చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ :
తలగడదీవి యువరాణులు నారాంబ, పేరాంబ.. కాకతీయ సైన్యంతో కలిసి బందీలుగా రాజధానికి వెళ్తున్నారు. అయితే, ఎవరికీ తెలియకుండానే పల్లకిలోకి ఎక్కాడు ద్వీపరాజ్యపు యువరాజు.. పదేండ్ల జాయప. ఏమాత్రం భయం, బెరుకు లేకుండా కాకతీయుల చతురంగ బలగాల మధ్య తిరుగాడాడు. ఏనుగులు, గుర్రాల చెవుల్లో ముచ్చట్లు చెబుతూ.. సైనిక పరివారాన్నంతా సందడిగా మార్చాడు. బేతవోలు వద్ద దళపతి సుబుద్ధితో కలిసి భోజనం చేశాడు. ‘బాబయ గారూ!’ అని పిలుస్తూ.. సుబుద్ధితో మాటల్లో మునిగిపోయాడు చిన్నారి జాయప.
తనకు ఇద్దరు అక్కలు కాకుండా అన్న పృథ్వీశ్వరుడు, తమ్ముడు నారమ నాయకుడు ఉన్నాడని చెప్పాడు జాయప. పెదనాన్న చోడయ నాయకుడు అనీ, భీమయ నాయకుడు, బ్రహ్మయ నాయకుడు ఇద్దరు చిన్నాన్నలు ఉన్నారని చెబుతూ.. అందరికీ తనంటే ఇష్టమేననీ, పెదనాన్న తనను వీపుపై కూర్చోబెట్టుకుని కృష్ణా జలాలలోనే కాదు.. సముద్ర కెరటాల్లో కూడా ఈత కొడతారని.. ఇలా తింటూ ఆపకుండా కబుర్లు చెప్పాడు జాయప. సుబుద్ధి ఆప్యాయత వల్ల కడుపునిండా తిన్నాడు. జాయప మూతిని తన ఉత్తరీయంతో తుడిచి, అతని చెయ్యిపట్టుకొని పటాలంవైపు వస్తూ అన్నాడు సుబుద్ధి..
“మీరు గొప్ప యోధులు అవుతారు యువరాజా! అసలు మన పటాలంలోని ఏనుగులూ, గుర్రాలన్నీ మీవంకే చూస్తున్నాయి. దేవదత్తమైన శక్తి ఏదో మీలో ఉంది. ముఖ్యంగా మీ శరీరాకృతి.. ఇంత అద్భుతమైన శరీరాకృతి తక్కువమంది మగవాళ్లకు ఉంటుంది. ఇలాంటి శరీరం తన కొడుక్కి ఉండాలని ప్రతి మహారాజు దేవుళ్లకు మొక్కుకుంటాడు. మీరు కాకతీయ రాజ్యానికి గర్వకారణం కాబోతున్నారని నా అంచనా. అమ్మా! కాకతిదేవీ.. ఈ బాలుణ్ని ఆశీర్వదించమ్మా!”..
జాయపకు చెబుతున్నాడో.. తనలో తానే చెప్పుకొంటున్నాడో తెలియని సుబుద్ధి, తన దగ్గరికి కొందరు యువతులు రావడం కూడా గమనించలేదు. ఆ వచ్చినవారు ద్వీప పరిచారికలు. వెతికి వెతికి అలసిపోయారు. పరుగున వచ్చి జాయపను పట్టుకున్నారు.
“ఇక్కడున్నారా యువరాజా! మీకోసం అక్కడ అక్కలు తల్లడిల్లిపోతున్నారు. పదండి!” అంటూ లాక్కుపోయారు. తనకు ఆత్మీయంగా చెయ్యి ఊపుతూ.. నవ్వుతూ వెళ్తున్న జాయపకు చెయ్యి ఊపుతూ నిండు మనసుతో ఆశీర్వదించాడు సుబుద్ధి.
భోజన కార్యక్రమం పూర్తయ్యాక సైనిక పటాలం బాట చాగి రాజ్యప్రాంతం దాటి.. నతవాడి రాజ్యం వైపు కదిలింది.
