక మంటున్నది. ఉన్నట్లుండి అప్పుడప్పుడు ‘గూప్, గూప్’ మంటూ గుడ్లగూబ ఎక్కడో కూస్తున్నది. నీలంపులకాడి జాలారి దగ్గరున్న జామచెట్టు మీద గబ్బిలాలు గీసులాడుకుంటున్నాయి. ఆకాశంలో పట్టెమంచం చుక్కలు పడమటికి వంగాయి. గొరుకొయ్యలు వాటి వెనకాలే, కళ్లు చారెడంత చేసుకొని నింగి నుంచి నేలవైపు చూస్తున్నాయి ఎక్కడ ఏ రసవత్తర ఘటన గోచరిస్తుందో చూద్దామని గంపెడు పేరాశతో.
* * *
శివలింగం కళ్లుమూసుకొని పడుకున్నాడే గానీ, కునుకు రావడం లేదు. ఏవేవో ఆలోచనలు కళ్లముందు కదలాడసాగాయి. ‘రోణి జొచ్చినప్పుడు పెంటకుప్పల్ల నుంచి కసువు ఎరువు దీసి కచ్రాలల్ల నింపి పెరండ్లల్ల కుప్పలు బోస్తిమి. మిర్గంల ఆనలు వడితే నాగండ్లు గట్టాలనుకుంట మొగులు దిక్కు జూస్తే, వాన బొట్టు జాడ లేకపాయె! మిర్గంల ఆన జల్లులు పడంగనే.. దుక్కులు దున్ని ఇత్తునాలేస్తె, ఇత్తునాలు మొలుకలచ్చి ఆయింత ఆనలు వడక మొత్తానికే ఎండిపాయె! ఆరుద్ర రావట్టే..’ అనుకుంటున్న ఆయన తలంపులకు అంతరాయం కలిగిస్తూ.. గుడిసె గోడ వారగా బూడిదలో పండుకున్న కుక్క సాగదీసి ఏడుస్తున్నట్లుగా అరవసాగింది. “దీని కుక్కనోట్లే మన్నువడా! దీనికేం పోయేకాలం అచ్చింది. సోకాలు దీసుకుంట ఏడుత్తంది?” అంటూ కసర సాగింది పోశమ్మ. “ఇంకా కన్నంటుకోలేదాయె?” నెమ్మదిగా అడిగాడు శివలింగం.
“నిద్రింట్ల పీనుగెల్ల. అదేమన్నా అయ్యనా? అవ్వనా? మనం రమ్మంటే అచ్చెతందుకు. పోయెతందుకు. ఆ కుక్క ముండ ఏడుత్తుంటే సంటోడు జడ్సుకున్నడు జెర్రవోయి దాన్ని గెదిమిరాపో” అన్నది పక్క మార్చుకుంటూ. శివలింగం వెళ్లి కుక్కను దూరంగా తరిమి వచ్చాడు. వచ్చి పోశమ్మ పక్కన నడుం వాల్చాడు. “నువ్వెందుకు నిద్రవోలేదు?! తెల్లారి సుక్కవొడ్సినప్పుడు నిన్ను లేపుతనంటి గదా!” పోశమ్మ అనునయంగా అన్నది. “ఏమోనే! అన్ని ఏవేవో కలిగెం బులిగెం కలలు కండ్లల్ల తిరుగుతున్నయి. ఈ యాడాది కాలం జల్దిన అయితదనుకుంటే, కాకనే పాయె! ఆన సినుకులు పడకనే పాయె. బాయిలల్ల, చెరువులల్ల సెంబు మునిగెడు నీళ్లు గూడా రాకపాయె. ఆ భగమంతుడు.. ఈ భూమ్మీద, మనుసుల మీద గుడ్లెందుకు ఎర్రజేస్తుండో?!”.
“ఆఁ ఎందుకా?! మొయ్యేడు పోశవ్వ తల్లికి, ఎల్లవ్వ తల్లికి, దుర్గవ్వ తల్లికి కర్రె పుంజులు కోత్తిరి. కల్లు ఆన్పిత్తిరి. తల్లులు కొద్దిగ సల్లవడి ఆలిసెంగానైనా ఎడకార్తెలో ఆనలు గురిపించిరి. మల్ల నిరుడేమో, ఊరంతా కల్సి పోశవ్వకూ, ఎల్లవ్వకూ, దుర్గవ్వకూ గొర్రె పొటేల్లు బలిత్తిరి. కల్లు బుంగలు ఆన్పిత్తిరి. బోనాలు ఎత్తితిరి. ఆ తల్లులు సంబురవడి ఆనలు గురిపించిరి. మరి ఈ యేడాది ఏం జేసిండ్రు!? మాగమాసమొచ్చిన గానీ బోనాలు ఎత్తకపాయిరి. ఇయన్ని పునాస, దుంపాలు అయిపోంగనో.. లేకపోతే ఏసంగి అయిపోంగనో సేత్తె.. తల్లులు సల్లవడి, సంబురవడి రోణికాకపోతే, ఎట్లనన్న మిర్గంలనన్నా ఆన సినుకులు పడేయి. మరి ఇయన్ని జెయ్యకపోతే పోశవ్వ తల్లికీ, ఎల్లవ్వ తల్లికీ, దుర్గవ్వ తల్లికీ కడుపంతా కుతకుత మండిపోదా? యాడాదంతా ఉపాసముంటరు ఆ తల్లులు. ఒక్కదినం బోనం బెట్టి, కర్రె కోడిపుంజును కోసి, బుంగెడు కల్లు ఆన్పితె.. మండే కడపు సల్లవడుతది. ఆనలు కురిపించుమని ఆనదేవునికి ఆగెలు వెడుతరు”.. చెప్పుకొంటూ పోతున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయి, ఒక నిమిషం గడిచాక అన్నది.
“ఏందీ సోద్యం!?” అంటూ తన గుండెలపై ఉన్న శివలింగం చేయిని తీసివేయబోయింది. శివలింగం ఆమెకు దగ్గరగా జరిగిపోతూ.. “ఆ అవ్వలకు కోపమత్తె ఆల్లను సల్లబర్చుమన్నవ్! మరి ఈ అవ్వకు కోపమత్తె సల్ల బర్చాలెగదా!”అంటూ ఆమెకు అతుక్కపోయాడు. అరుగు మీది జాంపు కింది కోడిపుంజు ‘కొక్కరోకో’ అంటూ దీర్ఘంగా కూసింది. తూర్పున తెల్లారి చుక్క పొడిచింది. పిట్టలు పిసపిస మనసాగాయి. గోరువంకలు కిలకిల రావాలు చేయసాగాయి. గుడిసె ఎనగర్ర మీద కూర్చున్న కాకి.. ‘కావ్కావ్’ అంటూ అరవసాగింది. పిచ్చుకలు కిచకిచ మనసాగాయి. శివలింగం ఎడ్లను తోలుకొని పొలంవైపు నడవసాగాడు. తూరుపు ఎర్రబారుతున్నది. పాలకొడిసె చెట్టుమీది చమురు కాకి చింతచెట్టు మీదికి గెంతుతున్నది. రాత్రంతా మర్రి మానుపై ఆకుల మాటున హాయిగా సేద తీర్చుకున్న కొంగల గణం.. అరుదెంచుతున్న ఆదిత్యుని కంఠానికి మల్లెపూల హారంగా మారి వినువీధిలో పయనించ సాగింది.
* * *
గ్రీష్మం తీవ్రంగా ఉంది. ఏసంగి ఎండలు మండిపోతున్నాయి.
