కలలో కోమలి తన కౌగిట్లోకి తనని ఆహ్వానిస్తున్న దృశ్యం ఒకవైపు.. అంతలోనే తన గొంతుపైకి దూసుకొస్తున్న కత్తి దృశ్యం మరోవైపు. కానీ, ఆ కత్తిని దూస్తున్న చెయ్యి ఎవరిదోనని తెలుసుకునే లోపలే.. రఘుశెట్టి తన తోటబంగ్లా దగ్గరున్న అరటి తోటలో తల, మొండెం వేరై కనిపించాడు. అదే ఉదయం, కోమలి మరోవైపు తమ డేరా గుడిసెని మడతపెట్టి.. గాడిదపై వేసుకుని ఏమీ ఎరుగని భర్తతోపాటు వేరే ఊరికి బయలుదేరింది. అక్కడ మరో దొరకోసం మళ్లీ వారం రోజుల్లోనే కత్తి చెయ్యడానికి.. కాదు కాదు, గుండెల్లోకి దుయ్యడానికి కాబోలు.
ప్రకృతిని మించిన అందమొకటి నవ్వుతూ, తనవైపే కైపుగా చూస్తూ తననే ఆహ్వానిస్తుంటే.. అడ్డుగా ఏదో తాకసాగింది. తాను ఆశపడిన అందం అందుకునేంత దూరంలో ఉన్నా కూడా తనకు దక్కకపోతుండే సరికి.. రఘుశెట్టికి కోపం వచ్చింది. ఏదో విధంగా ఆ అందాల విందుని అందుకున్నాను అనుకునే లోపలే.. మళ్లీ తన మెడపై ఏదో తగులుతున్నట్లుగా అనిపించింది.తేరిపారా చూసేసరికి తాను ఒకరి తల తియ్యడానికి చేయిస్తున్న కత్తే అది. దాన్ని పట్టుకున్న చెయ్యి ఎవరిదోనని చూసేలోపలే.. ఊపిరి ఆగినట్లుగా, ప్రాణం పోయినట్లుగా అనిపించింది. దాంతో..
“ఎవరు మీరు?”.. అని కేకేశాడు.అంతలోనే కళ్లు తెరుచుకున్నాయి. కల చెదిరింది. ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకుని గుండెలనిండా ఊపిరి పీల్చుకుని.. తన గదిలోంచి బయటికి వచ్చాడు. తన చుట్టూ ఉన్నదేదీ మారలేదు. పనివాళ్లు ఎవరిపనిలో వాళ్లున్నారు. భార్య మాధవిశెట్టి.. కాఫీ కప్పుతో తన ముందు నిలబడి ఉంది. దాన్ని అందుకుని నుదిటిపై చేరిన తడిని తుడ్చుకుని ఆలోచనలో పడ్డాడు.
సింధూపురం చుట్టుపక్కల రఘుశెట్టి చూడని, దక్కించుకోని అందమంటూ లేదు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన అందంపై ఆశ పెంచుకుని దక్కించుకోడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. తన పూర్వికులు సంపాదించి పెట్టిన ఆస్తులు బాగా ఉండటంతో.. కష్టం తెలియకుండా, సుఖాలకోసం ఆరాట పడ్తుంటాడు. రోజంతా పొలాల్ని చూసి రావడం, మధ్యలో అవకాశం దొరికితే సుఖాలవెంట పరుగెత్తడం తప్ప.. మరో ఆలోచనలేని మనిషి.
