కప్పతల్లి.. కప్పతల్లి కడివెడే నీళ్లు!
పల్లెటూరి జీవితాలన్నీ వాన మీదనే ఆధారపడి ఉంటాయని మాకు తెలియని రోజులవి. రోహిణి కార్తె ఎండలకు తపించిపోయిన జనమంతా.. ‘మృగశిర ఎప్పుడు వస్తుందా? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా!?’ అని ఎదురు చూస్తూ ఉండేవారు. వానలు కురవాలని పిల్లలు ‘కప్పతల్లి’ ఆటలు ఆడేవారు.
పల్లెటూరి జీవితాలన్నీ వాన మీదనే ఆధారపడి ఉంటాయని మాకు తెలియని రోజులవి. రోహిణి కార్తె ఎండలకు తపించిపోయిన జనమంతా.. ‘మృగశిర ఎప్పుడు వస్తుందా? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా!?’ అని ఎదురు చూస్తూ ఉండేవారు. వానలు కురవాలని పిల్లలు ‘కప్పతల్లి’ ఆటలు ఆడేవారు.
“రోహిణిల గూడ ఒక్కొక్కసారి వాన పడ్తది. సామెతే ఉండె.. రోహిణంటె రోళ్లు పలిగే ఎండలన్న గొడ్తయ్! రోళ్లు నిండె వానలన్న పడ్తయ్!” అనేది నానమ్మ. నాన్న దగ్గరికి వచ్చే రైతులు, ఆసాములు.. “ఈఏడు వానలెట్లున్నయో, చెరువు నిండుతదో లేదో! ఉగాది నాడు అయ్యగారైతె.. ‘ఏడు తూముల వానున్నది’ అన్నడు. మరి వానలు ఏపాటి కొడ్తయో? కడగొట్టు పొలాల దాక చెరువు నీళ్లు అందుతయా దొరా?!” అనడిగేవారు. నాన్న ఒక్కోసారి ఉత్సాహంగా.. “ఆఁ.. ఈఏడు బాగనే ఉంటయి” అనేవాడు. మరోసారి పాపం వాళ్లను నిరాశపర్చలేక, నిజం చెప్పలేక.. “ఈసారి ఓ మోతాదుగనే పడ్తయట. ఒక్క పంటకు ధోకా ఉండకపోవచ్చు. అయినా కొంత చెల్క పంటలేసుకుంటె బాగుంటది” అని చెప్పేవాడు.
వర్షాలు బాగుంటే పంటలు బాగా పండుతాయి. చెరువులు, బావులు నిండుతాయి. కమ్మరి, కుమ్మరి, కంసాలి వాళ్లకు వ్యవసాయ పనిముట్లకు గిరాకీ పెరుగుతుంది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో బోనాలు, ఆశ్వయుజంలో బతుకమ్మ, దసరా పండుగలకు బట్టలు అమ్మేవాళ్లకు, బట్టలు కుట్టేవాళ్లకు పని దొరుకుతుంది. పాడి పశువులను, గొర్రె మేకలను, కోళ్లను పెంచుకునేవాళ్లకు వర్షాలు ఉంటేనే వాటికి పచ్చిగడ్డి, గ్రాసం, దాణా గింజలు దొరుకుతాయి. కూరగాయలు అమ్మేవాళ్లకు అవి పండాలన్నా వానలే ఆధారం. అందుకని అందరూ.. ‘వానలెప్పుడు పడతాయా!?’ అని ఎదురు చూసేవారు.
వర్షాకాలం మొదలైనా వానలు పడకపోతే కప్పతల్లికి మొక్కేవారు. కప్పలు బెకబెకమని అరిస్తే వానలు కురుస్తాయని పల్లెటూరివాళ్ల విశ్వాసం. సుమారు పదేళ్లలోపు ఇద్దరు మగపిల్లలకు కేవలం బుడ్డగోచి మాత్రం ఉంచి, వాళ్ల భుజాల మీద రోకలి ఉంచేవారు. ఓ తడి బట్టలో కప్పల్ని ఉంచి ఆ రోకలి మధ్యలో వదులుగా కట్టేవారు. ఆ పిల్లలు ముందుగా, వాళ్లెనుక ఓ గుంపు బయల్దేరి.. “కప్పతల్లి.. కప్పతల్లి కడివెడే నీళ్లు! పురిశెలు.. పురిశెలు పురిశెడే నీళ్లు! దొంతులు.. దొంతులు దొంతెడే నీళ్లు!” అని పాడుతూ, ఊరిలో ఇంటింటికీ వెళ్లేవారు. ప్రతి ఇంటిలోవాళ్లు నీళ్లు తెచ్చి ఆ రోకలి మోస్తున్న పిల్లల మీదా, కప్పలను ఉంచిన బట్టమూట మీదా పోసేవారు. నీళ్లు పోసినప్పుడల్లా పక్కనున్న పిల్లలు అరుస్తూ వాళ్లను ఉత్సాహపరిచేవాళ్లు. ఆ రాత్రే వర్షం పడుతుందనేవారు.
