నా పరీక్ష హాల్ టికెట్ రాలేదని ఇంట్లో నాయనమ్మకూ, చిన్నాయనలకూ గోపిక చిన్నమ్మ చెప్పింది. ‘అయ్యో! ఎందుకు బిడ్డా.. అట్లయింది?’ అన్నారు రంగారావు చిన్నాయన. నాయనమ్మ ‘మళ్ల పోయి గట్టిగ అడుగకపోయిన్రే? ఊరుకుంటే ఎట్ల? మనింట్ల రెండేండ్లు ఉండి చదువుకున్నది గద! ఏం జూసిన్రు అని మనను అంటరు!’ అన్నది చిన్నమ్మతో.
‘నేను పోయి అడిగిన గద అత్తయ్యా! రమ అసలు అప్లికేషనే ఇవ్వలేదంటున్నరు వాళ్లు. తనేమో ఇచ్చిన అని డేట్‌తో సహా చెపుతున్నది’ అన్నదామె. ‘అవును చిన్నమ్మా! నేను కచ్చితంగా ఇచ్చిన. దేవకీ మేడమ్ కూడ అక్కడనే ఉన్నరప్పుడు’ చెపుతుంటేనే నన్ను నిలువెల్లా దిగులు ఆవరించింది. ‘ఏమో! ఏం చదువులో.. ఏం కథలో! కొసకు గిట్లాయే. మరి ఆమెది తప్పా, దీనిదా! ఎవరు చెప్పాలె?’ నిట్టూర్చింది నాయనమ్మ. ‘ఇప్పుడేం చేసేది ఉండదా?’ అంటూ. ‘వాళ్ల చేతిలో ఏం లేదన్నరు అత్తయ్యా! ఇంక తర్వాత రాసుకోవల్సిందే!’ జవాబిచ్చింది చిన్నమ్మ.
నా మనసు మనసులో లేదు. నా మీద అమ్మా, నాన్నా ఎప్పుడూ ఏ విషయంలోనూ ఒత్తిడి చేయలేదు. కానీ, అమ్మకు నా చదువు పైన చాలా ఆశలున్నాయి. తనకు చదువంటే ఎంతో ఇష్టం. బాగా చదువుకోవాలనే తన కోరిక ఆనాటి పరిస్థితుల్లో తీరలేదు గనుక మేము బాగా చదువుకోవాలని అమ్మ ఎప్పుడూ చెప్పేది. మా కజిన్స్లో చాలామందికి టెంత్ క్లాస్ అవుతూనే పెళ్లిళ్లు చేస్తుంటే అమ్మ నాన్నకు నచ్చజెప్పి మమ్మల్ని చదువు కోసం పరాయి ఊర్లకు పంపించింది. ఆడపిల్లలకు పై చదువులెందుకు, చెడిపోతారని మా దగ్గరి బంధువుల నుంచి ఎన్నో మాటలు ఎదుర్కుంది కూడా. అప్పటికే అక్కకు ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయింది. నా తప్పేమీ లేకపోయినా నాకిలా అయింది. నాకు చదువు చెప్పిన టీచర్లకూ, దగ్గరి బంధువులకూ, ఊర్లో కొందరికీ నేను డాక్టర్నవుతాననే పెద్ద ఆశ. వాళ్లందరికీ మొహం ఎలా చూపించను?
మర్నాడు కాలేజీకి వెళ్లానే కానీ, క్లాసుకు వెళ్లలేకపోయాను. పెద్దగా క్లాసులేవీ జరగడం లేదు. రివిజన్ చేస్తున్నారు. చాలా అవమానంగా, బాధగా అనిపించింది. క్లాసులో అందరూ నన్నో ఫూల్‌గా, పనికిమాలినదానిగా చూస్తున్నారేమో అనిపించింది. కాలేజీ ఆవరణలో బిల్డింగ్‌ని ఆనుకుని బొడ్డు మల్లె చెట్ల కింద ఉండే బెంచీల్లో ఒక దాని మీద పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. నా మాట ఎవరూ నమ్మడం లేదని బాధేసింది. బర్కత్‌పురాలో ఉన్న పోస్ట్ ఆఫీసుకి వెళ్లి ఒక ఇన్లాండ్ కవరు కొని విషయమంతా నాన్నకు వివరంగా ఉత్తరం రాశాను. ఆ మర్నాడు కాలేజీకి వెళ్లాలనిపించలేదు. బ్యాగు తీసుకున్నానే గానీ, కాలేజీకి వెళ్లకుండా హిమాయత్‌నగర్‌లో ఉన్న వకుళక్క వాళ్ల మామయ్య ఇంటికి వెళ్లాను. ఆమెకు కూడా ప్రిపరేషన్ హాలిడేసే. ఇలా జరిగిందని నా విషయం చెబుదామంటే వాళ్లింటి నిండా ఎప్పటిలాగే బంధువులు ఉన్నారు.
‘వకుళక్కా! ఎటన్న పోదామా?’ నేనే అడిగాను. మేమిద్దరమే సినిమాకు ఎప్పుడైనా వెళ్లింది కూడా లేదు. అసలు ఇంట్లో చెప్పకుండా వెళ్లే అవసరమూ, అవకాశమూ, ఆసక్తీ కూడా లేదు. ‘సరేనే! మా గల్లీ పక్కనే వెంకటేశ, శ్రీనివాస వున్నాయి కదా! ఏదైనా ఒక సినిమా చూద్దాం. నాకు కూడా బోర్ కొడుతుంది’ అంది వకుళక్క. శ్రీనివాసలో ‘కురుక్షేత్రము’, వెంకటేశలో ‘దానవీరశూర కర్ణ’ నడుస్తున్నాయి. నేను అదివరకే చిన్నమ్మ వాళ్లతో కురుక్షేత్రము చూశాను. రెండో దానికి టికెట్లు అయిపోతే ‘ఫర్వాలేదు, ఏదో ఒకటి కాసేపు చేంజ్ ఉంటుందిలే’ అనుకుని టికెట్స్ కొనుక్కుని చూశాం. ఆ తరువాత రోజుల్లో కూడా నాకు కురుక్షేత్రమే నచ్చింది ఎందుకో! సినిమా అయిపోతూనే రెండు థియేటర్ల జనంతో రద్దీగా ఉంటుందని కొంచెం పక్కగా నిలబడ్డాం. వకుళక్క ఇప్పుడే వస్తానని టాయిలెట్స్‌కి వెళ్లింది. ఇంతలో రోడ్డుకవతల బాలాజీ మిఠాయి భండార్ నుంచి బయటికి వస్తూ రంగారావు చిన్నాయన కనిపించారు. ఒక్క నిముషం ఆగి జేబులో ఏదో చూసుకుని వెళ్లిపోయారు. నన్ను చూశారో లేదో అర్థం కాలేదు. వకుళక్క రాగానే ఎవరింటికి వాళ్లం వెళ్లిపోయాం.
ఇంటికి రాగానే నాకు అన్నం పెడుతూ గోపిక చిన్నమ్మ ‘సినిమా అంత బాగుందా రమా! ఒక్కదానివే పోయి రెండుమూడు సార్లు చూసేటంత!’ అనడిగింది. నాకు అర్థమయింది. థియేటర్లో నన్ను చూసి చిన్నాయన ఇంట్లో చెప్పి ఉంటారని. ‘నేను ఒక్కదాన్నే పోలేదు చిన్నమ్మా! వకుళక్క కూడా ఒచ్చింది’ అన్నాను. నా మనసెంత దిగులుగా, పిచ్చి పిచ్చిగా వున్నా కూడా ఒక్కదాన్నే సినిమాకు వెళ్తానా? అది ఆ సినిమా నచ్చి కాదు, కాస్త చేంజ్ కోసమని చెప్పాలని కూడా చెప్పలేకపోయాను. అప్పటి పరిస్థితుల్లో నేనేం చెప్పినా అబద్ధం చెప్పినట్టే ఉంటుంది. అది వాళ్ల తప్పు కూడా కాదు. ఇక నేను వాళ్లింట్లో వుండడం కూడా అనవసరం అనిపించింది. వాళ్లేమీ నన్ను నిరాదరణ చేయలేదు. రెండేళ్లూ బాగా చూసుకున్నారు. నా అదృష్టమే బాగాలేదు. కానీ, నా తప్పేమీ లేకుండా ఓడిపోయినట్టు తిరిగి వెళ్లిపోవడం నాకు బాగనిపించలేదు. ఏదైనా జరగకపోతుందా? అన్నట్లు తోచింది. మూడు రోజులకు రమణయ్య వచ్చారు. మా నాన్న ఘన్పూర్, శివునిపల్లి గ్రామాలు రెండిటికీ అసల్ దార్ పట్వారీ అయితే, ఘన్పూర్ది రమణయ్య చూస్తుండేవారు. రెవిన్యూ శాఖలో చట్టాలు, రికార్డులు ఆయనకు కొట్టిన పిండి. పెద్దపెద్ద వాళ్లు ఆయన సలహా తీసుకుంటుండేవారు.
ఆయన వస్తూనే అమ్మాయిగారికి కాలేజీలో ఏదో ఇబ్బంది వచ్చిందట. విషయం కనుక్కొని రమ్మని దొరవారు నన్ను పంపించిన్రు. అన్నాడు చిన్నాయన వాళ్లతో. నన్ను వెంటబెట్టుకుని మొదట కెనరా బ్యాంకుకు వెళ్లి అక్కడ నేను ఫీజు కట్టిన రికార్డు తీయించి, ఆ చాలాన్ కాపీ తీసుకున్నాడు. మా లెక్చరర్స్‌ని కలిసి నా గురించి అడిగితే ‘చాలా మంచి అమ్మాయి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్’ అనే సమాచారం తీసుకున్నాడు. అప్పు డు ప్రిన్సిపాల్ ఇందిరా లక్ష్మయ్య గారికి ఇవన్నీ తెలుపుతూ ఒక లెటర్ ఇచ్చాడు. ఆవిడ వెంటనే సుమిత్రా మేడమ్‌ని పిలిపించి ‘ఎగ్జామ్ ఫీజు కట్టిన అమ్మాయి అప్లికేషన్ ఎందుకు ఇవ్వదు? ఒకవేళ ఇవ్వకపోతే బ్యాంకు స్టేట్మెంట్తోనో, క్లాస్రోల్స్తోనో మీరు కౌంటర్ చెక్ చేసుకోవాలి కదా! ఇప్పుడు వీళ్లకు నేనేం సమాధానం చెప్పాలి?’ అని మందలించారు. అప్పటికీ కూడా నేను అప్లికేషన్ ఇవ్వలేదనే మాట మీదే ఉంది సుమిత్రా మేడమ్. ‘సారీ అండీ! ఇప్పుడు ఏమీ చేయలేం. సెప్టెంబర్‌లో పరీక్షలు రాయమనండి’ అన్నారు ప్రిన్సిపాల్. ఇంటికి రాగానే విషయమంతా చెప్పారు. నేను బట్టలు సర్దుకుని నాయనమ్మకూ, ఇంట్లో వాళ్లకూ చెప్పి ఆయన వెంట మా ఊరికి వెళ్ళిపోయాను. ఆ ఇల్లూ, పరిసరాలూ వదిలి వచ్చేస్తుంటే చెప్పరానంత దుఃఖం వచ్చేసింది.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి