Ramayanam | ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. ఓరోజు సాయంత్రం నేనున్న నారాయణగూడలోని నాయనమ్మ వాళ్లింటికి మా మేనత్త అల్లుడు (ఆ తరువాత నా పెద్దాడపడుచు భర్త).. తన స్నేహితుడ్ని తీసుకుని వచ్చారు. నేను ఆ సమయంలో ముందు గదిలో హోమ్‌వర్క్ చేసుకుంటూ ఉన్నాను.
ఎప్పుడైనా మా కజిన్స్ లక్ష్మి, హైమక్క తప్ప అప్పటిదాకా నాకోసం మగవాళ్లెవరూ ఇంటికి రాలేదు. వచ్చినవాళ్లను ఎలా రిసీవ్ చేసుకోవాలో నాకు తెలియదు. వాళ్లే రెండు కుర్చీల్లో కూర్చున్నారు. “బాగ చదువుతున్నవానే?” అని నన్నడిగి.. “ఇది మంచి క్లెవర్!” అని ఆయనతో చెప్పారు రవీందర్ అన్నయ్య. అన్నయ్య నాకంటే దాదాపు పదిహేనేళ్లు పెద్ద. వాళ్ల పెళ్లి జరిగినప్పుడు నాకు తొమ్మిదేళ్లు. తనకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు లేరు. నాపట్ల వాత్సల్యం ఎక్కువే. మా అత్తయ్య వాళ్లింటికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి కబురు పంపి నన్నూ, అక్కనూ తీసుకుని రమ్మనేవారు.
ఏవో ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్లం. అన్నయ్య చాలా సౌమ్యుడు, సహృదయుడు. “నీకు తెల్సు గద, బాబూరావు! నా బెస్ట్ ఫ్రెండ్!” అని ఆ పక్కన ఉన్నాయనను చూపించాడు. నాకు ఆయన్ని చూసిన జ్ఞాపకం లేదు. చూసినా గుర్తు పెట్టుకునేంత సంభాషణో, సంఘటనో మా మధ్య లేదు. ఎత్తుగా, తెల్లగా ఉన్నాడు. వాళ్లు ఎందుకు వచ్చారో, వాళ్లతో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. సంభాషణ ఎలా పొడిగించాలో కూడా తెలియదు.
“రోజు కాలేజీకి పోతున్నవా?”
“ఊ.. పోతున్న”
“ఇంటి నుండి ఉత్తరాలు ఒస్తున్నయా?”
“అహ! నేనే రాస్త”..
“మీ సీనియర్ మాల ఉన్నది కదా!”
“మాలనా? ఎవరు?”
“అదేనే! నువ్వు చిన్నప్పుడు ఆడుకునేది. మీ ఇంటి పక్కన బంగ్లా ఉండే! వెలమోళ్లు! నువ్వూ, అక్కా పొయ్యి ఆడుకునేది చూడూ!”.. ఆ.. గుర్తొచ్చింది.
“ఓ! అది వాండ్లిల్లు గాదు. వాండ్ల అమ్మమ్మ గారిల్లు! సెలవులల్ల ఒచ్చేది! వాండ్ల మామయ్యకు ఇద్దరూ మొగపిల్లలే గనుక మమ్ములను పిలిస్తే మేం పోయేది”
“అదే.. అదే.. గామే! మీ కాలేజే గద! డిగ్రీ జేస్తుంది”
“అవునా! నాకు తెల్వదు”
“అయితే.. నువ్వు ఒక్క హెల్ప్ జెయ్యాలె. నువ్వు ఆమెతోటి ఫ్రెండ్షిప్ జెయ్యాలె”
“ఎందుకు? మా క్లాసులు వేరు, డిగ్రీ వాళ్లవి వేరు ఉంటయి. ఆమె గనుక ఆర్ట్స్ గ్రూప్ అయితే సత్తెమ్మ-నరసిమ్మారావు బిల్డింగుల అయితయి వాళ్లకు”
“గదే! ఎట్లనన్న జేసి లీజర్ పీరియడ్ల మాట్లాడిచ్చి పరిచయం పెంచుకో! చాయ్ కో, కాఫీకో తీస్కపో!”
“నేను చాయ్ గానీ, కాఫీ గానీ తాగ గద అన్నయ్యా! ఆమెకు గూడ అలవాటుందో లేదో!”
“చాయ్ గాకపోతే బేకరీకి తీస్కపో! కేకులో, బిస్కెట్లో తినుకుంట మాట్లాడుకోండి”
“ఏమో! నేనెప్పుడు బేకరీకి పోలే! అయినా ఎట్ల పిలువాలె! ఆమె ఒస్తదో రాదో!”
“లేకపోతె సిన్మాకు పోండి ఇద్దరు కల్సి! రెండు మూడు గంటలుండొచ్చు!”
“అమ్మో! నేను సిన్మాకు పోతే నాయనమ్మతోని మార్నింగ్ షో గానీ, ఎప్పుడన్న చిన్నమ్మ వాండ్లతోని గానీ.. లేకుంటె గౌలిగూడ పోయినప్పుడు లక్ష్మి వాండ్లతోని గానీ! అంతే! విడిగ ఎట్ల పోతం?”
ఆ సమయంలో అన్నయ్యకు తన తలను గోడకేసి కొట్టుకోవాలనిపించి ఉంటుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు.
“నీకు ఎవరన్న కామన్ ఫ్రెండ్స్ ఉంటే వాండ్ల ద్వారా మాట్లాడిచ్చి స్నేహితం పెంచుకో!”
“సరే! చూస్త అన్నయ్యా! ఎందుకు మరి స్నేహం పెంచుకునుడు?”
“ఇగో.. ఈ హెల్ప్ నువ్వే జెయ్యాలె. చెయ్యగలవు గూడ! బాబూరావు గా పిల్లను ఇష్టపడుతున్నడు. వీడు గూడ వెలమనే! కొంచెం ఎడ్యుకేటెడ్ పిల్ల అయితె బాగుంటదని చూస్తున్నడు. ఘనపూర్, మన ఇంటి పక్కనే ఉండే వాండ్లకు చుట్టాలు అంటే.. లక్కీగ నీకు తెల్సిన అమ్మాయి అయింది” అన్నయ్య మెల్లగా అసలు విషయం మొదలుపెట్టారు. అప్పటికే అన్నయ్య పెళ్లయి ఐదేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. మరి ఈయనకేమో ఇంకా పెళ్లే కాలేదట. ఇంతకూ స్నేహం పెంచుకున్నాంక నేనేం జేయాలె?.. అదే అడిగాను.
“నువ్వు ఆ అమ్మాయితో బాగా పరిచయం పెంచుకున్నాన్క.. ఒకరోజు బాబూరావు మీ కాలేజీ ముందరికి ఒస్తడు. అప్పుడు నువ్వు ఆమెకు వీడ్ని పరిచయం జెయ్యి. ‘మా అన్నయ్య ఫ్రెండు. శానా మంచోడు. బాగా చదువుకున్నడు. డబ్బులు కూడా ఉన్నయి’ అని మళ్లామళ్లా చెప్పు. ఆ తర్వాత వీడు చూసుకుంటడు”.. అన్నయ్య వివరిస్తుంటే, ఆయన అప్పుడే అదంతా జరిగిపోయినట్టు ముసిముసి నవ్వులు విసురుతూ డ్రీమ్స్‌లోకి వెళ్లిపోయాడు.
“కానీ, మా కాలేజీ ముందర మొగోళ్లను నిలబడనియ్యరు” చెప్పాను ఏమనలేక. అన్నయ్యకు విసుగొచ్చినట్టుంది. “కాలేజీ ముందర కాకపోతే కొంచెం అటు పక్కో, ఇటు పక్కో.. సరేనా?”. ఏమనాలో తోచలేదు నాకు. ‘వద్దను, వద్దను! నావల్ల కాదని చెప్పెయ్యి. ఈ గోలంతా నీకెందుకు?’ అని నా మనసు నెత్తీనోరూ మొత్తుకుని నాకు చెపుతోంది. కానీ, నా ఒంట్లోనే రక్తంతోపాటు మొహమాటం కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ‘నో’ అని చెప్పడం ఇప్పటికీ ఎంత కష్టమో నాకు!
ఇన్ని మంచి లక్షణాలున్న ఈయన.. మాలా వాళ్ల పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి.. ‘మీ అమ్మాయి నాకు నచ్చింది. పెళ్లి చేసుకుంటాను’ అని అడగొచ్చుగా! లేకపోతే వీళ్ల వాళ్లతో అడిగించొచ్చు కూడా! నన్నెందుకూ ఇలా బలి చెయ్యడం?
నాకెందుకో నా మీద నాకే జాలి కలిగింది. సినిమాల్లో ముదురు మాటలు మాట్లాడుతూ పెద్దవాళ్ల ప్రేమల్లో తలదూర్చే బాలనటుల్లా నాకు నేనే అనిపించాను. నా మౌనాన్ని వాళ్లు వేరేరకంగా అర్థం చేసుకున్నారేమో గానీ, అన్నయ్య వాళ్ల ఫ్రెండు తన జేబులోంచి రెండొందలు తీసి అన్నయ్యకిస్తే.. “సినిమాలకో, బేకరీలకో ఆ అమ్మాయిని తీస్కపోయేటందుకు నీకు కావాలె గదా!” అంటూ ఆ డబ్బులను అన్నయ్య నా చేతిలో పెట్టాడు. నేను.. “ఒద్దు” అంటూ నా చెయ్యి వెనక్కి తీసుకుంటుండగానే బయటి నుండి చిన్నాయన వాళ్లొచ్చారు. వాళ్లూ, వీళ్లూ పరిచయాలూ, షేక్ హ్యాండ్లూ అవగానే.. “నాన పైసలు పంపిండా బిడ్డా!” అన్నారు చిన్నాయన.
“అవును! నేను హైదరాబాదు ఒస్తుంటే ఇచ్చి రమ్మని నాకు చెప్పి పంపిన్రు” అన్నారు రవీందర్ అన్నయ్య. అది కాదని, వెనక్కు ఇచ్చే అవకాశమే నాకు లేకుండా పోయింది. అప్పుడు వీళ్ల పరువు పోతుంది. డబ్బు తీసుకుంటే నేను వీళ్లు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. కాసేపటికే వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత నేను మాలను దొరకబట్టి పలుకరించి, ఆమెతో నేను చిన్నప్పుడెప్పుడో ఒకటి రెండుసార్లు ఆడుకున్న విషయం కూడా గుర్తు చేసాను. ఆమె కూడా నవ్వి.. “ఓ! నువ్వు ఈ కాలేజీలోనేనా?” అన్నది గానీ, పెద్దగా సంభాషణకు అవకాశం ఇవ్వలేదు. ఎలా పరిచయం పెంచుకోవాలో నాకూ తెలియలేదు. ఈ మొహమాటమే నాకు తరువాత చాలా ప్రమాదం తెచ్చిపెట్టింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి