‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
ఈ మధ్య సుహాస్ చాలా సమయం నాతోనే గడుపుతున్నాడు. కొవిడ్ కారణంగా స్కూళ్లు మూసివేయడంతో తరచూ నా కూడా పొలానికి వస్తున్నాడు. చదివేది తొమ్మిదోక్లాసే అయినా.. చాలా కబుర్లు చెబుతాడు. టచ్ ఫోన్ కొంచెం అలవాటు కావడంతో ఏవేవో చూస్తూ, ఆసక్తికరమైన విషయాలుంటే నాకు చెబుతుంటాడు. సుహాస్.. వాళ్ల అమ్మానాన్నలతో యాప్రాల్‌లో పెద్ద అపార్టుమెంటులో ఉంటున్నాడు. ప్రతి శనివారం వెళ్లి, వాణ్ని మా రాంపల్లి విలేజ్‌కు తీసుకువచ్చేవాణ్ని.
ప్రస్తుతం స్కూళ్లు బంద్ కావడంతో మా ఊరిలోనే ఎక్కువగా ఉంటున్నాడు. వచ్చేటప్పుడు వెంట ఫుట్‌బాల్ తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆడటానికి వాడి వయసు పిల్లవాడొకడే ఉన్నాడు.. మా ఎదురింట్లో! అతను వచ్చేవరకూ మా ఇంటి ముందరి రోడ్డు మీద సుహాస్ ఒక్కడే ఫుట్‌బాల్‌ను పాదం మీంచి మోకాలు వరకూ, ఆపై వరకూ తిప్పుతూ ఆడుతుంటాడు. అప్పుడప్పుడూ నేను ఆసక్తితో చూస్తుంటాను.
“అలా బాల్‌ను చేత్తో పట్టుకోకుండా కాలితోనే తిప్పడానికి ఏమన్నా పేరుందా!?” అని అడిగాను ఒకనాడు.
“‘ఉంది తాతయ్యా!” అని,
ఫుట్‌బాల్‌ను చేత్తో పట్టుకుని..
“జగ్లింగ్” అంటారు అని చెప్పి, బంతి మీదనే దృష్టిపెట్టి, మళ్లీ పాదం మీదినుంచి మోకాలు వరకూ.. అటూ ఇటూ తిప్పుతూ మధ్యలో బాల్‌ను నేలమీదికి తెచ్చి గట్టిగా తన్నాడు.
కంకర రోడ్డు మీద రాళ్లు పైకి రావడంతో, కాలికి ఓ రాయి తగిలి.. “అమ్మా” అన్నాడు.
చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి అటుచూశాను. దెబ్బ గట్టిగానే తగిలినట్టున్నది. రక్తం కారుతున్నది. వాడి కళ్లల్లో నీళ్లు!
“లోపలికి రా!” అని పైపు దగ్గరికి తీసుకెళ్లి, కాలిమీద చల్లని నీళ్లు కాసేపు పడేలా చేశాను. తర్వాత మందువేసి, కట్టుకట్టాను.
“తగ్గిపోతుందిలే. రెండ్రోజులు కాలికి దేన్నీ తగలనీకు. గాయం చిన్నదే అయినా రేగితే గబుక్కున మానదు” అన్నాను.
“రెండ్రోజులా!?” అన్నాడు.. అయిష్టంగా మొహం పెట్టి.
‘అవును!’ అన్నట్టుగా తలూపాను.
“సరే తాతయ్యా! మీకూడా పొలం వస్తాను” అన్నాడు కుంటుకుంటూ నడుస్తూ.
“ఈవేళ వద్దులే!” అన్నాను సుహాస్ కాలివంక చూస్తూ .
చిన్నప్పటి వాడి సుకుమారపు కాళ్లు.. కళ్ల ముందు కదిలాయి. అలాగే తెగిన వాడి చిటికన వేలూ గుర్తు కొచ్చింది.
పదినెలల సుహాస్‌ను మంచం కొసన పడుకోబెట్టి, వాడిముందు నేలమీద కూర్చుని పాదాలను ముద్దుపెట్టుకునేవాణ్ని. మంచుబిందువు సుతారంగా తాకిన గులాబీ రేకుల్లా ఉండేవి వాడి లేత పాదాలు.
కొద్దిగా కితకితలు పెడుతుంటే.. కాళ్లూ చేతులూ ఊపుతూ, కిలాకిలా ఒకటే నవ్వు! తెల్లటి మల్లెపువ్వుల్లా కనువిందు చేస్తూ.. పట్నానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మా ఊరికి పల్లెటూరి కళ తగ్గుతున్నా.. పొలాలకు దగ్గరలో ఉండటంతో చెట్టూ పుట్టా ఇంకా ఉన్నాయి.
కాకి ‘కావ్ కావ్’ అంటే.. వాడూ అలానే అనేవాడు. సుహాస్ అమ్మా నాన్నా ఉద్యోగాలు చేస్తుండటంతో మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ కాన్వెంటులో ఎల్కేజీలో చేర్పించాం.
ఒకనాడు వాడి టీచర్..
“మీ మనవడు గడుగ్గాయి అండీ!” అన్నది పగలబడి నవ్వుతూ.
‘ఏమిటి?’ అన్నట్టు ఆమెవంక చూశాను.
“ఈవేళ ‘ఏబీసీడీలు చెప్పు’ అంటే.. ‘మీకొచ్చుగా!’ అన్నాడు” అంటూ మళ్లీ నవ్వు.
నాకూ నవ్వొచ్చేసింది. ముళ్లపూడి బుడుగు గొర్తొచ్చి, సుహాస్ భుజాల మీద చేతులు వేసి..
“బుడుగూ బుడుగూ! అల్లరి పిడుగు!” అన్నాను.
వెంటనే వాడు చేతులు చాచాడు ఎత్తుకోమంటూ, మనవణ్ని ఎత్తుకుని గిరగిరా తిప్పాను.
తర్వాత కొన్నిరోజులకు..
“టీచర్ కొట్టింది” అన్నాడు వాడు.
“దేంతో?” అన్నాను.
“నోటితో!” అన్నాడు.
నాకు అర్థమైంది.. వాడి దృష్టిలో కొట్టడం అంటే తిట్టడం అని. కార్తికమాసం రావడంతో వాడి స్కూలువాళ్లు వనభోజనాలు ఏర్పాటుచేశారు మా
తోటలో. మేమంతా వెళ్లాం. అంతవరకూ సరదాగా ఆడుకుంటున్న సుహాస్..
“ఇక్కడికీ వచ్చిందీ!” అన్నాడు దూరంగా కనిపించిన టీచర్‌ను చూసి. అదోలా మొహం పెట్టి.
మాకు నవ్వాగలేదు. టీచర్ అంటే స్టూడెంట్‌కు భయమో, కోపమో ఉంటాయనుకుంటూ..
“అలాగ అనకూడదురా!” అన్నాను నెమ్మదిగా. వాడికామాట నచ్చినట్టులేదు.
రోజూ రాత్రి నా పక్కన పడుకున్న సుహాస్‌ను జోకొడుతూ..
“జో అచ్యుతానంద జోజో ముకుందా!” అని పాడటం ఒక డ్యూటీగా పెట్టుకున్నాను.
అలా జోకొడుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవాడు. ఆ రాత్రి కూడా జోకొడుతూ ఏదో ఆలోచిస్తూ పాడుతుంటే..
“తాతయ్యా! తప్పు పాడుతున్నారు” అన్నాడు.
‘లాలి పరమానంద లాలి గోవిందా’ను ముందు వెనకలుగా పాడినట్టు గమనించి..
“అమ్మ వెధవా!” అంటూ ముద్దు పెట్టుకుని, నవ్వుకుంటూ సరిగా పాడాను.
‘వీడికెంత గుర్తో!’ అని మనసులోనే అభినందించాను.
మా ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్‌కు మా స్నేహితుడు వచ్చాడు. భోజనం చేశాక సుహాస్ కబుర్లకు ముచ్చటపడి..
“చిన్న మ్యాజిక్ చేస్తాను. ఓ తాడు, బ్లేడు కావాలి” అన్నాడు.
మనవడు ఆశ్చర్యపడతాడు కదా అని అవి తెచ్చి ఇచ్చాను. తాడును బ్లేడుతో సగానికి రెండు ముక్కలుగా కోసి, వాటిని చూపించి.. చేతులతో వాటిని అటూ ఇటూ తిప్పి, ఒకే తాడుగా చూపించాడు. సుహాస్ ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టాడు. మిత్రుడు భోజనం చేసి వెళ్లిపోయాడు.
మర్నాడు పొద్దున సుహాస్ గుక్కపెట్టి ఏడుస్తుంటే, పెరట్లోకెళ్లి చూసేటప్పటికి.. చిటికెన వేలు చివర కొద్దిగా తెగి, ఒకటే రక్తం!
“ఎలా తెగిందిరా?” అంటే..
“నేనూ మ్యాజిక్ చేద్దామని తాడు కోస్తుంటే వేలుకు బ్లేడు తగిలింది” అన్నాడు ఏడుస్తూనే.
గబగబా దగ్గరే ఉన్న క్లినిక్‌కు తీసుకెళ్లాను. డాక్టర్ కట్టు కట్టి, ఓ ఇంజక్షన్ చేసి, మందులు రాశాడు.
“మా ఫ్రెండుకు మ్యాజిక్ వచ్చు కాబట్టి ఓ ట్రిక్ చేశాడు. నువ్వూ అలా చేయాలనుకుంటే ఎలా? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమంటే అదే!” అంటూ ఆ కథ చెప్పాను. సుహాస్ శ్రద్ధగా విన్నాడు.
పిల్లలందరిలాగే సుహాస్ కూడా బొమ్మలంటే ఇష్ట
పడేవాడు. అయితే, కాసేపు ఆడుకున్నాక బొమ్మలో ఏముందో చూడటం కోసం ప్రయత్నించేవాడు. ఒక్కోసారి దాన్ని పగలగొట్టేసేవాడు. వాళ్ల నాన్న తిడితే..
“వాడిష్టప్రకారం చెయ్యనిద్దూ! ఏమో ఏఆర్ రెహ్మాన్ అంతటి మ్యుజీషియన్ అవుతాడేమో” అనేవాణ్ని.
తను ప్రతి బొమ్మలోనూ ఏముందో చూడాలనుకునేవాణ్నని ఓ సందర్భంలో రెహ్మాన్ చెప్పిన సంగతి గుర్తొచ్చి అలా అన్నాను.
‘చేపలు పెంచుతా! అక్వేరియం కావాలి’ అన్నాడు ఒకనాడు.
దాన్ని కొని ఇంటికి తీసుకొచ్చాక అందులో రంగురంగుల చేపల్ని పెంచడం మొదలెట్టాడు. వాటికి ఆహారం వాడే పెట్టేవాడు. స్కూలుకు వెళ్లేటప్పుడు మధ్యాహ్నం చేపలకు ఏ ఆహారం వేయాలో వాళ్ల నానమ్మకు చెప్పేవాడు. కొన్నాళ్లకు వాడికి ఆ సరదా తీరిపోయింది. కుక్కను పెంచుకుందామన్నాడు. అది చాలా కష్టమైన వ్యవహారమంటూ వాళ్ల అమ్మా నాన్నా వద్దన్నారు. వాడు కాసేపు ఆలోచించి..
“అపార్టుమెంటులో అయితే వద్దంటున్నారు. తాతయ్యా! మీ ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు కదా” అన్నాడు.
నేను సరేనన్నాను. ఓ నల్ల కుక్కపిల్లను తెచ్చాను. దానికి తిండిపెట్టడం, దానితో ఆడుకోవడం వాడికి చాలా సరదాగా ఉంది. దానికి ‘బ్లాకీ’ అని పేరు పెట్టాడు. అది వాడికే కాకుండా ఇంట్లో అందరికీ బాగా దగ్గరయ్యింది.
మా ఇంటి దగ్గరి కాన్వెంట్లో ఐదో తరగతి వరకే ఉండటంతో.. కొన్నాళ్లకు సుహాస్‌ను యాప్రాల్‌లోని పెద్ద కాన్వెంట్లో చేర్చారు.
“ఇక వాడి కుక్క సరదా కూడా తీరిపోతుందిలే!” అనుకున్నాను. అయితే, ప్రతి శనివారం సాయంత్రం మా ఊరు వచ్చేసి, బ్లాకీతో ఆడుకుంటున్నాడు. వాళ్ల నాన్నో, నేనో.. వాణ్ని తీసుకొచ్చేవాళ్లం. వాడు వచ్చేటప్పుడు బిస్కట్లు తప్పక కొనిపించేవాడు.. కుక్క కోసం. దానికి ఎప్పుడన్నా కాస్త బాగోలేకపోతే తెగ బాధ
పడేవాడు.
“తాతయ్యా!” అంటూ.. సుహాస్ నా భుజం తడుతుండటంతో నేనీ లోకంలోకి వచ్చాను.
“ఆన్లైన్ క్లాసుకు టైమ్
అయ్యిందేమో!?” అన్నాను.
“ఇంకో పది నిమిషాల టైముంది లెండి. బ్లాకీ కనిపించడం లేదు. ఎక్కడికెళ్లిందో?” అన్నాడు.
“ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటుంది. దానికీ కాలక్షేపం కావాలి కదా! నువ్వు ఫుట్‌బాల్ ఆడుకుంటుంటే ఎంతసేపని చూస్తుంది” అన్నాను.
‘అవును కదా!’ అన్నట్టు చూసి, ఆన్లైన్ క్లాస్ కోసం ఫోన్ పట్టుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు.
నేను హాల్లోకి వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి బ్లాకీ వచ్చింది. అటూఇటూ చూసింది. సుహాస్ కోసమే అనుకున్నాను. అంతలో మా ఎదురింటి వాళ్లబ్బాయి వచ్చాడు ఫుట్‌బాల్ ఆడడానికి. ఆన్లైన్ క్లాస్ పూర్తి చేసుకుని సుహాస్ బయటికొచ్చి, బ్లాకీ తల నిమిరాడు. అది రెండు కాళ్లూ పైకెత్తి, వాడి పొట్టమీద పెట్టి, తోక ఊపుతూ గారాలు పోయింది. తర్వాత సుహాస్ తన ఫ్రెండుతో ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాడు. రెండు ఇటుకలు అటూ ఇటూ దూరంగా పెట్టి.. వాటి మధ్యకు బంతి వెళ్తే గోల్ కొట్టినట్టుగా ఏర్పాటు చేసుకున్నారు.
“గోల్!” అంటూ సుహాసే చాలాసార్లు అరిచాడు.
తర్వాత ఏడుపు మొహంతో బంతి పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు సుహాస్.
“తాతయ్యా! ఫుట్‌బాల్ ఓ పక్కన చిట్లిపోయింది. ఇంక ఆడటానికి పనికి రాదు” అన్నాడు.
“మరోటి కొందాంలే!” అన్నాను.
“ఈ మధ్యే మీరు కొన్నారు కదా! రేపు ఇక్కడికి వచ్చేటప్పుడు నాన్నను కొని తెమ్మంటాను” అంటూ అరుగు మీద ఉన్న ఫోన్ తీశాడు.
కాసేపు.. ‘ఆ! ఊ!’ అంటూ ఫోన్ ఆఫ్‌చేసి, ముఖం మాడ్చుకుని కూర్చున్నాడు.
“ఏమయ్యిందిరా?” అంటే..
“ఫుట్‌బాల్ కొనమని నాన్నను అడిగితే.. ‘ఇప్పుడు కొనను. అస్తమానం పాడు చేస్తే కొనాలంటే.. ఎలా? సంపాదించేవాడికి తెలుస్తుంది దాని విలువ. ముందు ఆన్లైన్ క్లాసులు బాగా ఫాలో అవ్వు!’ అన్నారు నాన్న” అని చెప్పాడు.
“సరే! యాప్రాల్ వెళ్లేటప్పుడు ఈసీఐల్ దగ్గర ఆగి, ఫుట్‌బాల్ కొంటానులే” అన్నాను.
“మీరు కొనవద్దు. నాన్న కొనకపోతే నేను కొనుక్కోలేనా” అన్నాడు కోపంగా.
వాడి వంక ఆశ్చర్యంగానూ, అభిమానంగానూ చూస్తూ..
“ఎలా కొంటావురా?” అని అడిగాను.
సుహాస్ ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. కోపంగా ఉన్నాడు కదా అని నేనూ మౌనం పాటించాను. మర్నాటి నుంచి పొద్దుటే కాకుండా సాయంత్రం కూడా నాతో పొలానికి వస్తున్నాడు. మెంతికూర, కొత్తిమీర వంటివి రెండో పంటగా నేను వేయడం ఇంతకుముందే చూశాడు. ఇప్పుడు వాటి వివరాలు అడిగాడు. చెప్పాను. వరిచేలో నేను కలుపు తీస్తుంటే.. వాడూ వచ్చి తీశాడు.
“వద్దులే! కాళ్లకు బురద అంటుకుంటుంది” అన్నాను.
వాడు వినలేదు.
“తాతయ్యా! మీతో ఇలా చెయ్యడం నాకిష్టం” అన్నాడు.
మనసులో ఆనందించాను.
“ఏరా! పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నావు” అని అడిగాను.
“నేను కూడా మీలా వ్యవసాయం చేస్తాను. ఇక్కడి పచ్చని పైరూ, చెట్లూ, పక్షులూ భలేగుంటాయి” అన్నాడు.
రెండురోజుల తర్వాత సుహాస్‌ను తీసుకెళ్లడానికి వాళ్ల అమ్మ వచ్చింది.
“వెళ్లే దారిలో నాలుగు తొట్టెలు కొంటేనే వస్తాను!” అన్నాడు ఆమెతో.
“ఎందుకు?” అని వాళ్ల అమ్మ అడిగితే..
“వాటిలో కొత్తిమీర, మెంతికూర పండిస్తాను” అన్నాడు.
“సర్లే.. రా! కొంటాను” అన్నది వాళ్ల అమ్మ.
“తాతయ్యా! గోనెసంచిలో మట్టి వెయ్యండి పట్టుకెళ్తాను” అన్నాడు.
సరేనని ఇంటి వెనకున్న మట్టిని తవ్వి, గోనెసంచిలో పోశాను. వాడి సాయంతోనే దాన్ని కారు డిక్కీలో పెట్టాను. మాకూ, బ్లాకీకి.. ‘బాయ్!’ చెప్పి, అమ్మతో వెళ్లిపోయాడు.
ఈసారి పదిహేను రోజుల వరకూ సుహాస్ మా ఊరు రాలేదు. నేనూ పొలం పనులతో వాళ్ల అపార్టుమెంట్‌కు వెళ్లలేకపోయాను. అయితే, అప్పుడప్పుడూ ఫోన్ చేస్తున్నాడు. తమ బాల్కనీలోని తొట్టెల్లో కొత్తిమీర, మెంతికూర ఎంత ఎత్తు పెరిగాయో చెబుతున్నాడు.
‘ఈ సరదా ఎంతకాలం ఉంటుందిలే!’ అనుకున్నాను. అయితే, కుక్క సరదా అలానే ఉంది. తనూ పండించాలనే సరదా కూడా అలానే ఉంటుందేమో అనుకున్నాను.
పొలం పనులు అయిపోవడంతో నేనూ, మా ఆవిడ కలిసి యాప్రాల్ వెళ్లాం.. కొన్నాళ్లు ఉందామని.
కాన్వెంటు నుంచి రావడంతోనే సుహాస్ ఓ గంట ఆన్లైన్లో ట్యూషన్ చెప్పించుకుంటాడు. ఆ తర్వాత అపార్టుమెంటులో ఓ పక్కనున్న పచ్చని పచ్చికలో స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు.
“నువ్వు ఆడుకుంటున్న ఫుట్‌బాల్ ఎవరిది?”
అని అడిగాను.
“మా ఫ్రెండ్‌ది. ఇంతకుముందు వాళ్లూ నా బంతితోనే ఆడేవాళ్లు. నాది పోవడంతో అతను కొన్న బాల్‌తో ఆడుకుంటున్నాం. కొన్నాళ్లకు నేను కొన్నాక దాంతోనూ ఆడుకుంటాం” అన్నాడు సుహాస్.
‘ఫుట్‌బాల్ కొనుక్కోవాలన్న వాడి కోరిక అలానే ఉందన్నమాట’ అనుకుంటూ..