మా పొలాలు, చెల్కల్లో పనిచేసే ఎల్లయ్య, రామయ్య, మల్లయ్య, యాకయ్య, బక్కయ్య, బుచ్చయ్య, కొమురయ్య, అయిలయ్య.. ఇలాంటి వాళ్లకు ప్రకృతికి సంబంధించిన అన్ని విషయాలూ తెలిసేవి. ఒక్కోసారి సాయంత్రాలప్పుడు ఆకాశమంతా ఎర్రగా మారిపోయి భలే అందంగా కనిపించేది. దాన్ని చూసి.
“ఎర్రడాలు ఏశింది. ఈఏడు వాన ఆలిశెంగ కొడ్తది” అనేవాళ్లు. అప్పుడప్పుడూ చంద్రుని చుట్టూ గుండ్రంగా ఒక వృత్తంలా ఏర్పడేది. దానిని “వరదగూడు ఏసింది” అనేవాళ్లు. ఆ రింగ్ చిన్నగా ఉంటే వర్షాలు ఆలస్యంగా వస్తాయనీ, పెద్దగా ఉంటే.. “వరదగూడు పెద్దగున్నది. వానలు జప్పున పడ్తయ్!” అనేవాళ్లు.
వాన రాబోతున్నదని వ్యవసాయదారులకు ఎలా తెలిసేదో! “వానొచ్చేటట్టుంది. ఇంటికి పోన్రి” అనేవాళ్లు. వానొచ్చే ముందు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయేది. ఎక్కడినుంచో చల్లని గాలి వీచేది. ఆ గాలి ఒక రకమైన మట్టి వాసనతో ఒంటిని తాకుతూ ఉంటే.. చెప్పరాని ఆనందం కలిగేది. నల్లని మేఘాలు వేగంగా జతగట్టి కిందికి దిగుతూ.. మనం అందుకోగలమన్నట్టుగా అనిపించేది. పక్షులు ఎగురుతూ వచ్చి చెట్ల కొమ్మల మీద ఆగి కిచకిచమంటూ శబ్దాలు చేసేవి. పశువులు కూడా గడ్డి మేయడం ఆపి చెవులు రిక్కించి దిక్కులు చూసేవి. ఆకాశంలో ఎక్కడో దూరంగా నల్లమబ్బు నుంచి జల్లులు జల్లులుగా వానపడటం మనకు కనిపిస్తూ ఉండేది. అదొక గొప్ప అనుభవం!!
ఒక్క వాన పడగానే రైతులు తొందరపడి విత్తనాలు చల్లేవాళ్లు కారు. “అమ్మో! గీ వానను ఎట్ల నమ్ముతం? నమ్మిచ్చి ముంచుతది. రెండు మూడు గట్టి వానలు కొట్టనియ్యుండ్రి. గప్పుడు గింజలు అలుకుదాం!” అనేవారు. ఇప్పట్లా ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వెస్టర్లు లేని రోజులవి. నాగలికి రెండెడ్లను కట్టి దున్నేవారు. మూడు నాలుగు వర్షాలు పడి భూమి మెత్తపడ్డాకే పొలం దున్నేవారు. మగవాళ్లు సాలుపెట్టి దున్నుతుంటే ఆడవాళ్లు గంపల్లో ఉన్న విత్తనాలు చేతితో చల్లుతూ వెనుక కదిలేవారు.
ప్రకృతి ఎంత చిత్రమైందో కదా! మనం ఎన్ని నీళ్లుపోసినా మొలవని విత్తనాలు.. ఒక్కవానకే మొలకెత్తుతాయి. విరియని మొక్కలు కొత్త చిగుర్లు వేస్తాయి. నేలపై ఏవేవో తెలియని మొక్కలు కూడా మొలుస్తాయి. “గిదేం చెట్టు? గిదేం మొలక?!” అని మేము నాన్నను అడిగేవాళ్లం. “ఆఁ.. అట్లాంటివి శాన మొలుస్తయి. మఖల పుట్టి పుబ్బల మాడుతయి” అనేవాడు నాన్న. చాలా ఏళ్ల తరువాత.. అట్టహాసంగా మొదలై కొన్నాళ్లకే మూతపడిన సంస్థల గురించి ఆ సామెతను ఉపయోగించడం చూసి ఆశ్చర్యపోయాను. ఇలా.. వానలు కురిస్తే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైతే.. మేము ఆటల్లో మునిగితేలేవాళ్లం. వానల్లో మా ఆట – పాటల గురించి వచ్చేవారం తెలుసుకుందాం.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