అంతలో ఒకరోజు వాన చినుకులు మంద్రంగా రాలుతున్నప్పటికీ.. రఘుశెట్టి తన పొలం నుంచి బుల్లెట్టు బండిపై ఇంటికి బయలుదేరాడు. కానీ, ఊరు శివార్లోకి చేరుకునేసరికి ఆకాశంలో మేఘాలన్నీ మెరుపుదాడికి సిద్ధమయ్యాయి. చూస్తుండగానే వర్షం మొదలై ఉగ్రరూపం దాల్చేసరికి, రఘుశెట్టి తలదాచుకోడానికి దిక్కులు చూశాడు. రోడ్డు పక్కనే, పొలంలో కలుపుతీసే పనిముట్లని సానబెట్టే బైరుకమ్మరోళ్ల డేరా గుడిసె ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్లడానికి ముందుగా కాస్త సంశయించినా.. రఘుశెట్టికి మరో దారిలేక తన బుల్లెట్టు బండిని అటువైపు మళ్లించాడు.బయట వర్షం కురుస్తున్నదని కాబోలు.. బుల్లెట్టు శబ్దానికి కూడా గుడిసెలోంచి ఎవరూ బయటికి రాలేదు. వర్షానికి తడిసిపోతున్న రఘుశెట్టి తన బండిని గుడిసె బయటే ఆపేసి.. లోపలికి పరిగెత్తి, ఆ గుడిసెలో కనిపించిన అప్సరసను చూసి అలాగే స్తంభించిపోయాడు.
ఆమె అతన్నలా చూసి దిగ్భ్రాంతి చెందినా కూడా తడుముకోకుండా..“ఏం కావాలి దొర?” అని అడిగింది.రఘుశెట్టి ఆమె అందం చూసి తేరుకోలేక అలాగే మిన్నకుండిపోయాడు. ఆమె మళ్లీ అదే ప్రశ్నని సంధించేసరికి తేరుకున్న అతను..“హా!.. ఏమీ వద్దు. వర్షం పడ్తుంది కదా! తడిసిపోతానని ఇలా లోపలికి వచ్చాను..” అని తలవెంట్రుకల్ని విదిలించుకుంటూ ఆమెవైపు అలాగే చూస్తుండిపోయాడు.ఆమెకి అతని చూపుల ఉద్దేశం ఇట్టే అర్థమైపోయింది. అందుకే తెలివిగా..“కొలిమి దగ్గర కూసో దొర! సలి తగ్గుతది..”
ఆమె మాట్లాడుతూనే ధైర్యాన్ని తెచ్చుకుంది. ఆ ఊరి దొరల్ని ఎదురించి తాముండే ఆ నెలరోజులు కూడా ప్రశాంతంగా జీవించలేమని ఆమెకు తెలుసు. ఆ నెలరోజుల్లో ఆ ఊరికి అవసరమైన వ్యవసాయ పనిముట్లన్నిటినీ సానపెట్టి.. అవసరమైతే కొత్తవి తయారుచేసి ఎంతోకొంత డబ్బుని పోగేసుకుని.. మరో ఊరికి వలసపోతూ బతికే సంచారజాతికి ఉండే విలువ ఏమిటో ఆమెకి తెలుసు. రఘుశెట్టి కొలిమికి దగ్గరున్న పీటపై కూర్చుని..
“జర నిప్కలు రాజెయ్యు..” అన్నాడు చలికి వణికిపోతూ “గట్లనే దొర! పిలగాణ్ని గిప్పుడే జోలెలేసినా. ఇగ వస్తున్నా..” అని గుడిసెలోని పరదా చాటుకెళ్లింది.
అప్పటి వరకూ రఘుశెట్టి చుట్ట వెలిగించి గాల్లోకి పొగలు వదులుతున్నాడు.అంతలోనే ఆమె వచ్చి కొలిమిలోని బొగ్గుల్ని సరిచేస్తూ గాలిమరని తిప్పసాగింది. కొద్దిసేపట్లోనే సెగలు కక్కుతూ కొలిమి బంగారు వర్ణంలోకి మారింది. ఆమె ఒకవైపు కొలిమిని రాజేస్తుంటే.. మరోవైపు రఘుశెట్టి మనసులో కోరికలు రాజుకోసాగాయి. అతని చూపులన్నీ ఆమె ఒంటిని ఘాటుగా తడుముతున్నాయి. అయినా ఆమె తన ఒంటిని చీరకొంగుతో కప్పేసుకుంటూ.. ఏమీ పట్టనట్లుగా ఉండిపోయింది. కానీ, రఘుశెట్టేకల్పించుకుని..“నీ పేరేంది పిల్లా?” అని ఆమెని అదోలా చూస్తూ, పొగని వదులసాగాడు.“నా పేరు కోమలి దొర!” అని తలెత్తకుండానేకొలిమిని సరిచెయ్యసాగింది.“నీ పేరు నీలకనే షానా సక్కగున్నది. అయినా గింతటి వానల నిన్ను ఒక్కదాన్ని వదిలి నీ మొగుడేడికి పోయిండు?” అని నాలుకతో పెదవుల్నితడుపుకోసాగాడు.
“పనిమీద బయటికెళ్లిండు. బేగిన్నే వస్తాడు. మాలాంటి బతుకులున్నోళ్లు బయటికెళ్లకపోతే కడుపులెట్ల నిండుతాయి?” అని తన భర్త కష్టాన్ని గుర్తు చేసుకుంది.“గా సంగతి సరే గానీ, వానేమో గట్టిగ కురుస్తున్నది. నీ డేరా గుడిసేమో గాలికే కొట్టుకు పోయేటట్లున్నది. సూరుమీది నీళ్లన్నీ గుడిసెలకే వస్తున్నట్లున్నయ్. సంటి పోరగానితోని గీడెట్ల ఉంటావు. గీడనే నా తోట బంగ్లా ఉన్నది. నీవు సరే అంటే.. వాన వెలిసేదాక గాడ వెచ్చగై వద్దువు గానీ..”
రఘుశెట్టి మాటలు ఏవగింపుగా అనిపించాయి. అయినా తనని తాను అదుపు చేసుకుని..“ఏరువాక వానకి ఏరులు పారినా.. గీ గుడిసెలోకి నీళ్లు రావు. గుడిసె సుట్టూ నా మొగుడు ఒక కాలువ సేసిండు. సూరునుంచి కారిన నీళ్లన్నీ గా కాలువల్నే పడ్తయ్. ఊరందరికీ ఎవుసానికి పనికొచ్చే సామాన్లు సేసిచ్చినా గుటా మేం మీ ఊర్లోకి రానట్లే.. గీ నీళ్లు గుటా గుడిసెలోకి రావు దొర. ఇక నీ తోట బంగ్లాలో యాటలు కోసినా నేను మర్లి సూసేదే లేదు. నా మొగుడు బతికినంతకాలం వాడితోనే ఏదైనా..”కోమలి మాటలు రఘుశెట్టికి కొలిమిలో కాలుతున్న ఇనుప చువ్వలకంటే ఎక్కువ వాడివేడిగా అనిపించాయి. రఘుశెట్టి కాసేపటి మౌనం పిమ్మట పెదవి విరుస్తూ..“కొలిమిలో కాలుతున్నంత సేపే ఆ బొగ్గులన్నీ బంగారు రంగులో కనిపిస్తాయి. ఆరిపోతే నలుపే. ఇంతకాలం ఆ నలుపులోనే నలిగిపోయాను. ఒక్కసారైనా బంగారంలో మునిగి తేలాలని ఉంది. నీలో నేను నా జన్మలో సూడని సక్కదనముంది. కొలిమి నిండా నీలాగా బంగారు పువ్వులే కనిపిస్తున్నాయి.
నీవు ఎప్పటికీ ఆరని బంగారు పూల కొలిమివి. ఆ కొలిమిలో ఒక్కసారి కాలిపోవాలని ఉంది..”రఘుశెట్టి మాటలు ఆమెకి మహాకంపరంగా అనిపించాయి. అయినా ఆమె తెలివిగా ఆవేశపడకుండా..“అవును దొర! బొగ్గులు నలుపే కానీ, ముట్టుకుంటే మసిమరకతోనే ఆపేస్తాయి. కానీ, బంగారు పూలకొలిమికి కాల్చడం, మరమ్మతులు సేయడం తప్ప.. జాలిపడి వదిలెయ్యడం రాదు కదా. బొగ్గులు బంగారు పువ్వులుగా మారిన మరుక్షణం మళ్లీ బొగ్గులుగా మారలేవు. బూడిద తప్ప ఇంకేమీ మిగలదక్కడా. గీ పూలకొలిమి సూడనికే సక్కగుంటది. కొలిమికి సేరిందేది గుటా
మునుపటిలాగా తిరిగిపోదు. కరిగైనా పోవాలే.. లేకపోతే కాలైనా పోవాలే..”కోమలి మాటలు రఘుశెట్టికి తనని కొలిమిలో వేసి కాలుస్తున్నట్లుగా అనిపించాయి. ఇక ఆమె తన దారికి ఎట్లాగూ రాదని అర్థమయ్యాక..“సరే కోమలి! నీకు నా ఆస్తంతా రాసిచ్చినా నీవు నా దగ్గరికి రావని అర్థమైంది. కానీ, నీవు నాకొక మాటివ్వాలి. నాకొక కత్తి సేసి పెట్టాలి.
దాన్ని సూస్తుంటే అది నీకంటే సక్కగుండాలి. దానికోసం నేను ఎన్ని డబ్బులైనా ఇస్తాను. కానీ, అది సెయ్యకుండా నీవు ఊరు దాటితే మాట మంచిగుండది. భయానా ఎంతివ్వల్నో సెప్పు..”చెప్తున్న రఘుశెట్టి మాటల్లో ఇంకేదో వక్రబుద్ధి ఉన్నట్లనిపించింది. అందుకే కాసేపు మౌనంగా ఉండిపోయింది. దాంతో రఘుశెట్టి..“డబ్బులిస్తాను నా తోట బంగ్లాకి రమ్మంటే రానంటివి. పోనిలే పతివ్రతవని గమ్మునుంటి. ఊరందరికి సేసిచ్చినట్లే నాగ్గుటా ఒక కత్తి సేసియ్యమన్నాను. దానికి గుటా ససేమిరా అంటున్నావు. సంగతేమున్నది? నన్ను కాదని గీ ఊరు దాటుతావా? నేను అనుకుంటే నిన్ను గిప్పుడే నా బంగ్లాకి ఎత్తుకుపోతాను. ఎంత కావల్నో అడుగు కానీ, వారం దినాల్లో నాకు కత్తి కావాలి. యాభై రూపాయలు భయానా కింద తీసుకో” అని తనని ముట్టుకుంటూ డబ్బు ఇస్తుంటే, కోమలి వెనక్కి జరిగి..“అహ! భయానేమీ వద్దు దొర. కత్తిని సేసినంక డబ్బులిద్దువు గనీ. నా మొగుడికి తెల్వకుండా భయానా తీసుకోను..”ఆమె మాటల్లో భయం తొణికిసలాడింది.“భయానా తీసుకోవడానికే భయపడుతున్నావంటే.. ఇంకేదో ఉన్నట్లుంది. ఈ ఊరి కరణం గాడికి శానా సామాన్లు సేసిచ్చిండ్రు కదా. వాడి బంగ్లాకేమైనాపోయినవా గిటా?”రఘుశెట్టి మాటలు కొలిమిలోని వేడికంటే ఎక్కువ కోపాన్ని కలిగించాయి.
“దొరా! నాలుగు మాటలొద్దు. మేలిమి బంగారు సహితం మెరవాలన్నా కొలిమికే చేరాలి. కానీ, కొలిమి ఎప్పటికీ బంగారుపూలతోనే నిండి ఉంటుంది. కొలిమి బంగారమవ్వాలంటే.. బొగ్గులు గట్టిగా ఉంటే సరిపోతది. మా బతుకులు బొగ్గులే కావొచ్చు. కానీ, కాలిస్తే బంగారు వర్ణమే.. మా గుణాల మాదిరి. మా బతుకులు మేలిమి బంగారమని మురిసే మీలాంటోళ్ల గుణాలన్నీ బొగ్గుల్లాగా నలుపే కదా..”కోమలి మాటల్లో కొలిమిలోని సెగలు కనిపించాయి.
“ఏయ్! ఏం మాట్లాడుతున్నావే..” అనిచెయ్యెత్తబోయాడు.
“వాన ఆగింది! జర పొయిరా దొర” అని బయటికి చెయ్యి చూపిస్తూ.. కోమలి కొలిమి దగ్గరినుంచి లేచింది.రఘుశెట్టికి ఆమె మాట చాలా అవమానంగా తోచింది. తన ఉక్రోశాన్ని ఆపుకోలేక..“నేను అడిగిన కత్తి సెయ్యకపో. గప్పుడు నీ సంగతి సెప్తాను..” అని కోపంగా లేచి వెళ్లిపోయాడు.
“కత్తి సెయ్యనీకే దొరా.. మేం పొట్ట చేత్తో పట్టుకొచ్చింది. గింతకీ ఆ కత్తి దేనికి దొర..” అని అడిగింది.పుండుమీది కారం లాగా.. వర్షం వెలిశాక చెట్టుకొమ్మల్లో దాగిన నీటిబొట్లతోసహా ఆమె మాటలు కూడా భారంగా కురుస్తున్నట్లుగా అనిపించింది. అయినా ఏం బదులు చెప్పకుండానే వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయమే రఘుశెట్టి తన పొలానికి వెళుతూ కోమలి గుడిసె వైపుకి రోడ్డుమీది నుంచే చూశాడు. కానీ, అక్కడ అప్పటికే చాలామంది జనాలు గుమిగూడున్నారు. దాంతో ఉబలాటం ఎక్కువై రఘుశెట్టి తన బుల్లెట్టు బండిని అటువైపుగా మళ్లించాడు. అప్పటికే కోమలి తన భర్త కొలిమిలోంచి తీసిన ఇనుప రాడ్డుని పట్టుకారుతో పట్టుకుని కాసీడాకలిపై ఉంచగా.. సమ్మెటతో తన శక్తినంతా కూడబెట్టుకుని మోదసాగింది. కోమలిలాంటి అందగత్తె అలా సమ్మెటతో బాదుతుంటే.. అదే అవకాశమనుకుని అందరూ అక్కడే గుమిగూడిపోయారు. దాంతో రఘుశెట్టికి కోపం నషాలానికి అంటింది. అక్కడున్న వాళ్లందరినీ ఎలాగైనా వెళ్లగొట్టాలని అనుకున్నాడు.
ముందుగా తాను అప్పులిచ్చిన అందర్నీ ఆ అప్పుల వంకతో భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. తన స్థాయి వ్యక్తుల్ని సూటిపోటి మాటలతో బెదిరించాడు. రఘుశెట్టి భయానికి ఒకరొకరు అందరూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. అందరు వెళ్లిపోయాక..“ఏం కోమలి! నీ మొగుడు పొద్దుపొద్దున్నే దుకాణం బాగానే తెరిసిండు. నీ వంకతో ఈ ఊరిని మొత్తం దోసుకుని పోతాడేమో. సరేలే గదంతా నాకెందుకు!? నా కత్తి కథ యాడిదా కొచ్చింది..” అని కోమలివైపు అదోలా చూశాడు రఘుశెట్టి.
దాంతో ఆమె మారు మాటాడకుండా తన భర్తవైపు చూసింది.“కత్తి దేనికోసం? ఎట్లుండాలి దొర?” అని అడిగాడు అతను.“ఊ.. బారెడుండాలి” ముక్తసరిగా అన్నాడు.“సరే దొర! కత్తి దేనికోసం సెయ్యాలే” అని మళ్లీఅడిగాడు కోమలి భర్త.“మనుషుల్ని నరకడానికి!..” అనేసరికి భార్యాభర్తలు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.“గట్లాంటి పనుల కోసం నేను కత్తిని సేయను దొర” అని కొలిమివైపు చూశాడు కోమలి భర్త.“ఏమిరా.. నేను సెప్తే సెయ్యనంటవా? ఆ కత్తిని సెయ్యకపోతే నిన్నే సంపుతా” అని అనేసరికి.. కోమలి కోపంతో ఏదో అనబోయింది.అంతలోనే జోలెలో నిద్రపోతున్న పిల్లవాడు ఏడ్చేసరికి కోమలి అటుగా వెళ్లింది.“దొరా! మేము పొట్ట చేతపట్టుకుని ఊరురా తిరిగి బతికేటోళ్లం. మాతోటి గట్లాంటి పనులు సేయిస్తే.. తెలిసినోళ్లు మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టరు. నీ కాళ్లు మొక్కుతా! గా కత్తిని సేసుడు మాతోని కాదు..” అంటూ అతని కాళ్లు పట్టుకోబోయాడు.
దాంతో రఘుశెట్టి వెనక్కి జరిగి..“ఇంతకీ నీ పేరేమది” అని అడిగాడు.
“నా పేరు పండరి దొర..”“సూడు పండరీ! నేను ఇష్టపడ్డది నాకు దక్కాల్సిందే. లేకపోతే బాగుండదు. వారం దినాలల్లా నాకు కత్తి కావాలి. దానికి భయానా వంద రుపాలు తీసుకో! కానీ, పని మాత్రం పక్కా జరగాలి”.. పండరి చేతుల్లో డబ్బు ఉంచి, రఘుశెట్టి తన బుల్లెట్టుపై వెళ్లిపోయాడు.
పండరి ఆ డబ్బుల్ని కాదనలేక.. అవుననలేక అలాగే స్తంభించి పోయాడు.మరుసటి రోజు రఘుశెట్టి మళ్లీ వచ్చాడు. అతను అక్కడికి వస్తాడని తెలిసిన అప్పు తీసుకున్నవాళ్లు,ఇంకా భూస్వాములు అక్కడికి రానేలేదు. అందుకే అక్కడే పనిముట్ల పని ఉన్నవాళ్లు తప్ప ఇంకెవరూ
కనిపించలేదు. దాంతో తన సూటిపోటి మాటలతోకోమలిని హింసించసాగాడు. ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటి నుంచి.. రఘుశెట్టి మానసిక పరిస్థితి మారిపోయింది.
కలలో కోమలి తన కౌగిట్లోకి తనని ఆహ్వానిస్తున్న దృశ్యం ఒకవైపు.. అంతలోనే తన గొంతుపైకి దూసుకొస్తున్న కత్తి దృశ్యం మరోవైపు. కానీ, ఆ కత్తిని దూస్తున్న చెయ్యి ఎవరిదోనని తెలుసుకునే లోపలే.. రఘుశెట్టి తన తోటబంగ్లా దగ్గరున్న అరటి తోటలో తల, మొండెం
వేరై కనిపించాడు.
అదే ఉదయం, కోమలి మరోవైపు తమ డేరా గుడిసెని మడతపెట్టి.. గాడిదపై వేసుకుని ఏమీ ఎరుగని భర్తతోపాటు వేరే ఊరికి బయలుదేరింది. అక్కడ మరో దొరకోసం మళ్లీ వారం రోజుల్లోనే కత్తి చెయ్యడానికి.. కాదు కాదు, గుండెల్లోకి దుయ్యడానికి కాబోలు. లేత భానుడి వెలుగులో, కొలిమిలో సెగలు కక్కుతున్న నిప్పురవ్వలా.. నింగిలోకి తీసుకెళ్తున్న తారాజువ్వలా.. తన కాళ్లకున్న మువ్వలదిరేలా అడుగులు ముందుకు వేసింది.
దారి మధ్యలో పండరి అమాయకంగా ఆమెనిఒక మాటడిగాడు..“గీ ఊరిలో బాగానే గిరాకీ అయ్యింది కదా. కానీ, ఎందుకు పోదమని తొందరపెడ్తివి?..”“ఏం సెప్పమంటావు బావ! ఆకెళ్లి ముల్లుమీద పడినా, ముల్లెళ్లి ఆకుమీద పడినా.. సిరిగేది ఆకేననిసులకనగా అంటాం కదా! కానీ, ముల్లులాంటి మూర్ఖులనుంచి తప్పించుకోలేనప్పుడు అడ్డుపడిన ఆ ఆకు కొమ్మనుంచి తెగిపోకుండా.. కాస్త చిరిగినా ఫర్వాలేదు, మిగతా భాగంతో చిగురించవచ్చని అనుకుంటే ఎంతబాగుంటుందో కదా..”కోమలి మాటలు అర్థం కాకపొయ్యేసరికి పండరి అదోలా చూశాడు. “అదేం లేదు బావా! ఆడది తనతో కంచాన్ని, మంచాన్ని పంచుకున్న వాడినైనా మరుస్తుంది కానీ, మనసుని పెనవేసుకున్న వాణ్ని ఎప్పటికీ మరవదు. వాడికోసమే ఎంతకైనా తెగిస్తుంది. ఆడదాని అందం కోసం యుద్ధాలు చేసే మగాళ్లు ఉన్నట్లే.. మనసిచ్చిన మగాడికోసం ఎంతకైనా తెగించే ఆడవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటప్పుడు ఆత్మగౌరవం కోసం ఆరాటపడే ఆడవాళ్లని తక్కువ అంచనా వెయ్యకపోవడమే మంచిది..” ఆమె మాటలు అర్థంకాక తలపట్టుకున్నాడు పండరి. రఘుశెట్టి ఆమె అందంపై ఆశపడి, పండరిని చంపేస్తే.. కోమలి శాశ్వతంగా తన దగ్గరే ఉండిపోతుందని అత్యాశపడి ప్రాణాలు పోగొట్టుకుని మట్టిలో కలిశాడు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి
రూ.3 వేలు పొందిన కథ.
యం. రాజేష్ ఖన్నా
ఆడదాని కోసం యుద్ధాలు చేసే మగాళ్లు ఉన్నట్లే, మనసిచ్చిన మగాడికోసం ఎంతకైనా తెగించే ఆడవాళ్లు కూడా ఉంటారని చెప్పే కథ.. పూల కొలిమి. రచయిత యం. రాజేష్ ఖన్నా. ‘ఈరే’ కలంపేరుతో కథలు రాస్తున్నారు. ఈయన స్వస్థలం జహీరాబాద్. ఎమ్మెస్సీ (టెక్), పీజీడీహెచ్ఆర్, ఎంసీజే, ఎల్ఎల్బీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా పూణెలో ఉన్నారు. 2005 నుంచి రచనావ్యాసంగం మొదలుపెట్టారు. వీరి మొదటి నవల.. ‘ప్రేరణ’. ఇప్పటివరకూ వందకుపైగా కథలు, దాదాపు నూట యాభై కవితలు రాశారు. వీటిలో పలు కథలు, కవితలు.. జాగృతి, సహరి, దిక్సూచి, మనోహరం తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకూ ప్రేరణ, నవవధువు ప్రేమకథ – మొదటి భాగం, కేయా ది వారియర్ పేరుతో మూడు నవలలు ప్రచురించారు. ఆవిరౌవుతున్న అమ్మ, అంతర్మథనం, నగ్నాశ్రువులు, ఎడారి నావ, దారి చూపిన బాటసారి, నగ్న పాదాలు, అర్ధాంగి మనసు, శ్రీవారి పరిణయం, కుయిలి, నవవధువు ప్రేమకథ-రెండో భాగం, నవవధువు ప్రేమకథ-మూడో భాగం, రేపటి యోధులుతోపాటు మరికొన్ని మినీ నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. కాకోలు, సంసిపోతున్న సంస్కృతి నాటకాలు రాశారు.
-యం. రాజేష్ ఖన్నా
74482 53472