“ఫుట్‌బాల్ ఆటగాళ్లలో నీకు ఎవరు ఇష్టం? ఎందుకు?” అని అడిగాను.
“క్రిస్టియానో రొనాల్డో అంటే నాకిష్టం. అతను చిన్నప్పుడు తల్లిదండ్రులతోపాటు రోడ్లు ఊడ్చేవాడు. ఆ రోడ్లమీద తనతోటివాళ్లతో ఫుట్‌బాల్ ఆడేవాడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని రొనాల్డో నిరూపించాడు. మీకు గూగుల్ చూడ్డం వస్తే ఇంకా ఎన్నో వివరాలు తెలుస్తాయి” అన్నాడు.
“అవన్నీ చూసే ఓపిక నాకు లేదు. నేను వయసులో ఉన్నప్పుడు అర్జెంటీనా ఆటగాడు మారడోనా అంటే చాలా ఇష్టపడేవాణ్ని. అతని పరుగులో, నడకలో ఎంత అందముండేదో తెలుసా?” అన్నాను.
“మారడోనా పేరు విన్నాను కానీ, అతని ఆట చూడలేదు. యూట్యూబ్‌లో చూస్తాను లెండి తాతయ్యా” అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.
నేను టీవీ వైపు తల తిప్పాను. ఓ గంట పోయాక..
“తాతయ్యా! అతని ఆట భలే బాగుంది!” అన్నాడు.
“ఏరా! అందరూ క్రికెట్ ఆడుతుంటారు కదా. నువ్వు ఫుట్‌బాల్ ఆడతావేంటి” అని అడిగాను.
“క్రికెట్లో అయితే అప్పుడప్పుడూ అటూ ఇటూ పరిగెడతారు. బ్యాటింగ్‌లో అయినా, బౌలింగ్‌లో అయినా! అదే ఫుట్‌బాల్‌లో అయితే క్షణక్షణానికీ కదులుతూనే ఉంటారు. అంతే కాదు.. ఇందులో చాలా డేరింగ్ ఉంటుంది” అన్నాడు.
“ఫుట్‌బాల్ బాగా ఆడి, పెద్ద ఆటగాడివి అవ్వాలనుకుంటున్నావా?”.
“లేదు తాతయ్యా! సరదాగా ఆడుతున్నాను. ఒంటికి కూడా మంచిది కదా. ఏమో ఒకవేళ ఏమైనా అవకాశాలొస్తే, అప్పుడు ఆలోచించవచ్చు” అన్నాడు.
సుహాస్‌తో మాట్లాడేటప్పుడు వాడి వయసులో నన్ను గుర్తు చేసుకుంటాను. అలాగే మా అబ్బాయిని కూడా. నాకంటే మా అబ్బాయి, వాడికంటే సుహాస్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారని అనుకున్నాను.
అంతలో..
“తాతయ్యా! మెంతికూర, కొత్తిమీర ఎలా పెరిగిందో చూద్దురుగానీ రండి” అంటూ బాల్కనీలోకి తీసుకెళ్లాడు.
“నాలుగు తొట్టెల్లో వేశావు. చాలా పండుతుంది”.
“ఎన్ని కేజీలు వస్తుందంటారు?”.
“ఏడెనిమిది కేజీలు రావచ్చు. ఇంట్లోకి అంత అవసరం లేదు కదా!” .
“మీరు పొలంలో బోలెడు పండిస్తారు కదా! ఇంటికంత అవసరం ఉంటుందా” .
“మాది వ్యవసాయం. అలా ఎక్కువ పండిస్తేనే మంచి ఆదాయం వస్తుంది” .
“ఆదాయం అంటే డబ్బులే కదా!?” అన్నాడు సుహాస్.. నా ముఖంలోకి చూస్తూ.
‘అవును’ అన్నట్టు తలూపాను.
“నేనూ డబ్బుల కోసమే వాటిని ఇంట్లో పండించాను” అన్నాడు.
నేను మనవడి వంక ఆశ్చర్యంగా చూశాను.
తన ధ్యాసలో తానుండి..
“తాతయ్యా! ఇప్పుడు మెంతికూర, కొత్తిమీర కేజీ ఎంత రేటు ఉంది?” అని అడిగాడు.
చెప్పాను.
ఫోన్ తీసుకుని, ఏదో చూసి..
“మీరు చెప్పినదానికంటే ఎక్కువే ఉంది” అన్నాడు.
“మార్కెట్ ధర కాస్త అటూ ఇటూ ఉంటుంది” అన్నాను.
మర్నాడు అపార్టుమెంటు పక్కనే కూరగాయలమ్మే ఆవిడ దగ్గరికి నాన్నమ్మను తీసుకెళ్లి కొత్తిమీర, మెంతికూర కేజీ ఎంతకు కొంటుందో అడిగించాడు. మొత్తానికి బేరాలాడి రెండు పెద్ద సంచుల్లో పట్టుకెళ్లి అమ్మేశాడు. అయిదొందలొచ్చాయని చెప్పాడు. మళ్లీ ఇంకో పంట వేస్తానన్నాడు.
“ఈ డబ్బులేం చేస్తావు?”.
“తాతయ్యా! మీరు మర్చిపోయారు. ఫుట్‌బాల్ నేనే కొనుక్కుంటాన్నన్నాను కదా!”.
గుర్తొచ్చింది నాకు. నేనప్పుడు పట్టించుకోలేదు.
“మిగతా డబ్బులు నేనిస్తాలే!” అన్నాను.
“వద్దులెండి. మరో పంట వచ్చాక నేనే కొనుక్కుంటాను” అన్నాడు.
ఆలోచిస్తూ కాసేపున్నాక..
“ఫుట్‌బాల్‌కు డబ్బులొచ్చాక, ఈ తొట్టె పంటలు మానేస్తావా?” అని అడిగాను.
“లేదు తాతయ్యా! నాకు వాటి మీద ఇష్టం పెరిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతాను. ఉద్యోగం వచ్చినా, మీలా వ్యవసాయం చేస్తాను. మీలా అంటే మీలాగ కాదు. కొత్తకొత్త పద్ధతుల్లో!” అని చెప్పాడు.
భూమిలా ఉండే ఫుట్‌బాల్ నా బుర్రలో తిరుగుతున్నది. నన్ను మించిన కొడుకు, వాణ్ని మించిన మనవడు.. సుహాస్ ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలనుకున్నాను.
“ఫుట్‌బాల్‌కు డబ్బులొచ్చాక, ఈ తొట్టె పంటలు మానేస్తావా?” అని అడిగాను.
“లేదు తాతయ్యా! నాకు వాటి మీద ఇష్టం పెరిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతాను. ఉద్యోగం వచ్చినా, మీలా వ్యవసాయం చేస్తాను.
మీలా అంటే మీలాగ కాదు.
కొత్తకొత్త పద్ధతుల్లో!” అని చెప్పాడు.
భూమిలా ఉండే ఫుట్‌బాల్ నా బుర్రలో తిరుగుతున్నది. నన్ను మించిన కొడుకు, వాణ్ని మించిన మనవడు.. సుహాస్ ఆలోచనలు బాగానే ఉన్నాయి.
కలిదిండి వెంకట సుబ్రహ్మణ్య వర్మ
కె.వి.యస్.వర్మ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పెనుమళ్ల. పలు దినపత్రికలు, న్యూస్ ఛానళ్లలో సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహించి, విరమణ పొందారు. 1968లో వీరి మొదటి కథ ‘స్త్రీ హృదయం’ ప్రచురితమైంది. ఇప్పటివరకూ వందకుపైగా కథలు ప్రముఖ వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రభూమి దినపత్రిక న్యూస్ ఎడిటర్‌గా ‘కథాకళి’, వార్త డైలీ డిప్యూటీ ఎడిటర్‌గా ‘ప్రతిధ్వని’ పేరుతో 500లకు పైగా ఫీచర్స్ కాలమ్స్ ప్రచురితమయ్యాయి. వందలాది సమీక్షలు చేశారు. ఐదు కథా సంపుటాలు, రెండు ఫీచర్స్ సంపుటాలు, శ్రీశ్రీపై వ్యాసాల పుస్తకం, ఒక కవితా సంపుటి వెలువరించారు. మరికొన్ని ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
కె.వి.యస్.వర్మ
98487 87266