“హలో..శేఖర్!” చాలా హడావుడిగా వినిపించింది తండ్రి గొంతు.
“చెప్పండి నాన్నా..” అన్నాడు శేఖర్.
“నువ్వు అర్జెంట్‌గా బయల్దేరి రా. చెల్లిని వెంటబెట్టుకు రా. ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావ్? నాకు మతిపోతున్నది. చెప్పడానికి నోరు రావడం లేదురా. కంగారు పడకు.. మా ఆరోగ్యాలు బానే ఉన్నాయి. అదీ గుండ్రాయిలా బాగానే ఉంది. అయితే విషయం మాత్రం ఫోన్లో చెప్పలేను. నువ్వు రావల్సిందే! ఇంకో మాట.. ఇది మన నలుగురి మధ్యే ఉండాల్సిన విషయం. బయటికి తెలిస్తే అందరూ నవ్విపోతారు. కోడల్ని తీసుకురావద్దు. అలాగే బావకు ఏదో ఒకటి చెప్పి, చెల్లిని మాత్రమే బయల్దేరమను. పిల్లల్ని కూడా తీసుకురావద్దు. మహిత, నువ్వు మాత్రమే రండి!” కచ్చితంగా చెప్పాడు మాధవరావు.
“ఏమైంది నాన్నా? అమ్మ ఏం చేసింది? ఎందుకంత కంగారు?” శేఖర్ ఆందోళనగా అడిగాడు.
“అవన్నీ ఫోన్లో చెప్పలేను. మీరు రండి” కొడుక్కి నచ్చజెప్పాడు మాధవరావు.
“సరే నాన్నా! చెల్లిని తీసుకొని బయల్దేరుతా” అని ఫోన్ పెట్టేశాడు శేఖర్.
బెంగళూరు నుంచి ఆరోజు రాత్రే బయల్దేరి, ఉదయానికల్లా విశాఖ ఎంవీపీ కాలనీలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు అన్నాచెల్లెళ్లిద్దరూ.
సోఫాలో కూర్చొని ఉన్నాడు మాధవరావు.
“అమ్మ ఏది నాన్నా!?..” అంటూ కంగారుగా అన్ని గదుల్లోకి తిరిగారు శేఖర్, మహిత.
రాధిక వంటింట్లో ఉంది. ఏం వండుతున్నదో.. ఇల్లంతా ఘుమఘుమల వాసన.
‘ఇద్దరూ బాగానే ఉన్నారే! ఎందుకు పిలిచారంటావ్!?’ అన్నట్టు అన్నాచెల్లి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
“మహీ.. శేఖర్! వెళ్లి స్నానాలు చేసి రండి. మీకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. అంతా కలిసి తిందాం. త్వరగా రండిరా!” అని ఆప్యాయంగా బిడ్డలిద్దరికీ చెప్పింది రాధిక.
“అమ్మా.. ఏమైందో నువ్వయినా చెప్పు! నాన్న సగం సగం మాట్లాడుతున్నారు” తల్లిని అడిగింది మహి.
సమాధానం చెప్పకుండానే..
“పిల్లలు బాగున్నారా? మొన్నటి సున్నుండలు ఉన్నాయా.. అయిపోయాయా? సాయంత్రం పిండి కలిపి తయారుచేస్తాను. పట్టుకెళ్దువు గానీ” అంటున్న అమ్మవైపు అసహనంతో చూసింది కూతురు.
వెళ్లి ఇద్దరూ ఫ్రెషప్ అయి వచ్చారు.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు.
మాధవరావు చిరచిరలాడుతూ.. కుర్చీని బరబరా లాక్కొని కూర్చున్నాడు.
“నాన్నా.. అమ్మా! మాకు ఏమీ తినాలని లేదు. ముందు ఏమైందో చెప్పండి?” అడిగింది మహి.
“ఏం చెప్పమంటావురా? బయటికి కక్కాలంటేనే అవమానంగా ఉంది. ఈ పిచ్చి..” అని మాధవరావు ఆగ్రహంతో మాట్లాడలేక, మధ్యలోనే ఆగిపోయాడు.
