Ramayanam | ఎండాకాలంలో మా ఊరికి వెళ్లినప్పుడు.. ఆ సెలవుల్లో చిన్నాయన కూతురు సరస్వతక్క పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసింది. మా నాన్న అందరికంటే పెద్ద అయినా.. మా అత్తలు, చిన్నాయనల పిల్లల్లో పద్నాలుగు మంది నాకంటే పెద్దవాళ్లు, తొమ్మిది మంది చిన్నవాళ్లు ఉన్నారు.
మా కజిన్స్లో అప్పటికే అయిదుగురికి పెళ్లిళ్లయ్యాయి కూడా. నాకంటే నాలుగేళ్లు పెద్దయిన సరస్వతక్కకు అప్పుడే పెళ్లేమిటి? అనిపించింది. అదేమాట అమ్మను అడిగాను. “అప్పుడే ఏంది? అది మీ తీరుగ చదువుకుంట లేదుకదా! ఇంటి పనులన్ని చేస్తది. వాండ్ల అమ్మకు బోలెడు ఆసరైతది. ఆమె తల్లిగారింటికి ఎప్పుడన్న పోతె.. నెల రెన్నెళ్లయినా అదే తండ్రికి, తమ్ముండ్లకు ఒండి పెట్టుకుంట మొత్తం ఇంటిని సవరిస్తది. మీరు జూస్తే నేనటు సంచీల బట్టలు సదురుకోంగనే.. ‘అమ్మా! ఎన్ని రోజులుంటవు? ఎప్పుడొస్తవు?’ అనడుగుతరు”.. సమయం చూసి షాట్ కొట్టడం అమ్మకు అలవాటే. “నువ్వెప్పుడన్న బట్టలు సదురుకున్నవా అమ్మా! ఎప్పుడు మేమే కదా సదిరి పెట్టేది? అయినా సరస్వతక్క చదువుకుంటె ఎవరు ఒద్దంటరు? గిప్పుడే పెండ్లి ఎందుకు అని!” అన్నాను. ఆడపిల్లలు పెళ్లి కాగానే మొదటి రెండేళ్లు పుట్టింటికి తరచుగా వస్తారు. ఆ తర్వాత వాళ్లు రావడం తగ్గిపోతుంది. మొగుడు, పిల్లలు, చాకిరి, సంసారంలో కూరుకుపోవడం.. కొందర్ని చూసి అప్పుడప్పుడే అర్థం అవడం మొదలైన రోజులు.
సరస్వతక్క చదువులో ఎస్సెస్సీ దాటకపోయినా చాలా విషయాల్లో గొప్పగా అనిపించేది. ఎంత బాగా పాటలు పాడేదో! పి.లీల, ఎస్.వరలక్ష్మి గార్ల బరువైన సంగీత స్వరం. బాగా జోకులు వేసి నవ్వేది, తనమీద జోకులేసినా ఉడుక్కోకుండా హాయిగా నవ్వేది. కపటం లేకుండా, బాగా బోళాగా ఉండేది. నాతోనూ, అక్కతోనూ ఎంతో ప్రేమగా మెలిగేది.
మహానటి సావిత్రి హావభావాలు డిటోగా చూపించేది. రానురానూ అదే ఆమె స్టయిల్‌గా మారిపోయింది. చూడ్డానికి బొద్దుగా, చామన ఛాయతో, పెద్దకళ్లతో సరితలాగా ఉండేది. ఆ తరువాత రోజుల్లో వాణిశ్రీని అనుకరించేది. వాళ్లమ్మ మేనవదిన కొడుకుతో తన పెళ్లి కుదిరిందని తెలిసింది. పెళ్లి ఖర్చులు, కట్నం, అల్లుడి అలక, ఆడబిడ్డలకు మర్యాదలతో కూడిన బహుమతులు.. వీటికే కష్టంగా ఉన్న రోజులవి.
అప్పట్లో ‘వర నిశ్చయం లేదా వరపూజ’ అని అబ్బాయికి, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే బట్టలు పెట్టి, అబ్బాయికి ఉంగరం పెట్టేవారు. ఆ తరువాత అమ్మాయికి, అబ్బాయి ఇంటివాళ్లు ఓ మంచి రోజున వచ్చి ‘పూలు పండ్లు’ అని ఇచ్చేవారు.
ఇప్పట్లాగా ‘ఎంగేజ్ మెంట్’ ను ఓ పెళ్లిలా చేయడం అప్పుడు లేవు. పెళ్లి కుదిరింది మొదలు ఎట్లా చేయాల్రా దేవుడా!? అనుకునే తల్లిదండ్రుల బ్యాచే ఎక్కువ. అమ్మాయిలైతే తలుపు చాటుకు పోయి.. “నా పెండ్లి కొరకే మా ఓండ్లకు గిన్ని తిప్పలు! మొగోన్నయితే ఏదో ఒక పని జేద్దును గద! ఛీ! మళ్ల జన్మల మొగోన్నయి పుట్టాలె దేవుడా!” అని కళ్లనీళ్లు పెట్టుకుని.. ‘నాకు పెండ్లి ఒద్దు, ఏమొద్దు నానా!’ అనే కాలం.
కూనూరు నుండి ఎవరో సైకిల్ మీద (పని మీద కూడా) మా ఊరికి వస్తుంటే.. నన్నూ, అక్కనూ రమ్మని సరస్వతక్క ఉత్తరం రాసి పంపింది. చందమామ కథల భేతాళుడు ఎప్పటిలాగే చెట్టు ఎక్కినట్టు.. మా ఇంట్లో అప్పుడెవరో చుట్టాలు ఉండటం వల్ల అమ్మా, నాన్నా రాలేకపోయారు. నేనూ, అక్కా హనుమకొండకు వెళ్లాం. కూనూరు మరీ పల్లెటూరు కాబట్టి అక్కడికి అబ్బాయి తరపువాళ్లు రామన్నారని అనడంతో.. వరనిశ్చయ కార్యక్రమం హనుమకొండలో ఏర్పాటు చేసారు.
జగనన్న, శరతన్న (సరస్వతక్క అన్నయ్యలు) వాళ్లకు హనుమకొండ బస్టాండు ఎదురు సందులో వాళ్ల అమ్మమ్మ గారి నుంచి సంక్రమించిన ఇల్లు ఉండేది. అందులోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. వాళ్లు కొంతమంది ఇంటికి వచ్చారు. సరస్వతక్కను చేసుకోబోయే ఆయన ఎలా ఉంటాడో చూడాలని మా కుతూహలం. మా ఉమ్మడి కుటుంబంలో అందరికన్నా పెద్దది లక్ష్మక్క పెళ్లికి నేను మూడు నెలల పిల్లనట. అందుకని ఆ బావను చూస్తే ఫాదర్లీ ఫిగర్ అనిపించేది. ఇక ఈయనెలా ఉంటాడా!? అనుకుంటే అందరూ లోపలికి వచ్చి కూర్చున్నాక ఆఖరున సన్నగా, తెల్లగా, పొడవుగా ఉన్నాయన వచ్చి తలెత్తకుండా, ఎవరివైపూ చూడకుండా.. ‘నాకే బంధాలు అవసరం లేదు’ అన్నట్టు కూచున్నాడు. ఆయనే పెళ్లికొడుకు అని తెలిసింది. అప్పుడాయన కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేసి ఆర్ట్స్ కాలేజీలో డెమన్స్ట్రేటర్గా ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ల నాన్న కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
అబ్బాయి బాగున్నాడు గానీ, నాకు మా అక్కే బాగనిపించింది. మా సరస్వతక్క కాసేపు కళ్లు వాల్చీ, ఇంకాసేపు ఓరగా చూసీ, మరికాసేపు నేరుగా చూసినా.. సావిత్రి, వాణిశ్రీని కలగలిపి నవ్వినా, ఆయన తనకేం పట్టనట్టు ఉన్నాడు (అని తరువాత సరక్క చెప్పింది). అబ్బాయి పీహెచ్డీ చెయ్యాలి కాబట్టి, ఆయన చెల్లెలికి పెళ్లయేదాకా ఆగాలి కాబట్టి, ఇప్పుడే పెళ్లి జరగదని వాళ్లు చెప్పారు. ఏముందిలే.. జరక్క పోతుందా!? అని వీళ్లు అనుకున్నారు గానీ, 1975లో సెటిల్ అయిన ఆ పెళ్లి.. మా చిన్నాయన, చిన్నమ్మ ఎంతో ఫాలోఅప్ చేస్తే, అయిదేళ్ల తరువాత 1980లో జరిగింది.
వాళ్లు వెళ్లిపోయాక మా వాళ్లంతా సినిమా ప్రోగ్రాం వేసారు. అప్పట్లో ఇంటికొచ్చిన వారికి మంచి భోజనం పెట్టడం, ఓ సినిమా చూపించడం గొప్ప ట్రీట్ అన్నమాట. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా మా అన్నయ్యలతోబాటు చిన్నమ్మ వైపు వాళ్లు ఎందరో కనిపించేవారు. జోకులు వేసుకుంటూ, కార్డ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తూ చీకూచింతా లేకుండా గడిపేవారు. ఒక్క జగనన్నయ్య కండక్టర్ ఉద్యోగం చేస్తే.. వీళ్లంతా ఎలా ఉండేవారోనని తరువాత రోజుల్లో ఆలోచిస్తే అనిపించేది.
మా ఆఖరి చిన్నాయన భార్య కూడా ఆ ఫంక్షన్‌కి వచ్చింది. ‘జీవనజ్యోతి’ సినిమాకు పోదామని ఆమె సంకల్పం. వాళ్లింట్లో చిన్నాయన, చిన్నమ్మలతోబాటు వాళ్ల నలుగురు కొడుకులకూ శోభన్‌బాబు అంటే వీరాభిమానం. క్రాఫ్ రింగు తిప్పడం, టక్ వేసుకోవడం, హీరోయిన్ని ‘ఏంటోయ్.. ఏమోయ్’ అనడం లాంటివి వాళ్లు విపరీతంగా ఎంజాయ్ చేసేవారు.
మొత్తానికి ఓ ఇరవై మందిమి కలిసి రిక్షాల్లో వరంగల్‌లో ‘జీవనజ్యోతి’ సినిమాకు వెళ్లాం. ముందే ఎలాంటి జనంలోనైనా చొచ్చుకుని వెళ్లగలిగే తోపుడు సామర్థ్యం కలిగిన ఇద్దరు చురుకైన వ్యక్తులు వెళ్లి టికెట్లు తీసుకున్నారు. ఆ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీల సన్నివేశం వచ్చినప్పుడల్లా ‘ఉన్నవానే సరస్వతీ!’ అని వాళ్ల మేనమామ సరక్కను బనాయించేవాడు. నాకు చాన్నాళ్లకు గానీ ఆ సెటైర్ అర్థం కాలేదు. ‘ఉన్నవా? ఊహల్లోకి జారుకున్నవా?’ అని దానికి అర్థమట. అయితే చాలారోజులు సరస్వతక్క ఊహలు, కలలు ఎందుకో వన్‌వేలోనే నడిచాయి. ఈమె డ్రీమ్స్ వేరేగా ,ఆయన గోల్స్ వేరేగా ఉండేవనుకుంటా.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి