ఇంకా కొంతసేపైతే స్కూళ్లు వదలిపెడతారు.పిల్లలందరూ బిలబిలమంటూ ఆనందంతో కేకలు వేస్తూ ఇళ్లవైపు పరుగులు తీస్తారు. బడి వదిలి పెట్టాక, చాలామంది పిల్లలు రోడ్డుదాటి అవతలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. అవతలివైపూ, ఇవతలి వైపూ ఆఫీసులు, బ్యాంకులు, హోటళ్లు, నివాస గృహాలు, బడులు, మధ్యన రోడ్డు. ఈ రోడ్డుకు అడ్డంగా మరో చిన్న రోడ్డు స్కూలు వైపు వెళ్తుంది. అదిగో.. ఆ రోడ్ల కూడలి దగ్గర పేవ్మెంటు మీద కూర్చుంది ముత్తి. ఓమారు రోడ్డు ఎగువ, దిగువల వైపు, మరోమారు స్కూలు వైపు చూసింది. ముత్తి వయసు పది సంవత్సరాలు. అయినా, దాని ముఖంలో ఆరిందతనం తొంగిచూస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ. స్కూలు వైపు చూస్తూనే.. గతంలోకి వెళ్లిపోయింది.
“ముత్తీ! ఓ ముత్తీ.. బట్టలు ఉతకడం అయిపోయిందా? ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉతుకు. మొన్న చీర చించావు” అనే హెచ్చరిక వినిపించింది.
“సరేనమ్మా!” అన్నది ముత్తి,“బట్టలైన తర్వాత అంట్లు తోము.. వినిపించిందా? ఆఁ! నీళ్లు ఉన్నాయా? అయిపోయినాయా?! నీళ్లు జాగ్రత్తగా వాడు. అసలే పంపుల్లో నీళ్లు సరిగ్గా వచ్చి చావవు” అంటూ గొణిగింది అమ్మగారు.ముత్తి బట్టలు ఉతికేసింది. వంట సామాను తోమి పెట్టేసింది. అమ్మగారు ఓమారు వాటిని ముట్టి.. అటూ, ఇటూ తిప్పి ఎగాదిగా చూసింది.“ఏవిటే?! అంట్లు తోమటం కూడా చేతకాదా? ఇదేమిటీ? ఈ మురికి ఇలాగే ఉంది! మళ్లీ కడుగు” అంటూ గుడ్లురిమి.. నీటి డ్రమ్ము వైపు చూసింది.“స్టుపిడ్! నీకెన్ని సార్లు చెప్పినా ఇంతే! నీళ్లయిపోయినాయ్! పో.. పోయి ఆ గవర్నమెంటు పంపు దగ్గర నుండి నీళ్లు మోసుకురా.. నీళ్లెప్పుడొస్తాయక్కడ?”
“మూడు గంటలకమ్మా!”“ఏడ్చిన్నట్టుంది స్టుపిడ్. సాయంత్రం అయ్యగారికీ, పాపకీ స్నానానికి నీళ్లుండాలి. అర్థమైందా? సరే.. అంతవరకూ ఏంజేస్తావు?! ఆఁ! ఆ ధోబీ దగ్గరికిపోయి చీరలు, ఫ్రాకులు, సారు బట్టలు ఇస్త్రీ చేయించి పట్రా.. మొన్న ఇచ్చిన అయ్యగారి నాలుగు షర్టులు, మూడు ప్యాంట్లు, నావి మూడు చీరలు, మూడు బ్లౌజులు, మున్ని ఆరు ఫ్రాకులు, నాలుగు స్కూలు యూనిఫాంలు, పాప బట్టలు తీసుకొని రా. మర్చిపోకు.. పోయి వెంటనే రా. సాయంత్రం ఫంక్షన్ ఉంది. నువ్వొచ్చినంక కూరగాయలకు వెళ్లు. వెంటనే రా..అటే పోయేవ్!”
చేయవలసిన పనులన్నీ ఏకరువు పెట్టిపురమాయించింది.
ముత్యాలు వెళ్లి ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చింది. అమ్మగారు బట్టలు లెక్కచూసి..“అయ్యగారి ప్యాంటు ఒకటి లేదు. ఏమైందే? మున్ని ఫ్రాకు కూడా లేదు! లెక్క చూసినవా? నీ ముఖానికి లెక్కలు కూడానా? ఆ స్టుపిడ్ దోభీగాడూ అంతే! ముత్తీ.. ఆ ధోబీగాడు ఏ ప్యాంటు వేసుకున్నాడో చూసినవా?!”
“లేదమ్మా!”“నువ్వో స్టుపిడ్! ఎక్కడ దిక్కులు చూస్తున్నావే?! ఆఁ! ఆ బుట్ట తీసుకో.. టైం అయిపోతుంది. మబ్బులు కూడా వస్తున్నాయి. వర్షం పడుతదో ఏంపాడో! ఏంటే? అట్లా దెయ్యంలాగా చూస్తూ నిలబడ్డావ్? ఆ కూరగాయల బుట్ట పట్రా!”మార్కెట్ నుంచి కూరగాయల బుట్ట నెత్తిన మోసుకుంటూ వచ్చింది ముత్తి.“స్టీలు గిన్నెలో మాపటి అన్నం, పప్పు ఉంది. నీ ప్లేట్లో వేసుకొని తిను. తిన్నాక ఇల్లు ఊడ్చి, తడిగుడ్డతో తుడ్చి, గవర్నమెంటు పంపుకాడికి నీళ్లకు పో.. అబ్బబ్బా! ఏం పనో ఏమో, నేను కాసేపు నడుం వాలుస్తాను.. వినిపించిందా?! ఇల్లు ఊడ్చి నీళ్లు తీసుకురా!”
“సరేనమ్మా!”అలుపెరగని, పసితనం తీరని పదేళ్ల ముత్తి.. ఇల్లు శుభ్రం చేసి, నీళ్ల డ్రమ్ముల్లో నీళ్లు నింపింది. అంతలోనే అమ్మగారు పడకనుండి లేచింది. ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుమీద డమడమ శబ్దానికి, కిటికీలో నుండి బయటికి చూసి విసుక్కొని, ముత్తి వైపుచూసి..“ముత్తీ! నీకేం పనిలేదాయే? అట్లా దిష్టిబొమ్మ లెక్క నోరు వెలగబెట్టి రోడ్డుమీదికి చూస్తున్నవ్?! ఆఁ స్టుపిడ్కు పనీపాటా లేదు. ఊఁ అంటే ఆ పండగా ఈ పండగా, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అంటూ ఈ వెధవలు డండంలు కొట్టి చందాలు వసూలు చేస్తారు. ఎవడు ఎంత మింగుతాడో?! అంతా దొంగ గాడిదలు! ఓసేవ్.. ఆ గాడిదల వైపు చూస్తూ కూర్చుంటే.. నువ్వూ గాడిదవౌతావు. స్టుపిడ్ తొందరగా నీళ్లు నింపు. నాలుగు కావొస్తుంది! ఇదేవిటే! నీళ్లన్నీ ఒంటిమీద పోసుకున్నావ్? స్టుపిడ్”“పంపు దగ్గరినుండి నీళ్లు మోస్తుంటే తడిశాయమ్మా”
“నీళ్లు మోసుకురావటం కూడా తెలియదా? స్టుపిడ్. నీళ్లు తేవడం చేతకాదా?! డర్టీఫూల్.. పో!! క్లీన్‌గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను.
ఎవరన్నా ఇంటికొస్తే నీ ఆకారం చూసి ముఖం చిట్లించుకుంటారు. అలగా జనం.. అడుక్కుతినే ముఖం! ఈ దేశం ఎప్పుడు బాగుపడుతోందో ఏమో?!” అంటూ అదోలా నిట్టూర్చింది అమ్మగారు.నిర్వికారంగా బాత్రూంలోకి వెళ్లిపోయింది ముత్తి. మనసులో బాకులు గుచ్చిన బాధ, కనుగుడ్లలో నిబిడీకృత బడబాగ్ని నీళ్ల రూపంలో ఉబికుబికి వస్తుంటే.. అనుకుంది..
‘పొద్దున్నే కళ్లు నలుముకుంటూనే ఇల్లు ఊడ్చేయ్యాలి. డ్రమ్ముల్లో నీళ్లు నింపాలి. తర్వాత వంటపాత్రలు తోమి, కడిగి శుభ్రం చెయ్యాలి. మరుగుదొడ్లు శుభ్రంగా కడగాలి. అయ్యగారి బూట్లు తుడవాలి. పాలిష్ చెయ్యాలి. మున్ని పాప బూట్లు తుడిచి, పాలిష్ చెయ్యాలి. మున్ని పాప ముఖం కడగాలి. వారు ఉదయం తిన్నాక గిన్నెలన్నీ మళ్లీ కడగాలి. అంతలోనే మున్ని పాపను బడికి ముస్తాబు చెయ్యాలి. మున్ని పాపను ఎత్తుకొని, పుస్తకాల సంచిని జబ్బకు వేసుకొని స్కూలుకు తీసుకు పోవాలి. మున్ని పాపను బడిలోని తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చాక.. అందరి బట్టలూ ఉతకాలి. ఆరబెట్టాలి. ఎండిన బట్టలను ఇస్త్రీకి ఇవ్వాలి. తర్వాత తీసుకు రావాలి. మళ్లీ నీళ్లు మోసుకు రావాలి. అమ్మగారితో బజార్‌కు వెళ్లి కూరగాయలు మోసుకు రావాలి. ఇల్లు అద్దంలా మెరిసేలా తడిగుడ్డతో తుడవాలి. మధ్యాహ్నం అమ్మగారి కాళ్లు పట్టాలి. సాయంత్రం స్కూలు నుండి మున్ని పాపను ఎత్తుకు రావాలి’..
మున్ని ఆలోచనలకు బ్రేకులు వేస్తున్నట్లుగా..“ముత్తీ” అంటూ కేకవేసింది అమ్మగారు.ముత్తీ బాత్రూంలోంచి బయటికి దూకింది. పొరిగింటి అమ్మగారు వచ్చింది.అమ్మగారూ, పొరిగింటి అమ్మగారూ ఏవేవో మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. పొరిగింటి అమ్మగారికేదో కావాల్సి ఉంది. దాన్ని బజారు నుండి తెప్పించడానికి ముత్తిని ఫ్రీగా పురమాయించింది. ముత్తి వెళ్లి వచ్చేసరికి నాలుగైంది. పొరుగింటావిడ వెళ్లబోతూ..
“నాలుగు అయిపోవస్తుంది. మా బాబుని స్కూలు నుండి తీసుకురావాలి. మీరూ వస్తారా?” అని అడిగింది అమ్మగారిని.
“అయ్యయ్యో! మాటల్లో టైమే మర్చిపోయాం! ఈ స్టుపిడ్ ముత్తి లేట్ చేసింది. సాయంత్రం మావారి కజిన్ ఇంట్లో ఫంక్షన్ ఉంది. మావారు 5గంటలలోపే వస్తానన్నారు. నన్ను రెడీగా ఉండమన్నారు. స్నానం చెయ్యాలి. రెడీ కావాలి. టైం లేదు” అంటూ, ఓసారీ ఫేస్‌కట్ వెలిగించేసి..
“ముత్తీ! ఓ ముత్తీ! నాలుగై పోయింది. ఈరోజు మున్నిని తీసుకురావడానికి నేను రావటం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్లి తీసుకురా! స్కూలు ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. పిల్లల్ని వదిలిపెట్టి ఉంటారు. వెంటనే పో! పరుగెత్తూ.. ఎవరూ కనిపించకపోతే మున్ని ఒక్కతే ఏడుస్తూ రోడ్డు దాటి వచ్చేస్తుంది. చిన్నపిల్ల. బస్సులు, కార్లు, ఆటోలు, స్కూటర్లు.. దానికి రోడ్డు దాటడం తెలియదు. త్వరగా పరుగెత్తూ.. వెళ్లూ!” అంటూ అరిచి, పొరిగింటి అమ్మ గారివైపు చూస్తూ..“మా మున్ని చిన్నపిల్ల కదండీ” అంటూ..“ముత్తీ! పోపో! త్వరగా పరుగెత్తూ” అని కేకలేసింది.
