బయోకెమీ క్రియేచర్ ఉన్న బాక్స్‌ను హరిశ్చంద్ర ఘాట్‌లోని చివరి మెట్టు మీద పెట్టినట్టు ఎట్టకేలకు గుర్తించాడు ఇన్స్పెక్టర్ రుద్ర.ప్రస్తుతం బాక్స్‌లో వైరస్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అప్పటికే మూడో దశ ప్రారంభమయ్యి 7 గంటలు దాటింది.
ఆ బాక్స్‌ను ఎగ్జామిన్ చేసిన సదరు అధికారులు పలు షాకింగ్ విషయాలు చెప్పారు. ‘సార్..అడ్వాన్స్డ్ స్కానర్లతో ఈ బాక్స్‌ను పరిశీలించాం. ఆ బాక్స్ గోడలపై ఏదో భాషలో ఏదేదో రాసి ఉంది. అలాగే చిన్న తంత్ర రేకు కూడా ఉంది’ అంటూ తాము గుర్తించిన స్కానింగ్ ఇమేజెస్‌ను ట్రాన్స్మిట్ చేసి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన తెరపై ప్రదర్శించారు అధికారులు. ఆ బాక్స్ లోపలి గోడలపై తెలుగును రివర్స్‌లో రాసినట్టు గమనించిన రుద్ర.. వాటిని సిస్టమ్‌లో రివర్స్ ఆర్డర్లో మార్చేసి చదవడం ప్రారంభించాడు.
‘మీరు ఇది చదువుతున్నారంటే.. రెండు దశలను విజయవంతంగా ఆపేసినట్టు అర్థం చేసుకోగలం. మీరు మరికొంత శ్రమిస్తే.. ఈ డోలో మిషన్‌ను ఈ మూడో దశలోనే పూర్తిగా నిలిపేయవచ్చు. మీకు అర్థం కావడానికి కొంచెం వివరంగా చెప్తాం. ఈ డోలో మిషన్‌లోని 8 దశల కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది అత్యుత్తమ సైంటిస్టులను రిక్రూట్ చేసుకొన్నారు. ఈ మూడో దశ కోసం ఇండియా నుంచి మా ముగ్గురిని ఎంచుకొన్నారు. తొలుత మేం చేయమని తెగేసి చెప్పాం. అయితే, మా భార్యా, పిల్లలను చంపుతామనడంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది. డోలో మిషన్‌లో పాలుపంచుకొన్న సైంటిస్టుల్లో కొందరు మంచివారు కూడా ఉన్నారు. వాళ్ల సాయం వల్లే ఈ మిషన్‌ను ఎక్కడికక్కడ ఆపేయాలన్న ఉద్దేశంతో ప్రతీ దశలో కొన్ని లీకులు ఇస్తూ వచ్చాం. దాని ఫలితమే.. మీరు ఇంతకు ముందు రెండు దశలను ఛేదించి ఇప్పుడు మేము రాసిన ఈ వివరణను చదువుతున్నారు.
మన ఇండియాను నాశనం చేయాలనుకొన్న వారి ఆటలు సాగొద్దన్న ఉద్దేశంతో ఇటలీలో ఈ బయోకెమీ క్రియేచర్ దశ యాక్టివేట్ అయినా.. దాని మూలాన్ని పండితుల సలహాతో వారణాసిలో కావాలనే పెట్టాం. మూడో దశలో డివైజ్ యాక్టివేట్ కాగానే వైరస్ ప్రభావం వ్యాపించాలి. అయితే, శ్రీలంకలోని రెండో దశను ఆపేసి ఇక్కడికి రావడానికి సమయం పడుతుంది కాబట్టి మేం మూడో దశ డివైజ్ యాక్టివేట్ అయినప్పటికీ వైరస్ ప్రభావం వ్యాపించకుండా ఉండేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకొన్నాం. సాంకేతికంగా వైరస్ వ్యాప్తిని మేం అడ్డుకొన్నట్టు వాళ్లు గుర్తిస్తే మమ్మల్ని ఈ మిషన్ నుంచి తొలగించి చంపేస్తారు. ఆ పనిని వేరే వాళ్లకు అప్పగిస్తారు. అందుకే, శాస్త్ర-సాంకేతికతకు అర్థంకాని విధంగా కొందరు పండితుల సాయంతో ఈ వైరస్‌ను బాక్స్‌లో అష్టదిగ్బంధనం చేశాం.
