జరిగిన కథ : నీలాంబ ఉరివేసుకుని చనిపోయిన మరునాడే.. కళామందిరానికి వచ్చింది లలితాంబ. వెళ్లి దూరంగా కొందరు మహిళా కవయిత్రుల మధ్య కూర్చుంది. ఎక్కడో ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.. విడిపోయాయి. ఇద్దరి మధ్య పూర్తి నిశ్శబ్దం! అదొక నృత్త విన్యాసం.. దాని అర్థం ఆ పరమేష్టికే తెలియాలి!!
ఏమిటీ
జీవితం.. కనీసపు శారీరకతృష్ణ కూడా తీరని ఓ ఎండిన మోడుగానే బతుకు ముగిసిపోతుందా!? నీలాంబక్కను తల్పంపై అలా చూసేసరికి ఆరోజు లలితాంబ చేతిని తన గుండెకు తాకించడం తప్పయిందా?.. అప్పటికే తమమధ్య ఆమె కోరుకున్న భోగినీ పండుగ జరిగినట్లు భావించి ఆ సంతోషంలో.. శారీరక బాధల నుంచి విముక్తి కోరుకుని ఉరి వేసుకుందా!? అది కూడా ఖర్మకొద్దీ ఆ రోజునే.. ప్చ్!
నీలాంబ మరణం కలిగించిన లోలోన ఘర్షణను మర్చిపోవడానికి అన్నట్లు ఈ పెళ్లిపనులు మీదికెత్తుకున్నాడు జాయచోడుడు. రాత్రింబవళ్లు మరో ఆలోచన రాకుండా అన్నీ తానై నిర్వహిస్తున్నాడు.కాకతీయ సామంత రాజ్యాలన్నీ కూడా గణపాంబ వివాహం తెచ్చిన ఉత్సవ వాతావరణంతో సంబరాలను జరుపుకొంటున్నాయి. సంబరాలతో పులకించిపోతోంది అనుమకొండ మహానగరం. నగరమంతా చలువ తాటాకులతో పెళ్లిపందిరులు వేస్తున్నారు. ఇక కాకతీయకోట, అందులో ఉన్న నియోగాలు, భవనాలు, రాజప్రాసాదాలు, రాజనగరి అన్నిటా సంతోష సందడులే. రాజనగరి మరీమరీ వెలిగిపోతోంది. రాజ్యమంతటా ఆనందసంద్రాలు పొంగి పొరలుతున్నాయి.
పెళ్లి బరువు బాధ్యతల నడుమ కాబోయే కాకతీయ వారసులపై ఓ కన్నేసి ఉంచాడు జాయచోడుడు. ముఖ్యంగా పెద్ద మేనల్లుడు రుద్రమదేవుడు, రెండవ మేనల్లుడు మురారిదేవుడు.. వాళ్లిద్దరి కదలికలు, ఉత్సాహ ఉద్వేగాలు.. పెళ్లి సంబరాల్లో వాళ్ల ఆటపాటలు.. అన్నీ పరిశీలిస్తున్నాడు. హరిహరుడు, మురారి విసురునాడులోని గురుకులంలో యుద్ధవిద్యలు అభ్యసిస్తుండగా.. హరిహరుడు కాలధర్మం చెందాడు. మురారి అక్కడే చదువు కొనసాగిస్తున్నాడు. గణపాంబ పూర్తిగా రాజప్రాసాదంలోనే రాజగురువుల వద్ద చదువుకుంటుండగా.. రుద్రమదేవుడు త్రిపురాంతకం గోళకిమఠంలోని విద్యాకేంద్రంలో చదువుతున్నాడు. చదువుతోపాటు యుద్ధవిద్యల్లో కూడా నిష్ణాతుడని విన్నాడు. జాయచోడుని నాజూకు శరీరం రాలేదు గానీ.. అందంలో మేనమామకు తీసిపోడు మురారి. చుట్టూ పదిమంది మిత్రులను వెంటేసుకుని ఎప్పుడూ ఘళ్లుఘళ్లున నవ్వుతూ కేరింతలలో కనిపిస్తున్నాడు మురారి. రుద్రమదేవుడి పక్కన కూడా ఉన్నారు మిత్రులు.. కాదుకాదు అంతా మిత్రురాళ్లు! ఆశ్చర్యపోయాడు. రుద్రమదేవుడు.. గణపతి – సోమల దంపతుల ద్వితీయ సంతానం. చూపులకు ఏదో వింత శరీరుడిలా తోచాడు జాయచోడునికి. కాకతీయవంశానికి కాబోయే వారసుడు.. అతని ఆహార్యం వింతగా ఉంది. కంచుకంపై బంగారపు కవచం ధరించాడేమిటి? పరీక్షగా చూస్తే.. అది వక్షస్థలాన్ని నొక్కిపెడుతున్నట్లు! మరింత పరీక్షగా చూస్తే.. చూడకూడని యుక్తవయస్కురాలి యువ సమున్నతాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తోచింది. సాధారణంగా యుద్ధవీరులైన మహిళలు అలాంటి కవచాలను ధరిస్తారు. కానీ యువ రారాజు, యుద్ధరంగంలో ఉన్నట్లు అక్క పెళ్లిసంబరాలలో దుస్తులపై కవచం ధరించడం ఏమిటి?!
రుద్రమదేవుని జనన సమయంలో రాజ్యంలో చెలరేగిన వాద ప్రతివాదాలు గుర్తొచ్చాయి జాయచోడునికి. చతుష్పథం వద్ద మిత్రుల చర్చలు కళ్లముందు కదలాడాయి. ఇతనికోసమా అప్పట్లో రాజ్యమంతా అట్టుడికిపోయింది?! ఇతనా కాబోయే చక్రవర్తి? ఇతనా పరిణత రాజకీయవేత్త, రణరంగ నిపుణుడు, ఆయన కలలోకి వచ్చినా శత్రువు గుండె ఆగి మరణిస్తాడని కవులు కీర్తించే గణపతిదేవుని వారసుడు? అతణ్ని ఎగాదిగా చూసి జాయచోడుని ఆనందం ఆవిరైపోయింది. అప్పుడే రుద్రమదేవుడు కూడా జాయచోడుణ్ని పరిశీలనగా చూస్తున్నాడు. తననే చూస్తున్న రుద్రమదేవుణ్ని చూసి పలకరింపుగా నవ్వాడు జాయచోడుడు. అతను తిరస్కారంగా చూసి మూతి తిప్పుకొని వెళ్లిపోయాడు.
దిమ్మెరపోయాడు జాయచోడుడు. వీరయువకుడు అలా మూతి తిప్పడం!??
అభినయాలు ఎన్నిరకాలో, ప్రతి శరీరభాగ కదలికలు ఎలా ఉండాలో సప్రమాణంగా చెప్పగల మహానాట్యకారుడు జాయచోడుడు విభ్రాంతి చెందాడు. ఆ మూతి తిప్పడం?? ఎటువెళ్లినా.. ఏమి చేస్తున్నా.. ఆ మూతి తిప్పుడు దృశ్యమే మరీమరీ జాయచోడుని కళ్లముందు కదలాడుతోంది. అతనిపై దృష్టిపెట్టాడు జాయచోడుడు. అతడు ఎవ్వరితో కలవడంలేదు. పక్కన ఇద్దరు పరిచారికలు అన్నీ సమకూరుస్తూ అతని వెన్నంటి ఉన్నారు. ‘వెన్నంటి ఉన్నారు’ అనే కంటే.. ఎవ్వరినీ కలవకుండా కాపలా కాస్తున్నారు అనొచ్చు.వెలనాడు కార్యాలయంలోనే పనిచేస్తూ జాయచోడుడు అనుమకొండ వచ్చిన నాటినుంచి తిరిగి ఆయన ఆంతరంగిక వార్తాహరుడుగా వ్యవహరిస్తున్న వృద్ధుడైన అంకమరట్టని పిలిచి రుద్రమదేవుని కదలికలు పరిశీలించమన్నాడు. మరునాడు అంకమరట్ట చెప్పాడు చెవిలో.. “యువరాజుగారిలో అబ్బాయి కంటే అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని యువకులే నవ్వుకుంటున్నారు. పైగా యువరాజుగారు యువకుల చెయ్యి తగిలినా చిరాకు పడిపోతున్నారట మహారాజా! ఇక భుజంపై చెయ్యి వేస్తే యుద్ధమేనట!”.
చలువపందిళ్లు వేస్తున్నచోట ఉన్నాడు రుద్రమదేవుడు. యువకులంతా కబుర్లు చెప్పుకొంటూ పనిచేస్తుంటే.. అతను మాత్రం ఇద్దరు చెలికత్తెల మధ్య చెంపకు చెయ్యి ఆన్చి విస్పారిత నేత్రాలతో చూస్తున్నాడు. చెలికత్తెలు ఏదో చెప్తున్నారు. ముగ్ధ మనోహరంగా అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా నవ్వుతున్నాడు. నవ్వుతున్నప్పుడు ఆ బుగ్గలపై బుజ్జిబుజ్జి చొట్టలు చూడముచ్చటగా కనిపించీ కనిపించకుండా వచ్చి పోతున్నాయి. జాయచోడుని మనసంతా విచారం అలుముకుంది. రుద్రమదేవుడు కేవలం స్త్రీ అయితే ఎంత కన్నులపండువగా ఉంటుంది! తల్లిలా ఛాయ తక్కువైనా.. అందానికి తిరుగులేదు!!
భగవంతుడా.. బావగారికి ఎంత పెద్ద పరీక్ష పెట్టావయ్యా!!
ప్చ్.. బావగారితో వీడి గురించి చర్చించాలి అనుకుంటూ గణపాంబ ఉన్న మందిరంలోకి ప్రవేశించాడు. ఎదురుగా గణపాంబను అలంకరిస్తున్నారు సైరంధ్రిలు, పుష్పలావికలు. సహకరిస్తూ హాస్యమాడుతున్న మిత్రురాళ్లు, బంధువుల్లోని యువతులు. అదొక యువ యవ్వన కెరటాలు ఎగసిపడుతున్న సంద్రం. ఆ మందిరమంతా విరిసిన నవ్వుల నవ సుమపరిమళంతో పల్లవించి ప్రవహిస్తోంది.
‘తను ఆ యవ్వనప్రాయపు సవ్వడులను దాటిపోయాడేమో..’ పలకరింపుగా నవ్వి వెనుదిరిగాడు.
“మామా..” పిలిచింది గణపాంబ. ఆగి వెనుదిరిగి చూశాడు. గణపాంబ ఆత్మీయంగా పరిగెత్తుకు వచ్చింది. “వీడు.. నా తమ్ముడు. రుద్రమదేవుడు!”. “ఆరోజు తండ్రిగారు పరిచయం చేశారుగా పెద్దతల్లి. కానీ, మాట్లాడలేదు” అన్నాడు రుద్రమదేవుణ్ని ఎగాదిగా చూస్తూ. “రుద్రా.. జాయచోడదేవుడు మామ. వినే ఉంటావు. దైవం ప్రసాదించిన మామ. ఎవరికోగానీ, ఇలాంటి మామ దొరుకడు. మహాయోధులు, మహానాట్యకారులు కూడా. అంతేకాదు తండ్రిగారికి అత్యంత నమ్మకస్తులు..” గొప్పగా చెప్పింది గణపాంబ. “విన్నాను. విన్నాను. పిఠాపుర యుద్ధంలో తండ్రిగారికి ఆయుధం అందించిన తీరు తండ్రిగారు ఎప్పుడూ చెబుతుంటారు. త్రిపురాంతకంలో మా యుద్ధగురువులు కూడా మామ ప్రతిభను పాఠాల వేళ ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు దగ్గరగా చూస్తున్నాను” అన్నాడు రుద్రమదేవుడు తిప్పుకొంటూ.అతని గొంతు.. హతవిధీ! ఎంత అన్యాయం చేశాడు దేవుడు. గొంతుకూడా స్త్రీలాలిత్యంతో ఎంత శ్రావ్యంగా ఉంది!
రాత్రి ఆంతరంగిక మందిరంలో గణపతిదేవుడితో అన్నాడు జాయచోడుడు. “రుద్రమదేవుడి అంశంలో.. దేవుడు అన్యాయం చేశాడు బావగారు!”. పెళ్లి ఏర్పాట్లలో చాలా అలసిపోయినట్లు ముఖం పెట్టాడు గణపతిదేవుడు. “వాడు.. అక్కడే ఇంకా బాగాచదివి ప్రవర్ధిష్ణువు కావాలి. కానీ, అక్కపెళ్లి చూడాల్సిందేనని పట్టుబట్టి మరీ వచ్చాడు. ప్చ్! నిద్ర వస్తోంది జాయా..” అన్నాడు ఆవులిస్తూ. ఆయన ముక్తసరిగా సంభాషణ ముగించి.. ‘వెళ్లిపో!’ అన్నట్లు మాట్లాడటం ఆశ్చర్యపరచింది. మరునాడు రాజనగరిలో వివాహనికొచ్చిన అతిథులకు నాట్య ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రదర్శనే జాయచోడుని నృత్తం. తొలి ప్రదర్శన కావడం.. అదీ జాయచోడుడు నర్తించనుండటంతో రాజనగరి నాట్యమండపం కిక్కిరిసిపోయింది.అందరూ ఆయన నృత్త విన్యాసాన్ని శారీరక కదలికలను విభ్రాంతితో చూస్తున్నారు.
సాక్షాత్తూ నటరాజు కైలాసం వీడి అనుమకొండ వచ్చినట్లు.. ఆడుతున్నాడు జాయచోడుడు. కానీ, అతనిలో ఏకాగ్రత లేదు. భావప్రకటన విరుద్ధంగా ఉంది. పాద ముద్రలు తడబడుతున్నాయి. హస్తముద్రలైతే ఘోరం. కానీ, ప్రేక్షకులు ఎప్పటిలాగే విస్మయంతో చప్పట్లు కొట్టి ఆయనను అభినందనలతో ముంచెత్తారు. తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు జాయచోడుడు. మొదటిసారి తను నృత్తంలో తప్పటడుగులు వేశాడు. నటుని తాదాత్మ్యత కోల్పోయాడు. విన్యాస విచిత్రాలకు మాత్రమే సాధారణ ప్రేక్షకులు మైమరుస్తారు. కానీ నాట్య ప్రవీణులు చూస్తే ముఖాన ఊస్తారు. పూర్తిగా ఘోరమైన మార్గినృత్తం. దీనికంటే ఓ మారుమూల పల్లెటూరిలో దేశీ ప్రదర్శన ఉత్తమం.
తల వంచుకుని రంగమండపం దిగిపోతున్న జాయచోడుడు.. ప్రేక్షకుల్లో ఓ యువతి తనను పరికించి చూడటం గుర్తించాడు. ఎవరీమె? ఎక్కడో చూచినట్లు తెలుస్తోంది. ఎవరీమె.. ఎవరై ఉంటారు?.. ఆమె చేతులు జోడించి అభినందనగా చప్పట్లు చరచి తిరిగి చేతులు జోడించి నమస్కరించి అభినందనగా చూసి మాయమైంది.ఆ పిల్లను చూశాక అతని నృత్త విఫలత తాత్కాలికంగా పక్కకుపోయింది. ఎవరీ పిల్ల?! ఎక్కడ చూశాను అనే ఆలోచన పెరిగిపోయింది. వివాహం క్రతువు పదిరోజులు. ముందువెనకా సంబరాలు మొత్తంగా నెలరోజులు. ఇటు వియ్యాలవారి ఆచార వ్యవహారాలను సమాదరిస్తూ, అటు గణపతిదేవునికి, సోమలదేవికి సహకరిస్తూ శాస్త్రీయ వివాహతంతులలోనూ జాయచోడుడే. యువకులతో చెడుగుడు, యువతులతో పాత్ర గొండ్లి, గుర్రం భంజలి.. అందరినీ కలిపి బిళ్లంగోడు.. అలాగే యువతీ యువకులకు లాస్యనాట్యం, దండరాసకం నేర్పించి, ఆడించి, ఆడి, నాట్యం చేసి నవ్వించి కవ్వించి పెళ్లి వేడుకలను మరపురాని మధుర సంఘటనగా లిఖించాడు. అప్పగింతల వేళ రాజ ప్రాసాదమంతా ఉద్వేగపు కన్నీటిలో తడిసి ముద్దయ్యింది. సహజంగా స్త్రీలందరూ తీవ్రంగా దుఃఖిస్తున్నారు కానీ కాస్త ఎక్కువగా ఏడ్చింది మాత్రం నారాంబతోపాటు రుద్రమదేవుడు! వెక్కివెక్కి ఏడ్చిన ఏకైక మగాడు!!
కానీ, మరి కొన్నిరోజులలో ఓ వార్త రాజధానిలో పుట్టి పెద్దలను భయవిహ్వలులను చేసింది. గణపతిదేవుని పెద్ద కుమారుడు.. యువరాజు రుద్రమదేవుడు ఆడమగ కానీ నపుంసకుడు!!
“అవునా?!”.
“నిజమేనా.. నేనూ అలాగే అనుకున్నా”. “ఆ అబ్బాయి వాలకం చూస్తే అలాగే ఉన్నాడు”. ప్రజల మాట ఆగదు. రాజనగరికి చేరిపోయింది. జాయచోడుని చెవిన పడింది. గణపతిదేవుడు, అక్కలు ఎలా భావిస్తున్నారోనని కించిత్ సందేహించాడు.
ఆశ్చర్యం!.. “ప్రజలు ఎప్పుడో ఒకరోజు ఇలా అంటారని నేను భావించాను..” అన్నాడు గణపతిదేవుడు అదేదో ఎప్పుడూ వినవచ్చే జనవాక్యంలా. సోమలదేవి కూడా నింపాదిగా మౌనంగా విన్నది. భర్త వైపు చూసింది.
ఆయన మౌనంగా చూశాడు. పవళించిన తల్పంపై నెమ్మదిగా మరోవైపు తిరిగి పడుకుంది. కిందా మీదా అయిపోతోంది మాత్రం నారాంబ. “ఇలా అయితే రేపు రాజ్యం ఎలా పాలిస్తాడు.. బావగారి పేరు ప్రతిష్ఠలు కాపాడగలడో లేదో!?”. రాజ్యంలోని ప్రజల సమస్యలు, రాజ్యసమస్యలు అన్నీ నారాంబ సమస్యలే! అయితే ఈ అంశం గణపతిదేవుణ్ని చాలా ఆందోళనకు గురిచేస్తోందని జాయచోడుడు గ్రహించాడు.
ఈ విషయమై గణపతిదేవుడు వృద్ధులైన రేచర్ల రుద్రసేనాని, గంగాధర మంత్రి, మల్యాల చౌండల నివాసాలకు వెళ్లి మరీ చర్చోపచర్చలు చేస్తున్నాడు. శైవ గురువులతోనూ చర్చలు.
(సశేషం)
అప్పగింతల వేళ రాజ ప్రాసాదమంతా ఉద్వేగపు కన్నీటిలో తడిసి ముద్దయ్యింది. సహజంగా స్త్రీలందరూ తీవ్రంగా దుఃఖిస్తున్నారు కానీ కాస్త ఎక్కువగా ఏడ్చింది మాత్రం నారాంబతోపాటు రుద్రమదేవుడు! వెక్కివెక్కి ఏడ్చిన ఏకైక మగాడు!!
-మత్తి భానుమూర్తి
99893 71284