“రేపు ఎండాకాలం సెలవుల్లో బదరీనాథ్ వెళ్దామనుకుంటున్నా.. నువ్వు కూడా వస్తావా?” కేశవ్ అడిగాడు రాఘవని.సాయంత్రం ఆరు గంటలప్పుడు వాళ్లిద్దరూ వాళ్ల ఇళ్లకు దాపులో ఉన్న పార్కులో కబుర్లు చెప్పుకొంటూ నడుస్తున్నారు. రోజూ ఓ గంటసేపు కాలక్షేపం. సంతోషాలు, కష్టాలు పంచుకుంటారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం అది. ఏడవుతుండగా ఇళ్లకు వెళ్తారు.
జనవరి మాసం. చలి తగ్గలేదు. అందునా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉన్నట్లనిపిస్తోంది.
ఇద్దరూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కేశవ్ తెలుగు, రాఘవ సైన్స్ సబ్జెక్టులు బోధిస్తారు. ఐదు సంవత్సరాల క్రితం ఒకేసారి చేరారు. ఒకరికొకరు ఆకర్షితులై త్వరలోనే ఆత్మీయ మిత్రులయ్యారు. నివాసం ఒకే బస్తీలో. రాఘవ తాతగారు దగ్గరలోనే ఉన్న గ్రామం నుండి వచ్చి మహబూబ్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని స్థిరనివాసం ఏర్పరుచుకోవటంతో.. అది అతడికి వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అయ్యింది. కేశవ్ వనపర్తి నుండి ఈ ఉద్యోగం వచ్చిన తరువాతే రావటంతో.. అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. ఇద్దరిదీ ముప్పై పైనే వయసు. రూపం కూడా తెలుగు మాస్టారే అనిపించేలా.. కేశవ్ ఎప్పుడూ ధోతి, లాల్చీనే ధరిస్తుంటాడు. అంట కత్తెర వేసిన జుట్టు, చిన్న శిఖ. రాఘవకు ప్యాంటూ, చొక్కా తప్ప.. ధోతి కట్టే అలవాటు లేదు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కేశవ్‌కు ఓ పిల్లవాడు. కాస్త ఆలస్యంగా వివాహమైన రాఘవ ఇంకా తండ్రి కాలేదు.
“ఎందుకు అనుకుంటున్నావ్ అక్కడికి వెళ్లాలని!” రాఘవ అడిగాడు.. కేశవ్‌నే చూస్తూ.
“నాన్న బతికున్నంత కాలం అంటుండే వాడు.. ‘ఎన్నాళ్లుగానో బ్రహ్మకపాలం వెళ్లి మా పితరులకు పిండప్రదానం చేసి సద్గతులు కలిగించాలని అనుకుంటున్నా. సానుకూలం కావటంలేదు. ఇప్పుడా.. వయసు మీదపడటంతో అంతదూరం వెళ్లగలనా? అనే అధైర్యం కూడా పీడిస్తున్నది’ అని. మనసులోని ఆ కోరిక నెరవేరకుండానే ఆయన వెళ్లిపోయారు. కన్నకొడుకుగా దానిని నిర్వర్తించి ఆయన ఆత్మకు తృప్తి కలిగించాలనేది నా ఆశ!”.
భార్య రమ.. బీఏ తరువాత తెలుగు పండిట్ చేసి ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయినిగా చేస్తోంది.అమ్మకు ఓపిక తగ్గటంతో రాలేదు. భార్యను తీసుకొని వెళ్దామన్నా.. పిల్లవాడు పసివాడు. అందుకే ఒక్కడే వెళ్దామనుకున్నాడు.“తోడుగా నువ్వు వస్తానంటే నాకు ధైర్యంగానూ, ఆనందంగానూ ఉంటుంది!” అన్నాడు రాఘవతో.“వస్తాను కానీ, నేనక్కడ చేయాల్సిన కర్మకాండలేవీ లేవు. లక్ష్మీనారాయణున్ని దర్శించుకోవటం, హిమాలయాల అందాల్ని ఆస్వాదించటం.. అంతే!”
అతడి తండ్రి పదిహేను సంవత్సరాల క్రితం ఒకరోజు ఇంటినుండి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఎక్కడున్నాడో తెలియదు. అసలు బతికి ఉన్నాడో లేదో కూడా తెలియదు.“నీ అంగీకారం నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది రాఘవా! ఇక ఆ ప్రయత్నంలో ఉంటాను. అక్కడ నిర్వర్తించాల్సిన కార్యక్రమాలకు ఎప్పుడు బావుంటుందో చూస్తాను!” అన్నాడు మిత్రుడి చేతిని అందుకుంటూ.
ఏప్రిల్ మొదటి వారంలో వెళ్లటానికి నిర్ణయించుకున్నారు ఇద్దరూ. అప్పటికి స్కూల్లో పిల్లల పరీక్షలే కాకుండా పేపర్లు దిద్దటమూ అయిపోతుంది. బదరీనాథ్తోపాటు ఢిల్లీ, హరిద్వార్, రుషికేశ్ చూడాలనేది వాళ్ల ఆలోచన. ఢిల్లీకి రానూపోనూ రైలుకు టిక్కెట్లను రిజర్వు చేసుకున్నారు. కేశవ్ బ్రహ్మకపాలంలో చేయాల్సిన కార్యక్రమానికి వారి ఇంటి పురోహితుడు తనకు తెలిసినవారి ద్వారా ఏర్పాట్లు చేశాడు.
పదిహేను రోజుల్లో బయల్దేరతారనగా.. ఒక రోజున రాఘవ తల్లికి దగ్గర బంధువు నుండి ఓ ఉత్తరం వచ్చింది.
‘సుభద్రమ్మా!
పదిహేను రోజుల క్రితం ఓ మిత్రుడితో కలిసి తొమ్మిది రోజులు ఉందామని కాశీ వెళ్లినప్పుడు.. అక్కడ ఒక అనాథాశ్రమానికి వెళ్లటం తటస్థించింది. నాతో వచ్చిన మిత్రుడు ప్రతి సంవత్సరం పంటలు రాగానే ఆ ఆశ్రమానికి పదివేలు విరాళంగా పంపిస్తుంటాడు. ఈసారి ఎలాగూ కాశీ వెళ్తున్నాం కదా.. స్వయంగా ఇద్దామని నిర్ణయించుకున్నాడు.ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే.. అక్కడ ఆ ఆశ్రమంలో బావగారి ఫొటో చూశాను. పదిహేను సంవత్సరాల క్రితం ఎవరో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను తీసుకువచ్చి అందులో చేర్చారట. అక్కడ అనాథగా చేరిన ఆయన.. త్వరలోనే కోలుకుని ఆ ఆశ్రమవాసులకు నాథుడై ఎంతో నిబద్ధతతో సేవ చేశాడట. అందరూ ఆయన్ను తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిన దేవుడిగా భావించేవారట.అక్కడున్న అందరినీ దుఃఖసముద్రంలో ముంచి బావగారు రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు నెల ఎనిమిదో తేదీ, ఏకాదశీ సోమవారం నాడు శివైక్యం చెందారట. నిర్వాహకులే సంప్రదాయ బద్ధంగా కర్మకాండనంతా గంగ ఒడ్డున జరిపించారట. నిస్వార్థంగా ఆశ్రమంలో చేసిన సేవలకు గుర్తింపుగా.. బావగారి ఫొటోను వారి ఆఫీసులో పెట్టారు.బావగారు తన వివరాలను ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోవడంతో.. వారూ ఆయనకు కావాల్సిన వారికి ఆ విషయాన్ని తెలియజేయ లేకపోయినట్లుగా చెప్పారు.బావగారి ఫొటో చూసి నేను గుర్తించటంతో.. నన్ను ఆ విషయాన్ని మీకు తెలియబరచమని కోరారు.
– నీ సోదర సమానుడు, రామబ్రహ్మం.’
కొడుకు చదువుతున్న ఆ ఉత్తరంలోని విషయాన్ని వింటూనే.. సుభద్ర ఘొల్లుమన్నది. కేశవ్ కూడా ఆ సాయంత్రం పార్కులో కలిసినప్పుడు విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడ్డాడు.“జరిగింది బాధాకర విషయమే! కానీ, ఇదే సమయంలో నువ్వూ బదరీనాథ్ బయల్దేరటం యాదృచ్ఛికం. ఎలాగూ నీ చేతులమీదగా ఆయన్ను సాగనంపలేక పోయావు. ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ పవిత్ర స్థలంలో తర్పణాలు విడిస్తే.. అంతదూరం వెళ్లిన శ్రమకూ ఫలితం దక్కుతుంది. అటు ఆయనకూ పుణ్యగతులు ప్రాప్తిస్తాయి!”
రాఘవ క్షణం కూడా ఆలస్యం చేయలేదు.“నేను అక్కడ ఎలాంటి కార్యక్రమాలనూ నిర్వర్తించనని ముందే చెప్పాను. చేయకపోవటమే కాదు, చేయాలని అనుకోవటమూ నాకు ఇష్టంలేదు!” అన్నాడు కంఠం హెచ్చించి.అతడి మాటతీరుకు ఉలిక్కి పడ్డట్లుగా మిత్రుడి ముఖంలోకి కన్నార్పకుండా చూస్తుండి పోయాడు కేశవ్.
“అదేం?”
‘మిత్రుడి ముందు తొందరపడ్డానా!?’ అన్నట్లుగా రాఘవ తడబడి..“అనవసరం అనిపిస్తున్నప్పుడు దాన్నే చర్చిస్తూ బుర్రపాడు చేసుకోవటం దేనికి!” అంటూ తేలిగ్గా నవ్వేశాడు.
ఘాట్‌రోడ్డు మీద పదకొండు గంటల బస్సు ప్రయాణం. ఒళ్లంతా నొప్పులు. కాళ్లూ చేతులూ పట్టుకున్నట్లవ్వగా.. బదరీనాథ్‌లో దిగిన ఇద్దరూ కించిత్ ఇబ్బందిపడ్డారు.. ఆ చలిలో నడవటానికి. సాయంత్రం ఆరు గంటలకే ఆ ప్రదేశమంతా చీకటి ఆవరించింది. దానికి తోడు ఏప్రిల్ నెల అయినా చలి ఎక్కువగానే ఉన్నది.కేశవ్ ఇంటి పురోహితుడు ముందుగానే తెలియబరచటంతో అక్కడ ఆయనకు తెలిసిన భట్టుగారు బస్సు దగ్గరికి వచ్చి వాళ్లను తన ఇంటికి తీసుకువెళ్లాడు.“మాది కర్ణాటక. మా నాన్నగారు నాలుగు దశాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చారు. మీకు మా ఇంట్లోనే వసతి, భోజన సదుపాయం ఏర్పాటుచేశాను. మన భోజనం మీకు ఇక్కడ హోటళ్లలో దొరకదు!”భోజనాలైన తరువాత, వాళ్లకిచ్చిన మేడమీద గదిలో కూర్చుని.. కేశవ్ చెప్పిన గతించిన వారి పెద్దల వివరాలను గోత్రనామాలు సహా ఓ కాగితం మీద రాశాడు.
“అక్కడి కార్యక్రమం మీరే నిర్వహిస్తారా?” కేశవ్ అడిగాడు.“లేదండీ.. దానికి ప్రత్యేకంగా వేరే పురోహితుడు ఉన్నారు. ఆ ఏర్పాట్లకు కూడా చెల్లించాల్సిన రుసుం కట్టి రసీదు తీసుకున్నాను. మీరు చెప్పిన వివరాలతోపాటు ఆ రసీదును కూడా వారికివ్వాలి!”“ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించటం వలన పొందే అనుభూతుల్ని, ప్రయోజనాలని తెలుసుకుంటే మనసు పెట్టి వారు చెప్పినట్లుగా చేయగలుగుతారు కదా!” అన్నాడు ఓరగా రాఘవ వంక చూస్తూ. అతడి ఉద్దేశం ఆ వివరాలు వింటేనన్నా అతడు మనసు మార్చుకుని తండ్రికి తనలాగానే కార్యక్రమం నిర్వర్తిస్తాడేమోనని మనసులో ఏర్పడిన చిన్న ఆశ.