రాత్రి రెండుజాములు దాటినా కూడా చెట్లు చైతన్యం కోల్పోయినట్లున్నాయి. గాలి సవ్వడే లేదు. ఆకు కదలికే అరుదయ్యింది. గుడిసె ముందు వాకిట్లో ఈత చాపమీద పడుకొని నింగిలోకి చూస్తున్నాడు శివలింగం. ఒంటిమీద మోకాలు దిగని దోవతిని కాశేబిగించి కట్టుకున్నది తప్ప.. మరేమీ లేదు. పక్కనే ఆయన రెండేండ్ల కొడుకు చాపపై దొర్లుతున్నాడు కేరింతలు కొడుతూ. నెత్తి కింది రుమాలు తీసి వానికి గాలి విసర సాగాడు. ఆకాశంలో చుక్కలు అపరంజి లగ్గలాగా మెరిసిపోతున్నాయి. చంద్రుడు నిండుగా వెలిగిపోతున్నాడు పండు వెన్నెల పంచుతూ. పిల్లలకోడి నక్షత్రపు గుంపు తారకలు మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్నాయి. వాటిని చూస్తూ శివలింగం కొడుకు కేరింతలు కొడుతున్నాడు. గుడిసె పనుగడి కాలి బొటనవేలుతో దగ్గరికి వేసి వచ్చింది పోశమ్మ.రెండు చేతుల్లో రెండు కంచు తలెలున్నాయి. చంకలో చిన్న నీళ్ల పటువ ఉంది. దాని మీద మట్టిచిప్ప. చిప్పపై ఒక రాగి చెంబు ఉంది. శివలింగం లేచి నీళ్ల పటువ అందుకొని కింద పెట్టాడు. పోశమ్మ తలెల్ని చాపమీద పెట్టి, కూర్చుంటూ.. కొంగుతీసి ముఖమంతా, మెడచుట్టూ తుడుచుకుంటూ..
“అబ్బబ్బబ్బా! ఇటు ఇంట్ల దగడు, అటు ఇవుతల దగడు. పెయ్యంత సలసల కాగిపోతంది. ఏమెండలో ఏమో!? యెడాదికాడాది, శెడగొట్టు ఎండలు ఎక్కువెక్కువనే అయితున్నయి గానీ, తక్కువైన పాపాన పోతలెవ్వు. పటివెడు నీళ్లకు దొర ఇంటికాడ పొంటెజాము నిలవడి, నిలవడి కాళ్లన్ని గుంజుకు పోయినయ్. పటేలైతే మా లెస్కనే నీతోని ఆల్ల బాయిలు బుర్ద పూడిక దీయించుకున్నడు గాని, పొద్దుగాల పటివెడు మంచి నీల్లియ్యిమని పోతే.. అంబటాల్లదాకా ఇల్లాకిలి ఊడ్పించుకొని, కొట్టంల గొడ్ల పెండా – కసువు తీయించుకొని.. ఆకిలంత అలుకేయించుకొని, ఇల్లు అలికించుకొని.. సున్నాలు, ముగ్గులు పెట్టించుకొని.. అడ్డమైన ఎట్టి సాకిరంతా జేయించుకొని.. నాల్గు రోతమాటలని నా మొకాన ఇన్ని నీళ్లు బోత్తండు. ఏమయ్యో! నువ్వంటే అయినె పాలేరువు. నేను నీ పెండ్లాన్ని అయినందుకు, నన్ను గూడా తన పాలేరే అనుకుంటున్నట్లుండు. నా ముందట్నే నిన్ను ఈ మాటా, ఆమాటా అంటడు. నాకెందుకో అయినె దగ్గర నువ్వు పాలేరుతనం సేసుడు ఇట్టమనిపిత్తలేదు” అంటూ చెప్పుకొంటూ పోతూ ఉంది.
ఇంతలో గట్క తింటున్న శివలింగానికి సరం పడటంతో ఆపి, చెంబులోకి నీళ్లు వంపి ఆయనకు ఇచ్చి.. “జెర్ర తాతిపరంగ తిన్దు?! సెలుకల పనేమి లేదు గదా?! ఏగిర్త పడదాన్కి” అన్నది.. తల మీదా, వీపు మీదా నెమ్మదిగా నిమురుతూ. “అదిగాదే! గటుకల గీ పచ్చిపులుసు కమ్మగుందే! జెర్ర ఎక్కువ జుర్రిన్నేమో! సరంవడ్డది” అంటూ నీళ్లు తాగి, భార్య చేతికి చెంబిచ్చాడు. “ఏం గట్కనో?! ఏం పచ్చిపులుసో ?! ఏడెల్లకాలం గీ కూడేనాయె మనకు. మెతుకుల కూరలెప్పుడు దిన్నం గన్క! ఎల్లిపాయ కారం, మక్కజొన్న గట్కే మన జేజ బువ్వలాయె!” అన్నది అదో మాదిరిగా నిట్టూర్చుతూ. “ఏం జెయ్యమంటవే!? నడుం ఇరిగెటట్లు.. నువ్వు కల్వవోయి, దంచవోయి, కైకిలి గంబడి జేసినా, కార్జం ఐసిపోయేటట్లు రెక్కలను, బొక్కలను నేను ఇరగొట్టుకున్నా, చేతికీ మూతికీ నడువకనే పోవట్టే! కడుపు కట్టుకొని కాలం ఎల్లదియ్య వడ్తిమి. మట్టి పని దప్ప, ఇంకో పని రాకపాయె! ఏం జేద్దామే! మన గాచారం గింతే!” నిరాశగా పలికాడు శివలింగం.
చెరువు కట్ట కింద ఉన్న మామిడి తోట నుంచి కోకిల కూత వినిపించ సాగింది.
“అగో! గీ యాల్లగాని యాల్ల కోయిల గూస్తుంది! ఏం పాడో?! కాలాలు గతులు తప్పుతున్నందుకు.. పాపం కోయిలలకు గూడా దినమేదో, నాత్రేదో! తెలుస్తలేనట్లుంది!” అన్నది శివలింగంకేసి చూస్తూ.. “ఇగో! నీకు శానాల్లసంది ఓ ముచ్చట జెప్పుదామనుకుంటున్న ఇంటున్నవా?” అన్నది. “ఆఁ సెప్పు” పరధ్యానంగా అన్నాడు శివలింగం. “గదే! మా సిన్నమామ కొడుకు నర్సిగాడు ఎరికే గదా!? ఆడు పాలేరుతనం ఇడ్సిపెట్టి, పట్నం బోయిండు.. ఇంటున్నవా?”. “ఏం జెయ్యవోయిండు?”. “ఇండ్లుగట్టే సుతారోల్ల దగ్గర ఇటికెలు, సిమిటి బత్తాలు, నీళ్ల తిత్తులు మోత్తడట. పని మంచిగ జేసుకుంటె.. బట్టాబాతలకు మంచిగనే దొర్కుతదట! మొన్న సంకురాతిరికి లగ్గం జేసుకొని పోయిండు గదా! గప్పుడు జెప్పిండు గిదంతా.. ఆల్మొగలు సుత సెయ్యచ్చట.. ఇంటున్నవా?”. “ఆఁ ఆఁ ఆఁ”.. పక్కన పడుకున్న కొడుకును జో కొడుతూ అన్నాడు శివలింగం.
“ఆఁ ఆఁ గాదు.. నీకిట్టమైతే నా మాటిను. ఇక్కడ జూత్తే పిడాత సచ్చెటట్లున్నం. నా కాల్జేయి, నోట్లె నాల్కె సల్లంగుంటె.. నేనూ కూలోనాలో, కైకిలో గంబడో జేత్త! కాల్జేయి మనకో పిల్లగాడాయె! ఇంకోల్లు కడుపుల పెర్గవట్టిరి.. గందుకని, మనం గూడా పట్నంబోతె కూడుగుడ్డకు సావమని నా ఆలోచన”.. అనునయంగా చెప్పసాగింది. “కన్నతల్లిలాంటి మన ఊరిడ్సిపెట్టి ఎట్లా బోదామే?!”. “ఆఁ! కన్న అయ్యా, అవ్వను ఇడ్సిపెట్టి ఆడోల్లం మేం లగ్గం జేసుకున్నోనింటికి అత్తలేమా?! ఏం నమ్మకంతోని మొగోని ఎంటవడి వత్తున్నం. సేసుకున్నోడు, అత్తమామలు ఎసువొంటోల్లో మాకు తెల్వకున్నా.. మేం అత్తలేమా!? కడుపుపండి నీల్లోసుకొన్నప్పటి సంది.. పిండం దినదినాన్కి కడుపుల పెరుగుతుంటే.. కడుపు ఇంత ఎత్తుకు పెరిగిందనీ, బరువైతుందనీ బుగుల్పడ్తమా?! తొమ్మిది పది నెల్లు మోత్తం. నీళ్లాడేటప్పుడు.. పురిటినొప్పులచ్చి పానానికే గండమైతది. సావుబతుకుల్ల పాణం గిజగిజలాడుతది. బిడ్డను కనకుండ మానుకుంటమా?! ఎన్ని కట్టాలచ్చినా ఓర్సుకుంటం. పుట్టిన బిడ్డను సూసి.. కొండంత కట్టాన్నీ, పడ్డ బాధనంతా సిటికెలో మర్సిపోతం. ఇదంతా నీకెందుకు జెప్పుతున్ననంటే.. మనంగాకున్నా మన పిల్లలు మనతీరుగ గరీబు బతుకులు బతకద్దు అనుకుంటే.. ముత్తెమంత కట్టం అనుభవించాలె! కార్జాన్ని దైర్నం జేసుకోవాలె”.. ఆత్మవిశ్వాన్ని పెంచి, ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నించ సాగింది.
“అదిగాదే!” ఏదో చెప్పబోయాడు శివలింగం.
“ఏదిగాదు. ఈ ఊరు మనదిగాదని నేను అంటలేను. నీ తండ్రీ, తాత ముత్తాతలు, నా తండ్రీ, తాత ముత్తాతలు ఈ ఊరోళ్లే గానీ, నా అని సెప్పుకొనే తందుకు ఈ ఊళ్లె మనకేముంది సెప్పు?! మనముంటున్న ఈ గుడిసడుగు భూమిగూడా పటేల్దేనాయే! రేపు ఆయినెకు కోపమచ్చి మనలను ఈ గుడిసెల ఉండుమంటే ఉండాలె.. ల్యాకపోతే జాల్లేకుంట పీకుమంటే ఎక్కడికి పీకుతం? నా అయ్యవ్వ సంపాదించింది నాకేం లేకపాయె! నీ అయ్యవ్వ సంపాదించింది నీకేం లేకపాయె! ఆల్ల బరువు దించుకునే తందుకు, నీకూ నాకూ పసివిల్లలుగా ఉన్నప్పుడే లగ్గం జేసిరి. మనకు బుద్ధి రాకముందే కాలం జేసిరి. ఈ ఊళ్లె మనకేముంది సెప్పు? ఈ ఊరును ఏడెల్లకాలం ఇడువుమంట లేనుగదా? ఇక్కడ జేత్తున్న ఈ రెక్కల కట్టమే పట్నంల జేసుకుందం అంటున్న. మనం నాల్గు కొత్తలు ఎనుకేసుకొని, మల్లా మన ఊరచ్చి, గుంటెడు జాగ కొనుక్కొని గుడిసేసుకుందం. మన సంటోనికి ఈ ఊరి పిల్లనే జేసుకుందం”.. మధ్య మధ్యలో గట్క ముద్ద మింగుకుంటూ.. చెప్పుకొంటూ పోతున్నది పోశమ్మ.
“ఉండే ఉండు! నువ్వు జెప్పిదంతా ఇనసొంపుగనే ఉందే! నువ్వు సెప్పే పట్నం బతుకబోయి బతికే కలలు మా లెస్కనే ఉన్నయి. కానీ, పట్నంబోయి అక్కడెక్కడుంటం? ఏం దింటం? పట్నం బోవుడంటే మాటలను కుంటున్నవా? పట్నం బస్సెక్కాలంటే.. ఈన్నుంచి ఆమడ దూరం నడువాలె! ఆ బస్సుదిగి రైలెక్కాలంటే ఇంకా రెండుమూడు కోసులు పిల్లబాటలు నడువాలె. మనం పట్నం రైలెక్కినంక, ఎక్కడ దిగాలో తెలువాలె. యాడికి వోవాలో తెలువాలె. నర్సయ్య యాడుంటడో తెలువాలె. ఇంతదూరం పోయెదాన్కి సద్దికి రొట్టె బిల్లలో, సత్తుపిండో ఉండాలె. ఈయన్నింటికన్నా మించి.. బస్సులకూ, రైలు కర్సులకూ పైసలుండాల్నే! సిల్లర పైసలు గాదే.. దుద్దులు, దుద్దులు.. రూపాలుండాల్నే! అన్ని రూపాలు యాన్నుంచత్తయి మనకు? మనం అనుకోంగనే, కల కనంగనే అయిపోతదా? అన్ని రూపాలు మనం సంపాదించాల్నంటే ఎన్నొద్దులు గావాలె!? అత్తురు బుత్తురు ఆలోచనలు జెప్పకు. దేవుడు సల్లంగ జూత్తె, ఈన్నే కైకిలో గంబడో జేసుకొని, కలో అంబలో తాగి బతుకుదం. అదిగూడ దొర్కకపోతె.. ఇంత ఊడుగు సెక్క తాగి సద్దం”.. అంటూ ఆవేశంగా చెప్పాడు.
పోశమ్మకు ఉక్రోశం పొంగుకొచ్చింది, ఆక్రోశంతో అన్నది.. “పచ్చికామిర్లోనికి ఊరంతా పచ్చగనే గనవడ్డదట!”. “అంటే ఏందే నువ్వనేది? నా కండ్లకు కామిర్లచ్చినాయే? ఆఁ నీయవ్వ గుద్దు గుద్దిన్నంటే గుమ్మడికాయంత..” ఇంకా ఏదో అనబోయాడు స్వరం పెంచుతూ. “సీ! నీనోట్లె మన్నువడ. తినేటప్పుడు గా మాటలేంది?” స్వరం తగ్గించి ఈసడింపుగా అన్నది పోశమ్మ. “లేకపోతేందే?”. “ఏందంటే ఏందీ?! గూదోంలెక్క ఆలోచించకూ అంటున్న. అది సుత తప్పేనా? అయిందా తినుడు?”.. అతను చెయ్యి కడుక్కోవడం చూసి అన్నది. అతను రుమాలుతో మూతి తుడుచుకొని అక్కడే చాప మీద మళ్లీ పడుకున్నాడు. పోశమ్మ తలెలు కడిగి నీళ్లు అటు పక్కకు చల్లింది. అక్కడే కాచుకొని కూర్చున్న కుక్క.. తోకాడించుకుంటూ ఎంగిలి నీళ్లు చల్లిన వైపు పరుగు తీసింది, తినడానికి ఏమన్నా దొరుకుతుందేమోనన్న ఆశతో. పోశమ్మ తలెల్ని గుడిసెలో పెట్టి, దిగుట్లోని దీపంతను ఆర్పివేసి వచ్చి, కొడుకును ఒళ్లో పెట్టుకొని శివలింగాన్ని ఉద్దేశిస్తూ..
“నీకు కొత్తల గురించే పికరుంటే, అది నాకు ఇడ్సిపెట్టు. ఎన్ని రూపాయలైతదో సెప్పు. నేను గూడవెడుత” అన్నది.
“యాన్నుంచి సంపాదిస్తవ్?! నన్నమ్ముతవా? చిల్లి గవ్వగూడ రాదు.. నువ్వే అమ్ముడు వోతవా?” అన్నాడు పరిహాసంగా. పోశమ్మకు అభిమానం కీచుమంది. కోపంతో అరిచినంతగా అన్నది. “ఏందీ? పిసనా నీకు. ఈయాల్లంత తిక్కెతిక్కెగా మాట్లాడుతున్నవ్? నాకు మండిందంటే.. ఏంజేత్తనో సూడు మల్లా! ఆఁ”. “ఆఁ ఏం జేత్తవే?! నీయవ్వ ఏం జేత్తవే?!” అంటూ పడుకున్నవాడల్లా లేచి కూర్చుచున్నాడు. “ఏంజేత్తనా! కూర సట్టి దీసి మొకం మీద ఈడ్సి గుంజిన్నంటే.. రోట్లె రోకలితోని మిరం నూరినట్లయితది! ఏందీ కొడుతవా? లేత్తున్నవ్?”.. పక్కకు జరిగిపోతూ బిగ్గరగానే అన్నది పోశమ్మ. అల్లంత దూరాన గుడిసెలోంచి ఓ ముసలమ్మ ఆ మాటలు వింటూ.. “ఏందే పోసా! గీసులాడుకుంటున్నారే?! సెరిసగం నాత్రయితంది.. ఏం గీసులాటలే? పండుకోండ్రి, పండుకోండ్రి!” మందలింపుగా అన్నది.
“ఏంలేదే పెద్దవ్వా.. గీ దొరకు సుట్ట ముట్టించుకునేతందుకు అగ్గి తెమ్మంటున్నడు నన్ను. కొర్రాయిలు ఎప్పుడో పొయ్యిల బూడిదల గుచ్చిన. అగ్గి లేదన్నందుకు.. కోపానికత్తండు” అన్నది పోశమ్మ, విషయాన్ని మారుస్తూ. “ఆన్నిటు రమ్మను. నా తాన దూదీ, జెకమొక ఉంది. అగ్గి గొట్టిత్త రమ్మను” అన్నది ముసలమ్మ. “పో! పిలుత్తంది ముసల్ది.. పాము సెవులు దానియి.. అన్నింటది!” అన్నది ముసిముసిగా నవ్వి.. “నీయవ్వ! నిన్ను పరాశికానికన్నా గూడా.. కాకిలెక్క కావుకావుమని లొల్లి వెడితివి గదనే!” మంద్ర స్వరంతో అని, ముసలవ్వనుద్దేశిస్తూ.. “అత్తా! సుట్టకు మోతుకాకు దొరుకుతలేదే. ఇప్పుడద్దు తియ్యి!” అంటూ ముగించాడు. “నాతాన గూడా లేదురా! ఏమన్న ముత్తెమంత పొగాకున్నాది కొడుకా?”.. అసలు సంగతి బయటపెట్టింది ముసలమ్మ. “ఆఁ ఇత్త ఉండు” అంటూ లేచి వెళ్లాడు శివలింగం. ఊళ్లో సందడి సద్దుమణిగింది. జానపదులు నిద్రలోకి జోగారు.
* * *
కాలం కలిసిరాలేదు. వానలు కురవలేదు. ఆయిటి పూనలేదు. బాయిలల్లా, చెరువులల్లా నీళ్లు లేవు. ఊరంతా పాడుబడే స్థితికి చేరుకుంది. పంటలు పండలేదు. పశువులకు మేతలేదు. ఉన్న కోళ్లూ, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లూ.. అమ్ముడు పోతున్నయ్. పొలాలు దున్నే ఎద్దుల పక్కబొక్కలు తేలుతున్నయి. ఆవులు, బర్రెల పొదుగులు ఎండిపోయినయ్. జనాలు ఓపూట తినీతినక ఉపాసముంటూ.. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అలమటించ సాగారు. ఊళ్లోని పెద్ద ఆసాములూ, దొరలూ, పటేండ్లూ హాయిగా కాకపోయినా.. పెద్ద పట్నాలల్లకు పోయి ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు కొనుకొచ్చుకొని కాలం వెల్లదీస్తున్నరు. గరిటెడు గంజి దొరకని పేదజనం ప్రాణాలు ఎట్లా గాల్లో ఎగిరిపోతున్నాయో.. ఊరు మీద పడి దాడి చేస్తున్న పులులకూ, జిట్ట పులులకూ, శివంగులకూ, గుడ్డెలుగులకూ, తోడేళ్లకూ, కోండ్రిగాళ్లకే బాగా తెల్సిపోతున్నది. శవాలమీద పడి పండగ చేసుకోడానికి కాకులు, గద్దలూ, పీతిరికాకులు, పసుపు ముక్కు తెల్ల గద్దలూ, పక్షులు లేవు. ఊర పిచ్చుకలు ఎప్పుడో మాయమైపోయినయి.
పోశమ్మ పెంచుకున్న కోళ్లను అమ్మేసుకున్నది. నాల్గు పైసలు పిర్సిట్ల కట్టుకొని మూట ముల్లే కట్టుకున్నది. ఉన్న ఇల్లు గడప ముందటకొచ్చి.. సాష్టాంగపడి మొక్కింది. తన భర్తతో, కొడుకుతో, కూతురుతో మొక్కించింది. మూటలు ఎత్తి శివలింగం నెత్తిమీద ఒకటి పెట్టి, తనూ ఒకటి నెత్తిమీద పెట్టుకున్నది. కొడుకును శివలింగం నడుముకు ఎక్కించి, రెండేళ్ల బిడ్డను తన నడుముకు ఎత్తుకొని.. గుడిసె తలుపు మూసి, గడపదాటి వాకిలికున్న పనుగడి పెట్టి.. తొవ్వ మీదికొచ్చింది. తొవ్వమీద నిలవడి గుడిసె దిక్కు తదేకంగా చూసుకుంటా కన్నీరు పెట్టుకొంటున్న భర్తతోపాటూ తనూ కన్నీరు కారుస్తూ.. భర్త చెయ్యి పట్టుకొని ముందుకు సాగింది.
“అవ్వా! మనం యాడికి బోతున్నమే?!” అంటూ కొడుకు అమాయకంగా అడుగుతూ ఉంటే.. “పట్నం బోతున్నం కొడుకా! అక్కడ నీకు మంచి బువ్వ, అంగీలు ఇత్త బిడ్డా! సెల్లే, నువ్వు మంచిగ సదువు కొని దొరలైతరు” అన్నది అనునయంగా గద్గద స్వరంతో.. ఉట్టిపడే, కరుడుగట్టిన వాత్సల్యంతో.శివలింగం భార్యవంక అదోమాదిరిగా చూశాడు. పోశమ్మ కళ్లల్లో వలస కలల అచంచల విశ్వాసం తొణికిసలాడుతున్నది. శివలింగం ఆకాశం వంక చూశాడు.. ‘భగవంతుడా! అంతా నీదే భారం!’ అన్నట్లుగా.
మనసు స్పందించినప్పుడే కలం పట్టినా.. పాఠకుల హృదయాలను కదిలించే కథలు రాస్తున్నారు ఎ.డి.ప్రభాకర రావు. సిరిసిల్లా జిల్లా చందుర్తి గ్రామం వీరి స్వస్థలం. తల్లి శాంతమ్మ ప్రోత్సాహంతో చిన్నతనంలోనే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్నారు. తండ్రి ధర్మయ్య ఉద్యోగరీత్యా బాల్యం అనేక గ్రామాల్లో గడిచింది. అప్పటినుంచే గ్రామీణ జీవన విధానాలు, సంస్కృతి, మాండలికాన్ని గమనిస్తూ ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (మెకాన్ లిమిటెడ్)లో జనరల్ మేనేజర్‌గా పనిచేసి, విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే కవితలు, వ్యాసాలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1975లో ‘రంగీ – రంగడు’ నవల రాశారు. బలియాగం, దిష్టిబొమ్మ, రెజాలు కథలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ముంబైకి ఎక్కువగా వలస వెళ్లే తమ గ్రామ యువతను ప్రేరణగా తీసుకొనే ‘వలస కలలు’ కథ రాశానని చెబుతున్నారు రచయిత.
-అత్రిపత్రి ధర్మశాంత్ ప్రభాకర రావు
9491875179