మన నస్రుద్దిన్ ఓపారి ఏదో పనివడి అడివి అవుతలున్న ఊరికి వోయిండు. ఆ ఊరికి పోవుడు.. ఆ పేరు ఇనుడు అదే తొలుత! అక్కడ మనోనికి ఎవలు ఎర్కలేదు. ఏం జెయ్యాలెనో సుత తొయ్యలేదు. ఎట్లయితే అట్లయిందని ఊరు మొదట్లనే కానచ్చిన దుకాణంలకు వోయిండు. అది ఒక వడ్లాయినెది. దుకాండ్లకు సొచ్చుకచ్చిన నస్రుద్దిన్ను సూశి, గిరాకి అచ్చిందనుకొని.. “సలాం” అంట అన్నడు. మనోడు గుడ.. “వాలెకుం అస్సలాం!” అంట జెప్పి.. “నేను మీ దుకాణ్లకు అచ్చేటప్పుడు నన్ను సూశినవా!?” అంట అడిగిండు.
అయినె గిట్లెందుకు అడుగుతుండో అర్థం గాకున్న.. “అవు! సూశిన!” అంట అన్నడు. “అట్లనా!? నన్ను ఇంతకు ముందెప్పుడన్న నీ దుకాణంల, మీ ఊర్ల సూశినవా!?” మల్ల అడిగిండు నస్రుద్దిన్. “లేదు.. ఎన్నడు సూడలేదు!” అంట మల్లన్నడు దుకాణపాయినె. “అట్లనా! మరి అట్లయితే అది నేనేనని నీకెట్ల ఎరుక?” అంట మల్లడిగిండు మనోడు. గా మాటలిని.. ‘ఈనెవర్రా నాయినా!?’ అంట ఏం జెప్పాల్నో దెల్వక.. తల్కాయమీది జుట్టంత పీక్కున్నడు దుకాణపాయినె. మీకు ఎర్కయిందా!?
– పత్తిపాక మోహన్