కథలు రాయడం కష్టం. బాలల కథలు మరీ కష్టం. భాష సరళంగా ఉండటంతో పాటు విషయం ఆసక్తికరంగా ఉండాలి. చదువరుల మనసును పరుగులు తీయించాలి. ఆ విషయంలో అపార అనుభవం ఉన్న నారంశెట్టి ఉమామహేశ్వరరావు తాజాగా రెండు పిల్లల కథల పుస్తకాలు విడుదల చేశారు. ‘వనదేవత తీర్పు’, ‘కనువిప్పు’ పేరుతో విడుదలైన వీటిలో 38 కథలు ఉన్నాయి. అన్ని కథలూ పిల్లలకు నచ్చేలా ఉన్నాయి. ‘వనదేవత తీర్పు’ మనుషుల్లో స్వార్థాన్ని బయటపెడుతుంది. కోతిని మోసగించిన సుందరికి బుద్ధి చెబుతుంది.
‘సామాన్యుడి సమస్య’ లో చిన్నడు ఊరిపెద్దకు నేర్పిన పాఠం బాగుంది. ‘అన్నదమ్ముల ప్రేమ’ ఎలా ఉండాలో ఆ పేరుతో ఉన్న కథే తెలియజేస్తుంది. వ్యక్తి స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి కథల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నిటిలోకి పరమ ‘చెత్త వ్యసనం’ మద్యపానం అని రచయిత పాత్రలతో చెప్పించిన తీరు చాలా బాగుంది. సమకాలీన సమస్య ఇది. ‘గర్వభంగం’ కథలో చిలుక కోడిపెట్టల సంవాదం సరదాగా సాగినా వాస్తవికతకు అద్దం పట్టింది. ఇలాంటి కథలు పిల్లల్ని ఆకర్షిస్తాయి. ఉపేంద్రుడనే ధనికుడైన పిసినారికి చివరికి పట్టిన గతిని ‘కుక్కతోక’ కథలో చక్కగా చెప్పారు. ప్రతి కథా చక్కని నీతితో పిల్లలకు అర్థమయ్యే భాషలో రచించారు.
వనదేవత తీర్పు;కనువిప్పు
రచన: నారంశెట్టి ఉమామహేశ్వరరావు
పేజీలు: 72, 56, ధర: ఒక్కొక్కటి రూ. 200
ప్రతులకు: నవతెలంగాణ, ప్రజాశక్తి దుకాణాలు
-చంద్ర ప్రతాప్ కంతేటి
హేతుబద్ధతే.. మతం
పౌరులు శాస్త్రీయ స్పృహ పెంచుకోవాలని భారత రాజ్యాంగం ప్రాథమిక విధుల్లో నిర్దేశం చేసింది. మనిషి వైజ్ఞానికంగా ఎంత ముందుకు వెళ్లినా విశ్వాసం ముసుగులో ఇంకా మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అర్థం లేని చర్చలు సాగుతూనే ఉన్నాయి. నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనలనూ చూస్త్తున్నాం. ఇలాంటి పరిస్థితి నుంచి మనిషి హేతుబద్ధంగా ఆలోచించడానికి కావాల్సిన వివేచనను పాదుకొల్పుతున్న సాహితీవేత్తల్లో డాక్టర్ దేవరాజు మహారాజు ఒకరు. స్వయంగా జీవశాస్త్ర ఆచార్యుడు అయిన ఆయన మనిషి పరిణామం గురించి, మతం గురించి ఎన్నో వ్యాసాలు రాశారు. అలాంటి 30 వ్యాసాల సంకలనమే ‘భిన్నత్వంలో ఏకత్వం మా‘నవ’వాదం’. మతం పేరుతో సమకాలీనంగా నడుస్తున్న వివిధ అంశాల వెనుక ఉన్న సత్యాలను రచయిత ఈ పుస్తకంలో వెల్లడించారు. ఇది చదివితే పాఠకులకు రాజ్యాంగం పేర్కొన్న శాస్త్రీయస్పృహ పెరుగుతుంది. హేతువాదం బలపడుతుంది.
భిన్నత్వంలో ఏకత్వం- మా‘నవ’వాదం
రచన: డాక్టర్ దేవరాజు మహారాజు
పేజీలు: 175, ధర: రూ. 175
ప్రచురణ: నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్
ప్రతులకు: ఫోన్ 040 27673787
-చింతలపల్లి హర్షవర్ధన్