కాఫీ.. కాఫీ.. కాఫీ..”ఆలోచనల్లోంచి తేరుకుంటూ తల తిప్పాను!డిపార్చర్ టైమ్ దగ్గరపడేకొద్దీ కంపార్టుమెంట్లోకి ఎక్కుతున్న ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారు. అప్పటికే ఎక్కేసినవారు పక్కవారితో కబుర్లు చెబుతున్నారు. కొందరు కాఫీ తాగుతూ నాలాగే ఆలోచనల్లో మునిగి ఉన్నారు. మొత్తానికి ఎవరి లోకంలో వారున్నారు. మళ్లీ ఇటువైపు తిరిగి కిటికీలోంచి బయటికి చూడసాగాను.నేను గుంటూరుకి ప్రయాణమవడం ఇది అయిదోసారో, ఆరోసారో! మొదటిసారి చిన్నప్పుడెప్పుడో వెళ్లాను. కానీ, గత ఐదేళ్లుగా గుంటూరు టౌన్ గుర్తురాగానే.. వెంటనే నా మదిలో మెదిలే వ్యక్తి.. నా ప్రాణస్నేహితురాలు.. మంజుల! ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ నుంచి బయల్దేరింది.. తన పెళ్లికి అటెండ్ అవడానికే!“నేనెందుకే మంజూ! పెళ్లిలో నన్ను నీ ఫ్రెండ్‌గా చూశారంటే.. నీ అత్తింటివారికి నీపట్ల ఇంప్రెషన్ పోతుందే! నా మనసు నీకు తెలుసుగా.. నేను రాకున్నా నా విషెస్ ఎప్పుడూ నీకుంటాయనీ!” అని నచ్చజెప్పాలని చూసినా..తను వినిపించుకోలేదు.
“నోర్ముయ్యవే! నువ్వు గనుక నా పెళ్లికి రాలేదంటే.. ఏం చేస్తానో తెలుసా?”“ఊఁ.. ఏం చేస్తావ్?” నేను కుతూహలంగా చూస్తూ అడిగేసరికి చెప్పింది..“ఇంకెప్పుడూ నీతో మాట్లాడను!”నేను తేలిగ్గా నవ్వేశాను.“పోవే.. నువ్వూ, నీ ప్రతిజ్ఞలూ! నీ గురించి నాకు తెలీదా మంజూ! నాతో మాట్లాడకుండా రెండ్రోజులు కూడా నువ్వుండలేవు! ఏదైనా జరిగే విషయం చెప్పమ్మా!” అన్నాను.“అయితే విను!” అని ఉక్రోషంగా..“నువ్వు నా పెళ్లికి రాకుంటే..”నేను ఆసక్తిగా చూడటం గమనించి చెప్పేసింది..“నేనూ నీ పెళ్లికి రాను!”
అంతే.. ఫకాల్మని నవ్వేశాను. ఈసారి తను నివ్వెరపోతూ చూసింది నావంక.“ఏమైందే.. ఇప్పుడు నేనేం అన్నాననీ? ఉన్నట్టుండి ఎందుకలా నవ్వుతున్నావ్?”
నేను నవ్వాపుకోడానికి ప్రయత్నిస్తూ..“మరి.. ఇలాంటి జోకులేస్తే నవ్వరేంటీ?” అంటూ పడీపడీ నవ్వుతున్న నేను.. మనసులో ఎక్కడో కలుక్కుమనేసరికి గుండెలోని దిగులుపొర కళ్లలో తేమతెరగా మారుతూండగా నోరు విప్పాను..“మంజూ.. నిజంగా నాకు పెళ్లవుతుందంటావా?”
‘యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెనాలి వెళ్లు నాగార్జున ఎక్స్‌ప్రెస్ బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది!’అనౌన్సర్ మాటలు వినగానే ప్లాట్‌ఫారంపై ఉన్న ప్రయాణికుల్లో ఉన్నట్టుండి కలకలం మొదలైంది. కిటికీ పక్కనే కూర్చున్న నేను అప్రయత్నంగా టైమ్ చూసుకున్నాను. ఐదు నిమిషాలుంది.. రైలు బయల్దేరడానికి!
ఓ ముగ్గురు వ్యక్తులు లగేజీతో గబగబా నేను కూర్చున్న కంపార్ట్మెంట్లోకి వచ్చారు. నా ఎదురుగా ఖాళీగా కన్పిస్తున్న సీటు దగ్గరకొచ్చి కూర్చోవడానికి సిద్ధపడుతున్నట్లుగా వంగి, యథాలాపంగా నావైపు చూశారు.
అంతే.. ఠక్కున కింద పెట్టబోయిన లగేజీని తిరిగి అందుకొని వెనుదిరిగి మరో కంపార్ట్మెంట్ వైపు వెళ్లిపోయారు. నా మనసు చివుక్కుమంది.
