జరిగిన కథ : యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న జాయప.. నీలాంబ ద్వారా చక్రవర్తిని కలిశాడు. తాను యుద్ధ సంసిద్ధుడనై ఉన్నాననీ, తననూ యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించాలని కోరాడు. ఆ మాటలు వింటూనే చక్రవర్తి కోపోద్రిక్తుడు అయ్యాడు. యుద్ధమంటే సంగీత గీతాలమధ్య నర్తించడం కాదనీ, వెళ్లి నాట్యాభ్యాసం చేసుకోమని చెప్పాడు. దాంతో అక్కణ్నుంచి మౌనంగా నిష్క్రమించారు నీలాంబ, జాయప. యుద్ధంలో ప్రవేశం దొరక్కపోవడం తన ఓటమిగా భావించాడు జాయప. ఓవైపు కాకతీయ రాజ్యమంతా యుద్ధ జ్వరంతో ఊగిపోతుండగా.. జాయప మాత్రం దీనంగా ఓ గదిలో ఉండిపోయాడు.
గణపతిదేవుడు సమస్త అస్త్ర శస్త్ర కవచ శిరస్ర్తాణ సహితంగా స్వయంగా యుద్ధరంగానికి కదలబోతున్నాడన్న వార్త.. కాకతీయ రాజ్యాన్ని ఉద్వేగంతో ఊపేసింది.
“ఒకసారి ఓడి పారిపోయిన పిరికియోధుడు. మళ్లీ తోక జాడిస్తున్నాడు. ఇప్పుడు మా చక్రవర్తి స్వయంగా వచ్చి నీ తోక కత్తిరించబోతున్నాడు. కాచుకో!”..
“గణపతిదేవుడి చేతిలో నీ చావుమూడింది!”..
ప్రజలు చర్చోపచర్చల్లో గణపతిదేవుణ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన్ను కాపాడమని గుడుల్లో పూజలు.. వింతవింత పాటలు.. ఆటలు.. పందేలు కూడా.
శ. సం.1123 లో కాకతీయ సైన్యంపై యుద్ధానికి భయపడి పారిపోయి.. పిష్టపురంలో తలదాచుకుని, కయ్యానికి కాలు దువ్వుతున్న పృథ్వీశ్వరుడిపై రెండోమారు యుద్ధ ప్రకటన చేసి, ఆ యుద్ధానికి సైన్యంతో స్వయంగా కదిలిన గణపతిదేవుడికి.. మహోన్నతమైన వీడ్కోలు పలికింది రాజధాని అనుమకొండపురం.
ముందు మహాగజ వాహనంపై అపరరుద్రుడిలా యువరాజు గణపతిదేవుడు. పక్కగా సర్వసైన్యాధ్యక్షుడుగా అనుభవాల వీరభద్రుడు మల్యాల చౌండ. వెనుక యోజనం పొడవున్న సైనిక పటాలం.
అనుమకొండ అందించిన ఘనమైన వీడ్కోలుతో
కాకతీయ మహాసైన్యం దక్షిణదిశగా కదిలింది. ఆ వీడ్కోలు సంబురాలను ఎన్నో రోజులు చెప్పుకొన్నారు అనుమకొండ ప్రజలు.
అయితే, సైన్య పారావారం కదలబోతున్న ముందురోజు ఓ సంఘటన జరిగింది. సుబుద్ధిని జాయప ఉంటున్న కంటకదొర నివాసానికి తీసుకువచ్చారు మిత్రులు. అప్పటివరకూ జాయప, చక్రవర్తిని కలిసి యుద్ధానికి అనుజ్ఞ ఇవ్వమని అభ్యర్థించాడని.. చక్రవర్తి తిరస్కరించాడని సుబుద్ధికి తెలియదు.
జాయపను నిరాశనుంచి బయటికి తీయడానికి మిత్రులు సుబుద్ధిని ప్రయోగించారు. జాయపను అలా చూసి హతాశుడయ్యాడు సుబుద్ధి. ఆయనకు జాయప శక్తియుక్తులపై అపార నమ్మకం.
“అయ్యయ్యో.. ఏమిటి జాయపా!. ఇంత చిన్న విషయానికి తమరు ఇలా దీనంగా బాధపడటం ఎందుకు? నాకు చెబితే మీరు నిరభ్యంతరంగా యుద్ధంలో పాల్గొనేలా నేను సహకరించేవాణ్ని కదా. మూల సేనాపతులే కాదు.. భృత్య సైన్యాధ్యక్షుడు, సమయశెట్టి వల్లయ లాంటి ఎందరో యుద్ధముఖ్యులు నాకు మిత్రులు కదా!” అన్నాడాయన.
జాయప చాలా ఆశ్చర్యపోయాడు.
“కత్తి వాడాల్సినచోట గొడ్డలి వాడకూడదు. కేవలం సూదితో సమసిపోయే సమస్యకు నువ్వు బరిసె వాడావు. చక్రవర్తి దృష్టిలో నువ్వు నాట్యకారుడివి. నువ్వు యుద్ధానికి వెళ్లడానికి ఆయన ఎలా అనుమతి ఇస్తారనుకున్నావు?” అన్నాడు సుబుద్ధి.
నిజమే.. తనే పెద్దతప్పు చేశాడు.
జాయప తెప్పరిల్లాడు.
సుబుద్ధి అందరికీ తన ఇంట్లో విందు ఏర్పాటుచేసి, జాయప కాస్త తేరుకున్నాక తన మంత్రాంగం చెప్పాడు.
“మీరు యుద్ధంలో పాల్గొనాలని ఎందుకు భావించారు.. మీ అక్కలను విడిపించడానికి ఇదొక మార్గంగా భావించారు కాబట్టి. అందుకు మీ నాట్యం సరిపోతుంది. యుద్ధభూమిని ఎందుకు ఎంచుకున్నారు.
పైగా మీకు చౌండసేనానుల వారి అండదండలున్నాయి. ఇవ్వాళ కాకపోయినా రేపైనా చక్రవర్తికి మీ గురించి చెప్పి, మీ అక్కలను బంధవిముక్తులను ఆయన చేయ
గలరు. మీ తొందరపాటువల్ల చక్రవర్తి కోపానికి గురయ్యారు. ఇప్పుడు మీరు యుద్ధం చెయ్యక తప్పదు. ఒక పని చేద్దాం. మన గజసాహిణి, ఎంతోమంది యుద్ధ సమాహర్తలు నా మిత్రులే! వాళ్లతో చెప్పి తమరిని
ఏదో ఒక దళంలో చేర్చగలను. కానీ, వెంటనే కాదు. మీరు స్కంధావారానికి దగ్గరగా వచ్చి ఉండాలి. నేను సమయం చూసి వేగుల ద్వారా వార్త పంపిస్తాను. అప్పుడు రంగంలోకి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత మీ అసమాన ధైర్యస్థయిర్యాలు ప్రదర్శించాలి..” అన్నాడు.
ఆ రాత్రే జాయపను, మిత్రబృందాన్ని గజసాహిణి కొమరయ నాయకుడి వద్దకు తీసుకుపోయాడు. సైనిక శిక్షణశాలలో ఆయన వీళ్లకు చిరపరచితుడే.
“యుద్ధానికి వస్తానంటే వద్దని ఎలా అంటాను!? పైగా ఏనుగులతో మంచి విన్యాసాలు చెయ్యగలవాడవు..” అంటూ సానుకూలంగా మాట్లాడాడు.
“ఇప్పటికి దళాలన్నీ నిర్ణయమై పోయాయి. సుబుద్ధి చెప్పినట్లు యుద్ధరంగం వద్ద ఉండండి. యుద్ధం మొదలయ్యాక పరిస్థితులు మనచేతిలో ఉండవు. సమయాన్నిబట్టి మిమ్మల్ని లోపలికి తీసుకుంటాను!” అన్నాడు.