“మీ మున్నికి ఎన్నేళ్లండీ?”.“ఐదేళ్లు పూర్తయి అరులోకి వెళ్తుంది.. ఈ వచ్చే దీపావళికి”‘ముత్తికి పదేళ్లాగా!?’ అని మనసులో అనుకుంటూ.. పొరిగింటి అమ్మగారు వెళ్లిపోయింది.“ముత్తీ! ఇంకా రూంలో ఏంచేస్తున్నావే?! స్టుపిడ్. అర్జంటుగా వెళ్లుమని చెప్పలేదూ?! పో” అంటూ అరిచి కోపంగా అటువైపు వచ్చి చూసి..“వచ్చినాక ఆ కూడు తిను. వెంటనే పో. పిల్లలు వచ్చేస్తున్నారు”తినే ఆ చద్ది అన్నాన్ని అక్కడే వదిలేసి, వడివడిగా స్కూలువైపు పరుగులు తీసింది.. ఉదయం నుంచీ కడుపు మాడ్చుకొని ఉన్న ముత్తి. రోడ్డుకు అవతలి వైపూ, ఇవతలి వైపూ స్కూలు యూనిఫాంలో పిల్లలు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ముత్తికి ఆ పిల్లలందర్నీ చూస్తుంటే ముచ్చటేసింది. తనకూ అమ్మానాన్న ఉంటే, తనూ చదువుకుంటే, ఇలాగే ఉండేదాన్నా?! అని అనిపించింది. అంతమంది పిల్లల్లో మున్ని ఎక్కడుందో గుర్తించడం కష్టంగా ఉన్నా.. ఎలాగో ఓలాగా గుర్తించేసరికి ముత్తిని మున్ని ముందే గుర్తించి..“ముత్తీ” అంటూ ముందుకు పరుగు తీయసాగింది.
మున్నికి ముత్తి మాత్రమే కన్పిస్తున్నట్లు ఉన్నది. స్కూలు సెక్యూరిటీ గార్డు ఎంత వారిస్తున్నా, మున్ని పట్టించుకోలేదు. ముత్తినే చూస్తూ రోడ్డు మధ్యలోకి దూసుకువచ్చింది మున్ని.అప్పుడే రోడ్డుపైన కారూ, బస్సు దూసుకు వస్తున్నాయి. వాటిని చూసిన ముత్తి అరుస్తూ..
“మున్నమ్మా! మున్నమ్మా!! అక్కడే ఉండూ అక్కడే ఉండూ! రోడ్డు దాటొద్దు దాటొద్దు. రావొద్దు.. నేనే వస్తున్నా వస్తున్నా” అంటూ ముందుకు పరుగు తీసింది ముత్తి.అలా ముత్తి కూడా రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. అటువైపు మున్ని కూడా ముత్తివైపు పరుగుతీస్తున్నది. బస్సు డ్రైవర్, కారు డ్రైవర్ ఇద్దరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. వెనక, పక్కన వస్తున్న ఆటోవాళ్లు, స్కూటర్లపై వెళ్తున్నవాళ్లూ.. ‘ఆఁ, ఆఁ’ అంటూ హాహాకారాలు చేస్తూ, పెద్దగా అరవసాగారు. రోడ్డు అవతల వైపు జనం, ఇవతలి వైపు జనం “అయ్యాయ్యో” అంటూ బిగ్గరగా కేకలు వేయసాగారు.ముత్తికి అవేమీ వినిపించడం లేదు.. ఆమె కళ్లల్లో మున్ని మాత్రమే ఉంది.“మున్నమ్మా!” అంటూ కేక వేస్తూ ముందుకు ఉరికింది ముత్తి. అంతే! అంతా చీకటి.
