Ramayanam | కాలేజీకి సెలవులు వచ్చినప్పుడల్లా గౌలీగూడాలోని పద్మ చిన్నమ్మ వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఒక ఆదివారం నేను వెళ్లేసరికి అందరూ తెగ హడావుడి పడుతూ ఉన్నారు. విషయం కనుక్కుంటే.. పద్మ చిన్నమ్మ ఓ దేవుడి ఉపాసకురాలి దగ్గరికి వెళ్లివస్తుందని తెలిసింది. ఆ సోమవారం ఏదో సెలవు కూడా. దాంతో, అందుకని ఆదివారం వెళ్లినదాన్ని అలాగే లక్ష్మి వాళ్లింట్లోనే ఉండిపోయాను.
పొద్దుటినుండే హడావుడిగా ఉంది. అందరూ స్నానాలు చేసి రెడీగా ఉన్నారు. పద్మ చిన్నమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. వెంకటగిరి జరీ చీర కట్టుకుని తయారై ఉంది. వంట చేయడం కోసం వంటమ్మగారు వచ్చింది అప్పటికే. పొద్దున్నే డ్రైవర్‌ను పిలిచి.. కారులో ఎవరినో తీసుకుని రమ్మని చెప్పింది.
“ఎవరొస్తున్నరు?” అని లక్ష్మిని అడిగాను. “అమ్మ ఒస్తున్నరు!” అరమోడ్పు కనులతో.. అదో ఆరాధనా భావంతో చెప్పింది లక్ష్మి. “అమ్మెవరు?”.. నాకు అయోమయం. “కమలమ్మ తెలువదా? అమ్మ పోతది చూడు.. ఆమె దగ్గరికి!” లక్ష్మి సమాధానం. “అవునా!” నాకింకా అయోమయంగానే ఉంది. మొత్తానికి ఆమె సుమారు పదిగంటలకు వచ్చింది. వీళ్లు దాదాపు పెళ్లికొడుకును పెళ్లిమండపానికి తీసుకొచ్చినంత గొప్పగా గేటులోనే ఎదుర్కుని పైకి తీసుకొచ్చారు. నేను ఆమెను చూడగానే చాలా నిరుత్సాహపడ్డాను. అన్ని హంగులతో నిర్మించిన పెద్ద హీరో గారి భారీ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టినట్టుగా అనిపించి.. నేను ఆమెను చూడగానే తుస్సుమన్నాను. అమ్మ అంటే సినిమాల్లో కేఆర్ విజయ లాగా ఉండాలి గానీ, ఈమె ఏంటో.. నల్లగా, మామూలు ఎత్తులో, చికాకు మొహంతో ఉంది.
ఒక నగిషీలున్న మహారాజా కుర్చీ వేసి దానిమీద ఒక పట్టుబట్ట పరిచి.. ఆ కుర్చీలో ఆమెను కూర్చోబెట్టారు. ఒక్కొక్కరూ వచ్చి ఆమెకు దండం పెట్టడం మొదలుపెట్టారు. దండం అంటే మామూలుగా వంగి కాళ్లను ముట్టుకోవడం కాదు. మగవాళ్లు పూర్తిగా సాష్టాంగ నమస్కారం పెడితే, ఆడవాళ్లు మోకాళ్ల మీద కూర్చుని తల దాదాపుగా నేలకు తాకించి దండం పెట్టారు. నాకు వాళ్ల భంగిమలు చూస్తే నవ్వు వచ్చింది.
ఇంట్లో అందరి దండాలు పూర్తయ్యాక.. “ఏమే పద్మాసనీ! జనార్దన్ ఏడి? వాడు ఇక్కడ లేడా!?” అన్నది అమ్మ. నాకు మరో షాక్! ‘జనార్దన్’ అంటే మా అమ్మకు మేనమామ కొడుకు, పద్మ చిన్నమ్మ భర్త. మా అమ్మకన్నా పెద్ద గనుక.. మేము ఆయనను ‘పెదనాయన’ అనేవాళ్లం. పెదనాయనను అందరూ ఎంతో గౌరవంగా ‘మీరు’ అనే అంటారు. అయినా తనేమిటీ ‘వాడు, వీడు’ అంటుందీ? అనిపించింది.
“ఆయన పనిమీద బయిటికి పోయిన్రమ్మ” అని చెప్పింది చిన్నమ్మ. “మేము వస్తా ఉంటే కూడా పోయినాడా?”.. ఆమె కనుబొమలు ముడిచి కోపంగా అన్నది. ఇంతలో ఆమె దృష్టి నా మీద పడింది. “ఈ పిల్ల ఎవరే?” అన్నది నన్ను ఎగాదిగా చూస్తూ. వెంటనే నన్ను కొంచెం ముందుకు తోసి, నా డొక్కలో మోచేత్తో పొడిచి.. “పొయ్యి దండం పెట్టు” అన్నది లక్ష్మి గుసగుసగా. జ్వరం వస్తే చేదు మాత్ర తిన్నట్లుగా ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. వెళ్లి కాళ్లు ముట్టుకోకుండా ఊరికే దండం పెట్టి వచ్చాను. ఆమె కాళ్లు చూసాను, మామూలుగా అందరి కాళ్లలానే ఉన్నాయి. ఆమె అందరికీ పెట్టినట్టు నాకు తెల్లబొట్టు పెట్టకుండా.. “ఇది ఎవరే? దండం పెట్టడం కూడా రాదు.
ఊరికే ఘమండి మాదిరి ఉన్నాదే! అది సరిగా దండం పెడితేనే నేను దానికి బొట్టు పెడతా ఉంటా!” అంది ఆమె కోపంగా. ఆమెచేత బొట్టు పెట్టించుకునే అర్హత కోల్పోయినందుకు నేనేమీ బాధపడలేదు సరిగదా.. ఆమెకు నేను నచ్చనందుకు సంతోషం వేసింది. అయితే చిన్నమ్మ వెంటనే సర్ది చెపుతూ.. “ఆమె మా ఇంటి ఆడబిడ్డ కూతురమ్మా! పల్లెటూరి నుండి ఒచ్చింది. కొంచెం తెల్వదు, ఏమనుకోకండి అమ్మా! ఆమె బాగ చదువుతది. స్కూలు ఫస్టు ఒచ్చింది. మంచి పిల్ల, బుద్ధిమంతురాలు” అంటూ నాకు అయిదారు సర్టిఫికెట్లు ఇచ్చింది. “ఎవరి బిడ్డనే ఇది? జానకి బిడ్డనా, శకుంతల బిడ్డనా?” అని అడిగింది. నేను శకుంతల బిడ్డనని తెలిసాక.. “దీని తల్లి కూడా మన దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినాదా?” అని మళ్లీ అడిగింది. లేదన్నాక ఆమె కోపం మరింత పెరిగినట్టు అనిపించింది. “ఏమే! బాగా సదూతున్నావా? ముద్దుగ ఉండంగనే సాలునా ఏమి? హైదరబాదుకు రాంగనే సాలునా? ఏమీ.. సొల్లు!!” అని తీవ్రంగా ప్రశ్నించింది. ఏమి సొల్లాలో నాకు తెలియలేదు. ఆమె ఆ పూటకు నన్ను వదలదేమో!? అనిపించింది.
ఇంతలో నా పాలిట దేవతల్లా తెలిసిన వాళ్లు ఎవరో ఈ అమ్మను చూడ్డానికి వచ్చారు. వాళ్లు కూడా సాష్టాంగాలూ, చెంపలేసుకోవడాలూ వంటివన్నీ చేసారు. ఆమెకు ఒక చీరా, పళ్లూ, స్వీట్లూ అన్నీ ఇచ్చి ఏదో మాట్లాడుతున్న సందర్భంలో పిల్లలమంతా జారుకున్నాం.
ఆరోజు ఆమె వెళ్లిపోయాక అయిదు నిమిషాలకే పెదనాయన ఇంట్లోకి వచ్చారు. వెంటనే చిన్నమ్మ.. “ఎటు పోయిన్రండీ! అమ్మ మీ గురించి అడిగిన్రు” అన్నది కొంచెం కోపంగా. “ఆ.. ఆమె అడిగితె మాత్రం నాకు పని కావొద్దా?” అన్నారు తాపీగా. “ఏం పనంటే?” అని మళ్లీ అడిగింది చిన్నమ్మ. “పని ఉండేనంటే!”.. అంటూ వాళ్లు చాలాసేపు అనుకున్నారు. “నాకు తెలుసు. మీకు ఇష్టం ఉండదని” అని చిన్నమ్మా.. “ఎహె! నేను అట్ల అన్ననా?” అని ఆయనా.. చెరోవైపు వెళ్లిపోయారు. “దేవునమ్మ అంటే నాయినకు అస్సలు ఇష్టముండదు” అన్నది హైమక్క నాతో గుసగుసగా. ఆ తరువాత దేవుడమ్మ నన్ను మందలించిన విషయం తెలుసుకుని.. “ఏం పట్టిచ్చుకోకు బిడ్డా! గామె రూల్స్ జెప్పితే మనం ఇంటమా? నాకైతే ఆమె అంటేనే అస్సలు ఇష్టం ఉండదు” అన్నారు పెదనాయన. ఆయన కావాలనే దేవుడమ్మ వచ్చినప్పుడు ఇంట్లో లేరని అన్పించింది.
ఆ తరువాత దేవుడమ్మ గురించి చాలా విషయాలు తెలిసాయి. “మీ మరిది వాండ్లు నీకు చెడు చెయ్యాలని చూస్తున్నారే పద్మాసనీ! నేను కరుమారి అమ్మన్‌కు పూజసేసి విరుగుడు సేస్తాను” అనీ, “నీ మీద సెడ్డ కన్ను ఉన్నాదే! ఆదివారం అమ్మకు పూజ సేయాలే!” అని చెప్పీ.. “నీ ఇల్లు బాగలేదే! పూజలు సేయాలే” అనీ బెదిరించి.. చిన్నమ్మ దగ్గరినుండి బోలెడు డబ్బులు, చీరలు, వస్తువులు, బహుమానాలు ఇప్పించుకునేదట.
అంతేకాదు.. దేవుడమ్మ వల్ల చిన్నమ్మకు తన అత్తింటి వాళ్లలో కొందరి కుటుంబాలతో అసలు మాటలే లేకుండా అయ్యాయి. అదివరకే కొంచెం అప్పులున్నాయో ఏమో.. పైగా దేవుడమ్మ చెప్పడం వల్ల కూడా కావచ్చు, గౌలీగూడాలోని ఇల్లు అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. కొన్నాళ్లపాటు పెదనాయన తమ్ముళ్లలో కూడా కొందరు దేవుడమ్మ దగ్గరికి సలహాల కోసం వెళ్లేవారు. ఆ సమయంలో వాళ్ల పిల్లలు కూడా ఎవరింట్లోనైనా ఏదైనా పెడితే తినడానికి భయపడేవారు. తరువాత వాళ్లు మానేసారు. క్రమంగా చిన్నమ్మ కూడా వెళ్లడం తగ్గించిందో, పూర్తిగా మానేసిందో గానీ మొదట్లో కనిపించినంత తరచుగా దేవుడమ్మ వీళ్లింట్లో కనిపించలేదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి