మనిషి తన నీడను చూసి తానే భయపడటమంటే ఇదే కాబోలు. మా స్థానంలో ఇద్దరు ముస్లింలు ఉన్నా ఇలాగే అభద్రతా భావానికి గురయ్యేవారు. సాటి మనిషి గుణాన్ని కాకుండా అతని మతాన్ని బట్టి అతను శత్రువా, మిత్రుడా అని నిర్ణయించడం అనేది మనిషి అజ్ఞానానికి చిహ్నం. నిజానికి మన దేశంలో తొంభై తొమ్మిది శాతం మనుషులకుమత పిచ్చి లేకపోయినా ఒక్క శాతం మత పిచ్చి ఉన్నవారు మిగతా వారి మనసుల్ని కలుషితం చేస్తున్నారు.
ఆ స్టేషన్లో రైలు ఆగినప్పుడు సమయం రాత్రి పది గంటలు కావస్తోంది. అప్పటికే రైలు గంట ఆలస్యమైంది. డిసెంబర్ నెల కావటంతో బాగా చలేస్తోంది. నేను ధరించిన స్వెట్టర్ చలిని పూర్తిగా అడ్డుకోలేక పోతోంది. నా భార్య భారతి చలికి తట్టుకోలేక స్వెట్టర్ పైన ఒక శాలువ కప్పుకొంది. మాకిద్దరికీ ఆకలేస్తోంది. భారతికి రైలు భోజనమంటే ఇష్టంలేదు. అందుకే రైలు దిగాక స్టేషన్‌కి దగ్గర్లో ఉన్న హోటల్‌కెళ్లి భోజనం చేద్దామని చెప్పింది. దానికి నేను ఒప్పుకొన్నాను. కానీ, రైలు ఇంత ఆలస్యంగా గమ్యం చేరుకుంటుందని మేం ఊహించనేలేదు.మేం రైలు దిగినప్పుడు ఆ స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అంగళ్లు కూడా మూసి ఉన్నాయి. పైగా ప్లాట్‌ఫామ్ పైన కొన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసి మాకు ఆశ్చర్యం కలిగింది.
“ఏమండీ! ఇంత పెద్ద స్టేషన్లో ఒక్క మనిషి కూడా కనపడ్డం లేదు. మనం తప్ప ఇంకెవరూ రైలు దిగలేదు. అంగళ్లు కూడా మూసి ఉన్నాయి. కనీసం టీ అమ్మే వాళ్లుకూడా లేరు. నా మనసేదో కీడును శంకిస్తోంది” కంగారుగా అంది భారతి.“విషయమేమిటో తెలుసుకుందాం, పద” అంటూ నేను సూట్‌కేసు పట్టుకొని, స్టేషన్ మాస్టర్ గదివైపు వడివడిగా కదిలాను. భారతి నన్ను అనుసరించింది.స్టేషన్ మాస్టర్ గదిలో ఆయనతోపాటు ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.
“స్టేషన్లో జనమే లేరు.ఎందుకండీ?” ఆత్రంగా స్టేషన్మాస్టర్ని అడిగాను.ఆయన నావైపు ఆశ్చర్యంగా చూసి.. “మీకు ట్రైన్లో ఎవరూ చెప్పలేదా? నగరంలో గొడవలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ విధించారు” అన్నాడాయన. “అలాగా! ఆ సంగతి మాకు తెలియదు. మేం చాలాదూరం నుంచి వస్తున్నాం. మేమొక స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులం. మత సామరస్యంపై రేపు ఇక్కడ జరగబోయే ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చాం. ఆ సంస్థ ఆఫీసుకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోంది. మీరు చెప్పేదాకా మాకు ఇక్కడి గొడవల గురించి
తెలియదు” అన్నాను.
“ఈరోజు సాయంత్రం హఠాత్తుగా గొడవలు మొదలయ్యాయి. ఓచోట ఇద్దరు భిన్న మతాలకు చెందిన వ్యక్తుల మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ జరిగింది. దాన్ని పెద్ద గొడవగా చిత్రించి ఇరువర్గాల వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాంతో అది వైరల్‌గా మారి.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాల్లోని అసాంఘిక శక్తులు ఇదే అవకాశంగా చెలరేగిపోయాయి. చీకటి పడ్డాక దుండగులు గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వచ్చి కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. లూటీలు చేస్తున్నారు. వారిని కట్టడి చెయ్యటానికి నగరంలో తగినన్ని పోలీసు బలగాలు లేవు. ఈరోజు పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బందోబస్తు కోసం చాలామంది పోలీసుల్ని పంపారు. తెల్లవారేవరకు వారు తిరిగి వచ్చే అవకాశం లేదు. అందువల్ల రాత్రి మీరు సురక్షితమైన చోట తలదాచుకోవటం మంచిది” అన్నాడు స్టేషన్ మాస్టార్.
“అంటే! రాత్రంతా మమ్మల్ని స్టేషన్లోనే ఉండమంటారా?” “ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు. ఇక్కడ కూడా పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. అరగంట క్రితమే ఓ అల్లరి మూక దాడి చేసింది. ప్రయాణీకులు భయంతో పారిపోయారు. అందువల్ల స్టేషన్‌కి దగ్గర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి ఇంటికెళ్లండి” అన్నాడాయన.“కానీ, మేం ఈ ఊరికి కొత్త. ఇక్కడ మాకు తెలిసిన వారు ఎవరూ లేరు. మా సంస్థ వారు ఇక్కడి రాజశ్రీ హోటల్లో మా కోసం ఒక గది బుక్ చేశారు. మమ్మల్ని ఎలాగైనా ఆ హోటల్ వరకు చేర్చండి, చాలు”అభ్యర్థిస్తూ అన్నాను.
“రాజశ్రీ హోటల్ స్టేషన్‌కి దగ్గరే. ఇక్కడి నుంచి సూటిగా వెళితే తొలి చౌరస్తా దాటాక రెండో చౌరస్తాలోనే ఆ హోటల్ ఉంది. నడుచుకుంటూ వెళ్లినా పదిహేను నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు. ఒక పోలీసును మీకు తోడుగా పంపిస్తాను. మిమ్మల్ని మొదటి చౌరస్తా దాటించి తిరిగొస్తాడు. అక్కడి నుంచి ఐదారు నిమిషాల్లో మీరు ఆ హోటల్‌కి చేరుకోవచ్చు” అంటూ ఆయన ఓ పోలీసుకు సైగ చేశాడు.
ఆ పోలీసు ముందుకు కదలగానే మేం అతన్నిఅనుసరించాం.ముగ్గురం స్టేషన్లోంచి బయటికి వచ్చాం. స్టేషన్ ముందు రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. బయట మరింత చలిగా ఉంది. ఇప్పుడు చలి కన్నా భయం మమ్మల్ని వణికిస్తోంది. పోలీసు ముందు నడుస్తుంటే మేం వడివడిగా అతని వెనక నడవసాగాం.నాపేరు అశోక్. నా భార్య భారతి. మేం మా ఊర్లో లెక్చరర్లుగా పని చేస్తున్నాం. మాది ప్రేమ వివాహం. మేం కులమతాల కన్నా మానవత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతాం. పెళ్లికి ముందు నుంచే మేం సంఘసేవ చేసేవాళ్లం. ఈ సేవా భావమే మమ్మల్ని ఒక్కటి చేసింది. మాకు పుట్టే పిల్లల్ని కూడా మాలాగే ఆదర్శవంతులు చెయ్యాలని అనుకున్నాం. కానీ, మా పెళ్లయి పదేళ్లు గడిచినా మాకు పిల్లలు పుట్టలేదు. అయినా మేం నిరుత్సాహపడలేదు. తరచుగా అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడి అనాథల్నే మా సంతానంగా భావించి వారికి చేతనైన సాయం చేస్తూ, వారితో సరదాగా గడుపుతూ పిల్లలు లేని లోటును తీర్చుకుంటున్నాం. మా సేవను గుర్తించి కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు తమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవటానికి మమ్మల్ని ఆహ్వానిస్తుంటారు. అదే క్రమంలో రేపు మత సామరస్యంపై ఇక్కడ జరగబోయే ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి మేం ఇక్కడికొచ్చాం. కానీ, మేమీ నగరంలో అడుగు పెట్టకముందే ఇక్కడ మత కలహాలు చెలరేగి ప్రజల మధ్య సమైక్యత దెబ్బ తినటం చూశాక మత సామరస్యం ఎంత అవసరమో మాకు అనుభవపూర్వకంగా బోధపడింది.
మేం పది నిమిషాలు నడిచాక మొదటి చౌరస్తా వచ్చింది. అక్కడ వీధి దీపాలు సరిగ్గా వెలగటం లేదు. అయితే అక్కడి నుంచి కొద్ది దూరంలో రెండో చౌరస్తా కనిపిస్తోంది. అక్కడ వీధి దీపాలు వెలుగుతున్నాయి. మాకు తోడుగా వచ్చిన పోలీసు మాకు వీడ్కోలు చెప్పి వెనుదిరిగి వెళ్లిపోయాడు.
మేం వేగంగా రెండో చౌరస్తా వైపు కదిలాం. అయితే మేం రెండు నిమిషాలు నడిచామో లేదో రెండో చౌరస్తాలోకి పక్కరోడ్డులోంచి ఓ పెద్ద అల్లరి మూక రావటం కన్పించింది. వారు పెద్దగా కేకలు వేస్తూ వీధి దీపాలు పగులగొడుతూ మేమున్న దిశలోనే రావటం చూసి మేం హడలిపోయాం. అంత చలిలోనూ భయం వల్ల మాకు ముచ్చెమటలు పోశాయి. వెంటనే ఇద్దరం వెనుదిరిగి దాదాపు పరుగు పెడుతూ మొదటి చౌరస్తా వైపు కదిలాం.
కానీ, అప్పుడే మొదటి చౌరస్తాలో కూడా పక్క రోడ్డులోంచి మరో అల్లరిమూక ప్రవేశించింది. వారు కూడా గట్టిగా కేకలేస్తూ మేమున్న రోడ్డులోకే మళ్లటం చూసి మేం భయంతో వణికిపోయాం. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి మాది. మా మెదడు భయంతో మొద్దుబారింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు.
మేం ఉన్న చోట వీధి దీపాలు లేకపోవటం వల్ల ఆ అల్లరి మూకలకు మేం కనపడలేదు. కానీ, ఇంకాసేపట్లో వారి దృష్టిలో పడతాం. ఆలోగా మేం తప్పించుకోవాలి అనుకుంటూ అటూఇటూ చూశాం. రోడ్డుకు ఇరువైపులా అన్నీ మూసేసిన అంగళ్లే కన్పించాయి. తప్పించుకోవటానికి చిన్న సందు కూడా కనపడలేదు. అయితే ఆ అంగళ్ల మధ్య ఓ చిన్న ఇల్లు కన్పించింది. వెంటనే ఇద్దరం ఆ ఇంటి దగ్గరికి పరిగెత్తాం. నేను ఇంటి తలుపు తడుతూ..“ప్లీజ్! తలుపు తెరవండి” అని అరిచాను.కొద్దిక్షణాల తర్వాత ఇంట్లో లైటు వెలిగింది. తలుపు పక్కన గల కిటికీ తెరచుకుంది. ఓవ్యక్తి మమ్మల్ని తేరిపార చూస్తూ..“కౌన్?” అనడిగాడు.నేను జవాబు చెప్పబోయి కిటికీలోంచి లోపల గోడకు తగిలించి ఉన్న మక్కా, మదీన ఫొటో చూసి.. ఎందుకైనా మంచిదని ఉర్దూలో మాట్లాడాను.“సార్! మాది ఈ ఊరు కాదు. మేం ఇప్పుడే రైలు దిగి వస్తున్నాం. ఇక్కడ గొడవలు జరుగుతున్న సంగతి మాకు తెలీదు. ఇప్పుడు మేం రెండు అల్లరి మూకల మధ్య ఇరుక్కున్నాం. మీ ఇంట్లోకి రానిస్తే కాసేపు ఇక్కడ తల దాచుకుంటాం. ఆ అల్లరిమూకలు వెళ్లిపోగానే మేం కూడా వెళ్లిపోతాం” అన్నాను.
మా ఊర్లో నాకు చాలామంది ముస్లిం మిత్రులు ఉండటం వల్ల నేను ఉర్దూ చక్కగా మాట్లాడగలను.“మీ పేరేమిటి?” ఆ వ్యక్తి అనుమానంగా అడిగాడు.
“నా పేరు సలీమ్. ఈమె నా భార్య ఫాతిమా” అంటూ అబద్ధం చెప్పాను.ఈ రోజు భారతి నుదుటిపై బొట్టు పెట్టుకోకపోవటం మంచిదైంది. పైగా ఆమె కప్పుకొన్న నల్లటి శాలువ ఆ వ్యక్తికి బురఖాలా కన్పించింది. అతను కిటికీ మూశాడు. కానీ, తలుపు తెరవలేదు. ఆలోగా అల్లరి మూకల గుంపులు మాకు దగ్గర కాసాగాయి. వాళ్లు మమ్మల్ని చూడక ముందే మేం ఆ ఇంట్లోకి దూరాలి. మాకు క్షణం ఒక యుగంలా గడవసాగింది.అంతలో తలుపు తెరచుకుంది. మేం చిన్నపిల్లల్లా లోపలికి దూరాం. ఆ వ్యక్తి వెంటనే తలుపు మూసి లైటు ఆర్పేశాడు. మేం చీకట్లో నిశ్శబ్దంగా ఉన్న చోటే నిల్చుండిపోయాం. భయం వల్ల మా గుండెలు కొట్టుకుంటున్న చప్పుడు మాకు స్పష్టంగా వినపడుతోంది. ఓ పది నిమిషాల తర్వాత రోడ్డు మీద అల్లరి మూకలు పర స్పరం రాళ్లు విసురుకుంటున్న శబ్దాలు స్పష్టంగా విన్పించాయి. మేం భయంతో వణికిపోయాం. కాస్సేపటి తర్వాత అల్లరి మూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
అప్పుడు ఆ వ్యక్తి మళ్లీ లైటు వేశాడు. నేను సూట్‌కేసు అందుకొని..“చాలా థాంక్సండీ. మీరు చేసిన సాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. మేమిక వెళతాం” అంటూ తలుపు వైపు కదిలాను.“అరే! ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. అర్ధరాత్రి ఎలా వెళతారు? మీకు మరో అల్లరి మూక ఎదురు కావచ్చు. అందువల్ల ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారాక వెళ్లండి. మీరు ముందు గదిలో పడుకోండి. మేం హాల్లో పడుకుంటాం” అన్నాడతను.
“మీకెందుకండీ శ్రమ?” బయటికెళ్లటానికి భయమేస్తున్నా మొహమాటం కోసం అన్నాను.“ఇందులో శ్రమ ఏముంది? కష్టాల్లో ఉన్న సాటి మనుషుల్ని ఆదుకోవటం ప్రతి మనిషి బాధ్యత. అన్నట్టు నా పేరు అలీ. నా భార్య రజియా. ఇంట్లో ఉండేది మేమిద్దరమే. కాబట్టి మీ వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదు. మీ ముఖాలు చూస్తుంటే మీరు భోజనాలు కూడా చెయ్యలేదనిపిస్తోంది. మీరు చేతులు కడుక్కోండి. మీ కోసం భోజనాలు తీసుకొస్తాను” అంటూ నేను వారిస్తున్నా వినకుండా అలీ భోజనాలు తేవటానికి లోపలికి వెళ్లాడు. నిజానికి మాకు బాగా ఆకలేస్తోంది.“ఏమండీ! మనం శాకాహారులం కదా. మనం ముస్లింలు అనుకొని ఆయన నాన్‌వెజ్ తీసుకొస్తే ఎలా?” భారతి నా చెవిలో గుసగుసలాడింది. అది విని నేను కంగారుపడ్డాను. ఇద్దరం అయిష్టంగానే అక్కడున్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కున్నాం.కాసేపట్లో అలీ దంపతులు భోజనాలు తీసుకొచ్చారు. ఓ గిన్నెలోని కూరలో పెద్దపెద్ద మాంసం ముక్కలు కన్పించగానే నేను అదిరిపడ్డాను. కానీ, భారతి నిశ్చింతగా ఉండటం చూసి మరోసారి ఆ కూరని పరిశీలనగా చూశాను. అప్పుడవి మాంసం ముక్కలు కావు, గుత్తొంకాయలని అర్థమైంది. అభద్రతా భావానికి గురై నా మెదడు మొద్దుబారటం వల్ల గుత్తొంకాయ ముక్కలు నాకు మాంసం ముక్కల్లా కన్పించి భయపెట్టాయని బోధపడింది.ఇద్దరం భోంచేశాక అలీ మాకు గుడ్‌నైట్ చెప్పి ఖాళీ ప్లేట్లు తీసుకెళ్లాడు. ఇద్దరం నిశ్చింతగా మంచంపై వాలాం. మెల్లగా మాకు కునుకు పట్టింది.
అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా ఇంటి బయట కేకలు వినిపించటంతో నేను ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. బయట కొందరు వ్యక్తులు అలీని నిలదీస్తున్నారు.“మన శత్రువులకు నీ ఇంట్లో ఆశ్రయమిస్తావా?” అంటూ అతన్ని కొడుతున్నారు.“ఇందులో నా తప్పేమీ లేదండీ. వాళ్లు చెప్పిన పేర్లను బట్టి వాళ్లు మనవాళ్లే అనుకున్నాను. కావాలంటే వాళ్లనే అడగండి. వరండా పక్క గదిలో పడుకున్నారు” అన్నాడు అలీ.
ఆ మాట వినగానే కొందరు యువకులు ఆవేశంగా మా గది తలుపు బద్దలుకొట్టి లోపలికి దూసుకొచ్చారు. కర్రలతో మాపై దాడి చేశారు. ప్రాణ భయంతో నేను గట్టిగా అరిచాను.
“ఏమండీ! ఎందుకలా అరిచారు? నిద్రలో పీడకల వచ్చిందా?” భారతి తట్టి లేపటంతో నేను మేల్కొన్నాను.అంతవరకు చూసినదంతా కలలో అని అర్థం కాగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికే తెల్లవారింది. నగరానికి పోలీసులు రావటంతో బయట కోలాహలం మొదలైంది. అవే శబ్దాలు నన్ను పీడకల రూపంలో భయపెట్టాయని బోధపడింది.నా కేక విని హాల్లోంచి అలీ పరిగెత్తుకొచ్చాడు. నిద్రలో అరిచానని చెప్పగానే చిరునవ్వు నవ్వి నాకు ధైర్యం చెప్పాడు. అంతలో అలీ భార్య వేడివేడి టీ తీసుకొచ్చి మాకు ఇచ్చింది. టీ తాగాక అలీ దంపతులకు మరోసారి ధన్యవాదాలు చెప్పి నేను, భారతి ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాం. మేం వద్దన్నా వినకుండా అలీ మావెంట కొంతదూరం వరకు వస్తానన్నాడు.ముగ్గురం రోడ్డుపై మెల్లగా నడవసాగాం. పోలీసుల రాకతో రోడ్లపై జన సంచారం పెరిగింది. మాలాగ రాత్రి ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన వారు ఇప్పుడు తమతమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కొద్దిదూరం వచ్చాక అలీ మాకు వీడ్కోలు చెప్పి వెనుదిరగబోతూ..“సలీమ్ గారూ! వెళ్లే ముందు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను” అన్నాడు.“ముందుగా మేమే మీకొక విషయం చెప్పాలి” అన్నాను.