మరో అరగంట తర్వాత ఈసారి ఎడ్లబండ్లు, రథాల మధ్య ఆడుతూ, ఎగురుతూ కనిపించాడు జాయప.
రాత్రి బస నతవాడి రాజ్యంలోని మంధేరపురానికి ముందు దట్టమైన అడవిలో. గణపతిదేవుడికి నతవాడి పరిపాలకుడు స్వయంగా బావమరిది. ఆయన సోదరి మైలాంబ నతవాడి రాజైన మల్లరుద్రుని భార్య. గణపతిదేవుని అద్భుత విజయం నతవాడి రుద్రునికి మహదానందం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ఆయన కాకతి సైనిక పటాలానికి గొప్ప విందు ఏర్పాటు చేశాడు. రుద్రుడు ఇచ్చిన విందు సంబురాలు కాకతీయ సైన్యం తమ జీవితకాలంలో మరచిపోలేదు.
ఆ విందులో సైనిక పటాలాలతోపాటు వచ్చిన భోగపుసానులు, కళాకారులే కాదు.. నతవాడి భోగపు సానులు, కళాకారులు కూడా పాల్గొన్నారు. పటాలం ఉన్న అడవిమార్గంలో పదిచోట్ల నిర్వహించిన ఆ వేడుకల్లో ఒకచోట జరిగిన నాట్యకలాపాలు అత్యద్భుతమని మిగతా విందు ప్రదేశాలవారు కూడా చర్చించుకున్నారు. అందుకు కారణం.. అక్కడ నర్తించిన గొప్ప భోగపు నర్తకీమణులు కాదు.. ఓ చిన్నారి. ఓడిన ద్వీపరాజ్యపు యువరాజు.. పదేండ్ల జాయప.
‘ఎక్కడ నేర్చుకున్నావీ నాట్యకౌశలం?’ అనాలని అనుకుంది. అనలేదు. కారణం.. ఆ బాలుడి ముఖంలో, చూపులో నటన ప్రదర్శించిన ఆనందం లేదు. నటనే తానుగా జీవించిన తాదాత్మ్యం ఉంది. ఏదేదో చెప్పాలనుకుంది. చెప్పలేక పోయింది. ఏవేవో పొగడాలనుకుంది. పొగడలేక పోయింది. కారణం.. ఆ చిన్నారి కళను పొగిడే మాటలు తనవద్ద లేవు. అతనికి విశ్లేషించి చెప్పగల అంశాలేవీ తనవద్ద లేవు. వయసు రీత్యా చిన్నవాడు. నమస్కరించలేదు. ఎలా??
భోజనశాల వద్ద రంగస్థలం కూడా ఏర్పాటు చేశారు. రంగస్థలమంటే పెద్ద రంగమండపం కాదు. నిర్ణయించిన చోట ఒక వేదికను ఉంచి, చుట్టూ పల్లంగా గోతులు తవ్వుతారు. ప్రేక్షకులు ఆ పల్లంలో కూర్చుంటే వేదిక ఎత్తుగా, అందరికీ కనిపిస్తూ కనువిందు చేస్తుంది. ఇక భోగపుసానుల బృంద నాట్యాలు మొదలయ్యాయి. కొందరు ముందు భోజనాలు కానిచ్చి వచ్చి.. వేదిక వద్ద కూర్చున్నారు. వారిలో పరివారంతోపాటు అక్కలు నారాంబ, పేరాంబతో చిన్నారి జాయప కూడా ఉన్నాడు. ఆ వేదిక.. ఆ నాట్యకత్తెలు.. ఆ రంగురంగుల దుస్తులు.. ఆ విచిత్ర వేషధారణలు.. వారి వింతవింత కదలికలు.. వారి నటనా వైదుష్యం.. ఆ తుళ్లింతలు, సంభాషణలు, నాటకీయ నవ్వులు, క్రోధం, దుఃఖం.. నవరస భావనలు.. ఒక్కొక్కరే కాదు.. ఒకేసారి అందరూ ఒక్కలాగే.. ఆ నాట్య విన్యాసాలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి. అవన్నీ చూస్తున్న జాయపలో ఏదేదో అయిపోతున్నది.
తమ అంతఃపురంలో చూసినవే అప్పట్లో అబ్బో అనిపించేవి. కానీ ఇక్కడ.. ఈ బహిరంగ వేదికపై ఈ ఆరుబయట రంగస్థలంపై ఈ నటులు, ఈ వాద్యకారులు, ఈ గాయకులు, ఈ సంబురం అతనిలో కొత్త లోకాలకు మంత్ర కవాటాలను తెరచి.. మరెన్నో కళల ప్రపంచాలను పరిచయం చేస్తున్నాయి.
ఉద్వేగంతో.. లోలోన రగులుతున్న కళల ఉన్మత్త ప్రకంపనాలకు స్పందిస్తూ పూనకం పట్టినవాడిలా ఊగి, కదలిపోయిన జాయప.. ఒక్క ఉదుటన వేదిక ఎక్కేశాడు. కాలు కదిపాడు వారితో. ఆ నాట్యకత్తెలతో ఆ నటరాజే పూనినట్లు విహ్వలంగా.. చూడ్డానికి రెండుకళ్లూ చాలవన్నట్లు నర్తిస్తున్నాడు. ఆడపిల్ల కంటే అందంగా, ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నంత సుకుమారంగా.. ముఖానికి ఎలాంటి రంగులు లేకుండానే సహజ సిద్ధమైన భావప్రకటనలతో నర్తిస్తున్న అ చిన్నారిని.. తమ నాట్యాన్నంతా మరిచి చూస్తున్నారు నర్తకీమణులు కూడా. ఇక వాద్యగాళ్లు, గాయకులూ అయితే నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు.
ఎక్కడిదీ కళాప్రదర్శన? ఎవరు నేర్పారీ నటవైదుష్యం? ఎలా పట్టుబడిందీ ఈ కళాకౌశలం? ఈ చిన్నారి సాధారణ బుడుతడు కాదు.. నాట్య బుడుతడు. అభినవ భరతుడు!!
ఇది అందరిలోనూ.. సామాన్యుల్లోనూ, కళాకారుల్లోనూ ఏకకాలంలో మెరిసిన హృదయ స్పందన!
ఒక ప్రదర్శన పూర్తయినట్లు తెర వేశారు. వెంటనే జాయపను ఎవరో చేయిపట్టి లోపలికి లాక్కొని పోయారు.
ఆమె నీలాంబిక! కాకతీయ రాజ్య ఆస్థాన నర్తకీమణి.
అతని భుజాలుపట్టి గడ్డం పైకెత్తి అతని ముఖంలోకి విభ్రాంతిగా చూస్తున్నది. అలసిన ముఖంలో, రొప్పు వల్ల కలిగిన శరీర కంపనతో జాయప గంతులేసి, అలసిన లేగదూడలా చూస్తున్నాడు. అతని ప్రతిభ కలిగించిన విభ్రమతో ఆమె నిరుత్తర అయ్యింది.
‘ఎక్కడ నేర్చుకున్నావీ నాట్యకౌశలం?’ అనాలని అనుకుంది. అనలేదు. కారణం.. ఆ బాలుడి ముఖంలో, చూపులో నటన ప్రదర్శించిన ఆనందం లేదు. నటనే తానుగా జీవించిన తాదాత్మ్యం ఉంది. ఏదేదో చెప్పాలనుకుంది. చెప్పలేక పోయింది. ఏవేవో పొగడాలనుకుంది. పొగడలేక పోయింది. కారణం.. ఆ చిన్నారి కళను పొగిడే మాటలు తనవద్ద లేవు. అతనికి విశ్లేషించి చెప్పగల అంశాలేవీ తనవద్ద లేవు. వయసు రీత్యా చిన్నవాడు. నమస్కరించలేదు. ఎలా??
ఓ మంచి కళా ప్రదర్శన తిలకించినప్పటి ఓ కళా కారిణి సంభ్రమం అది.
మౌనంగా ప్రసరిస్తున్న ఆమె భావజాలం తనకు సోకుతున్నదన్నట్లు.. చిరునవ్వు నవ్వాడు జాయప. తేలికపడ్డ హృదయంతో తనూ నవ్వింది నీలాంబ. అది ఇద్దరు మంచి కళాకారుల మధ్య ప్రవహించే కళా రసస్రవంతి.
లోపలికి చొచ్చుకువచ్చిన ద్వీప పరిచారికలు మళ్లీ జాయపను గుర్తించి పట్టుకున్నారు.
“పద వెళదాం యువరాజా! ఇప్పటికే అలసిపోయారు. భోజనాదులు కాలేదు. అక్కలు మీకోసం వెతుకుతున్నారు. పదండి పదండి!”.
వెనుదిరిగిన జాయప ఆమెను ఉద్దేశించి..
“పెద్దక్కా.. మీరు మహానర్తకి తెల్సా?!” అన్నాడు.
ఆమె పులకాంకిత అయింది. మురిసి ముక్కలయింది. తనకు లభించిన గొప్ప అభినందనగా ఆమె మనసు నాట్యసరస్సులో ఈదులాడింది. వెళుతున్న జాయపను చూస్తూ అనుకుంది.
‘అబ్బ.. ఆ నటరాజు ఈ పిల్లవానికి ఎంత అద్భుతమైన శరీరాకృతిని ఇచ్చాడు. ముఖ్యంగా ఆ నడుము.. సింహమధ్య అంటే ఇదే! ఎన్ని నాట్యాలు.. ఎంత కళాకౌశలం ప్రదర్శించగలడో!? ముందుముందు!’.
పేరమ, నారమ తమ్ముడికి దిష్టి తగులుతుందని వాపోతున్నారు. జలధీశ్వరుడికి మొక్కుకున్నారు. పరిచారికల మధ్య ఎవ్వరికీ కనిపించకుండా భోజనశాలకు తీసుకెళ్లారు. ఏదో భోజనం చేశారు. తిరిగి వేదిక వైపు వెళ్లకుండా పల్లకి వైపు వడివడిగా కదలబోయారు. అయితే వారు ఊహించకుండా అక్కడే వేదిక దిగువనే ఒక బృందం దండరాసకం మొదలుపెట్టింది.
“శివ శివ శివోయన్న.. నీ నోరే పండును గదరా.. ఆహో!”..
పాటతో రెండుకర్రల లయబద్ధ తాళపు శబ్దం. ఆడుతున్న కళాకారుల గజ్జెల సవ్వడి. ఘడియ ఘడియకూ వెర్రెత్తిస్తున్నాయి జాయపను. చూశాడు.. రెండు ఘడియలు.. మూడు.. నాలుగు ఘడియలు.. అక్కల ఒడిలో కూర్చుని.. అక్కల పక్కన కూర్చుని.. అక్కల పక్కన నిలబడి చూశాడు. తటాలున కదిలి.. పరుగునవెళ్లి ఆ బృందంలో దూరాడు. కర్రలు లేకుండా లయబద్ధంగా వారితో ఆడసాగాడు. తమ్ముడు దండరాసక బృందంలో కనిపించగానే తత్తరపడి పక్కకు చూశారు అక్కలు. ఏం లాభం.. చేయగలిగిందేమీ లేదు.
తమ్ముడి కళాకౌశలం వీక్షించడం తప్ప. మరికాసేపటికి ఎవరో రెండు కర్రలిచ్చారు జాయపకు. ఇక చూడాలి అతని క్రీడా కళాసమ్మిళిత కౌశలం. అందరినీ ముగ్ధుల్ని చేస్తున్నది. చిన్నవాడైనా పెద్దలతో సమానంగా ఎగిరెగిరి కర్ర తగిలిస్తున్నాడు. అక్కలు కూడా ముక్కున వేలేసుకున్నారు. జాయపతో వాళ్లు రోజూ ఆడతారు కానీ.. ఇవాళ మరీ ఇంతగా విజృంభించడం అంటే.. పోటీ ఉన్నప్పుడు, సరిజోడైన కళాకారులు ఉన్నప్పుడు అతనిలోని భగవద్దత్తమైన కళ మరింత ప్రకాశిస్తుందన్న మాట. అలా ఇద్దరూ సమాధాన పరచుకుని తిరిగి దండరాసక క్రీడ వైపు చూస్తే మళ్లా అదృశ్యం.
వెదుకులాట.. మళ్లీ మొదలు.
(సశేషం)