చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : ఎవరికీ తెలియకుండా అనుమకొండకు వచ్చిన జాయప.. కొన్నిరోజులు మల్యాల చౌండ మహా ప్రాసాదంలో ఉన్నాడు. ఆ తర్వాత మావటి సుబుద్ధి ఇంటికి చేరాడు. నాగంభట్టు దగ్గర విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. సుబుద్ధితో కలిసి యుద్ధ శిక్షణశాలకు వెళ్తూ.. ఒక్కోరోజు ఒక్కో యుద్ధకాండ నేర్చుకుంటున్నాడు.
ఒకరోజు నాగంభట్టు తండ్రి శివభట్టు నిర్వహిస్తున్న ఘటికా స్థానానికి వెళ్లాడు జాయప. భరతఖండంలో విద్యా వ్యవస్థ గురించి జాయపకు వివరిస్తున్నాడు నాగంభట్టు.
“జైనులు విద్యా వ్యవస్థను మరింత పరిపుష్టం చేశారు. ముఖ్యంగా బాలల శిక్షణకు వారు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ప్రతి జినాలయం, జైనబసది ఓ చిన్నారుల పాఠశాలగా ప్రకటించి.. సర్వవర్ణాలకూ విద్యనందించారు. తర్వాత వచ్చిన రాజవంశాలు విద్యకు చేసింది తక్కువ కాకపోయినా.. విద్యా వ్యవస్థను మతంతో ముడి
పెట్టారు. బుద్ధుడికి ముందున్న కులీన వైదిక విద్యా వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చారు. చదువును కొందరికే పరిమితం చేశారు. రాయడం తగ్గించి.. విద్యను కేవలం శ్రుతపేయం చేశారు. దాంతో లిపి పరిణామం ఆగిపోయింది. లిపి కొనసాగి ఉంటే..
ఇప్పటికీ ఆసేతు హిమాచల పర్యంతం ఒకే లిపి, ఒకే భాష ఉండేవి. తద్వారా ఆసేతు హిమాచల పర్యంతం ఏకైక భారతీయ సామ్రాజ్యం ఏర్పడే అవకాశం ఉండేది. కానీ, రానురానూ ప్రాంతీయ భాషలు స్థిరమవుతున్నాయి. దాంతో ప్రాంతీయ భావాలు, అలాగే ప్రాంత విద్వేషాలూ పెరుగుతాయి. ఈ చిన్నచిన్న రాజ్యాలు మరిన్ని పెరిగి.. వాటి మధ్య యుద్ధాలు, పోరాటాలు మొదలవుతాయి. ఫలితంగా భరతఖండమంతటా ఏకైక భారతీయ సామ్రాజ్యం ఏర్పడే అవకాశం ఉండదు. తద్వారా విదేశీశక్తులు భరతరాజ్యం ఏర్పడకుండా కుక్కలు చింపిన విస్తరిచేసి, ఇక్కడి సంపదను దోచుకుపోతాయి. మనపై పెత్తనం చేస్తాయి. అందరికీ విద్య లేకుండా చేయడం వల్లనే ఈ దుష్కర్మ. ఈ వెయ్యేళ్లలో ఏవేవో చిన్నచిన్న ఘటికా స్థానాలు తప్ప.. ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క విశ్వవిద్యాలయం కూడా మన దక్షిణాపథంలో రాలేదుకదా”..
శివభట్టు చెబుతుండగా రామేశభట్టు కల్పించుకుని..
“ఆర్యావర్తంలో తురుష్కులు మన విశ్వవిద్యాలయాలను పూర్తిగా నేలమట్టం చేసి గ్రంథాలను తగలబెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి” అన్నాడు.
“ఆ వార్తలే ఆందోళన కలిగిస్తున్నాయి. త్వరలో నలందా ప్రయాణం పెట్టుకున్నాను. అయినా దక్షిణా
పథానికి రావడానికి ఆ ముష్కరులకు గుండె ధైర్యం తక్కువ” అన్నాడు శివభట్టు.
సంప్రదాయ ఉపాధ్యాయులు చతుర్దశ విద్యలు.. అంటే నాలుగు వేదాలు (ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు); శిక్షా, వ్యాకరణ, కల్ప, నిరుక్త, జ్యోతిశ్శాస్త్రం, ఛందశ్శాస్త్రం అనే ఆరు వేదాంగాలు; మీమాంస, న్యాయం అనే దర్శనాలు; పురాణాలు,
ధర్మశాస్ర్తాలు.. మొత్తం 14 విద్యలు, ఉపవేదాలైన ఆయుర్వేద, గాంధర్వ వేద, ధనుర్వేద విద్యలు తమవద్ద ఉంచుకుని.. స్థాపత్యాలు (సాంకేతిక విద్యలు) ఇతరులకు విడిచిపెట్టారు.
నిపుణులైన వృత్తికుల వృద్ధులు తమ పిల్లలకు తమ కర్మశాలల్లో వృత్తిని నేర్పుకొంటారు. కానీ, వారి పిల్లలకు ప్రాథమిక విద్య అందడం లేదు. అలాగే చతుర్ధ కులజులైన రైతులు, వారి పిల్లలకు విద్యపట్ల అంత ఆసక్తిగా లేకపోవడంవల్ల సమాజం మొత్తంగా చాలా నష్టపోతున్నది.
ఇది గుర్తించినవాడు శివభట్టు. చతుర్ధ కులాల పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు.. ఆయా కులస్థులకే ఉపాధ్యాయులుగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఇది ఉపాధ్యాయ వృత్తి వర్గాల కోపానికి కారణమైంది. వారు దీనిని రాజాస్థానం వరకూ తీసుకుపోయారు. శివభట్టు భయపడలేదు. ఆయన ఆశయానికి గ్రామ సమయాలు (సంఘాలు) సహకారం అందించాయి.
భారతీయ సామాజిక ఆవిష్కరణలో అత్యుత్తమమైన అంశం గ్రామాల స్వయం పోషిత, స్వయం పరిపాలనా విధానం. ఇతర ఖండాలు, దేశాలు కన్నుతెరవకముందే.. భారతీయ గ్రామాలు అత్యుత్తమ నాగరికతను అలవరుచుకున్నాయి. తమ గ్రామ పరిపాలనలో భాగంగా గ్రామంలో సేవలు అందిస్తున్న చాకలి, మంగలి, శాలి, తెలగ తదితర అష్టాదశ కులవృత్తిదారులు ఏర్పరచుకున్న సంస్థలే ఈ సమయాలు. ప్రతి వృత్తి కులానికీ ప్రతి గ్రామంలో ఒక కులపెద్ద ఉంటాడు. ఇతనే శ్రేష్ఠి లేదా శెట్టి. ఈ శెట్టిలందరూ కలిసి మళ్లీ గ్రామ సమయశెట్టిని ఎన్నుకుంటారు. బ్రాహ్మణుల సమయాన్ని మహాజనులు అంటారు. సమయశెట్టి ఆధ్వర్యంలో అన్నివృత్తుల శెట్టిలు సభ్యులుగా ప్రతి గ్రామంలో గ్రామ సమయం ఏర్పాటు చేసుకుంటారు. విశేషం ఏమిటంటే.. వేదకాలం నాటికే ఈ సమయాలు, శ్రేణులు భారత రాజ్యాలన్నిటా ఉన్నాయి. సమయం అంటే ప్రాచీన భాషలో ఒప్పందం. అంటే గ్రామస్థులందరూ ఒకే మాటకు కట్టుబడటం. గ్రామ పరిపాలన అంతా వీరి చేతుల్లోనే ఉంటుంది.
శివభట్టు ఈ సమయాల శెట్టిలను కలిసి వృత్తి కులాల వారందరికీ కనీసపు విద్య ఉండాలనీ, అలాగే వాళ్ల కులాల్లోనే ఉపాధ్యాయులు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి వివరించసాగాడు. ఆయన అభిప్రాయంతో శెట్టిలు ఏకీ
భవించి, తమ కులాలలో ఆసక్తి ఉన్నవారిని ఎంపికచేసి.. శివభట్టు ఘటికా స్థానానికి పంపుతున్నారు.
“ఇక్కడ నువ్వు చూస్తున్నది ఈ వృత్తికుల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని”..
జాయపవైపు చూస్తూ అన్నాడు నాగంభట్టు.
“అదుగో అతను గుండప. మంగలి వృత్తిదారుడు. ఈ శిక్షణ పూర్తయ్యాక వారి కుల బాలలకు ప్రాథమిక విద్య నేర్పగలడు. ఇతను సిరికేతుడు, శాలి కులస్థుడు. వీరి తండ్రిగారు బందరులో మంచి వస్త్ర తయారీదారులు. తయారీలో నైపుణ్యం ఉంది కానీ, నిరక్షరకుక్షులు. రేపు వృత్తివిద్యతోపాటు ప్రాథమిక విద్య కూడా తెలిస్తే.. వారు మరింత నాణ్యమైన బట్టను తయారుచేయగలరు కదా! దానికి దేశవిదేశాలలో మరింత ధర పలుకుతుంది. వారు లాభపడతారు. పన్నులు బాగా చెల్లించగలరు. అలా మన ఆర్థికవ్యవస్థ మొత్తం పటిష్ఠమవుతుంది కదా!”
నాగంభట్టు మాటలకు పూర్తిగా ఏకీభవించాడు జాయప.
“మరి చక్రవర్తుల అభిప్రాయం ఏవిటి?”.. అన్నాడు రాజబిడ్డ జాయప.
“ఏమో! వారి దగ్గరికి మనల్ని రానివ్వరు. ‘మనకు ఈ సమయాల వారే ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అది చాలు’ అంటారు తండ్రిగారు” చెప్పాడు నాగంభట్టు.
“మరి ఈ సంగతి రాజాస్థానం వారికి తెలిస్తే?!”.
“సరిగ్గానే అడిగావ్. రాజు ఉన్నా లేకున్నా సమయాలవారి కార్యకలాపాలు ఆగవు. ఎందుకంటే ఇవి ప్రజలకు నిత్యం సమయానికి అవసరమైన వస్తువులు, సేవలు అందించే వ్యవస్థలు కదా!”.
ఈ సమాధానం అంతగా నచ్చలేదు జాయపకు.
“ఏది ఏమైనా రాజానుగ్రహం లేకుండా మన ఘటికా స్థానం నిలబడలేదు. అందుకు ప్రయత్నం చెయ్యాల్సిందే!”.
ఈ వాక్యం నచ్చింది జాయపకు.
ఒకసారి సుబుద్ధి వల్ల ఈ సమయాల శెట్టిలతో మాట్లాడే అవకాశం వచ్చింది జాయపకు. యుద్ధ శిక్షణ సంస్థ వద్ద సుబుద్ధి మరో పెద్దమనిషిని పరిచయం చేశాడు. ఆయన ఒక సమయం శెట్టి. పేరు వల్లయ. ప్రధానంగా బలింజ కులస్థుల శెట్టి. గొప్ప విలుకాడు. ధనుర్విద్యలో మేటి. ఆరడుగులపైగా ఉన్న ఆయన శరీరం.. పోతపోసిన ఉక్కుముక్కలా ఉంది. నడుముకు కాసెపోసి పంచెకట్టి, దానిని తొడలవరకూ పైకి మడిచాడు. పెద్ద జడలా ఉన్న జుట్టును మడిచి కొప్పుకట్టాడు. నుదుటిపై విబూది అడ్డగీతలు.. ఆచ్ఛాదన లేని ఛాతీపై కత్తిగాట్లు.. పెద్దపెద్ద మహావృక్షాలను.. కొమ్మలు విరిచినట్లుగా పెళ్లగించగలడీయన.
‘పెద్ద సేనాపతి. లేదా దండనాయకుడు అయ్యుంటాడు!’ అనుకున్నాడు జాయప.
సుబుద్ధి కలిసినప్పుడు కబుర్లు చెబుతూ బాణం
వేయడం అభ్యాసం చేస్తున్నాడు. ఆయన అమ్ముల పొదిలోంచి బాణాన్ని తీయడం.. ఆ వేగం.. ఆ ఒడుపు.. చాలా గమ్మత్తుగా ఉంది. అది చూసి అబ్బురపడ్డాడు జాయప. బాణం అందరూ వేస్తారు. కానీ, బాణం తీయడం అనే క్రియను ఆయన అభ్యాసం చేయడం జాయపను బాగా ఆకర్షించింది. ఆయన బాణం వేశాక ఉత్సాహంగా చప్పట్లు చరిచాడు.
గమనించిన ఆయన.. సుబుద్ధిని అడిగాడు.
“ఎవరీ కుర్రవాడు? యుద్ధ శిక్షణశాలకు తీసు
కొచ్చావ్.. ఎందుకు సుబుద్ధీ?”.
“ఈ అబ్బాయి మా బంధువు శెట్టీ. యుద్ధవిద్యల్లో ఆసక్తి ఉన్నవాడు. చూస్తానంటే?!”.. అన్నాడు సుబుద్ధి.
“మనవాళ్లంతా అభ్యాసం చేస్తున్నారా? త్వరలో
దక్షిణాదికి బెజ్జవాడ వరకూ బిడారు వెళ్లాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. భైరయకు చెప్పు.. నేను చెప్పానని. సరుకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని నేను
అడిగానని కూడా చెప్పు”.. అన్నాడాయన.
‘సరే శెట్టీ!’.. ‘అలాగే శెట్టీ!’.. ‘తప్పకుండా శెట్టీ!’.. ఇలా చేతులు కట్టుకుని, ఆయన పట్ల చాలా గౌరవంగా, వినయంగా వంగి మాట్లాడటం జాయప గ్రహించాడు. అదే అడిగాడు.. తిరిగి ఇంటికి వెళుతున్నవేళ,
“మామయ గారూ.. వారు పెద్ద యుద్ధవీరులుగా ఉన్నారు. సేనాపతా లేక దండనాయకులా?”.
“ఆయన వారందరికన్నా ముఖ్యులు. మన గ్రామ సమయానికి శ్రేష్ఠి.. అంటే శెట్టి. ఆయన మాటంటే మాటే!. గ్రామంలోని అష్టాదశ కులాలకు ఆయన మాట వేదవాక్కు. ఆయన బలింజ సమయానికి కూడా శెట్టి” చెప్పాడు సుబుద్ధి.
నాగంభట్టు చెప్పిన సమయాలు, వృత్తులవారికి శిక్షణ కార్యక్రమం గుర్తొచ్చింది.
‘శివభట్టు శిక్షణాలయానికి ఆర్థిక సహకారం అందిస్తున్నది ఇలాంటి శెట్టిలే కాబోలు. ఈయన అంత పెద్దవాడైతే మరి ఈ యుద్ధవిద్యల శిక్షణ అభ్యాసం ఎందుకో!?’.. నవ్వొచ్చింది జాయపకు.
‘నాలాగే యుద్ధవిద్యలంటే ఇష్టం కాబోలు’ అనుకున్నాడు. అదే అడిగాడు.
ఇతర ఖండాలు, దేశాలు కన్నుతెరవకముందే.. భారతీయ గ్రామాలు అత్యుత్తమ నాగరికతను అలవరుచుకున్నాయి. తమ గ్రామ పరిపాలనలో భాగంగా గ్రామంలో సేవలు అందిస్తున్న చాకలి, మంగలి, శాలి, తెలగ తదితర అష్టాదశ కులవృత్తిదారులు ఏర్పరచుకున్న సంస్థలే ఈ సమయాలు.
దానికి సుబుద్ధి నవ్వి..
“ఆయన వీరబలింజ వర్తకులు. దాదాపు యాభై రకాల వస్తువులతో ఉత్పత్తి, క్రయ విక్రయాలు జరుపుతారు. ఆయన బిడారులో వందమంది బలింజ వర్తకులు ఉంటారు. ఒక్కసారి బిడారు కదిలింది.. అంటే దాదాపు పాతికవేల రూకల విలువైన వ్యాపారం నిర్వహిస్తారు. అయ్యావళి ఐనూరు, నానాదేశి పెక్కండ్రు లాంటి వ్యాపార సంస్థల్లో ఆయన ముఖ్యశెట్టి. భారత భూభాగంలో మొత్తం ఛప్పన్న దేశాలు ఉన్నాయి. వీటన్నిట్లో శెట్టి సమయాలు ఉన్నాయి. వీటన్నిటికి ప్రధానశెట్టిని పృథ్వీశెట్టి అంటారు. ప్రతి ఏడాది అన్ని రాజ్యాల శెట్టిలతో మహానాడు.. అంటే వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ ఏడాది జరగబోయే మహానాడులో మన వల్లయశెట్టి తప్పకుండా పృథ్వీశెట్టి అవుతాడని వార్తలు వస్తున్నాయి. మన చక్రవర్తి కూడా వల్లయశెట్టిని తప్పకుండా పృథ్వీశెట్టిని చెయ్యాలని పట్టుదలగా ఉన్నారని వార్తలు వింటున్నాను” అని చెప్పాడు.
సుబుద్ధి చెప్పినదాంట్లో జాయపకు అర్థం అయ్యిందేమిటంటే.. ఈ వల్లయశెట్టి సాధారణ ప్రజల్లో గొప్ప పలుకుబడి ఉన్నవాడని! అయితే.. రానున్న రోజుల్లో ఈ వల్లయశెట్టి తనకు మహోపకారం చేయబోతున్నాడని అప్పటికి జాయపకు తెలియదు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284