నిజమే.. మామూలుగానే నా వంక చూడటానికి ఎవరూ ఇష్టపడరు. ఒకసారి చూశాక.. ముఖం తిప్పేసుకోకుండా ఉండలేరు. అలాంటిది గంటో, రెండు గంటలో ప్రయాణం చేసేందుకు రైలెక్కినవాళ్లు అంత సమయాన్ని ఎదురుగా నన్ను చూస్తూ గడపాలని కోరుకోరు. అందుకే వేరే సీటు వెతుక్కుంటూ వెళ్లారు.
ఒకవేళ.. తప్పనిసరై నా ఎదురుగా కూర్చోవాల్సి వస్తే మాత్రం.. నా వైపు చూస్తూ కూర్చోరు. పక్కకి తిరిగి ఎటో చూస్తూ ఉంటారు. అనుకోకుండా పొరపాట్న నా వైపు సారించిన చూపుల్లో కూడా ‘అసహ్యం, ఈసడింపు’ తప్ప మరో భావమేదీ కన్పించదు. ఊహ తెలిసినప్పటినుంచి పాతికేళ్లుగా నాపట్ల ఈ సమాజానికి అలవాటుగా మారిన స్థితి! ఇది నాకు అవమానమో, అపహాస్యమో విశ్లేషించుకుంటూ.. నన్ను నేను ఓదార్చుకుంటూ గడిపే రోజులు కూడా దాటిపోయాయి.
అందుకే.. ‘మౌనిక’ నయ్యాను.. ప్రపంచాన్ని దూరాన్నుంచే చూస్తూ చదివే జీవిత పాఠకురాలినయ్యాను.
సమాజం నన్ను వీక్షించే విధానాన్ని అర్థంచేసుకునే పరిశోధకురాలినయ్యాను!“ఎక్స్క్యూజ్ మీ.. ఈ సీటు ఖాళీయే కదండీ..?” అన్న మాటలకి తేరుకొని తల తిప్పి చూశాను.నా ఎదురుగా ఉన్న సీటు మీద చేత్తో తడుముతూ కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాడతను.“ఆఁ.. ఎవరూ లేరు. ఖాళీయే!” చెప్పాను.
చేత్తో సీటుని తడుముకుంటూ కూర్చోబోయాడు.“అయ్యో.. జాగ్రత్త!” అన్నాను అప్రయత్నంగా.అతడు జాగ్రత్తగానే కూర్చున్నాడు. ఎందుకో.. ఆ క్షణంలో రవ్వంత గర్వంగా అన్పించింది నాకు. నా ఎదురుగా కూర్చోవడానికి ఓ వ్యక్తి వచ్చినందుకు!
“ఆశ లేనిదే బతకడం కష్టం. కళ్లు లేనందుకు మీకెప్పుడూ బాధ కలగలేదా? ఈ లోకాన్ని చూడాలనిపించలేదా?”ట్రైన్ బయల్దేరి రెండు గంటలు కావొస్తోంది. ఈ రెండు గంటల్లోనూ మామధ్య మాటల బాటలు ఎందుకో.. మమ్మల్ని కాస్త సన్నిహితం చేశాయనిపించింది. నా ప్రశ్నకి బదులివ్వకుండా నవ్వాడతను. తేలిగ్గా ఉంది ఆ నవ్వు!
“పుట్టుకతోనే చూపులేని నాకు అసలు ‘ఆశ’ అంటే ఏమిటో తెలీదు. ‘ఆశ’ అనేదాన్ని ‘వెలుగు’తో పోలుస్తారందరూ. కానీ.. నాకు మాత్రం వెలుగంటే ఏమిటో తెలీదు. నాకు తెలిసిన లోకమంతా చీకటే! ‘దృష్టి’ అనేది ఒకటుంటుందనీ, దాంతో చూస్తారనీ, ఆ చూపు వల్లే ఈ లోకం కనిపిస్తుందనీ.. ఊహ తెలిసేదాకా నాకు తెలీదు. తర్వాత లోకం గురించి అవగాహన ఏర్పడేకొద్దీ అనిపించింది.. నాకు చూపు లేకపోవడమే మంచిదని! అప్పుడు అర్థమైంది.. నేనే అదృష్టవంతుణ్నని!”
“ఎందుకని..?”
“లోకంలో స్వచ్ఛతా, మంచీ ఎక్కడున్నాయండీ? అంతటా మలినం, అవినీతీ, దుర్మార్గమే కదా! పక్కవాడి ఎదుగుదలని చూసి ‘కుళ్లు’. ‘వాడికున్నది నాకు లేదే’ అని ఏడుపు. ప్రమోషన్ రాలేదని నిరసన. ట్రాన్స్ఫర్ కాలేదని వేదన. మనుషుల మనసులన్నీ చీదర! మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా ‘మనదీ ఒక బ్రతుకేనా.. కుక్కల వలె, నక్కల వలె/ మనదీ ఒక బ్రతుకేనా.. సందులలో పందుల వలె!” అని..ఓ క్షణమాగి..
“సారీ అండీ.. నేను తప్పుగా మాట్లాడితే!” అన్నాడు.“లేదు లేదు.. మీరు మాట్లాడుతూంటే స్వచ్ఛత కనిపిస్తున్నది. మీ మాటల్లో వాస్తవం వినిపిస్తున్నది. ఔను.. మీరు చెప్పేది నిజమే! మనుషులంతా కులమతాల పోలికల్లో, స్థాయీ స్తోమతల బేరీజుల్లో, తరతమ భేదాల అంచనాల్లో, లాభనష్టాల లెక్కల్లో, అనునిత్యం న్యూనత అహంభావాల రాపిడిలో.. తమ ‘అంతరాత్మ’ల్ని చంపుకొని, ప్రేమరాహిత్యపు ‘నిధి’నే మితిమీరిన ఆత్మవిశ్వాసంగా భావిస్తూ బతికేస్తున్నారే తప్ప.. మనస్ఫూర్తిగా ఎవరూ జీవించడం లేదు!” అన్నాను.
అతడు ఆశ్చర్యపోతూ..
“అరెఁ.. మీరూ నాలాగే మాట్లాడుతున్నారే! మీ భావాలు నా భావాల్లాగే ఉన్నాయే!” అన్నాడు.“నాకూ అలాగే అనిపించింది. అందుకే మీ మాటలు వింటూంటే ఇంకా వినాలనిపిస్తోంది.. చెప్పండి!” అన్నాను.అతడు నవ్వేస్తూ..“చెప్పడానికేముందండీ.. నేను చెప్పేవన్నీ అందరికీ తెలిసినవే, ప్రతి ఒక్కరూ ఒప్పుకొనేవే.. కొత్తగా ఏమున్నాయనీ?! మనుషులై ఉండి ఒకరినొకరు పీల్చుకుతింటున్నారు. చంపుకొంటున్నారు. నిజం చెప్పండీ.. పసిపిల్లలు తప్ప మనుషుల్లో ఎవరైనా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నారా?” అన్నాడు.“నవ్వటం మాట అటుంచి.. ‘తమ పాపాలు ప్రక్షాళనమయ్యేట్లు కనీసం మనస్ఫూర్తిగా ఏడవగలుగుతున్నారా?’ అనే ప్రశ్నకి కూడా లేదనే బదులివ్వాల్సి వస్తుందండీ!” అన్నాను.
“అదేమరి! మనుషులు ఇంత భయంకరంగా ఉంటారనీ, వాళ్ల అంతరంగాలు ఇంత వికృతంగా ఉంటాయనీ తెలిసేకొద్దీ.. అదంతా చూసే దౌర్భాగ్యం నాకు లేకపోవడం అదృష్టమే కదా మరి! కాబట్టి ఆ దేవుడు నాకు మేలే చేశాడు..”ఈసారి నాకు నవ్వొచ్చింది.“మీకు సంబంధించి మీరెంత అదృష్టవంతులో.. నా మటుకు నేనూ అంతే!” అన్నాను.
“ఎందుకలా..?”
“ఎందుకంటే.. ఒంటరితనం! నాతో ఎవరూ మాట్లాడరు. నా వంక చూడాలని కూడా ఎవరూ అనుకోరు. అలా ఒంటరితనం అలవాటైంది నాకు. ఈ ఒంటరితనాన్నే ఒకవిధంగా ‘ఏకాంతం’గా భావించే మనోస్థితిని అలవాటు చేసుకున్నాను. ఈ స్థితి.. ఈ ఒంటరితనం.. ఈ ఏకాంతంలోనే నిశ్చింతగా ఉండగలం. ఎవరూ మనవంక చూడరు, మన జోలికి రారు, మనల్ని బాధపెట్టరు, ఎవరూ కోప్పడరు.. అవి వింటూ బాధపడీ, లోలోపలే కృశించిపోయే దౌర్భాగ్యం మనకి ఉండదు!”
నేను ‘నా’ గురించి చెప్పటం మొదలుపెట్టి, అతణ్ని కూడా కలుపుకొని ‘మనం’ అంటూ ముగించానని గుర్తొచ్చి నాలిక్కరుచుకున్నాను. అయితే అతడు అది గమనించాడో, లేదో తెలీదుకానీ.. నా మాటలకి ‘నిజమే’ అన్నట్లు తలూపుతూ..“నాకు మాత్రం మీ మాటలు వింటూంటే, మీతో మాట్లాడుతుంటే ఎంతో ఆహ్లాదంగా, ఆత్మీయంగా అనిపిస్తోంది. నాతో కూడా ఇప్పటివరకూ ఇంత బాగా ఎవరూ మాట్లాడలేదు. నాలాంటి భావాలు కలిగి, నావంటి అభిప్రాయాలు ఉండి, నాలాగే మాట్లాడే మీరు పరిచయమైన ఈరోజునీ, మీతో మాట్లాడుతున్న ఈ సమయాన్నీ నేనెప్పటికీ మర్చిపోలేను” అన్నాడు.
జీవితంలో మొదటిసారిగా నా గురించి ఓ మగవాడి నోటినుంచి ఇలాంటి పొగడ్త విన్నందుకేమో.. సంతోషంతోపాటు మనసులో కాస్త గర్వంగా కూడా అనిపించింది నాకు. అంతేకాదు.. నాపట్ల అతడికి కలిగిన భావమే అతడి పట్ల నాకూ కలిగింది. నిజానికి అతడి మాటలు విన్నాక..‘నా మనసునే మాటల్లోకి అనువదించి అని ఉంటాడా?’ అనిపించింది.కొద్దిసేపటికి నన్ను నేను సంబాళించుకుని అన్నాను.“మీరు నన్ను చూడలేదు, చూడలేరు కాబట్టి మీకు దగ్గరై మీ మెప్పు పొందాలని నాకేం లేదులెండి! ముందే చెప్పాను.. నేనెలా ఉంటానో! నేనిలా అన్నందుకు మరోలా అనుకోకండి!”వింటూ అర్థం చేసుకుంటున్నట్లుగా అనిపించింది అతని మౌనం. కాసేపు మా ఇద్దరిలో ఎవరమూ మాట్లాడలేదు. ఎందుకో.. ఆ కాస్త సమయమూ ఎంతో భారంగా గడిచిందని అనిపించింది నాకు.
“తీసుకోండి!” అన్నాను.. బ్యాగ్‌లోంచి టిఫిన్‌బాక్స్ బయటకి తీసి, మూతతెరిచి అతడి ముందుకు చాచి.
“ఏమిటీ..” అంటూ చేత్తో తడిమి, మళ్లీ తిరిగిస్తూ అన్నాడు..
“ఇప్పుడేం వద్దండీ! నేను తినలేను, ఆకలిగా లేదు!”
“ఆకలైతేనే తినడానికి ఇది భోజనం కాదులెండి. రవ్వలడ్లు! మొహమాట పడకండి.. తీసుకోండి!” బలవంతపెట్టాను.
అతడు సున్నితంగానే తిరస్కరించాడు. నాకెందుకో ‘గిల్టీ’గా అనిపించింది.
“కొంపదీసి వీటిలో మత్తుమందు కలిపానని అనుమానమా? మిమ్మల్ని మైకంలో పడేసి మీ దగ్గరున్నదంతా దోచేస్తానని సందేహమా?” అన్నాను చనువుగా.
“అరెరేఁ.. అలా ఎందుకనుకుంటారు? అదికాదు!” అంటూ నొచ్చుకుని..
“అయినా దోచుకోడానికి నా దగ్గరేముందనీ? ఒకవేళ మీరు దోచుకోవాలనుకున్నా.. నా దగ్గరున్నవాటి కంటే మీ రవ్వలడ్డే ఖరీదైనది.. తెలుసా?!” అన్నాడు నవ్వేస్తూ.
“మరి? నేనెలా ఉంటానో చెప్పాను కాబట్టి.. అందరిలాగే నాలాంటిదాని దగ్గర్నుంచి ఏదీ తీసుకోకూడదని మీరూ అనుకుంటున్నారా?” ఎందుకో.. నా కంఠం కొద్దిగా జీరబోయింది. ఎంతగా వద్దనుకున్నా.. నాలోని ‘ఆత్మన్యూనతాభావం’ కొద్దిమంది ‘దగ్గరివారి’ వద్దే ఇలా వ్యక్తమౌతుంది.
“అయ్యయ్యోఁ.. మీరు మరీను! అలాగేం అనుకోవద్దండీ! నాక్కొంచెం మొహమాటం ఎక్కువ!” అని..
“ఏదీ.. ఇవ్వండి! ఇలా ఇవ్వండి!” అని చేయి చాచాడు ఆత్మీయంగా.
అతడలా చనువు తీసుకోవటం ముచ్చటగా అన్పించింది నాకు. నా చేతిలోని టిఫిన్‌బాక్స్ అతడి చేతికి తగిలేలా ముందుకి పెట్టాను మురిపెంగా. ఇబ్బందిగానే తీసుకున్నాడు.
“రవ్వలడ్డు చాలా బావుంది… కొన్నారా, చేశారా?” అడిగాడు కొంచెం తిని చూసి.
నేను నవ్వాను.
“వంటకాల విషయంలో తినడానికి అవసరమైనవన్నీ చేయడం నాకు వచ్చండీ! కొనే అలవాటు లేదు! నేను బావుండనంత మాత్రాన నేను చేసేవి కూడా బావుండవనా మీ ఉద్దేశం?” అతణ్నే సూటిగా చూస్తూ అడిగాను.
చప్పున అతని ముఖమంతా విచారం ఆవరించింది. బాధని కళ్లతో ‘చూసే’ స్థితి అతడికి లేకపోయినా.. బాధని అర్థం చేసుకున్న భావాన్ని నిజాయతీగా వ్యక్తం చేయగలిగే నిష్కపట భావం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.
వెంటనే నోరు విప్పాడు.. నవ్వుతోపాటు..
“మిమ్మల్ని మీరు నిరూపించుకునే మార్గాల్లో ఈ వంటపని కూడా ఒకటేమో! ఎవరో అన్నారు.. ఒక వ్యక్తి ప్రియమైనది ఏదైనా కోల్పోయినప్పుడు ఆ క్షణంలోనే ఒక అద్భుత సృష్టికర్త అవుతాడట. ఆ పోగొట్టుకున్నదే తక్కువగా అనిపించే మరో గొప్ప విజయాన్నేదో సాధిస్తాడట! మనలాంటి వారికి సరిగ్గా సరిపోయే మాట అది!”
అబ్బురంగా చూశానతడి వైపు! అతడి మాటలు వింటుంటే నాలోని ఆత్మన్యూనతాభావం ‘ఆత్మవిశ్వాసం’గా రూపాంతరం చెందడం తెలుస్తోంది నాకు. అంతేకాదు.. తనుకూడా ‘మనలాంటి’ అనే పదం వాడటం నాకు నచ్చింది.
“నాకు కాదు.. మీకు సరిగ్గా సరిపోతుంది ఆ మాట! ‘అంధత్వం’ అనేది ఓ మేలిమి ముసుగైతే.. దాని వెనుక దాగిన ‘మేధోదృష్టి’ మీది! లోకుల దృష్టిలో మీరు అంధులేమో కానీ, లోకం పట్ల మాత్రం మీరు అంధులు కారు!” అన్నాను.
బదులివ్వకుండా విని ఊరుకున్నాడతను.
మరోసారి మౌనం మామధ్య నాట్యమాడింది. కానీ ఈసారి మౌనం.. భారంగా అనిపించలేదు నాకు. కారణం.. అతడి కళ్లు శూన్యంలోకి చూస్తూవున్నా, అతడు చూడలేకున్నా.. అతడి మనోనేత్రాలు మాత్రం నన్నే చూస్తున్నట్లు అనిపించడం!
చిత్రమైన విషయమేంటంటే.. ఆ చూపుల్లోని భావం ‘నేనొక ఆడదాన్ని’ అన్న విషయం గుర్తుచేస్తూ.. నేను మునుపెన్నడూ చవిచూడని ‘పులకింత’కి గురిచేసింది.
“మీ ఇంట్లో ఎవరెవరుంటారు?” ఉన్నట్టుండి అడిగాను.
“నేనూ, మా అమ్మమ్మ!”
“ఇంకా..?” అని ఓ క్షణమాగి..
“అంటే.. భార్యా, పిల్లలూ..?” అనడిగాను.
“అలా ఎవరూ లేరు. నేనింకా పెళ్లిచేసుకోలేదు!” చెప్పాడు.
“అదేం..?” అసంకల్పితంగానే అడిగేశాను.
“ఏమో.. తెలీదు. చేసుకోలేదు.. అంతే!”
కొద్దిసేపయ్యాక మళ్లీ అడిగాను..
“మీకు ‘తోడు’గా మరొకరుంటే బావుణ్ను.. అన్పించలేదా?”
తల అడ్డంగా ఊపాడు.
“మా అమ్మమ్మ ఉంది చాలు! మూడోవ్యక్తి వస్తే.. నాలో మీరన్న.. ఏమిటదీ ఏదో ‘దృష్టి’ అన్నారే ఇందాక.. మాయదృష్టా?” అంటూ అతడు తడుముకుంటూంటే..
“మేధో.. మేధోదృష్టి!” అని సరిచేశాను.
“ఆఁ.. నాకున్న ఆ దృష్టి కూడా పోతుంది. మరీ అన్యాయమైపోతాను. అందుకే వద్దు”
“అదేంటీ.. అలా ఎందుకు అనుకుంటారు? ఒకవేళ మూడోవ్యక్తి ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడి, కోరుకొని వస్తే?”
“ఎవరూ రారు.. నాకు తెలుసు!” చాలా స్పష్టంగా, కచ్చితంగా చెప్పాడు.
“లేదు.. మీకు తెలీదు.. వచ్చింది.. వచ్చేసింది!”
“ఏంటీ..? ఏంటి మీరంటోంది?!” ఉలిక్కిపడుతూ.. తడబడుతూ అడిగాడు.నేను తమాయించుకుని..
“గుంటూరు! గుంటూరు స్టేషన్ వచ్చేసిందంటున్నాను!” అన్నాను.
“ఓఁ..” అంటూ నిట్టూర్పు విడుస్తూ నెమ్మదించినట్లుగా సర్దుకున్నాడు.
ట్రైన్ వేగం తగ్గసాగింది.. స్టేషన్ రాబోతోందనడానికి సూచనగా! రైలెక్కిన ప్రతిసారీ ‘ఎప్పుడెప్పుడొస్తుందా!?’ అని ఎదురుచూసే స్టేషన్.. ఈసారి వెంటనే వచ్చేయడం నాకు అస్సలు నచ్చలేదు. రైలు దిగాలంటే మనసంతా దిగులుగా ఉంది.
“నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. ఇక జనగణమన అధినాయక జయహే..!” అన్నాను పేలవంగా నవ్వుతూ.
నవ్వలేదతను.. ఏదో చెప్పాలనుకుంటూ అతికష్టమ్మీద నిగ్రహించుకుంటున్నట్లుగా అన్పించింది నాకు. స్టేషన్ దగ్గరపడుతోంది. అదేమిటో నేనే అడుగుదామని నోరు తెరిచాను. అంతలో.. అతడే అడిగాడు.
“నాతో మాట్లాడాల్సింది ఇంకేమీ లేదా?”ఆశ్చర్యంగా చూశాను.
“ఏముంటాయి ఇంకా? ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా! మీరే చెప్పండి ఏదైనా.. ట్రైన్ ఆగబోతోంది. చెప్పండి త్వరగా.. ప్లీజ్!” అన్నాను.
“మీరూ హైదరాబాద్‌లోనే కదా ఉండేది?”
“అవును.. కానీ, ఇద్దరిదీ పక్కపక్క ఇళ్లు కాదుకదా!” అనేశాను అసంకల్పితంగా. అతడి ‘మనసు’ని చదివేసినట్లుగా, అందులోని ‘భావం’ అర్థమైనట్లుగా!
జేబులోంచి ఏదో తీసి నాకివ్వబోతున్నట్లు చేయి ముందుకి చాచాడు.
“ఏమిటిది?” అంటూనే తీసుకుని చూశాను.విజిటింగ్ కార్డ్! అతడిది!!
“ఈరోజు పౌర్ణమి! నిద్ర పోవాలన్పించదు. మా ఇంట్లో అయితే ఆరుబయట కూర్చొని ఆకాశంలో చంద్రుడి వంక చూస్తూ జాగారం చేయాలనిపిస్తుంది..” చెప్తూ ఆపాను మధ్యలో.“ఔనా… పౌర్ణమి అంత బావుంటుందన్నమాట! అయితే..?”
“ఏం లేదు.. ఆరోజు నేను మీతో ట్రైన్లో మాట్లాడినంతగా ఇప్పటివరకూ నేనెవరితోనూ మాట్లాడలేదు. ఈరోజు మీతో మాట్లాడాలనే వచ్చాను. పౌర్ణమి వెన్నెలని చూస్తూ మా ఇంట్లో ఒంటరిగా, మౌనంగా ఉండటం కన్నా.. ఇక్కడ మీ ఇంట్లో, మీతో మాట్లాడుతూ, మరోవైపు చంద్రుణ్ని చూస్తూ గడపొచ్చనే ఉద్దేశంతో వచ్చాను..”
అతడి కళ్లలో ‘వెలుగు’ కన్పించింది నాకు.. చిత్రంగా!
“అయితే.. ఆ పౌర్ణమికి థాంక్స్!” అన్నాడు నవ్వుతూ.
నాకు తెలీకుండానే నా హృదయం ఆనందంతో నిండిపోయింది. అతడు నవ్వుతూ, సరదాగా మాట్లాడటం చూస్తూంటే.. నాలాగే అతడు కూడా ఎప్పుడూ ‘నవ్వడం’ అనే అదృష్టానికి నోచుకోలేదేమో.. అనిపించింది.
“ప్రకృతిలో మీకు ఏదిష్టం?” అడిగాను. నా మాటలకి నిస్సారంగా చేతివేళ్లతో కళ్లను నులుముకున్నాడతను.
“ప్రకృతిలో ఇష్టమైనవి అంటే.. ఎలాగూ చూడగలిగే వరం లేదు కాబట్టి వినడం వరకే నా భాగ్యం! వినడం, వాసన చూడటం, రుచి చూడటమే కదా నా జీవితం! ఆ మూడింటి ఆధారంగా చెబ్తున్నాను నాకు నచ్చినవేమిటో.. సంగీతం అంటే ఎంతో ఇష్టం. మల్లెపూల వాసన అన్నా చాలా ఇష్టం! ఇక రుచిలో.. రుచిగా ఉండేదేదైనా ఇష్టమే!” అన్నాడు.
“మరి.. ‘మనసు’కి నచ్చిన రుచుల్లో?” అన్నాను.
వెంటనే బదులివ్వలేదతడు.
“మనసు రుచి.. మనసు రుచి..” తడుముకుంటున్నట్లు తనలోతానే పలికాడు రెండు మూడుసార్లు.
“మనసు రుచి అంటే.. మరోలా అనుకోకండి. మనస్తత్వాల్ని బట్టి ఫలానా రుచిపట్ల ఇష్టం ఉంటుందిగా!” అన్నాను.
“తెలుసు..” తెలుసన్నట్లుగా తలూపుతూ నవ్వాడు.
‘ఏం చెబుతాడా…’ అన్నట్లుగా ఎదురుచూడసాగాను.
నిజమే.. మనసుల్లో కూడా చాలా రకాలున్నాయి. అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. నాకు నచ్చిన, ప్రియమైన ‘మనసు రుచి’.. తనలోని లోపాల్నీ, లేమినీ దాచుకోకుండా ఆత్మసాక్షిగా, నిజాయతీగా, స్వచ్ఛంగా మాట్లాడే అతడి వైఖరి!అతను చెప్పసాగాడు.. నేనేం మాట్లాడలేదు.. వింటూ ఉండిపోయాను.“నాకు మీ మనస్తత్వం నచ్చింది. మీలోని సుగుణాలు కూడా! మీ గురించి మీకు తెలిసిందే గాక.. మీ గురించి పదిమందీ అనుకునేదీ, చెప్పుకొనేదీ కూడా చెప్పారు. మీ తప్పొప్పులూ, మీ గుణగణాలూ, మీలోని అవలక్షణాలూ.. అన్నీ వివరించారు. ఇన్నేళ్లకి, ఇన్నాళ్లకి ‘మనిషి’ అనే పదానికి సరైన అర్థంలా మీరు నాకు కన్పించారు..”
“కన్పించానా..?”..
ఆనందం, గర్వం, మురిపెం.. ఒకేసారి ధ్వనించాయి నా స్వరంలో.“ఔను.. కన్పించారు. నాలోని అంతర్నేత్రానికి! నా మనసుకి, నా మనోదృష్టికి! మీ మాటల్లో చెప్పాలంటే నా మేధో దృష్టికి కనిపించారు.. కనిపిస్తున్నారు! నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను!”
సంభ్రమంగా చూశానతణ్ని! నాపట్ల అతడి మదిలో దాచుకున్న భావాల్ని ఏ విధంగా, ఎలాంటి సమయంలో, ఎటువంటి సందర్భంలో వ్యక్తం చేస్తున్నాడో అర్థమై.. ఒక్కసారిగా స్త్రీ సహజమైన సిగ్గు కమ్మేసింది నన్ను.ఆ తర్వాత ఎన్నో కబుర్లు చెప్పుకొన్నాం ఇద్దరం. ఆకాశంలో చంద్రుడివంక చూస్తూ, చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ, హాయి గొలిపే అతడి మాటలు వింటూంటే.. గంటలు కూడా క్షణాల్లా గడిచిపోయాయి.
“ఇక… వెళ్తా!” అంటూ లేచాను.“అప్పుడేనా..?” దిగులుగా అన్నాడు.“ఏం..? ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా?” అన్నాను.నిజానికి నాకూ వెళ్లాలని లేదు. కానీ, తప్పదు కదా?! నేను అన్నదానికి అతడేం బదులిస్తాడోనని ఎదురుచూశాను. తనలో తానే తర్జనభర్జన పడుతున్నట్లుగా, సందిగ్ధంగా ఉండిపోయాడు చాలాసేపు. ఆ తర్వాత అన్నాడు..“పౌర్ణమి.. ఇంత అద్భుతంగా ఉంటుందని నాకిప్పటివరకూ తెలీదు!”“నాక్కూడా..!” నా మనసులోని అనుభూతి అతడి మాటల్లో వ్యక్తమయ్యేసరికి ఠక్కున అనేశాను.“ఇలాంటి పౌర్ణములు ప్రతిరోజూ వస్తే ఎంత బావుణ్ను..!”నా మనససుని చదువుతున్నట్లు ప్రతి భావాన్నీ అతడు మాటల్లో తెలుపుతూంటే విస్మయంగా చూశానతడి వంక.“నాకూ అలాగే అన్పిస్తోంది. కానీ, అదెలా వీలవుతుంది?” అన్నాను నిరాశగా.అతడేమీ మాట్లాడలేదు. నాకింకేం మాట్లాడాలో తెలీలేదు.
“సరే మరి.. వెళ్లనా!” అయిష్టంగానే లేచి నించున్నాను.అప్పుడు కూడా అతడేమీ మాట్లాడలేదు. కాసేపు ఎదురుచూసి..“ఓకే. గుడ్‌నైట్!” అంటూ అక్కణ్నుంచి కదిలాను.అప్పుడన్నాడు హఠాత్తుగా..“ఆశలు రేపడం మీకు బాగా తెలుసు..!”
ఆశ్చర్యంగా చూశానతడి వంక.“నేను మీలో ఆశలు రేపానా..?” అన్నాను.“ఔను! సమాంతర రేఖలు ఎన్నటికీ కలవవేమో కానీ.. మనం కలిసి ఉంటామన్న నమ్మకం నాకుంది!” అన్నాడు.“ఎలా..?” అప్రయత్నంగానే అడిగాను.“అందరు భార్యాభర్తల్లా ఒకరి లోపాల్ని మరొకరు వేలెత్తి చూపుకొనే పరిస్థితి మనమధ్య రాదు కాబట్టి!”
“ఏమిటంత ధీమా? అందరు భార్యల్లాగే నేనూ మారిపోతే?”
“నువ్వు మారవు..!”
అతడి ‘నువ్వు’ అనే ఏకవచన సంబోధనలో ఆత్మీయత, అనురాగమే కాదు.. నా మనసుని తన మనసుతో ఆత్మీయంగా తాకిన అనుభూతి, తన హృదయంతో నా హృదయాన్ని ఆప్యాయంగా హత్తుకున్న నిశ్చింత కూడా ధ్వనించింది.“నేను మారనని అంత నమ్మకమేంటి మీకు?”.. అతడి ఉద్దేశం ఇంకాస్త స్పష్టంగా తెలుసుకోవాలని నా ప్రయత్నం.“రెండు ఒకట్లు పక్కపక్కన చేరితే ఎంతవుతుంది?” ఉన్నట్టుండి అడిగాడు.అసందర్భ ప్రశ్నలా అన్పించి.. ఆశ్చర్యంగా అతడి వైపు చూసి, చెప్పాను వెంటనే “పదకొండు!” నవ్వాడతడు.“చూశావా! నువ్వూ, నేనూ కలిస్తే ‘రెండు’ కాదు.. పదకొండు! అందుకే నువ్వు మారవు. మనం కలకాలం అన్యోన్యంగా ఉంటాం!” అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.చిత్రం.. నా చేయి ‘అందుకోవడానికి’ అతడు తడుముకోలేదు.
ముప్ఫయ్ అయిదేళ్లు గడిచాయి..
ఒక పాప.. ఒక బాబు! మాలాగా కాదు. ఏ లోపమూ లేని సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఎలాంటి వైకల్యమూ లేని పరిపూర్ణవంతులు!పెళ్లిళ్లు కూడా ఘనంగానే చేశాం. మనవలూ, మనవరాళ్లతో కాలక్షేపం చేయడమే మా దినచర్య ఇప్పుడు!ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ఏనాడూ పల్లెత్తుమాట అనుకోలేదు ఇద్దరమూ.ముఖ్యంగా.. మావారి ‘అంధత్వం’ నాకేనాడూ గుర్తురాలేదు. అలాగే.. శరీరమంతా తెల్లని మచ్చలతో నిండిపోయిన నా ‘చర్మవ్యాధి’ కూడా ఆయనకి జ్ఞాపకం రాలేదు.
ఇంతకీ.. నా పేరేంటో చెప్పలేదు కదూ మీకు? మానసవంశీ!’
ఏంటీ.. మావారి పేరేంటో కూడా చెప్పమంటారా?ఉహుఁ.. చెప్పను! నా పేరు నుంచి కూడా ఆయన్ని విడదీయటం నేను తట్టుకోలేను!
“మిమ్మల్ని మీరు నిరూపించుకునే మార్గాల్లో ఈ వంటపని కూడా ఒకటేమో! ఎవరో అన్నారు.. ఒక వ్యక్తి ప్రియమైనది ఏదైనా కోల్పోయినప్పుడు ఆ క్షణంలోనే ఒక అద్భుత సృష్టికర్త అవుతాడట. ఆ పోగొట్టుకున్నదే తక్కువగా అనిపించే మరో గొప్ప విజయాన్నేదో సాధిస్తాడట! మనలాంటి వారికి సరిగ్గా సరిపోయే మాట అది!”
అబ్బురంగా చూశానతడి వైపు! అతడి మాటలు వింటుంటే నాలోని ఆత్మన్యూనతాభావం ‘ఆత్మవిశ్వాసం’గా రూపాంతరం చెందడం తెలుస్తోంది.
యస్వీ కృష్ణ
సాహిత్యం – రచనా వ్యాసంగాలనే వృత్తి- ప్రవృత్తులుగా మలచుకొని జీవనయానం సాగిస్తున్నారు యస్వీ కృష్ణ. రచయితగా, ప్రచురణ కర్తగా సుపరిచితులు. రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చదివారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఫైన్ ఆర్ట్స్ (శిల్పం)లో బీఎఫ్ఏ డిగ్రీ, శాస్త్రీయ సంగీతం (కర్ణాటక వయొలిన్)లో బీఏ చేశారు. శాస్త్రీయ నృత్యం(కథక్)లో డిప్లొమా చేసి జాతీయ ప్రదర్శనలూ ఇచ్చారు. ఇక సాహిత్యంలో.. కవి, కథా – నవలా రచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, ప్రచురణకర్త కూడా. ‘జయంతి పబ్లికేషన్స్’ ప్రచురణ సంస్థను స్థాపించి.. వర్ధమాన రచయితలు మొదలుకొని లబ్దప్రతిష్ఠులైన సాహితీవేత్తల రచనలను 410కి పైగా పుస్తకాలుగా ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేస్తున్నారు. వీరి రచనలు దాదాపు అన్ని ప్రముఖ దిన-వార-పక్ష-మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. రేడియో-దూరదర్శన్లలోనూ ప్రసారమయ్యాయి. ఎన్నో రచనలకు బహుమతులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర (ఇన్సా)’ సంస్థకు రెండు తెలుగు రాష్ర్టాల తరఫున సమన్వయకర్తగా ఉన్నారు. పలు జాతీయ- అంతర్జాతీయ సాహితీ సదస్సులలో పాల్గొన్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
-యస్వీ కృష్ణ
93999 39302