హిందీ కథ
నాలుగైదు దినాల్నుంచి నస్రుద్దీన్కు బుగులు గావట్టింది. ‘పిడాత గూత్తె ఎట్ల?’ అనుకున్నడు. అనుకున్నది అనుకున్నట్టే.. పొద్దుగాల లేవంగనే పక్కూరి వకీలు తానికి వోయిండు. “వకీల్ సాబ్! నాకు బుగులుబుగులు గుంటంది. జర్రంత నాకు ఇల్లునామా రాయించి పెట్టాలె! నీ రాత పైసలు నీకిత్త!” అంట అన్నడు. “సరే!” అంట శెప్పుమన్నడు వకీలు. “ఎయ్యి బంగారు సిక్కలు.. నూరు గాడ్దులు. యాభై యాటపోతులు. నపరో పదిగాల్ల దున్నపోతులు.
ఇంటింటి రాజులందరికీ రాయుండ్రి!” అంట జెప్పిండు. ‘అమ్మో! ఈనికింత ముల్లె ఉన్నదా!?’ అంట వకీల్ సాబ్ అయిరానైండు. ఇల్లునామా రాసినంక.. కాయితాన్ని నస్రుద్దీన్ శేతుల వెట్టుకుంట.. “అబ్బా! మీరు గింత సిరిమంతులాయె.. నా ఫీజు పది సిక్కాలియ్యుండ్లి!” అంట అడిగిండు వకీలు. గా మాటలిన్న నస్రుద్దీన్.. “అయ్యో! వకీల్ సాబ్.. ఇయ్యన్నీ నాతాన ఇప్పుడు లేవు. ఈ గాడిది, పెయ్యిమీది కోటు.. గంతే! రేపు గవన్ని సంపాయించినంక మర్శిపోతే మంచిగుండదని ఇల్లునామా రాయించిన!” అంట జెప్పి, వకీలు శేతుల రూపాయి బిళ్లవెట్టి.. బిరాన వేయిండు.
…? పత్తిపాక మోహన్