‘మిస్టర్ రుద్ర.. మీరు అనుకొన్నట్టు ఈ ఇద్దరినీ ఎవరూ ప్రత్యక్షంగా చంపలేదు’ అన్న డాక్టర్ మాటలతో రుద్ర
ఆశ్చర్యంగా చూశాడు. ‘అర్థంకాలేదు అనుకొంటా.. సృజన్ బాడీని డీప్‌గా ఎగ్జామిన్ చేశాం. నిరాటంకంగా ఆహారాన్ని నమలడంతో అతను లంగ్స్‌కు ఊపిరి అందక రెండ్రోజుల కిందట చనిపోయాడు. ఆహారం నములుతున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు ఊపిరి పీల్చలేం. అలా కొద్ది నిమిషాలు అదే పనిగా నమలడాన్ని చేస్తే.. ఊపిరితిత్తులకు శ్వాస అందక గుండె ఆగిపోతుంది. సృజన్ విషయంలో ఇదే జరిగింది’ అన్నాడు డాక్టర్.
‘మరి చైతన్య?’ అంటూ అడిగాడు రుద్ర. ‘ఆమె కూడా ఇలాంటి డిఫరెంట్ సర్కంస్టాన్సెస్లోనే చనిపోయింది. తుమ్మినప్పుడు మనం యథాలాపంగానే కండ్లు మూసుకొంటాం. ఒకవేళ, అలా చేయకపోతే, ఆ తుమ్ము ధాటికి కనుగుడ్లు బయటికి వచ్చే ప్రమాదం ఉంది. చైతన్య విషయంలో అదే జరిగింది. తుమ్ముతున్నప్పుడు ఆమె కండ్లు మూసుకోకపోవడంతో గుడ్లు బయటికి వచ్చి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అత్యంత బాధాకర స్థితితో గిలగిలకొట్టుకొంటూ ఆమె కూడా అదే సమయంలో మరణించింది’ బాధపడుతూ చెప్పాడు డాక్టర్.
‘డాక్టర్.. వీళ్లను ప్రత్యక్షంగా ఎవరూ చంపలేదు అన్నారు. అదెలా చెప్తారు?’ సందేహాస్పదంగా అడిగాడు రుద్ర. దీనికి డాక్టర్ బదులిస్తూ.. ‘ప్రత్యక్షంగా చంపడం అంటే కత్తితోనో, పిస్టల్తోనో దాడి చేయడం అని నా అర్థం. అయితే, ఇక్కడ వీళ్లు వాళ్లంతట వాళ్లే చనిపోయారు’ అంటూ మరేదో చెప్తున్న డాక్టర్ మాటలకు హెడ్ కానిస్టేబుల్ రామస్వామి అడ్డుపడుతూ.. ‘హమ్మయ్యా.. కేసు సాల్వ్ అయ్యింది. వీళ్లు లవర్స్ అండి. పెండ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో విడిచి ఉండలేక ఇలా సూసైడ్ చేసుకొన్నారు’ అంటున్న రామస్వామితో.. ‘బాబాయ్ నీ ఊహలు ఆపుతావా??’ అంటూ రుద్ర కోపంగా చూశాడు.
ఇంతలో డాక్టర్.. రామస్వామి వైపు తిరిగి.. ‘నో.. వీళ్లు సూసైడ్ చేసుకొన్నారని నేను చెప్పలేదు. నిజంగా ఇలా సూసైడ్ చేసుకోవడం చాలా కష్టం. తినేటప్పుడు ఊపిరితీసుకోవద్దు అని ఎంతగా అనుకొన్నా అలా చేయలేం. తుమ్మేప్పుడు కూడా కండ్లు ఎంత మూసుకోవద్దు అనుకొన్నా.. అలా చేయలేం. అయితే, ఈ రెండు కేసుల్లో బాధితులను బలవంతంగా అలా చేసుకొనేట్టు చేశారు. దానికోసం నాడీకణాలను ఉత్తేజితం చేసి, మైండ్‌ను స్థిమితంగా ఉంచని ఓ ప్రత్యేకమైన ఇంజెక్షన్‌ను కూడా బాధితులు తీసుకొనేలా చేశారు. ఇద్దరికీ ఒకే రకమైన ఇంజెక్షన్‌ను ఒకే డోసుతో ఇచ్చారు’ అంటూ డాక్టర్ ఆగిపోయాడు. ‘అంటే డాక్టర్.. వీటిని హత్య కేసులుగా నమోదుచేయొచ్చా’ అన్న రుద్ర ప్రశ్నకు.. అవునన్నట్టు తలూపిన డాక్టర్.. ‘మిస్టర్ రుద్ర.. నేను చూసిన అత్యంత రేరెస్ట్ కేసు ఇది. ఈ ప్రేమికులను చంపిన ఆ హంతకులకు తప్పకుండా శిక్ష పడుతుంది’ అంటూ కండ్లు తుడుచుకొంటూ వెళ్లిపోయాడు.
అప్పటికే దవాఖాన రిసెప్షన్లో ఒకవైపు సృజన్ పేరెంట్స్, మరోవైపు చైతన్య పేరెంట్స్ ఆందోళనతో ఉన్నారు. ఇంతలో దూరంగా ఫైల్స్‌తో వస్తున్న రుద్రను వాళ్లందరూ చుట్టుముట్టారు. మా బిడ్డను పొట్టనబెట్టుకొన్నారంటూ ఒకరిపై ఒకరు దాడులకు యత్నించారు. ఇంతలో రుద్ర.. ‘ఇది హాస్పిటల్. బిహేవ్ యువర్ సెల్ఫ్. అందరూ స్టేషన్‌కు రావాలి’ అంటూ సిబ్బందికి సైగ చేసి బయటికి కదిలాడు. స్టేషన్‌కు వస్తున్నంతసేపూ రుద్ర మనసు మనసులో లేదు. ఇంతలో రోడ్డు పక్కన టీ స్టాల్ కనిపిస్తే.. కారును ఆపమని డ్రైవర్‌కు చెప్పాడు రుద్ర. టీ తాగుతూ ఫోన్ ఆపరేట్ చేస్తున్న రుద్ర చేతివేలు.. తన కజిన్ స్నేహిల్ కాంటాక్ట్ నంబర్‌పై ఆగింది. ఫోన్ కలిపాడు. ‘ఒరేయ్ అన్నయ్యా.. ఎక్కడ?’ రుద్ర అడిగిన ప్రశ్నకు.. ఆఫీస్ నుంచి ఇప్పుడే బయటికి వస్తున్నానంటూ స్నేహిల్ జవాబిచ్చాడు. ‘త్వరగా ఐకియా జంక్షన్ దగ్గరికి రారా. నా మనసేం బాగాలేదు’ అంటూ రుద్ర అనడంతో సరేనంటూ ఆరగంటలో అక్కడికి చేరుకొన్నాడు స్నేహిల్.
వచ్చీ రావడంతోనే స్నేహిల్తో కేసు గురించి రుద్ర ఇలా చెప్తూపోయాడు. ‘నిన్న రాత్రి రెండు మిస్సింగ్ కంప్లయింట్స్ వచ్చాయ్‌రా. నిన్న మధ్యాహ్నం నుంచి తమ పిల్లాడు కనిపించట్లేదని ఒకరు, మా పిల్ల కనిపించట్లేదని మరొకరు ఫిర్యాదు చేశారు. రెండు కేసులనూ ఫైల్ చేశాం. అయితే ఈ రోజు తెల్లారేసరికి ఆ మిస్సింగ్ పర్సన్స్ ఇద్దరు చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గండిపేట శివార్లలో చెట్ల పొదల్లో భిన్నమైన పరిస్థితిలో ఒకరి బాడీ, మూసీ ఒడ్డున మరొకరిది దొరికింది’ అంటూ రుద్ర చెప్పాడు. దుర్వాసనను భరించలేక స్థానికులు మున్సిపాలిటీ వాళ్లకు సమాచారం ఇవ్వడం.. వాళ్లు పోలీసులకు చెప్పడం జరిగినట్టు వివరించాడు. ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయాలను కూడా చెప్పాడు. నా విచారణలో ఆ ఇద్దరూ లవర్స్ అని తేలినట్టు రుద్ర చెప్తుండగా అతణ్ని ఆపిన స్నేహిల్.. ‘ఎవరు చంపి ఉంటారని నీ అనుమానం’ సూటిగా ప్రశ్నించాడు. ‘ఎవరు చంపారో ఉదయం డాక్టర్‌ను కలవగానే అర్థమయ్యిందిరా. వాళ్లను చంపింది వాళ్ల పేరెంట్సే’ అన్న రుద్ర మాటలకు షాక్ తిన్న స్నేహిల్.. పూర్తి విషయాన్ని తెలుసుకొని తమ్ముడి బుద్ధికుశలతను మెచ్చుకొన్నాడు.
‘చంపింది వాళ్ల పేరెంట్సే అని తెలిసినప్పుడు వాళ్లను అరెస్టు చేయొచ్చుగా?’ అంటూ ఆత్రుతగా అన్నాడు స్నేహిల్. ‘డియర్ బ్రదర్ ముందు నేను చెప్పేది పూర్తిగా విను. చనిపోయిన ఈ ఇద్దరూ ప్రేమికులు. మన తెలుగు సినిమాల్లో చూపించినట్టే అబ్బాయిది లోయర్ క్యాస్ట్. అమ్మాయిది అప్పర్ క్యాస్ట్. పెండ్లి విషయంలో రెండు వర్గాలవారికి గొడవలు కూడా జరిగాయని విన్నా. ఇదే సృజన్, చైతన్య మరణానికి కారణంగా తెలుస్తున్నది’ అంటూ రుద్ర ఆగిపోయాడు. ‘బ్రదర్.. ఇందులో ఆలోచించడానికి ఏముంది? అమ్మాయి తరఫు వాళ్లు అబ్బాయిని, అబ్బాయి తరఫు వాళ్లు అమ్మాయిని పొట్టనబెట్టుకొన్నట్టు రుజువైందిగా’ అంటూ చెప్తున్న స్నేహిల్ను వారించిన రుద్ర.. ‘అమ్మాయిది అప్పర్ క్యాస్ట్ కాబట్టి ఆమె పేరెంట్స్ తక్కువ క్యాస్ట్ ఉన్న అబ్బాయిని చంపారని అనుకొందాం. మరి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని అబ్బాయి పేరెంట్స్ చంపుతారని నేను అనుకోవట్లేదు’ అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు రుద్ర.
‘నువ్వు చెప్తున్నది కూడా పాయింటే. మే.. బీ.. అబ్బాయిని చంపిన చైతన్య పేరెంట్సే ఆమెను కూడా చంపొచ్చుగా’ అంటూ స్నేహిల్ అన్నాడు. ఇదంతా తేలాలంటే ముందు స్టేషన్‌కు వెళ్లాలన్న రుద్ర మాటలతో ఇద్దరూ కదిలారు. ఇంతలో రుద్ర ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేశాడు రుద్ర. ‘సార్.. సార్.. స్టేషన్‌కు సృజన్ పేరెంట్స్ ట్యాక్సీలో వస్తుండగా పెట్రోల్ బంకు దగ్గర బ్లాస్టింగ్ జరిగి మంటల్లో ఆ కుటుంబం అంతా ఆహుతైంది. అదే ప్రమాదంలో చైతన్య వాళ్ల కారు కూడా కాలిపోయింది. ఆమె పేరెంట్స్ కూడా చనిపోయారు’ అంటూ రామస్వామి కంగారుపడుతూ చెప్పాడు. అది విన్న రుద్ర కాళ్లకింద భూకంపం వచ్చినంత పనైంది. అది పక్కనపెడితే, సృజన్‌ను, చైతన్యను వాళ్ల పేరెంట్సే చంపారని రుద్ర ఎలా కనిపెట్టినట్టు?
సమాధానం:
సృజన్ రెండ్రోజుల కిందట చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. అదే సమయంలో చైతన్య కూడా చనిపోయినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఉంది. పిల్లలు రెండ్రోజుల కింద చనిపోవడంతోనే వాళ్ల బాడీలు దొరికిన ప్రదేశంలో దుర్వాసన వచ్చింది కూడా! అయితే, ఇందుకు విరుద్ధంగా తమ అబ్బాయి మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదని హత్య జరిగిన మరుసటి రోజు సృజన్ పేరెంట్స్, అలాగే చైతన్య పేరెంట్స్ కంప్లయింట్ ఫైల్ చేశారు. ఇక్కడే మృతుల పేరెంట్స్‌పై రుద్రకు అనుమానం వచ్చింది. అయితే, ఎవరు ఎవరిని చంపారు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకొనే లోపే చైతన్య, సృజన్ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడంతో కేసు మధ్యలోనే ఆగిపోయింది. అయితే, ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేస్తానని రుద్ర దృఢ నిశ్చయంతో మరింత లోతుల్లోకి వెళ్లాడు.
…? రాజశేఖర్ కడవేర్గు