“చెప్పండి?” అలీ కుతుహలంగా అడిగాడు.“మీకు అబద్ధం చెప్పినందుకు క్షమించండి. నిజానికి మేం ముస్లింలు కాదు, హిందువులం! నా పేరు అశోక్, నా భార్య పేరు భారతి. మేం హిందువులన్న విషయం తెలిస్తే మీరు ఇంట్లోకి రానిస్తారో లేదో అనుకొని రాత్రి అబద్ధం చెప్పాం. సారీ” అన్నాను.
నేను చెప్పింది విని అలీ నివ్వెరబోయాడు. అబద్ధం చెప్పినందుకు మమ్మల్ని తిడతాడనుకున్నాను. కానీ, పకపక నవ్వటం మొదలెట్టాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవటం మా వంతయింది. తర్వాత అలీ ఉర్దూలో కాకుండా తెలుగులో మాట్లాడాడు.“నిజానికి నేను చెప్పాలనుకున్న మాటే మీరు చెప్పారు” అన్నాడు.“అంటే..?” నేను తికమకపడ్డాను.
“మేము కూడా ముస్లింలు కాము. నా పేరు అలీ కాదు, అజయ్. నా భార్య పేరు రాధ” అన్నాడు అలీ ఉరఫ్ అజయ్. ఆ మాట విని నాతోపాటు భారతి కూడా ఆశ్చర్యపోయింది.“మీరు హిందువులైతే మీ ఇంట్లో మక్కా-మదీన ఫొటో ఎందుకుంది?” భారతి ఆసక్తిగా అడిగింది.
“ఎందుకంటే.. ఆ ఇల్లు మాది కాదు, నా మిత్రుడు అలీది. అతని ఇంట్లో మేం ఎందుకున్నామో తెలియాలంటే మాగురించి కొంత చెప్పాల్సి ఉంటుంది. అలీ, నేను బాల్య మిత్రులం. ఒకే కంచంలో తిని, ఒకే మంచంపై పడుకున్న ప్రాణ స్నేహితులం. ఇద్దరి మతాలు వేరైనా అవి మా స్నేహానికి అడ్డు రాలేదు. నేను గుడికి వెళితే అలీ నా వెంట వచ్చి నేను పూజ ముగించే వరకు గుడి బయట వేచి ఉండేవాడు. అలీ మసీదుకి వెళ్లినప్పుడు అతని నమాజు ముగిసేవరకు నేను మసీదు బయట వేచి ఉండేవాణ్ని. పెద్దయ్యాక కూడా మా స్నేహం చెక్కు చెదరలేదు. తర్వాత మేం ఉద్యోగరీత్యా వేరువేరు ఊర్లలో స్థిరపడాల్సి వచ్చింది. అవకాశం దొరికినప్పుడల్లా నేను, నా భార్యతో కలిసి ఇక్కడికొచ్చి అలీ ఇంట్లో దిగుతుంటాను. నిన్న ఉదయం కూడా మేం అతని ఇంటికొచ్చాం. కానీ, అప్పుడే అలీ మామగారు చనిపోయారని ఫోన్ రావటంతో అలీ తన ఇల్లు మాకు అప్పగించి భార్యతో కలసి హడావుడిగా వాళ్ల ఊరికి వెళ్లిపోయాడు. అంత్యక్రియలు ముగిశాక తిరిగొస్తానన్నాడు. కానీ, నిన్న సాయంత్రం హఠాత్తుగా నగరంలో గొడవలు మొదలు కావటంతో రాలేకపోయాడు. జాగ్రత్తగా ఉండమని మాకు ఫోన్ చేసి చెప్పాడు. మేం కూడా నిన్న రాత్రి మీలాగే ఆందోళనకు గురయ్యాం. కానీ, మీరొచ్చాక మాకెంతో ధైర్యం వచ్చింది” అన్నాడు అజయ్.
“అది సరే! మేం ముస్లింలు అని అబద్ధం చెప్పటానికి ఒక కారణం ఉంది. కానీ, మీరు అబద్ధం ఎందుకు చెప్పారు?” నేనడిగాను.
“నిన్న రాత్రి మీరు బాగా భయాందోళనలకు గురయ్యారు. మేం హిందువులమని తెలిస్తే మీరు మరింత అభద్రతా భావానికి గురవుతారనిపించింది. పైగా ఆ ఇల్లు కూడా ముస్లింలదే కదా! అందుకే అబద్ధం చెప్పాం. మీరు హిందువులని ముందే తెలిస్తే మేం అబద్ధం చెప్పేవాళ్లం కాదు” అన్నాడు అజయ్.
“మనిషి తన నీడను చూసి తానే భయపడటమంటే ఇదే కాబోలు. మా స్థానంలో ఇద్దరు ముస్లింలు ఉన్నా ఇలాగే అభద్రతా భావానికి గురయ్యేవారు. సాటి మనిషి గుణాన్ని కాకుండా అతని మతాన్ని బట్టి అతను శత్రువా, మిత్రుడా అని నిర్ణయించడం అనేది మనిషి అజ్ఞానానికి చిహ్నం. నిజానికి మన దేశంలో తొంభై తొమ్మిది శాతం మనుషులకు మత పిచ్చి లేకపోయినా ఒక్క శాతం మత పిచ్చి ఉన్నవారు మిగతా వారి మనసుల్ని కలుషితం చేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు. దానివల్ల ఇరు వర్గాల్లోనూ అభద్రతా భావం పెరుగుతోంది. అమాయక ప్రజలు ఈ మతోన్మాదుల ఉచ్చులో చిక్కుకోకుండా వారిలో చైతన్యం కలిగించటం కోసం మాతృభూమి అనే ఒక స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఆ సంస్థ మతసామరస్యం అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనటానికే మేం ఈ ఊరికొచ్చాం. కానీ, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి ముందే మతోన్మాదం వికృత రూపాన్ని ప్రత్యక్షంగా చూశాం. అదే సమయంలో మతం కన్నా మానవత్వానికి విలువ నిచ్చే మీ స్వచ్ఛమైన స్నేహం గురించి కూడా తెలుసుకున్నాం. మా ఈ అనుభవాన్ని మా సంస్థ సభ్యులతో పంచుకుంటాం. మతాలకు అతీతమైన మీ స్నేహం మా వంటి సంఘ సేవకులకు కూడా చక్కటి స్ఫూర్తినిస్తుంది. సమాజంలో మీవంటి గొప్ప వ్యక్తులు ఉన్నంత కాలం మతోన్మాదులు మన దేశాన్ని ఏమీ చెయ్యలేరని మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇక మేము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నిన్న రాత్రి మాకు ఎదురైన అనుభవం గురించీ, నిష్కల్మషమైన మీ స్నేహం గురించి తప్పక ఉదహరిస్తాం”.. గద్గద స్వరంతో పలికాను.
మహబూబ్ బాషా
‘మతం కన్నా మానవత్వమే మిన్న’ అని నమ్ముతారు రచయిత మహబూబ్ బాషా. ‘ఆదోని బాషా’ కలంపేరుతో రచనలు చేస్తున్నారు. మాతృభాష ఉర్దూ. పదో ఏట నుంచే చందమామ లాంటి బాలల పత్రికల్లోని బొమ్మల్ని చూసి.. వాటి వెనక ఉన్న కథల్ని చదవాలనే అభిలాషతో పట్టుబట్టి తెలుగును అభ్యసించారు. తెలుగు చదవడం నేర్చుకోగానే.. మొట్టమొదట చేసిన పని చందమామ కథలు చదవడమేనని చెబుతారు. ఎనిమిదో తరగతి నుంచే పిల్లల కథలు రాయటం మొదలుపెట్టారు. డిగ్రీలో ఉన్నప్పుడు పత్రికల కోసం వ్యాసాలు రాశారు. ఉర్దూ, హిందీ, కన్నడ, ఆంగ్లం వంటి భాషల నుంచి తెలుగులోకి కథలను అనువదించారు. అలాంటి వంద వరకూ అనువాద కథలు విపుల మాస పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇప్పటి వరకు 600లకు పైగా కథలు రాశారు. వాటిలో 30కి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం మాయాబజార్ అనే నవల, అల్లరి పందెం అనే సీరియల్ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమయ్యాయి.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-మహబూబ్ బాషా
94402 39828