‘కయ్యి’ మంటూ రోడ్డు మీద పెద్ద శబ్దం అయ్యింది. ఎవరో సడన్ బ్రేకులు వేసినట్లున్నారు.ఆ శబ్దంతో ముత్తి ఆలోచనలకు అంతరాయం కలిగింది. అప్రయత్నంగానే రోడ్డు వైపు చూసింది ముత్తి. ఎవరో స్కూలు పిల్లాడికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. ముత్తి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన కాళ్ల వైపు చూసుకుంది. ఇప్పుడు తనకు రెండు కాళ్లు లేవు. ఆనాడు మున్నీని రక్షించి.. తన కాళ్లు పోగొట్టుకుంది ముత్తి. ముత్తి ఆప్యాయంగా తన రెండు కాళ్లను తడిమి చూసుకుంది. కళ్లలోని నీళ్లు తుడుచుకుంది. బడిలోంచి పిల్లలు బిలబిల మంటూ కేరింతలు కొడుతూ, ఆహ్లాదకరంగా అరుస్తూ, బయటికి పరుగులు తీస్తున్నారు. ప్రఫుల్ల వదనాలతో కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నారు. ఒకరి చెయ్యిఒకరు పట్టుకొని, ఒకరి వెనక ఒకరు పరుగులు తీస్తున్నారు.
“బాయ్! బాయ్! టాటా!” అంటూ చెప్పుకొంటున్నారు. రోడ్డు దగ్గరికి వచ్చి, రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ముత్తి అప్రయత్నంగానే అలవాటుగా బిగ్గరగా అన్నది..“బాబులు.. పాపలూ! రోడ్డు దాటొద్దు. టక్కర్లు, ప్రమాదాలు జరుగుతాయి. ఆ పోలీసు అంకుల్ పొమ్మన్నప్పుడే రోడ్డు దాటండి. మధ్యలో రోడ్డు మీదికి ఉరకొద్దు జాగర్త! కాళ్లు పోతాయి. చేతులు విరుగుతాయి. చచ్చిపోతారు”“ఆగండీ! ఆగండీ! బస్సులు, కార్లు, ఆటోలు, లారీలు, మోటారు సైకిల్లు రానప్పుడే రోడ్డు దాటాలి” అంటూ బడి పిల్లలను నిత్యం గట్టిగా హెచ్చరిస్తోంది ముత్తి.
తన ముందున్న అల్యూమినియం గిన్నెలోంచి ‘టంగ్’ అనే శబ్దం వినిపించేసరికి ప్లేటు వైపు చూసుకుంది. ఎదురుగా ఒక అమ్మగారు, తన చిన్ని కూతురు చెయ్యి పట్టుకొని నిలబడి ఉన్నది. ముత్తి చిన్నగా చిరునవ్వు చిందిస్తూ, అమ్మగారి వైపూ, పాప వైపూ చూసింది. తిరిగి తన ప్లేటులోకి చూసింది. ఐదు రూపాయల బిల్ల కనిపించింది. పాపవైపు చూసింది ముత్తి. ఆమె కిలకిలా నవ్వుతోంది. అమ్మగారు మందహాసం చేస్తున్నది. ముత్తి అప్రయత్నంగానే, విప్పారిన మెరిసే కళ్లతో..“టాంకుసు అమ్మగారూ” అన్నది.“నీ పేరేమిటి?” అడిగింది అమ్మగారు.“కుంటిది”.. పాప అమాయకంగా నవ్వుతూనే అన్నది.ఆ అమ్మగారు పాప వైపుచూసి..“తప్పమ్మా! అలా అనకూడదు.. పాపం కదూ! అలా అనొచ్చా? సారీ చెప్పు” అన్నది.
“సారీ మమ్మీ!” అన్నది పాప.“నాక్కాదు.. ఆ అమ్మాయికి చెప్పు! సారీ”“సారీ!” చెప్పింది పాప.