జాయపలో, మిత్రబృందంలో ఉత్సాహం తిరిగి వచ్చింది. ఆ రాత్రి మరోవార్త కూడా జాయప బృందానికి తెలిసింది.
కంటక కూడా అప్పటికే సామంత గిరిజన సైన్యపటాలంతో యుద్ధభూమిలో ఉన్నాడు. మిత్రులు అందరూ ఏదో ఒకమార్గంలో యుద్ధ సైన్యంలో ఉన్నారు. మిగిలినవారు.. జాయప, నాగంభట్టు, త్రిపుర.
సైన్య పటాలం కదలివెళ్లాక యుద్ధాభ్యాసాలు చేస్తూ సుబుద్ధి పిలుపు కోసం వేచి చూస్తున్నారు ముగ్గురూ.
సైన్యం యుద్ధానికి వెళ్లడంతో రాజ్యమంతటా.. ముఖ్యంగా అనుమకొండ, ఓరుగల్లు ప్రాంతమంతా చాలా ఉద్విగ్నంగా ఉంది. ప్రతి కుటుంబం పనిపాటలు పక్కనబెట్టి, యుద్ధంలో గెలవాలని భగవంతుణ్ని కొలుస్తూ.. తదేక ధ్యానంలో ఉన్నది. ప్రజలంతా యుద్ధవార్తల కోసం చెవులు రిక్కించి ఉన్నారు.
రాజవార్తా సంబంధి ఎప్పటికప్పుడు వచ్చిన వార్తల వివరాలు ప్రకటిస్తున్నాడు. ఆ సమయానికి ప్రజలు అక్కడ విపరీతంగా గుమిగూడుతున్నారు.
“చాగిరాజ్యపు సరిహద్దుల్లో స్కంధావారం ఏర్పాటుచేశారు. యుద్ధస్తంభం నాటి తాంబూలం మార్చుకుని కాహళీ తూర్యరావాలతో యుద్ధం ప్రారంభమయ్యింది. వెలనాడు పినచోడ మహారాజు సైన్యానికి అగ్రభాగాన ఉండగా.. కాకతీయ సైన్యం, నెల్లూరు తిక్కభూపాల సైన్యం, కొండపడమటి సైన్యం, చాగి సైన్యం, ధరణికోట సైన్యం, నతవాడి సైన్యం సహాయకంగా వచ్చి నిలిచాయి. చక్రవర్తివారే స్వయంగా రావడంతో ఆయా సామంత మహారాజులు కూడా వచ్చి స్కంధావారాన్ని శత్రు దుర్భేద్యం చేశారు!”..
పురవాసుల జయజయ ధ్వానాలు..
“ఈసారి ఆ పృథ్వీశ్వరుణ్ని వదలిపెట్టకూడదు.
తరిమితరిమి చంపాలి!”..
“అందుకేగా చక్రవర్తి స్వయంగా వెళ్లింది. వాడికి చావు తప్పదు!”..
రెండోరోజు..
“జయ.. జయ జయ జయ.. జయ
పృథ్వీశ్వరునికి సహాయకంగా కూడా కొన్ని మిత్ర
రాజ్యాల సైన్యం యుద్ధంలో పాల్గొన్నట్లుగా
తెలుస్తున్నది. ఈ రోజు మన సైన్యానికి గట్టి దెబ్బతగిలింది. దాదాపు వెయ్యిమంది వీరమరణం పొందినట్లు వార్తలు వచ్చాయి.
జయ.. జయ జయ జయ.. జయ”
అంతా నిశ్శబ్దం.. విషాదం!
మూడోరోజు..
“జయ.. జయ జయ జయ.. జయ..
ఈరోజు మన వీరసైనికులు విజృంభించి శత్రుసైన్యాన్ని ఊచకోత కోశారు. మన సైన్యం మరింత ముందుకు చొచ్చుకుపోయింది. చక్రవర్తి గణపతిదేవులు వీరవిహారం చేస్తున్నట్లు.. ఆయన యుద్ధ పరాక్రమానికి మన సేనానులే ఆశ్చర్యపోతున్నట్లు తెలిసింది. జయ.. జయ జయ జయ.. జయ”..
అనుమకొండ ఉద్వేగంతో ఊగిపోయింది.
ఎక్కడ విన్నా..
“గణపతిదేవుడికి జై!”
“హరహర మహాదేవ.. గణపతిదేవునికి మహత్తర శక్తులు అందించు తండ్రీ!”
నాలుగవ రోజు..
“జయ.. జయ జయ జయ.. జయ
మన సర్వసైన్యాధ్యక్షుడు యుద్ధతంత్రం మార్చారు. ముందు పృథ్వీశ్వరుని సైన్యాన్ని వదిలి అతని మిత్ర సైన్యాన్ని చీల్చి చెండాడటం ప్రారంభించారు మనవాళ్లు. అతని మిత్ర సైన్యంలోని చాలామంది సేనానులు నిహతులయ్యారని మన వేగులు తెచ్చినవార్త!
జయ.. జయ జయ జయ.. జయ”..
పురవాసులంతా యుద్ధం గెల్చినంత సంబురాలు చేసుకున్నారు. ఊరంతా రంగురంగుల బుక్కాయిలు, జినుగు జవ్వాదిలాంటి సుగంధద్రవ్యాలు, పసుపు కుంకుమలాంటి పవిత్రద్రవ్యాలు చల్లుకుని వీధులంతా గంతులేశారు.
“వాణ్ని ఒంటరి చేసి చంపాల్సిందే! వాడికి తోడు
వచ్చిన వాళ్లను ముందు శిక్షించడం మంచి ఆలోచనే”..
“నేను ముందే చెప్పానా!. చౌండసేనానికున్న
అనుభవం ఇక్కడ ఉపయోగపడింది”..
ఐదవరోజుకు సైన్యంలో చనిపోయిన వారి వివరాలు, కొన్ని శవాలు, కొందరు క్షతగాత్రులు రాజధానికి చేరారు. వారికి పూర్తి యుద్ధ గౌరవమర్యాదలు..
శుశ్రూషలు చేశారు.
జాయప బృందం చాలా ఉద్వేగంగా ఉంది. ఇంత
వరకూ సుబుద్ధి నుంచి వార్త రాలేదు. ముగ్గురూ సిద్ధమై కూర్చున్నారు. చివరికి ఆరవరోజు అర్ధరాత్రి సుబుద్ధి పెద్దకొడుకు మంచన.. జాయప నివాసానికి వచ్చి వార్త అందించాడు.
“నాన్నగారు వెంటనే బయల్దేరమన్నారు. స్కంధా
వారానికి రావద్దని.. ఆవల ఉన్న రుద్రేశ్వర దేవాలయం వద్ద సిద్ధంగా ఉండమని చెప్పారు”..
అప్పటికప్పుడు నలుగురూ సమాయత్తమై ఆ అర్ధ
రాత్రివేళ తమతమ గుర్రాలను స్కంధావారంవైపు పరుగులు పెట్టించారు. సుబుద్ధి నిర్దేశించిన రుద్రేశ్వరాలయం వద్ద బస చేశారు. ఏడవరోజు యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నది.
పిలుపులేదు. వార్తలేదు. రుద్రేశ్వరుణ్ని ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోయారు మిత్రులు. క్షణం కూర్చోలేదు.
కత్తి తిప్పుతూ.. బరిసె విసురుతూ.. ఎగిరి దూకుతూ యుద్ధ సన్నద్దతతోనే ఉన్నారు.
జాయప చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. ఓ పెద్ద యుద్ధం అతనికి తొలిసారి. ఏడేళ్లుగా అనుభవించిన సంఘర్షణలు.. అభిమానించిన పెద్దల తత్వం.. తన ముందున్న పెద్ద బాధ్యత.. అవతల యుద్ధం చేస్తున్న తన తండ్రి.. బాబయలు.. వెలనాడు, ద్వీపసైన్యం..
ఆ పృథ్వీశ్వరుడు కూడా బంధువేనట.
ప్చ్.. ఏం జరుగుతుందో!?..
ఎనిమిదవరోజు అక్కడికి కొమరయ గజసాహిణి నుంచి సరాసరి వార్త వచ్చింది. వచ్చినవాడు ముగ్గురినీ నిశితంగా పరిశీలించి..
“ముందు జాయప యుద్ధంలోకి వెళ్తాడు. అతణ్ని
కేశవశెట్టి దళంలోకి పంపుతున్నాం. మీరిద్దరూ సారయ అనే సమాహర్త అధీనంలో మొదటి అంచె బృందంలో ఉంటారు” అని తీసుకుపోయాడు.
అక్కణ్నుంచి కొంతదూరంలో యుద్ధ క్షేత్రం.
జాయపను కేశవశెట్టికి అప్పగించి నాగంభట్టును,
త్రిపురను సారయ సమాహర్తకు అప్పగించాడు
గజసాహిణి. జాయప యుద్ధక్షేత్రంలోకి వెళ్లగా.. సారయ సమాహర్త వద్ద నిలబడి యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ తగిన ఆయుధ, వైద్య సదుపాయాలకు సర్వసన్నద్ధంగా ఉన్నారు నాగంభట్టు, త్రిపుర.
ఎటుచూసినా కత్తులతో ద్వంద్వయుద్ధం చేస్తున్న సైనికులు.. గుర్రాల పరుగులు.. రథికుల నుంచి బాణాలవర్షం.. యుద్ధ దృశ్యం భయంకరంగా ఉంది. ఏనుగుల ఘీంకారాలు.. అరుపులు.. పెడబొబ్బలు.
యుద్ధభూమి భయంకరంగా ఉంది. యుద్ధమంటే ఎలా ఉంటుందో ఇప్పుడే చూస్తున్న ఆ కౌమార
నవయవ్వనులు అన్నిటినీ విభ్రాంతిగా తిలకిస్తున్నారు.
జాయపకు సైనికదుస్తులు, ఆయుధాలు, రక్షణ కవచాలు ఇచ్చాడు మారయ. కాకతీయ సైనికులని తెలిపే తోలుపటక భుజాల చుట్టూ కప్పాడు. దానిపై రాయగజకేసరి ముద్రిక ఉంది. అంచే బృందాలలో ఉన్న నాగంభట్టు, త్రిపుర మరోరకం దుస్తులు, యుద్ధ సూచికలు ధరించారు.
రుద్రునికి నమస్కరించి తల్లిదండ్రులను తలచి యుద్ధభూమిలో కుడికాలు పెట్టిన జాయప.. పూర్తిగా లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకరించాడు. మరో ఘడియలో ఓ శత్రుభటుడు జాయపను చూస్తూ కత్తి ఝళిపిస్తూ మీదమీదకు రాసాగాడు. జాయప అతణ్ని ఎదుర్కోవడానికి సిద్ధమై కత్తివాటంగా పట్టుకుని గుర్రాన్ని అతని గుర్రం చుట్టూ తిప్పాడు.
యుద్ధభూమి.. ఎదురుగా శత్రు సైనికులు.. చేతిలో కరవాలం.. అతణ్ని ఎదుర్కోవాలి..
లిప్తకాలం కళ్లు మూసుకున్నాడు. ఓ చేతితో కళ్లాన్ని పట్టుకుని మరో చేత్తో అత్యంత వేగంగా కత్తి ఎత్తాడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284