అష్ట దిక్కులను బంధించే మంత్ర దిగ్బంధనం, యంత్ర దిగ్బంధనం, తంత్ర దిగ్బంధనం, పంచ భూత దిగ్బంధనం, రక్షా దిగ్బంధనం, క్షేత్ర దిగ్బంధనం, గ్రహ దిగ్బంధనం, ప్రేత దిగ్బంధనాలు అన్నీ ఈ బాక్స్‌లో ఓ చిన్న తంత్ర రేకులో నిక్షిప్తమై ఉన్నాయి. సైంటిస్టులమైన మేము ఈ మంత్ర, తంత్రాలు, దిగ్బంధనాలను నమ్మడం ఏంటీ? అని మీకు ఆశ్చర్యం కలుగొచ్చు. సైన్స్ గుర్తించనంత మాత్రాన కొన్ని విషయాలు ఈ సృష్టిలో అసలు లేనేలేవనే పిచ్చి వాళ్లం మాత్రం మేం కాదు. ఇక, అది పక్కనబెడితే, అతి ముఖ్యమైన విషయం.. మూడో దశ డివైజ్ యాక్టివేట్ అయిన 8 గంటల వరకూ ఈ అష్టదిగ్బంధనం పని చేస్తుంది. ఆ తర్వాత ఆ వైరస్‌ను ఎవ్వరూ ఆపలేరు. పంచ భూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం సహా ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువులను అది నాశనం చేయగలదు. ఆలోపే దాన్ని అడ్డుకోవాలి. అలా చేస్తే.. మూడో దశ అయిన బయోకెమీ క్రియేచర్ పాజ్లోకి వెళ్లడంతో నాలుగో దశ యాక్టివేట్ కావడానికి డివైజ్‌కు సిగ్నల్ అందదు. సో.. ఈ డోలో మిషనే పూర్తిగా ఆగిపోతుంది. దానికి ఏం చేయాలో మా దగ్గర సమాధానం లేదు’ అని అందులో రాసి ఉంది.
అది చదివిన రుద్రకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. మంత్ర, తంత్రాల ప్రస్తావనను చూసి అక్కడి అధికారులు కొందరు నవ్వుకొన్నారు. అయితే, అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న కాశీ విశ్వేశ్వర ఆలయం ప్రధాన పూజారుల్లో ఒకరు రుద్ర దగ్గరికి వచ్చి ఓ విషయం చెప్పాడు. ‘అస్సలు సాధ్యం కాదు’ అన్నట్టు అక్కడి అధికారులు కొందరు వారించారు. దీంతో మళ్లీ కొనసాగించిన ఆ పూజారి.. ‘కేరళం అనంత పద్మనాభ స్వామి ఆరో గదికి నాగ బంధనం వేసిన విషయం తెలుసు కదా.. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా విచారించింది. అంటే, ఏంటీ?? మనకు తెలియని వాటిని మూఢ విశ్వాసాలుగా కొట్టిపారేయవద్దు. కొన్నిటిని నమ్మాలి అంతే. విశ్వంలో అన్నింటినీ అమాంతం మింగేసే బ్లాక్‌హోల్‌ను నమ్మే మీ సైన్స్.. ఈ వైరస్‌ను ఈ 8 గంటలు బంధించిందేంటో ఎందుకు కనిపెట్టలేకపోతుంది?’ అంటూ ఆ పూజారి మరేదో చెప్పబోతుండగా.. ‘స్వామి.. మీరు అవేం పట్టించుకోకండి. సృష్టి ఆవిర్భావానికి కారణమైన దాంతో ఇప్పుడు ఈ వైరస్‌ను పూర్తిగా నిలువరిస్తామంటున్నారు. అదే జరిగితే, అంతకంటే ఇంకా ఏంకావాలి?’ అంటూ ప్రాధేయపడుతున్నట్టు రుద్ర అంటుండగానే.. ఆ పూజారి చేసిన ఓ చర్యతో ఆ వైరస్ పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ పూజారి ఏం చేసినట్టు?
సమాధానం:
సృష్టి ఆవిర్భావానికి కారణం ఓంకార నాదం. అలాంటి ఓంకార నాదాన్ని పంచాక్షరి, అష్టాక్షరి మంత్రంతో కలిపి శబ్ద దిగ్బంధనం చేసి ఆ వైరస్‌ను బంధించాడు పూజారి. పంచ భూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం సహా ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువులను నాశనం చేసే శక్తి ఆ వైరస్‌కు ఉన్నట్టు అర్ధమవుతున్నది. దీంతో ఈ సృష్టికి చెందనిది ఏదైనా వస్తువు ఉన్నదంటే అది శబ్దం మాత్రమేనని పూజారి గ్రహించాడు. దాని సాయంతోనే వైరస్‌ను శాశ్వతంగా బంధించాడు. ‘సృష్టి ఆవిర్భావానికి కారణమైన (ఓంకారం) దాంతో..’ అని రుద్ర అందుకే అన్నాడు.