‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
బ్రహ్మీ ముహూర్తం.. అలారం మోగడంతో బద్ధకం వదిలించుకుంటూ నెమ్మదిగా లేచి కూచున్నాను. మహానగరంలో ఉరుకులు పరుగుల జీవితాలు.. ఇంత పొద్దున్నే లేచినా, ఆఫీసుకి బయలుదేరే సమయానికి..
‘మీవల్లే లేట్ అయింది..’ అంటే.. ‘నీకే టైమ్‌సెన్స్ ఉండదు’ అంటూ.. నేనూ రేవతి అరుచుకోవడం కూడా అలవాటుగా జరిగేదే.
సుప్రభాతం వింటూ అరచేతులు రుద్దుకున్నాను. ఆవలిస్తూ మంచం దిగబోతుంటే..
“గేటు తాళంతీసి నీళ్లు పెట్టండి. గుమ్మంలో ముగ్గేస్తాను”.. దుప్పటి ముసుగు తీయకుండానే చెప్పింది సతీమణి. కళ్లు నులుముకుని బెడ్రూంలోంచి హాల్లోకి వచ్చి.. పూజామందిరంలో దేవుడికో నమస్కారం చేసి నిత్యకృత్యాలలో పడ్డాను. ఇద్దరి మొబైల్ ఫోన్లు చార్జింగ్ కోసం పెట్టడంతో రోజు మొదలైనట్టే. ఊపిరి తీయడం క్షణం ఆలస్యమైనా ఫర్వాలేదు, చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఊపిరి ఆగిపోయినట్టే.
రోజంతా ఎంత హడావుడిగా గడిచిపోయినా, పొద్దున మాత్రం మా రెండో అంతస్తు బాల్కనీలో ఎదురెదురు కూచుని నేనూ, రేవతి టీ తాగుతాం. అయితే ఒక చేతిలో టీ గ్లాస్, రెండో చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటాయి. రాత్రి ఆలస్యంగా వచ్చిన వాట్సాప్ సందేశాలు, మెయిల్, మిస్డ్కాల్స్ అన్నీ చకచకా చూసేసి కొన్నిటికి సమాధానాలు ఇస్తూ, కొన్ని వదిలేస్తూ, ఇంటి వ్యవహారాలు మాట్లాడుకోవడం కూడా జరిగిపోతాయి. ఇదంతా పూర్తిచేసి లేవబోతుంటే నా మొబైల్ మోగింది. ఆ రోజు తనకి ఆన్లైన్లో జాతీయస్థాయి సమావేశం ఉందట. రోజూ కన్నా త్వరగా బయలుదేరాలని చెప్పి కాల్ త్వరగా పూర్తి చేయమని సైగలు చేసి.. రేవతి లోపలికి వెళ్లిపోయింది. తనకి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.
ఆ కాస్తలోనే రెండు మిస్డ్కాల్స్. ఒక వాట్సాప్ కాల్.. న్యూజెర్సీ నుండి మోహన్ చేశాడు. ఇంటర్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం. తను ఇంజినీరింగ్ చేశాడు. ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. నాకు ర్యాంక్ సరిగారాక డిగ్రీ పూర్తిచేసి.. అతి కష్టమ్మీద ప్రభుత్వ ఉద్యోగంలో చేరగలిగాను. ఎప్పుడు ఇండియా వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా.. మొబైల్లో తప్పనిసరిగా పలకరించేవాడు. సమయం చూస్తే ఆరు అవుతోంది. అంటే నిన్న రాత్రి ఎనిమిదిన్నర అక్కడ. ఆలోచనల్లో ఉండగానే మళ్లీ ఫోన్ మోగింది.
“సారీ సూర్యా! పొద్దునే ఇబ్బంది పెడుతున్నాను” అవతల మోహన్ గొంతులో ఆందోళన.
“ఏమైందిరా”
“అమ్మకి సీరియస్‌గా ఉందిరా.. గంట క్రితమే నాన్న ఫోన్‌చేశారు. మెట్రోసిటి హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. క్రిటికల్ అని చెప్పారు. వీలైనంత త్వరగా బయలుదేరే ప్రయత్నం చేస్తున్నాను. మలేషియాలో ఉన్న మా చెల్లెలు సుధ రేపు బయలుదేరుతోంది. అక్కడ నాన్నగారు ఒక్కరే ఉన్నారు. నీకు ఏమాత్రం వీలున్నా”.. ఆగాడు మోహన్. ఈ మధ్యకాలంలో తన మాట కాదనలేక వాళ్ల అమ్మానాన్నల అనారోగ్య కారణాల కోసం.. దాదాపు అయిదారుసార్లు సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది.
“సర్లే రా! వెళ్తాను” నా ప్రమేయం లేకుండానే జవాబు చెప్పాను. తనొచ్చేలోగా ఖర్చుల కోసం ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిస్తానన్నాడు. క్షణాల్లో పెద్దమొత్తం నా బ్యాంక్ అకౌంట్లోకి చేరినట్టుగా మొబైల్లో సందేశం కూడా వచ్చింది.
“ఎవరు? ఆ ఆన్లైన్ మోహనేనా? ఇంత పొద్దునే ఫోన్‌చేస్తే ఆయనే అనుకున్నాను.. వాళ్లకి పడకేసే టైమ్, మనకి పరిగెత్తే టైమ్! మన హడావుడి తెలిసికూడా మీరు చెప్పరు. ఆయన అనుకోడు. ఈసారి.. ఎవరికి బాగోలేదట? అలాంటప్పుడేగా మీరు గుర్తొస్తారు.. మళ్లీ సెలవు పెడుతున్నారా?” కిచెన్‌లోంచే రేవతి అరిచింది.
“ఆంటీకి.. అస్సలు బాగోలేదు. వెంటిలేటర్ పెట్టారట! మోహన్ బయలుదేరుతున్నాడు. రేపు వాళ్ల చెల్లెలు వస్తోంది.. అంకుల్ ఒక్కరే ఉన్నారు. ఆన్లైన్లో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు..” విషయమంతా నెమ్మదిగా చెప్పాను.
“ఇదంతా సరే.. ఎప్పుడూ మీకే చేస్తాడాయన. చుట్టాలు, స్నేహితులు ఇంకెవరు లేరా!?” రేవతిలో అసహనం.
మోహన్ వ్యక్తిగత వివరాలు అంతగా తెలియవు నాకు. గతంలో ఇలాంటి అవసరాలలో వాళ్లింటికో, ఆసుపత్రికో ఎన్నిసార్లు వెళ్లినా.. మరో మనిషి తారసపడలేదు. అమెరికాలో ఉద్యోగం దొరికాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు మోహన్. మొబైల్లో శుభలేఖ పంపించాడు. పెళ్లి చూడటం కోసం ‘ఆన్లైన్ లింకు’ పంపించాడు. ల్యాప్‌టాప్‌లో మోహన్ పెళ్లి చూసి.. స్క్రీన్ మీదే అక్షింతలు వేశాం నేనూ, రేవతి. అప్పుడప్పుడూ ఆన్లైన్లోనే పలకరిస్తుంటాడు.
ఇంట్లోంచి త్వరగానే బయల్దేరాం. బైక్ మీద వెళ్తున్నంతసేపూ.. రేవతి చికాకు పడుతోనే ఉంది. మా అవసరాల కోసం ఆదివారాలు, పర్మిషన్లు వాడుకోవడమే తప్ప.. ఇలా ప్రత్యేకంగా సెలవులు పెట్టడం తక్కువ. ఎవరూ చూసేవాళ్లు లేక, పిల్లల చిన్నతనాలలో ఇద్దరం విపరీతంగా సెలవులు వాడేశాం. చాలా సందర్భాలలో జీతాల్లో నష్టంకూడా భరించాల్సి వచ్చింది. ఎప్పుడో రిటైర్ అయ్యాక వచ్చేడబ్బుల కన్నా.. ఇప్పుడు కళ్లముందున్న అవసరాలు చాలా ముఖ్యం అనుకుని బాధపడలేదు. అయితే ఈమధ్య మోహన్ కోసం చాలా సెలవులు పెడుతున్నాను. ఆలోచనల్లో ఉండగానే రేవతిని ఆఫీసు దగ్గర దిగబెట్టాను.
“బైట నుండి వచ్చీరాగానే ఆ గుడ్డలతో ఇల్లంతా తిరిగేయకండి. మెట్లకింద స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్లండి. సాయంత్రం ఏదో తంటాలు పడి నేనే వచ్చేస్తాను” హెచ్చరికలు చేసి ఆఫీసులోకి వెళ్లిపోయింది రేవతి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి పరిగెత్తాను. దార్లో ఉండగానే మోహన్ మళ్లీ ఫోన్ చేశాడు. వీలైతే తన తల్లిని వీడియో కాల్లో చూపించమన్నాడు. ఐసీయూ ముందు వరండాలో దిగాలుగా కూర్చుని ఉన్నారు మోహన్ తండ్రి సుందర్రావుగారు.
“అంకుల్..” అంటూ ఆయన భుజమ్మీద చెయ్యేశాను.
“సూర్యం.. క్షమించు బాబు! నేనే సాయం కోసం రమ్మన్నాను..” నా రెండు చేతులూ పట్టుకున్నారాయన.
“పెద్దవారు.. మీరు ఆ మాటనకండి. మోహన్ ఎంతో, నేనూ అంతే” అంటూ ఆయన పక్కనే కూర్చున్నాను.
“ఆ చనువుతోనే ప్రతీసారీ నా కోసమో, నా భార్య లక్ష్మి కోసమో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. బాబూ సూర్యం.. ఇంతక్రితమే డాక్టర్‌గారు చూసి వెళ్లారు. ముఖ్యమైన వాళ్లని పిల్చుకోమని చెప్పారు. కనీసం పిల్లలకైనా కడసారి చూపు దక్కుతుందో లేదో? ఈసారి లక్ష్మి నాకు అన్యాయం చేసేట్టుగా ఉంది.. బాబు..” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మనిషి మొత్తంగా వణికిపోతున్నారు. ఆయన్ని ఓదార్చడానికి నాకు శక్తి చాలటం లేదు.
“లక్ష్మిగారి అటెండర్ రావాలండి..” ఐసీయూ ముందున్న సెక్యూరిటీ అరిచాడు. ఒక్కసారిగా సుందర్రావుగారు కంపించిపోయారు. కూర్చున్నచోటు నుంచి లేవలేకపోతున్నారు.
“సూర్యం.. నాకు ధైర్యంలేదు! ఒక్కసారి నువ్వు..” అంటూ ఆగిపోయారు. నేను తడబడుతూ భయంగానే వెళ్లాను. అచేతనంగా పడి ఉన్నారు ఆంటీ. చాలారోజుల క్రితం సుందర్రావుగారికి బాగోలేనప్పుడు ఆవిడకి సాయంగా ఉన్నాను. అదే పరిచయం.
“మీరు..” డాక్టర్ అడిగారు.
“నా పేరు సూర్యం.. ఆవిడ మా ఆంటీ..” ఆవిడనే చూస్తున్నాను.
“వీళ్లబ్బాయి మోహన్ చాలాసేపు మాట్లాడాడు నాతో” అంటూ వైద్య పరిభాషలో మిగతా విషయాలు చెప్పాడు డాక్టర్.
“మాలోపం లేకుండా అన్ని విధాలా ప్రయత్నించాం.. మీ అంకుల్‌కి చెప్పండి. వెంటిలేటర్ విషయంలో ఆయన ఎలా చెబితే అలా..” చెప్పడం పూర్తయినట్టు వెళ్లిపోయాడు డాక్టర్. ఈ విషయం పెద్దాయనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. యాంత్రిక శ్వాస ద్వారా, నిశ్చలంగా ఉన్న ఆంటీని చూస్తున్నాను. మరికొన్ని ఘడియలలో జీవన చరమాంకపు ఘట్టంలోకి శాశ్వతంగా చేరబోతున్నారు. కోరికలు, కలలు, ఆశలు, ఆశయాలు, కష్టాలు, ఇష్టాలు, తీరినవి, విఫలమైనవి, అనుభవాలు, ఆవేదనలు.. ఇలా ఎంతో జీవితాన్ని చూసిన ఆవిడని అలా చూస్తుంటే.. ఎందుకో ఒళ్లు జలదరించింది. చిత్రమైన అనుభవం.. అసలు నేనెవరు? ఆవిడెవరు? ఈ సమయంలో ఇక్కడ నేనుండటం నిజంగా అనూహ్యం. కేవలం మోహన్ అర్థించడం వల్ల నేనిక్కడ ఉన్నాను అంటే.. నమ్మశక్యం కావడం లేదు. అంతకుమించిన మరేదో బంధం.. వీడియో కాల్లో ఆంటీని చూపించమన్న మోహన్ మాటలు గుర్తొచ్చినా.. మనస్కరించక బైటికి నడిచాను.
అతికష్టం మీద అంకుల్‌కి నచ్చచెప్పడం, మోహన్‌తో మాట్లాడటం, వాడు తన చెల్లెలితో మాట్లాడటం, హాస్పిటల్ వ్యవహారాలు త్వరగా పూర్తిచేసి.. లక్ష్మి ఆంటీ మృతదేహంతో రాత్రి పది గంటల సమయంలో ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర్లో ఉన్న వాళ్ల విల్లాకి చేరుకున్నాం. అప్పటికే రేవతి పదిపన్నెండు సార్లు ఫోన్ చేసింది. జరిగింది క్లుప్తంగా చెప్పి, మరో గంటలో ఇంటికి చేరతానని చెప్పాను. పొద్దుటినుంచి తిండీ నీళ్లు లేకపోవడం, హాస్పిటల్ వాతావరణం, ఫోన్ల ద్వారా నిర్ణయాలు, క్షణం తీరిక లేకుండా ఇతర ఏర్పాట్లు చూడటంతో కళ్లు తిరుగుతున్నట్టుగా ఉంది. పనివాళ్ల సాయంతో హాల్లోకి ఫ్రీజర్ బాక్స్ చేరింది. నిర్జీవమైన ఆంటీముఖాన్ని చూడటానికి ధైర్యం లేదు. సుందర్రావుగారు నిస్తేజంగా ఉన్నారు.
“అంకుల్.. ఎవరికైనా చెప్పాలంటే ఫోన్ చేస్తాను..” ఎలాగో గొంతు పెగుల్చుకున్నాను.
“లక్ష్మిని ఇంటికి తెచ్చేశాం! ఇంకేం కంగారు లేదు. పనివాళ్లున్నారుగా.. అయినా ఇంక చేయడానికేముంది? శవంగా తనూ, జీవచ్ఛవంగా నేనూ.. పిల్లలొచ్చేవరకు ఎదురుచూడటమే! ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను.. ఇంకా ఉండమనడం భావ్యం కాదు” అంటూ చేతులు జోడించబోయారు. చప్పున ఆయన చేతులు పట్టుకున్నాను. తప్పనిసరై నిశ్శబ్దంగా బైటికి నడిచాను. ఇంటికెలా చేరానో, ఏం తిన్నానో, కలలో జరిగినట్టుగా అనిపించింది. మర్నాడు ఎనిమిదింటికి నిద్రలేచాను.
“ఇవాళ కూడా రానట్టేగా?” అసహనంగా చూసింది రేవతి..
“రాత్రి చాలా లేటైనట్టుంది..” తల భారంగా అనిపిస్తోంది.
“గూర్ఖావాడు, మీరు కలిసే వచ్చారు..” రేవతి మాటల్లో విసుగు, బాధ, భయం..
“ఎందుకీ అర్థంపర్థం లేని పనులు.. మీ స్నేహితుడేమో అక్కడ్నుంచి ఫోన్‌చేసి ఆర్డర్ వేయడం.. తగుదునమ్మా అని మీరు పరిగెత్తడం.. ఇంతాచేస్తే మీఫ్రెండ్ గానీ, వాళ్ల నాన్నగారు గానీ ఆస్తిలో వాటా ఇస్తారా? సంపాదన కోసం ఎగబడి పోతున్నారుగా.. కన్నవాళ్లు ఇక్కడ ఉన్నారో చచ్చేరో ఎవరికీ పట్టదు. డబ్బులు పంపిస్తే చాలా? నిలబడి చేసేవాళ్లు కావాలి? పిల్లల్ని పంపించి పెద్దవాళ్లు, ఈ పెద్దవాళ్లని వదిలేసి ఆ పిల్లలు ఏం బావుకుంటున్నారో తెలియడం లేదు. అమ్మ అన్నమాట నేర్పుతున్నారో లేదో తెలీదు గానీ.. అమెరికా, ఆస్ట్రేలియా అన్న మాటలు మాత్రం బాగా పలికిస్తున్నారు. అయినా మీరు సాయం చేస్తున్నారో, చాకిరీ చేస్తున్నారో తెలుసుకోలేని పిచ్చిలో ఉన్నారు. అంతా నా ఖర్మ!” రేవతి మాటలు ఆగడం లేదు. సరిగ్గా అప్పుడే మోహన్ దగ్గరనించి ఫోన్. చటుక్కున నా చేతిలో ఫోన్ లాక్కుని స్విచాఫ్ చేసింది. తన ఆవేదన తెలుసు. నచ్చచెప్పే ప్రయత్నం చేశాను.
“పెద్దాయన ఒక్కరే ఉన్నారు. కనీసం మోహన్ వచ్చేవరకు.. ప్లీజ్ రేవతీ! అర్థం చేసుకో! నిన్ను ఆఫీసు దగ్గర దిగబెట్టి..” నా మాటలు పూర్తికాకుండానే రేవతి అందుకుంది..
“అక్కర్లేదు.. నా చావు నేను చస్తా! మీరు శవజాగరణ చేసుకోండి”.. విసురుగా వెళ్లిపోయింది.
రెండు రోజుల తర్వాతగానీ మోహన్, సుధ రాలేకపోయారు. మోహన్ భార్య గర్భవతి, రాలేదు. సుధ, ఆమె భర్త వచ్చారు, పిల్లలు రాలేదు. సుందర్రావుగారి తరుపు బంధువులు పెద్దగా రాలేదు. చాలామంది విదేశాలలో ఉన్నారని ఇంటి పనివాళ్లు చెప్పారు. సిటీలో ఉన్నవాళ్లు కూడా ఎక్కువగా రావడం చూడలేదన్నారు. మొబైల్ ద్వారా మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు.
‘ఆన్లైన్’ సదుపాయంతో పెద్దగా హడావుడి లేకుండానే లక్ష్మి ఆంటీ అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడియో రికార్డింగ్ కూడా జరుగుతోంది. భుజమ్మీద చెయ్యేసే వాళ్లు లేరు. పక్కన కూచుని పలకరించే వాళ్లు లేరు. దగ్గరకి తీసుకుని ధైర్యం చెప్పేవారు లేరు. ఒకమాట ఇటు, ఒకమాట మొబైల్లో.. అక్కడున్న పదిమంది చేతుల్లో ఇరవై కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఫ్రీజర్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. మళ్లీ వస్తామో!? రామో!? అనిట! నిమిషానికో ఫోన్ మోగుతోంది. జీవంలేని మొబైల్.. ప్రాణంగా తయారైంది.
ప్రాణం పోయిన మనిషిని ఎప్పుడు తీసుకెళ్తారా!? అని అసహనంగా ఎదురుచూస్తున్నారు. ఏడవాలో, నవ్వాలో అర్థం కావడంలేదు. జరిగే తతంగమంతా ప్రత్యక్షప్రసారంలాగా రానివాళ్ల కోసం ఫోను ద్వారా చూపిస్తున్నారు ఇంకెవరో. పలకరింపులు, పరామర్శలు, ఓదార్పులు, నిట్టూర్పులు, ఏడవడాలు అన్నీ మొబైల్ ద్వారా జరిగిపోతున్నాయి. సుందర్రావుగారు నిర్లిప్తంగా ఉన్నారు.
“పిన్ని మొహం సరిగ్గా కనిపించడం లేదు.. కాస్త దగ్గరగా చూపించు..” ఎవరి ఫోన్లోంచో అవతలివైపు గొంతు స్పష్టంగా వినిపిస్తోంది.
“నా ఫోన్లో డాటా అయిపోయింది. ఒక్క నిమిషం.. రీచార్జి చేస్తున్నాను” ఇవతలి వారి సమాధానం.
“ఎందుకురా కంగారు! ఫోన్లో సరిగా కనిపించదనే వీడియో తీయిస్తున్నాడు మోహన్. ఆన్లైన్లో లింక్ పంపిస్తానన్నాడు. డాటా ఎందుకు దండగ” అన్నాడో మధ్య వయస్కుడు. మార్కెట్లో ఉన్న అధునాతన స్మార్ట్ఫోన్లు, ఇప్పుడున్న ‘జీ’ నుంచి.. భవిష్యత్తులో రాబోయే ‘జీ’ లు. ఉన్న చోటునుంచి కదలకుండా జీవితాలని సౌకర్యవంతం చేస్తున్న ఆన్లైన్ ఉపకరణాల గురించి చర్చ మొదలైంది. మోహన్ తన భార్యకి, సుధ తన పిల్లలకి మొబైల్ ద్వారా ఇక్కడి దృశ్యాలని చూపిస్తూ, రన్నింగ్ కామెంటరీ చెబుతున్నాడు. నా చేతిలో ఉన్న మొబైల్‌ని చూస్తే భయమేస్తోంది.
‘అమ్మగారి మంచితనం’ చెప్పుకొంటూ.. పనివాళ్లు అప్పుడప్పుడూ గొల్లుమంటున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. వచ్చిన అతిథులు వెళ్లిపోయారు. భరించలేనంత నిశ్శబ్దం!
అంతకుముందే మోహన్‌తో చెప్పాల్సింది చెప్పి, తనిచ్చిన సొమ్ములో మిగిలింది ట్రాన్స్ఫర్ చేసేసి భారంగా అడుగులేశాను. అప్పటికే వారంరోజులు సెలవులుగా కరిగిపోయాయి. ఇంటికెళ్లగానే పూర్తిస్థాయిలో శుద్ధి చేసింది రేవతి.. నన్నూ, నా మొబైల్‌ని కూడా. మర్నాడు ఆఫీసులోకి అడుగుపెట్టగానే బాస్ కూడా వార్నింగ్ లెటర్ ఇచ్చాడు.
మరో వారం తర్వాత అమెరికా వెళ్లబోతూ విమానాశ్రయం నుండి ఫోన్ చేశాడు మోహన్. సుధ ఆమె భర్త రెండురోజుల ముందే పిల్లల కోసం వెళ్లిపోయారట. భార్యని డెలివరి కోసం చేర్పించడంతో, కొడుకుగా తల్లికి చేయాల్సిన మిగతా కార్యక్రమాల కోసం ఎవరినో ఏడాదిపాటు ‘గుత్తగా’ మాట్లాడి కుదిర్చానని చెప్పాడు.
“మరి నాన్నగారు..” ఇంకేం అడగాలో అర్థం కాలేదు నాకు.
“అంత పెద్దింట్లో ఆయనొక్కరే ఉండటం కష్టమని.. వెళ్లేముందే వృద్ధాశ్రమంలో చేర్పించాను. ఆన్లైన్ ద్వారా సులువుగానే పనైపోయింది. ఇల్లు అద్దెకివ్వడం కోసం కూడా ఆన్లైన్లోనే వివరాలిచ్చానురా. ఇండియా ఎప్పుడొస్తానో తెలీదు.. సమయానికి నువ్వు చేసిన సాయానికి చాలా థాంక్స్ రా.. మళ్లీ ఆన్లైన్లో కలుద్దాం.. బై!” కాల్ ఆగిపోయింది. అంటే.. ఇంక తండ్రితో అవసరం లేదన్నమాట! అంకుల్ మొహం గుర్తొచ్చి మనస్సు చివుక్కుమంది.. తట్టుకోలేకపోయాను. మానవ జీవితాలని, సంబంధాలని ‘ఆన్లైన్’ శాసిస్తోందా? మంచితనం, మానవత్వం అసహజాలా? భవిష్యత్తులో మానవతా విలువలు, సంబంధ బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు వంటి పదాల అర్థాల కోసం అంతర్జాలంలో గాలించాలేమో?
చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ వైబ్రేషన్లో కదులుతోంది, పాముపిల్లలా.
‘రవీంద్ర కాలింగ్’.. సహోద్యోగి అతను. నాకు జూనియర్. ప్రసవంలో అతని భార్యకి కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆపరేషన్ చేస్తున్నారట.. సాయంగా రమ్మంటున్నాడు.. ఏం చేయను? తోచడం లేదు. ఎందుకో గానీ, చిన్నప్పుడు విన్న ఒక కథ మాత్రం గుర్తొచ్చింది. ఒక సాధువు నీటిలో కొట్టుకుపోతున్న ఒక తేలుని చూసి, సాయం చేద్దామని ఎన్నిసార్లు బైటికి తీసి కాపాడినా.. అన్నిసార్లూ సాధువుని కుట్టి మళ్లీ నీళ్లలోకే పడుతోందిట ఆ తేలు. ఆ బాధ భరిస్తూనే తన ప్రయత్నం ఆపకుండా మళ్లీమళ్లీ దాన్ని బయటకు తీస్తూనే ఉన్నాడాయన. చుట్టూ చేరిన జనాలు వినోదంలా చూస్తూ నవ్వుతుంటే, ఆ సాధువు కూడా నవ్వి.. ‘కుట్టడం దాని సహజగుణం. సమయానికి సాయం చేసి కాపాడటం మనిషి సహజగుణం. ఒంట్లో విషాన్ని నింపుకొన్న తేలే దాని గుణాన్ని వదులుకోనప్పుడు.. మనిషిగా నేను, నా సహజగుణాన్ని ఎలా వదులుకుంటాను’ అంటూ జనాల మాటలు పట్టించుకోకుండా.. మళ్లీ తేలుని తీసి దూరంగా విడిచిపెట్టి ముందుకెళ్లి పోయాడు. ఈ సన్నివేశం జ్ఞప్తికి రాగానే మనసు తేలికపడింది. ఆ సమయంలో రేవతి తిట్లు, బాస్ హెచ్చరికలు, తోటివారి గుసగుసలు మరేమీ గుర్తుకురాలేదు. తక్షణం నా మిత్రుడి కోసం బయలుదేరాను.
ఏదైనా విషయం లేదా సంఘటన పట్ల మనసు స్పందించినప్పుడు.. కథ గానీ కవిత గానీ రూపుదిద్దుకుంటుంది. అలా రూపుదిద్దుకున్న కథే.. సహజం! రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ మూర్తి. ఎం.కామ్ చేశారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటీలో ఆఫీస్ సూపరింటెండెంట్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి.. 2023లో విరమణ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవాసంస్థలలో రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్‌గా ఉన్నారు. సాయి సంస్థల కోసం రచనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు. కథలు, కవితలు, నాటికలు, ఇతర రచనలు చేయడాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. పత్రికలతోపాటు రేడియో, దూరదర్శన్, ఇతర ప్రైవేట్ చానెల్స్‌లో డైలీ సీరియల్స్ కోసం మాటలు రాశారు. 2015లో రాజమండ్రిలో నిర్వహించిన నంది అవార్డు నాటకాల పోటీలలో.. ఈయన రాసిన ‘పడగనీడ’ నాటకం ప్రదర్శనకు నోచుకుంది. స్టేజ్, రేడియో, టీవీలలో నటన, వ్యాఖ్యానం చేశారు. మా ఊరు, ఒక్క క్షణం, అలౌకిక లాంటి సీరియల్స్ ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
– ఆకెళ్ల సూర్యనారాయణ మూర్తి, 92474 95346