“అమ్మ ఏం చేసింది? వివరంగా చెప్పండి నాన్నా!” అడిగాడు శేఖర్.
“ఒరే.. ఏ భార్యా, ఏ భర్తకూ ఇవ్వని రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిందిరా మీ అమ్మ నాకు. ఇదిగో చూడండి” అని లోపలి వెళ్లి, రాధిక తనకు విడాకులు కోరుతూ పంపిన కోర్టు నోటీసును తీసుకొచ్చి శేఖర్ చేతికిచ్చాడు మాధవరావు.
మహి, శేఖర్ ఇద్దరూ నిర్ఘాంతపోయారు.
“అమ్మా! ఏంటిది? నమ్మలేకపోతున్నాం” గట్టిగా అన్నది మహి.
“నాన్న నిన్ను ఏమన్నా.. ఎప్పుడూ ఎదురు చెప్పవు. ఆయన అడుగులో అడుగేసి నడుస్తావు. మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగిందో కదా! పెళ్లిలా జరిగిందని అంతా మురిసిపోయారు” అన్నాడు శేఖర్.
“అవును.. మీరిద్దరూ అచ్చంగా రాధామాధవులేనని అందరూ ఎంత సంబరపడ్డారో! మనసు నిండా ఆనందోత్సాహాలతో ఆరోజు ఎంతో ఘనంగా జరుపుకొన్నాం. ఇంతలోనే ఏందమ్మా ఇది!” బాధగా అడిగింది మహి.
“ఏమోరా! ఆ నోటీసు చూసి నా మతిపోయింది. మీకే అలా ఉంటే.. నాకెలా ఉంటుందో ఆలోచించండి” మాధవరావు ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చున్నాడు.
రాధిక ఏమీ మాట్లాడలేదు. కాసేపు అంతా నిశ్శబ్దం.
మళ్లీ మాధవరావు అందుకున్నాడు..
“ఆ రోజు ఈ నోటీసు చదివి నా గుండె ఆగినంత పనైంది. సోఫాలో దబీమని కూలబడ్డాను. వెంటనే పరుగెత్తుకు వచ్చి మంచినీళ్లు, బీపీ మాత్ర ఇచ్చింది. ఇదేం వింతరా.. దీన్ని ఇన్నాళ్లూ భరించినందుకు నేను కదా కేసు వేయాలి!” అన్నాడు.
“ఊరుకోండి నాన్నా!” అని మహి వారించింది.
“అమ్మ ఇలాచేసి ఉండదు. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు!” అంటూ అమ్మవైపు చూశాడు శేఖర్.
రాధిక నోరు విప్పింది.
“సారీ రా. స్వయంగా నేనే ఆ నోటీసు పంపించాను” అన్నది స్థిరంగా.
“అమ్మా!” అంటూ నిర్ఘాంతపోయారు ఇద్దరు.
మాధవరావు తల బాదుకున్నాడు.
“ఏం? ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని..” ముగ్గురివైపూ చూస్తూ అడిగింది రాధిక.
“ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు గంగలో కలిసిపోతుందన్న ఇంగితం కూడా లేదు. ఇంతా చేసి.. ఏమైందని ఎంత తాపీగా అడుగుతున్నదో చూశార్రా?” మాధవరావు దాదాపు అరిచి చెబుతున్నాడు.
“మీరు భోంచేయండి!” అంటూ.. తను తినడం పూర్తి చేసి, ప్లేటుతో సింకు దగ్గరికి నడిచింది రాధిక.
అన్నాచెల్లెళ్లకు అంతా అయోమయంగా ఉంది.
“అమ్మా! అలా వెళ్లిపోతావేం? ముందు దీని సంగతి చెప్పమ్మా, మాకు ఎంత బాధగా ఉందో తెలుసా?” మహి ఆవేదనగా అన్నది.
“బాధ పడకండమ్మా! నేనే నోటీసు పంపానని చెప్పాను కదా” అన్నది రాధిక, ప్లేటు టబ్‌లో పెడుతూ.
“అదే.. ఎందుకూ? ఎప్పుడూ నాన్నను పల్లెత్తుమాట అనని నువ్వు ఈరోజు ఎందుకిలా?”.
“ఆ విషయం మీ నాన్ననే అడగండి”.
“అదిగో.. పళ్లు రాలిపోతాయ్! ఒరే.. ఒట్టురా! మా మధ్య ఏ గొడవా జరగలేదురా! ఎప్పటిలాగే ఉన్నాం. సడన్‌గా ఏంటిది? అందుకే నాకు బుర్ర పాడైపోతుంది” చెప్పాడు మాధవరావు. మళ్లీ తనే..
“అయినా నన్ను వదిలేసి ఎక్కడికి పోదామని? ఉజ్జోగమా? సజ్జోగమా? ఎలా బతికేస్తుంది?” అన్నాడు.
“ఆ బెంగ మీకనవసరం” అన్నది రాధిక నెమ్మదిగా.
“చూడమ్మా .. మా దగ్గరికి వద్దామని అనుకుంటున్నావేమో! ఒక్క మాట విను. నువ్విలా చేస్తే మీ అల్లుడికి నీ మీదా, నా మీదా గౌరవం ఉంటుందా!? చెప్పు!” అన్నది మహి.
“నీ కోడలికి మాత్రం ఏం చెప్పగలవు అమ్మా. తనకు, పిల్లలకూ నీమీద పిసరంత గౌరవం ఉంటుందా?” అన్నాడు శేఖర్.
“నేను ఎక్కడికీ రాను. ఈ ఇంట్లోనే ఉంటాను..” స్థిరంగా అన్నది రాధిక.
“హమ్మో.. ఎంతకు తెగించింది చూశార్రా! ఈ ఇల్లు దాని పేర రాశాననా.. అంటే నన్ను గెంటేస్తావా?” అని అరుస్తూ మాధవరావు కుర్చీ విసిరి సర్ర్.. మని పైకి లేచాడు. ఆ పక్కనే ఉన్న పేపర్ వెయిట్‌తో టీపాయ్ మీద గట్టిగా మోది, కోపంగా విసిరి కొట్టాడు. ఆ ధాటికి టీపాయ్ గ్లాస్ కాస్తా భళ్లున పగిలిపోయింది. అదే విసురుతో రాధికపైనా చెయ్యెత్తాడు. పిల్లలిద్దరూ తండ్రిని వారించారు.
“అడ్డుకున్నారేం? కొట్టనివ్వండి” అన్నది రాధిక తాపీగా.. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ.
శేఖర్, మహి బిత్తరపోయారు.
“తిట్టినప్పుడు ఏనాడూ అడ్డుకోని మీరు.. కొట్టినప్పుడు మాత్రం ఎందుకు అడ్డుకోవాలి? ఆయన మాత్రం ఎన్ని దెబ్బలని వేయగలరు? ఓ నాలుగు వేసి ఊరుకుంటారు. నేనూ తిని ఊరుకుంటాను. కానీ తిట్లు అలా కాదే! ఘడియ ఘడియకూ వినాలి. వింటూనే ఉండాలి. కొన్నిటికి నా దగ్గర సమాధానం ఉన్నా తిరిగి మాట్లాడకూడదు. మాట్లాడితే మళ్లీ ఆ తిట్ల పురాణం కాస్తా మరింత పొడుగైపోతుంది. అందుకే దెబ్బలే నయం. వెయ్యనివ్వండిరా” అన్నది.
“అమ్మా.. నాన్న గురించి నీకు తెలుసు కదా. కోపం ఎక్కువ. అయినా ఇన్నాళ్లూ బాగానే ఉన్నావు. ఈ రోజు తిట్లు బాధపెడుతున్నాయా?” అనడిగాడు శేఖర్.
ఆ మాటలకు పకాలున నవ్వింది రాధిక.
“అవున్రా! ‘ఈ పిచ్చిముండ కొంప ముంచిందిరా’ అని మీ నాన్న అనగానే.. నువ్వు ఆ పిచ్చిముండ ఎవరా!? అని ఒక్క క్షణం ఆలోచించావా? లేదే.. వెంటనే ‘అమ్మ ఏం చేసింది నాన్నా?” అని అడిగావు. అంటే నా పేరు రాధిక కాదు.. పిచ్చిముండ. అంతే కదా?”.
తల్లి మాటలకు తల దించుకున్నాడు శేఖర్.
“ఓకే.. ఓకే.. మీకే అంతగా అలవాటైపోయిన ఆ తిట్లు నన్నెందుకు ఇప్పుడు కొత్తగా బాధ పెడుతున్నాయని కదా ఇప్పుడు ప్రశ్న? అంతేనా మహీ? ‘ఏమ్మా! ఎందుకిలా చేశావ్?’ అని నన్ను అడిగావు. బాగానే ఉంది. ‘పిచ్చిముండ అని ఎందుకు పదేపదే అమ్మను తిడతావ్ నాన్నా?’ అని ఎప్పుడైనా అడిగావా నువ్వు!?”.
అమ్మ సూటి ప్రశ్నతో మహి కళ్లలో నీళ్లు తిరిగాయి.
“సరే.. సూటిగా విషయానికొద్దాం!” అంటూ చెప్పడం ప్రారంభించింది రాధిక.
“నేను ఇన్నాళ్లూ బాగానే ఉన్నాను. ఆయన్ని నిలదీయలేదూ అంటే అర్థం.. ‘నేను పిచ్చిముండనని, తెలివితక్కువ దాన్నని, నాకేమీ అర్థం కాదని’ అంగీకరించానని కాదు. నన్ను మా నాన్న ఉయ్యాల్లో వేసి ముద్దుగా తొలిసారి ‘రాధమ్మా!’ అని పిలిచాడట. ఆ పిలుపే నాకు 18 ఏళ్లవరకూ వినిపించింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ నా పుట్టింట్లో నేను రాధమ్మనే. రాధిక అని కూడా నన్నెవ్వరూ పిలిచేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పేరే మరచిపోయాను”..
“పెళ్లయి, ఇన్నేళ్లూ బాగానే ఉన్న నాకు ఇప్పుడెందుకు సడన్‌గా కోపం, బాధా, ఆత్మాభిమానం పొంగుకొచ్చాయి అనేగా మీ సందేహం? అదీ చెబుతాను. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నాకు ఆత్మాభిమానం ఉంది. కానీ నాడు, నా తలనిండా బాధ్యతలు నిండి ఉన్నాయి. మీ నాన్నను ప్రశాంతంగా ఆఫీసుకు పంపాలి. మిమ్మల్ని చదువులకు పంపాలి. పెళ్లిళ్లు చెయ్యాలి. మీ పిల్లలను చూడాలి. ఇలా అప్పుడు నా అవసరం అందరికీ ఉంది. అందుకే నోరెత్తలేదు” అన్నది.
“ఇప్పుడు లేదా బాధ్యత” అరిచాడు మాధవరావు.
“లేదు.. ఉన్నా నేను నిర్వర్తించలేను” అని ఇల్లు అదిరిపోయేలా ఒకే ఒక్కమాట గట్టిగా చెప్పింది రాధిక.
మాధవరావు నోటమాట రాలేదు.
రాధికే మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది.
“నాన్న రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు జాబు బాధల్లేవు. టెన్షన్లు లేవు. 24 గంటలూ ఇంట్లోనే ఉంటున్నారు. మరి నాకు? నాకు కూడా అంత హడావుడి, ఇతర టెన్షన్లు ఉండకూడదు కదా? ఇద్దరం హాయిగా తీరిగ్గా లేచి, నవ్వుతూ ఆనందంగా గడపాలి కదా. కానీ అలా లేదు జీవితం. నాకు మునుపటి కంటే డబుల్ టెన్షన్ వచ్చి పడింది. ఇది నేను ఊహించనిది కాదు. ఒకప్పుడు ఆయన సెలవు రోజనో, ఒంట్లో కాస్త నలతగా ఉండో ఇంట్లో ఉంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వారికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలని ఉత్సాహం ఉవ్విళ్లూరేది. హడావుడిగా చేసి పెట్టేదాన్ని. కానీ ఏరోజూ నన్ను ఆయన ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
మరి ఇప్పుడైతే పొద్దున లేచిన దగ్గర్నుంచి ఆయన నిద్రపోయే వరకు, నాకు ఇంటి సూత్రాలు చెబుతూనే ఉంటారు. ‘కూరలో కాస్త ఇంగువ దట్టించమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పెళ్లయి ఇన్నేళ్లయినా వంటరాదే నీకు’ అంటారు. ఆ కూరలో ఇంగువ వేశాను. కూర బాగుంది కూడా. కానీ ఆయన సలహా అది. ఓ రోజు బట్టలన్నీ కింద వేసి, వేరుచేసి ఉతికేందుకు సిద్ధం చేస్తున్నా. ఇంతలో గ్యాసు బండ రావడంతో అటు వెళ్లాను.. అంతే! ‘బట్టలన్నీ కింద పడేశావ్. కొంప కొల్లేరులా ఉంచుతావ్! నీకు ఇల్లు సర్దడం చేతకాదు’ అంటూ ఆ గ్యాసువాడి ఎదుట అరుపులు.
‘అన్ని నీళ్లు పోస్తే మొక్క ఎందుకూ పనికి రాకుండా చస్తుంది. తెలుసుకో!’.. పొద్దున్నే మొక్కలకు నీళ్లు పోస్తుంటే సుప్రభాతం మొదలుపెడతారు. మన పెరట్లోని ప్రతి మొక్కకూ, పువ్వుకూ తెలుసు వాటినెవరు పెంచారో! సగం కోసిన ఉల్లిపాయ, నిమ్మకాయ, కాస్త వాడిన తోటకూర కట్టో లేక, పచ్చిమిరపకాయలో ఆయన కంట పడ్డాయా.. పనివాళ్ల ముందు పాఠాలు మొదలుపెడతారు.
ఆయనకు రిటైర్మెంట్ ఉందిరా.. మరి నాకేదీ? నిజానికి బాధ్యతలు నిండా ఉన్నప్పుడు కూడా ఇంతగా కుంగిపోలేదు. బాధ్యతలన్నీ తీరిన రిటైర్మెంట్ ఏజ్‌లో ఇలా కుశించిపోతున్నాను. ఎందుకో తెలుసా? అప్పుడు ఈ సలహాలు ఇంట్లో ఐదారు గంటలే వినిపించేవి. ఇప్పుడు రోజంతా వినాలి. ఇక ఈ బతికిన నాలుగు రోజులైనా ‘రాధమ్మగా కాకున్నా.. కనీసం రాధికగానైనా బతకాలనుందిరా! పిచ్చిముండగా బతకాలనిలేదు రా” అంటూ బిగ్గరగా ఏడ్చింది రాధిక.
అమ్మకంట ఎప్పుడూ కన్నీరు చూడని మహి, శేఖర్ తల్లడిల్లిపోయారు. ముగ్గురూ రాధికవైపు అలా చూస్తూ ఉండిపోయారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఏదో తిన్నామనిపించి నిద్రకు ఉపక్రమించారు. నాన్న అమ్మను తిడుతూ జోకులేస్తుంటే ఎన్నోసార్లు నాన్నతో కలిసి నవ్వుకోవడం గుర్తొచ్చి శేఖర్ బాధపడ్డాడు.
‘అయ్యో! ఆడపిల్లను అయి ఉండీ అమ్మ మనసును అర్థం చేసుకోలేకపోయానే’ అని మహిత గిలగిల్లాడింది.
కోర్టు నోటీసు ప్రకారం.. రేపు ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరు కావాలి. మాధవరావు మారుమాట్లాడకుండా అన్నం తిన్నాడు. బాల్కనీలో కాసేపు అటూఇటూ నడిచాడు. భార్య ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నాడు. సోఫాలోనే కూలబడి నిద్రపోయినట్టు కళ్లు మూశాడు.
రాధిక పనంతా కానిచ్చి బెడ్రూంలో మంచంపై పడుకుంది. నిద్ర రాకున్నా వచ్చినట్టే కొద్దిసేపు నటించి, భర్త కోసం ఎదురు చూసింది. మాధవరావూ అలాగే నటిస్తూ సోఫాలో చాలాసేపు కూర్చున్నాడు. రాధిక నిద్రపోయింది. కొద్దిసేపటికి మాధవరావు బెడ్రూంలోకి వచ్చి, చప్పుడు చేయకుండా రాధిక పక్కన పడుకున్నాడు. ముద్దబంతి లాంటి ఆమె నిండైన రూపును ముఖంలో ముఖంపెట్టి చూస్తున్న అతని ఆలోచనలు.. గతంలోకి జారుకున్నాయి.
అప్పుడు అతని వయసు 24. కొత్తగా ఉద్యోగంలో చేరాడు. వరహాలరావు మామయ్య పెళ్లికని కృష్ణదేవిపేట వెళ్లాడు. అక్కడే.. లంగా ఓణీలో, జారుజడతో, నుదుట సిందూర తిలకంతో సింపుల్‌గా ఉన్న రాధిక కనిపించింది. నగలతో ఆర్భాటంగా ఉన్న కన్నెలందర్నీ తప్పించుకొని అతని చూపులు రాధికపైన నిలిచిపోయాయి.
తర్వాత పెద్దలకు చెప్పడాలూ.. పెళ్లిచూపులు.
“ఎంత నిరాడంబరంగా, అందంగా ఉన్నావు. నా కోసమే పుట్టావు. నువ్వు రాధికవి. నేను మాధవుణ్ని. మనిద్దరం రాధామాధవులం” అన్నాడు ప్రేమగా.
పెళ్లి ఘనంగా జరిగింది.
ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా రాధిక అతనికి అనుగుణంగా మారిపోవడం మొదలైంది. మాధవరావు హోదాకు తగినట్టే పట్టుచీరలు కట్టింది. ఇష్టం లేకున్నా మెడనిండా నగలు వేసింది. చేతులు బంగారు గాజుల బరువెక్కాయి. ఇంట్లో అన్నీ ఖరీదైన పట్టుచీరలే.
“ఇవి వద్దండీ.. ఉక్కపోత! నాకు ఇష్టంలేదు” అని ఆమె అంటే.. “అంతా ఏసీయేగా! నీకెక్కడ ఉక్కపోస్తుంది? మన స్టేటస్‌కు తగినట్టు ఉండు” అనేవాడు.
ఎప్పుడు క్యాంపునకు వెళ్లినా నగలు, పట్టుచీరలు తెచ్చేవాడు. అలా ఉండటమే బాగా చూసుకోవడం అనుకున్నాడు తను. ఆమెకు ఎలాంటి చీర ఇష్టమో.. ఏ రంగు ఇష్టమో ఎప్పుడూ ఆలోచించలేదు. భార్యలో తన స్టేటస్ అంతా కనిపించాలి అనుకున్నాడు.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ అతని మాటల్లోనూ మార్పు వచ్చింది. రాధికను తక్కువ చేసి మాట్లాడటం మొదలైంది. రోజులో నాలుగు సార్లయినా ‘పిచ్చిముండ’ అనడం అతనికి అలవాటైంది. రాధిక ఆ మాటలు భరిస్తూ, అందరికీ అన్నీ అమర్చుతూ తన జీవితంలో తానంటూ మిగలకుండా, తన ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి, కష్టమనుకోకుండా చిరునవ్వుతో ఇంటా, బయటా అన్నీ చక్కబెట్టింది. నవ్వు తాండవించే ఆ మోము వెనుక ఏదైనా బాధుందా అని ఆలోచించే తీరిక అతని మనసుకు లేకుండా పోయింది.
‘మా రాధమ్మది బంగారు బతుకు’ అనేవారు ఊళ్లో వారంతా. అదే నిజం అనుకున్నాడు అతను.
బయట ఒక్కసారిగా ఉరుములు – మెరుపులతో పెద్దగా వర్షం మొదలవడంతో ఉలిక్కిపడి గతం.. ఆలోచనల్లోంచి బయటికి వచ్చాడు మాధవరావు. కిటికీ వద్దకెళ్లి నిలబడ్డాడు. చల్లగాలికి వానజల్లు ముఖంపై పడింది. అతని మనసు నెమ్మదిగా విశాలంగా విచ్చుకుంటున్నది. వెనక్కి తిరిగి రాధిక వైపు చూశాడు. తన ప్రవర్తనకు తాను తొలిసారి నొచ్చుకున్నాడు. తనను తాను తప్పుబట్టుకున్నాడు. మంచం వద్దకు వెళ్లి నెమ్మదిగా రాధిక పక్కన చేరబడ్డాడు. తన ప్రవర్తన రాధికను ఎంతగా విసిగించిందో అని తలచుకొని సతమతమయ్యాడు. అతని మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అతని కళ్లవెంట రెండు కన్నీటి బొట్లు చెంపల మీదుగా జారాయి.
‘రాధమ్మను.. ఆమె నిర్ణయాలను ఇకపై తప్పక గౌరవిస్తాను. తప్పక గౌరవించాలి’ అని మనసులో గట్టిగా ముద్ర వేసుకున్నాడు. ఆమెపై చేయి వేసి నిద్రపోయాడు.
తెల్లవారింది.
శేఖర్, మహి రెడీ అవుతూ మధ్యమధ్యలో తల్లిని చూస్తూ.. “అమ్మా.. వద్దమ్మా” అని నచ్చజెప్పబోయి ఆగిపోయారు.
మాధవరావు బాధగా నింపాదిగా రెడీ అయ్యాడు.
రాధిక రెడీ అయ్యి బయటికి వచ్చింది. సాధారణమైన నీలం రంగు కాటన్ శారీ కట్టుకొంది. అందులో పట్టుచీర కంటే పదింతల అందం ఉందా అనిపించింది మాధవరావుకు. అందరూ వాకిట్లోకి నడిచారు.
కారు ఎక్కబోతున్న రాధికకు..
“రాధమ్మా..” అని భర్త పిలుపు వినిపించింది.
నమ్మలేకపోయిన రాధిక గిరుక్కున వెనక్కి తిరిగింది. పశ్చాత్తాప హృదయుడై.. తన కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తున్న భర్తవైపు చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.ఇద్దరి కళ్లల్లో నీళ్లు. ఒకరికొకరు మసకబారి కనిపిస్తున్నారు.
“రాధమ్మా.. నువ్వు నా బంగారు తల్లివి. పిచ్చిముండవి కావు. నన్ను, పిల్లలను కంటికిరెప్పలా సాకిన అమ్మవి. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన ఇల్లాలివి. ఇన్నాళ్లూ నీకు ఏమీ తెలీదన్న నా అహంకారం వల్లనో, చులకనభావం వల్లనో.. నాకు తెలీకుండానే నిన్ను చాలా బాధపెట్టాను. నీ పట్ల బండగా, మొండిగా మసిలాను. ఇప్పుడు మనసారా చెబుతున్నా.. సారీ రా! నీకు కష్టం కలిగించే పని ఇంకెప్పుడూ చేయను. ఇక నీ ఇష్టం. ఇకపై ఎప్పుడూ నీకు భిన్నంగా నడుచుకోను!” అని స్పష్టంగా, స్థిరంగా చెప్పాడు మాధవరావు.
రాధిక వణుకుతున్న చేత్తో భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. “కోర్టుకు వెళ్తున్నామని, ఆగిపొమ్మని ఇవ్వన్నీ చెబుతున్నారా?” అన్నది.. బాధతో పూడుకుపోయిన చిన్నగొంతుతో.
“లేదు రాధమ్మా.. నీ ఇష్టానికి అడ్డు తగలనని చెప్పాను కదా. ఇప్పుడు నీకు మాటిచ్చాను. అదే చేస్తున్నాను. ఆ మాట ప్రకారమే కోర్టుకు వెళ్లాలన్న, నా నుంచి విడాకులు పొందాలన్న నీ ఇష్టాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నాకు దక్కవేమోనన్న బాధ తప్ప, పరువు పోతుందన్న ఆలోచన ఏ కోశానా లేదు నాకు. బంధుమిత్రులు ఏమనుకుంటారో అన్న భయాలూ లేవు. నీ ఇష్టానికి అడ్డు తగలలేదన్న సంతృప్తి మిగిలితే చాలు” అన్నాడు.. దుఃఖం నిండిన గొంతుతో.
“నేను మీపై ఏకేసూ వేయలేదు. ఇవి చిత్తు కాగితాలండీ.. మా ఫ్రెండ్ లాయర్ ఫాతిమా పంపిన కాగితాలు. వీటిపై కోర్టుముద్ర ఎక్కడైనా ఉందా చూడండి?” అన్నది కళ్లలోకి నవ్వును తెచ్చుకుంటూ.
ఆ మాట విని మాధవరావు ఆశ్చర్యపోయాడు. అంతకుమించి అమితానందంతో సంబురపడిపోయాడు.
గేటు అవతలున్న డ్రైవర్ నందయ్యను దగ్గరికి రమ్మని పిలిచింది రాధిక. “నందయ్యా! చెప్పు.. నిన్ను కారు ఎక్కడికి పోనివ్వమని చెప్పాను!?” అనడిగింది.
“బీచ్ రోడ్డుకి మేడమ్. ‘కాళికామాత ఆలయానికి వెళ్లి, అక్కణ్నుంచి సాయంత్రం వరకూ బీచ్‌లో గడుపుదాం!’ అని చెప్పారు మేడం” అన్నాడు డ్రైవర్.
ఈలోగా ఆ నోటీసును శేఖర్, మహి గబగబా తిరగేసి చూశారు. అందులో ఎక్కడా కోర్టుముద్ర లేదు. పిల్లలిద్దరూ ఆనందంతో అమ్మను రెండు చేతులతో గట్టిగా చుట్టేశారు.
“నిజమే నాన్నా.. మన రాధమ్మ మనందర్నీ పిచ్చివాళ్లని చేసింది” అని నవ్వుతూ అన్నాడు శేఖర్.
“లేదురా.. నా రాధమ్మ నా పిచ్చి వదలగొట్టింది” అన్నాడు మాధవరావు. ఆ మాటలకు అందరూ మనసారా నవ్వుకున్నారు.
ఎల్ శాంతి
సాహిత్యం అనేది ప్రజల్లో సుహృద్భావం, సామరస్యం, సామాజిక చైతన్యం కలిగించటానికి దోహడపడాలన్నది రచయిత్రి ఎల్ శాంతి ఆకాంక్ష. వీరి స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని కృష్ణదేవిపేట. ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నారు. ప్రజాశక్తిలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 14 కథలు రాశారు. ఐద్వా, వైజాగ్ ఫెస్ట్, విశాఖ సంస్క ృతి, జాషువా సాంస్క ృతిక వేదిక నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైన ‘కార్పొరేట్ అంబలి’ కథకు.. సాహిత్య పురస్కారం లభించింది. బాలల కథలు, వ్యాసాలూ కూడా రాశారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలో పాల్గొనడం, బహుమతి పొందడం ఇదే తొలిసారి.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి
పొందిన కథ.
-ఎల్ శాంతి
76800 86787