ముత్తి నవ్వింది.
“నీ పేరేంటి?” అమ్మగారు మళ్లీ అడిగింది.“ముత్యాలు అమ్మగారు. కానీ, అందరూ ‘ముత్తీ’ అనీ, ‘కుంటి ముత్తీ’ అనీ, ‘కుంటిదీ’ అనీ పిలుస్తారు” అంటూ సంతోషంగా చెప్పింది.“నీకు ఇంగ్లీషు కూడా వచ్చా?!” అమ్మగారు కొంటెగా అడిగింది.ముత్యాలు అదో మాదిరిగా, సిగ్గుతో ఏం చెప్పాలో తెలియక తల వంచుకొని.. ముసిముసిగా నవ్వుతూ, వం కర్లు పోసాగింది.అమ్మగారు రోడ్డు దాటబోతూ, గోడపై అంటించి ఉన్న పాత పోస్టర్వైపు చూసింది.దానిపై ఒక దివ్యాంగురాలైన అమ్మాయి బొమ్మ ఉంది. దాని కింద..‘చిన్న పిల్లలతో పనిచేయించడం నేరం.చిన్న పిల్లలను బడిలో చేర్పించండి.అంతర్జాతీయ బాల వికలాంగుల హక్కుల దినం’ అని రాసి ఉంది.అమ్మగారు ముత్తి వైపు మరోసారి చూసి ముందుకు కదలి వెళ్లి పోయింది.ఇంటికి వెళ్లే పిల్లలవైపు ఆశగా చూస్తూ..“రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త పాపలూ!” అంటూ తను నిత్యం చేసే హెచ్చరికలు చెబుతూనే.. నిస్వార్థంగా తన పరోపకార కర్తవ్యం నెరవేరుస్తూనే ఉంది ముత్యాలు.
“బాబులు.. పాపలూ! రోడ్డు దాటొద్దు. టక్కర్లు,ప్రమాదాలు జరుగుతాయి.ఆ పోలీసు అంకుల్పొమ్మన్నప్పుడే రోడ్డు దాటండి. మధ్యలో రోడ్డు మీదికి ఉరకొద్దు జాగర్త! కాళ్లు పోతాయి.చేతులు విరుగుతాయి.చచ్చిపోతారు”“ఆగండీ! ఆగండీ!బస్సులు, కార్లు, ఆటోలు,లారీలు, మోటారు సైకిల్లు
రానప్పుడే రోడ్డు దాటాలి” అంటూ బడి పిల్లలను నిత్యం గట్టిగా హెచ్చరిస్తోంది ముత్తి.
అత్రిపత్రి ధర్మశాంత్ ప్రభాకర రావు
సామాజిక పరిస్థితులకు స్పందించి కథలు రాస్తుంటారు రచయిత అత్రిపత్రి ధర్మశాంత్ ప్రభాకర రావు. ఈయన తల్లిదండ్రులు అత్రిపత్రి శాంతమ్మ-ధర్మయ్య. పుట్టి పెరిగింది ముల్కనూర్. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం సాగింది. బీటెక్, ఎంబీఏ, ఎంఐఈ, పీజీడీసీఎస్ చదివారు. మెకాన్ ఇంజినీరింగ్ సంస్థలో జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. తల్లి శాంతమ్మ ప్రేరణతోనే కథలు రాయడం మొదలుపెట్టారు. ఈయన రాసిన కొన్ని కథలు నమస్తే తెలంగాణతోపాటు నవ తెలంగాణలో ప్రచురితం అయ్యాయి. నమస్తే తెలంగాణ-ముల్కనూర్ సాహితీ పీఠం కథల పోటీలో బహుమతి రావడం ఇది రెండో సారి. ప్రస్తుతం ‘మూడవ కన్ను’ అనే పరిశోధన గ్రంథం రాస్తున్నారు.
నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-అత్రిపత్రి ధర్మశాంత్ ప్రభాకర రావు
94918 75179