భట్టు చిరునవ్వుతో..
“నిజమే! ఉపనిషత్తులు ఏం చెబుతున్నయంటే మనిషి మరణించిన తరువాత కారణ శరీరం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది!” అంటూ మొదలుపెట్టగానే.. రాఘవ లేచి గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు.
వణుకు పుట్టిస్తున్న చలికి వత్తాసుగా ఆకాశాన మరీ కిందకు దిగాడా అన్నట్లుగా చంద్రుడు. తెలియని తపనతో ఊగిపోతున్న మనసు. కలవరపాటును అధిగమించాలి అన్నట్లుగా మూసుకుపోతున్న కళ్లు. కొద్ది క్షణాల తరువాత తనని తాను నిగ్రహించుకుంటూ కనురెప్పలు తెరిస్తే ఆకాశవీధిలో కాలుపెట్టినట్లుగా చుట్టూ ఎత్తుపల్లాల మధ్య ఇళ్లు, వాటిలో వెలుగుతున్న దీపాలు.. వంతెన కిందుగా గలగలా పారుతున్న అలకనంద నీటి శబ్దం.
తన ఆలోచన ఫలించనందుకు కేశవ్ ఓ నిట్టూర్పు విడిచాడు.. మిత్రుడు వెళ్లిన వైపే చూస్తూ.“ఆ నూతన శరీరానికి మనం పెట్టిన పిండాలే ఆహారం…!” భట్టుగారు చెప్పుకొంటూ పోతున్నాడు.
మరునాడు ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఇద్దరూ దేవాలయం ముందున్న ఉష్ణగుండంలో స్నానం చేశారు. ఒడ్డుకు వచ్చి శరీరాల్ని శుభ్రపరుచుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు.అదో అద్భుతమైన దేవాలయం. లోపలికి వెళ్తూ ఎత్తుమెట్ల మీద నిలబడి వెనక్కు తిరిగి చూస్తుంటే.. చుట్టూ మంచును కప్పుకొన్న హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని చుంబిస్తున్నయా!? అన్నట్లుగా కనిపిస్తున్నాయి.గుడి లోపల బద్రి నారాయణుడు అనే పేరుతో ఉన్న లక్ష్మీనారాయణుని దర్శించుకున్నారు. ఆలయంలోని వివిధ దేవుళ్లనూ దర్శించుకుని దగ్గర్లోనే ఉన్న బ్రహ్మకపాలానికి భట్టుగారు దారి చూపుతుండగా బయల్దేరారు.వీళ్లు వెళ్లేసరికి అప్పటికే ఆ ప్రదేశంలో కొంతమంది కూర్చుని పిండాలు చేస్తుండగా, పురోహితుడు వారిమధ్య అటూఇటూ తిరుగుతూ సూచనలు ఇస్తున్నాడు.కేశవ్ తనకు నిర్దేశించిన స్థలంలో కూర్చుని చేయాల్సిన పనికి ఉపక్రమించాడు. అతడికి కాస్తంత దూరంగా రాఘవ కూర్చుని అతడు చేస్తున్న పనులనే నిర్లిప్తంగా చూస్తున్నాడు.కేశవ్ తన చేతిలోని చిన్న తోలుసంచి నుంచి రాత్రి భట్టుగారు తన పెద్దల పేర్లు, వారి గోత్రాలు, బంధుత్వాలు రాసి ఇచ్చిన కాగితాన్ని, డబ్బు కట్టిన రసీదును బయటకు తీశాడు.తర్పణాలు, పిండపూజ పూర్తయ్యేటప్పటికి పన్నెండు దాటింది. కేశవ్ పిండాలను తీసుకువెళ్లి ఎత్తునుండి నురుగులు కక్కుతూ పడుతున్న అలకనంద నీటిలో గతించిన పెద్దలను స్మరించుకుంటూ వదిలాడు. అతడి నేత్రాలు తండ్రి కోరికను ఇప్పటికైనా తీర్చగలిగాను అన్న తృప్తితో నిండి ఉన్నాయి.
కేశవ్ కళ్లలోని వెలుగును తదేకంగా చూస్తున్న రాఘవ తలెత్తితే..పితరులే హిమాలయాల నుంచి వాటిని స్వీకరించేందుకు వస్తున్నారా!? అన్నట్లుగా ఆకాశాన వేగంగా కదులుతున్న తెల్లటి మబ్బు తునకలు.అక్కడికి తమతోపాటు వచ్చిన భట్టుగారిని చూస్తూ,“ఇక్కడ స్వచ్ఛమైన రుద్రాక్షలు దొరుకుతాయని విన్నాను. నాకు ఇప్పించగలరా?” అడిగాడు రాఘవ.“నా దగ్గరే ఉన్నయండీ! ఇస్తాను. చాలా పవిత్రమైనవి. సహజంగా చెట్లనుండి పొందినవి!”“చాలా సంతోషం… వాటి ధర ఎంతో చెబితే ఇస్తాను!”
“ఈ పవిత్ర క్షేత్రంలో అడుగిడి మరణించిన ఆత్మీయులకు శాంతి చేకూరేలా నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించక పోవటం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది రాఘవా!” కేశవ్ గుండె లోతుల్లోనుంచి వచ్చిన మాటలు అవి.ఉదయం ఆరుగంటల సమయంలో భట్టుగారు వాళ్లను బస్టాండులో దించి వెళ్లారు. అక్కడికి రాత్రి వచ్చిన బస్సు తిరిగి వెళ్లేందుకు రెడీగా ఉన్నది. అందులో కొందరు ప్రయాణికులు అప్పటికే ఎక్కి కూర్చున్నారు.
చలికి తట్టుకోవాలి అన్నట్లుగా స్వెటర్ తొడుక్కుని, మంకీ క్యాప్‌లు పెట్టుకున్నారు ఇద్దరూ.“దేవుళ్లమీద నమ్మకం లేదా అంటే నమ్మలేను. నాతోపాటు దేవుళ్లందరినీ భక్తితో దర్శించుకున్నావు. పవిత్రమైన రుద్రాక్షలు కొని మెడలో వేసుకున్నావు. ఇన్నాళ్లూ ఏమయ్యాడో తెలియని మీ నాన్న మరణించాడని తెలిసినా.. తర్పణాలు విడవటానికి మాత్రం అంగీకరించలేక పోయావు!” నిష్టూరంగా అన్నాడు కేశవ్.రాఘవ మాట్లాడలేదు చాలాసేపు. మిత్రుడి మాటలు వింటూ ఇబ్బందిగా చూశాడు అతడి ముఖంలోకి. అంత చలిలోనూ ఎండిపోతున్న నోటిని తడుపుకొంటున్నట్లుగా.. నాలికను అటూఇటూ తిప్పాడు.“కేశవా! నువ్వు నాకెంతగానో నచ్చచెప్పాలని ప్రయత్నించావు. మనం బయల్దేరుతున్న సమయంలో అమ్మ కూడా నన్ను ఆ విధి నిర్వర్తించమంటూ కన్నీరు పెట్టుకోవటం నీకు గుర్తున్నది కదా! అయినా నాకు చేయాలనిపించలేదు! చేయలేదు!” తలవంచుకుని అన్నాడు.
మళ్లీ..
“ఇంకా.. అయిపోయిన దాన్ని గురించి చర్చించటం అవసరమంటావా!” అన్నాడు రాఘవ.కేశవ్ మాట్లాడలేక పోయాడు.తరువాత అరగంటలోనే బస్సు బయల్దేరింది.పచ్చటి చెట్ల నడుమగా లోయలోకి జారిపోతున్నదా అన్నట్లుగా పోతున్న బస్సు. మంచుతో తడిసి అద్దాల సందులలోనుండి ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతూ వీస్తున్న చల్లటి గాలి.“అమాయకురాలైన ఓ ఆడపిల్లని ఏ వ్యక్తి అయినా కిరాతకంగా నాశనం చేసి.. ఆమె జీవితంలో వెలుగును అతిహేయంగా చిదిమి.. చీకటితో నింపివేయటం భరించగలిగే విషయమేనా? అలాంటి మనిషి చస్తే శాస్ర్తాలు చెబుతున్నాయంటూ వారసులు మాసికాలూ, తద్దినాలతో అతడి ఆత్మకు ఆహారం పెట్టటం సమంజసమా? అతడికి సద్గతులు కలగాలని, స్వర్గానికి పంపాలని ప్రయత్నించటం సమంజసమా?”.. పావుగంట తరువాత నోరు తెరిచాడు రాఘవ. మనసులోని నిజాల్ని ఇంకా అదిమి పెట్టుకోలేనట్లుగా.
విచిత్రంగా చూశాడు మిత్రుడి ముఖంలోకి కేశవ్.
“ఎవరతను?” మనసులో రూపు ఏర్పరుచుకుంటున్న అనుమానం అతడిలో ఆరాటాన్ని పెంచసాగింది.
“రోజూ వచ్చే పనిమనిషి ఆరోగ్యం బాగోలేక.. పన్నెండేళ్ల కూతురుని పంపింది. ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. తెలిసీ తెలియని వయసులో ఉన్న ఆ అమ్మాయిని అదునుచూసి కాటేశాడు అతడు. అందునా ఆ పిల్ల ఎవరికీ బాధను చెప్పుకోలేని మూగది. ఇంటికి పరుగెత్తుకెళ్లి ఏడుస్తూ తల్లికి సైగలతో చెబితే ఆమె అర్థం చేసుకుని.. తన వాళ్లందరినీ తీసుకుని, కర్రలూ కత్తులతో ఇంటిమీద దాడి చేస్తే.. అతడు భయంతో పారిపోగా ఆ కొంప ఛిన్నాభిన్నమైంది. ఆ ఇంట్లో మిగిలినవారి మనసులు అవమానంతో చచ్చి శవాలయ్యాయి. పదిహేను సంవత్సరాల క్రితం ఆ నికృష్టపు పనిచేసిన అతడికి మనం ఇక్కడ ఇప్పుడు మనవాడు అనే ఒక్క కారణంతో స్వర్గద్వారాలు తెరిపించాలా?”
“ఎవరతను?”..
తన అనుమానం నిజం కాకూడదని దేవుడిని ప్రార్థిస్తూ అడిగాడు భయం భయంగా కేశవ్.“నేను నాస్తికుడిని కాదని నీకు తెలుసు. నీ మాట, అమ్మ మాట వినకపోవటానికి అసలు కారణమేమిటో ఊహించలేక తపన పడుతున్నావనీ తెలుసు. పదిహేను సంవత్సరాలుగా నిజాన్ని మింగలేక, కక్కలేక నాలో నేనే కుమిలిపోవటానికి అలవాటుపడ్డ నన్ను.. మా బంధువునుండి వచ్చిన ఉత్తరం మరింత కుంగదీస్తూ, అడకత్తెరలో పెట్టి నొక్కసాగింది. నీ ముందు ఇంకెన్నాళ్లీ దాగుడుమూతలు!” చటుక్కున ముఖాన్ని రెండు చేతులలో దాచుకున్నాడు.అయ్యో.. తెరుచుకున్న మిత్రుడి మనసును చూడలేనట్లుగా తలవంచుకున్నాడు కేశవ్.“గరుడపురాణంలో చెప్పినదంతా నిజమే అయితే అతడు నరకానికి వెళ్లి అక్కడ ఆ శిక్షలన్నీ అనుభవించక తప్పదు!” అతడి కళ్లు కోపంతో నెత్తుటి ముద్దలు అవుతున్నాయి.“ఆ అమ్మాయి బతుకేకాదు.. మా జీవితాలూ ముక్కలయ్యాయి. తెలిసినవారి దృష్టిలో హీనచరితులమయ్యాం. వారి చీదరింపులకు గురయ్యాం. బతకటానికి అమ్మ అడ్డమైన చాకిరీ చేసింది. వడియాలు పెట్టింది, అప్పడాలు ఒత్తింది, కూరలు వండింది.. వాటిని నేను సంచుల్లో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్మాను. మొదట్లో కొన్ని ఇళ్లల్లో వాకిళ్లు ఊడ్చి, అంట్లు తోమింది కూడా! వాళ్లు ఇచ్చిన చద్ది పదార్థాలను తెచ్చుకుని నాకు పెట్టి.. మిగిలింది తను తిన్నది. ఈ స్థితికి కారణం నాన్న అని గర్వంగా చెప్పుకోవాల్సిన ఆ మగవాడు కాదా.. నరకంలో అన్ని విధాలా శిక్షలు అనుభవించటానికి అర్హుడైన అతడిని నేనెందుకు కాపాడాలి? ఎందుకు రక్షించాలి?” ఆవేశంతో ఊగిపోతున్నాడు రాఘవ.
అతడి చేతిమీద చేయి వేశాడు కేశవ్ అనునయిస్తున్నట్లుగా. మరుక్షణంలోనే అతడి మనసులో భారతంలోని ఓ పద్యం మెదిలింది.తనువున విరిగిన యలుగుల ననువున బుచ్చంగవచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా?
మిత్రుడి ముఖంలోకే స్తబ్ధుగా చూస్తూ ఉండిపోయాడు కేశవ్. శరీరానికి తగిలిన గాయాలకు చికిత్స చేసుకుని ఆ మనిషి విముక్తి పొంది ఉండవచ్చు కానీ.. జీవించి ఉన్న ఈ మనిషి తన మనసుకు కలిగిన గాయంనుండి ఎప్పటికి కోలుకోగలిగేనో..
అమాయకురాలైన ఓ ఆడపిల్లని ఏ వ్యక్తి అయినా కిరాతకంగా నాశనం చేసి.. ఆమె జీవితంలో వెలుగును అతిహేయంగా చిదిమి.. చీకటితో నింపివేయటం భరించగలిగే విషయమేనా? అలాంటి మనిషి చస్తే శాస్ర్తాలు చెబుతున్నాయంటూ వారసులు మాసికాలూ, తద్దినాలతో అతడి ఆత్మకు ఆహారం పెట్టటం సమంజసమా? అతడికి సద్గతులు కలగాలని, స్వర్గానికి పంపాలని ప్రయత్నించటం సమంజసమా?
పి.ఎస్. నారాయణ
మానసిక విశ్లేషణతో కూడిన రచనలు చేయడంలో రచయిత పి.ఎస్. నారాయణ దిట్ట. అలాంటి రచనే.. ‘మనసా ఎటులోర్తునే’. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చినకాకాని. 30 ఏళ్లపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐడీపీఎల్‌లో వివిధ స్థాయుల్లో ఉద్యోగం చేశారు. 1993లో సీనియర్ ఎకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌గా స్వచ్ఛంద విరమణ చేశారు. 28 ఏళ్ల క్రితం రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ 350కి పైగా కథలు, 50 నవలలు రాశారు. వీటిలో మానసిక విశ్లేషణతోపాటు సస్పెన్స్‌తో కూడిన ధారావాహికలూ ఎన్నో ఉన్నాయి. వీటిలో పలు కథలు కన్నడ, తమిళ భాషలలోకి అనువాదమయ్యాయి. వివిధ సాహితీ సంస్థలు, పత్రికలు నిర్వహించిన పోటీల్లో.. ఈయన రాసిన కథలు, నవలలు.. బహుమతులు గెలుపొందాయి. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహిచిన కథల పోటీ 2023-24లో ‘మనసా ఎటులోర్తునే..’ రూ.3వేల బహుమతికి ఎంపికైంది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.