జరిగిన కథ : ఒక చిన్న అపోహ కారణంగా భోజమహారాజు తన భార్యను, కాళిదాసును దూరం చేసుకున్నాడు. తప్పు తెలుసుకుని వారిని వెతుక్కుంటూ దేశాల వెంట తిరగసాగాడు. అదే సమయంలో కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులు భోజరాజు వద్ద కొలువు సంపాదించడం కోసం ధారానగరానికి వస్తున్నారు. వారందరి మధ్య జరుగుతున్న విచిత్ర మజిలీలకే.. ‘సప్తమిత్ర చరిత్ర’ అని పేరు.
భోజ కాళిదాసులు ధారానగరానికి బయల్దేరారు. భోజునికి తన భార్య ఇంకా దొరకలేదు. మరోపక్క ఆమెను చూపిస్తానని తనతోపాటు వచ్చిన ఘోటకముఖుడు ఏమయ్యాడో కూడా తెలియదు. భైరవుడు ఆరోజు భోజుణ్ని మేకగా మార్చిన తరువాత.. అంతకుముందు తన జన్మనంతా మరిచిపోయాడు. వాడు ఆడించినట్లల్లా ఆడాడు. ఏకశిలానగరంలో అల్లాణభూపతి వద్దనున్న కాళిదాసును కలుసుకోవడంతో.. భోజరాజుకు శాపవిమోచనం కలిగినట్లయింది. కాళిదాసును వెంటబెట్టుకుని ఆయన ధారానగరానికి వస్తున్నాడు.
అటువైపున ధారానగరంలో.. యక్షునివల్ల శాపం పొంది ఆడపిల్లగా మారిపోయిన దత్తకుడు, భోజరాజు కూతురైన రుక్మిణి వద్ద చారుమతి అనే పేరుతో సేవకురాలిగా ఏడాదికాలం గడిపాడు. ఆ సమయంలోనే భోజరాజు కుమారుడైన చిత్రసేనుడు ఆమెపై విపరీతమైన మోహం పెంచుకున్నాడు. శాపం తీరి మళ్లీ మగవాడిగా మారిన తరువాత, దత్తకుడు తన మిత్రుడైన గోణికాపుత్రునితోపాటు చిత్రసేనుడిని కలుసుకున్నాడు.
“ఎలాగైనా నీకు చారుమతిని దక్కిస్తాను” అని బూటకపు ప్రతిజ్ఞ చేశాడు.
..కానీ ఒకసారి మగవాడిగా మారిపోయిన తరువాత, చారుమతి ఎక్కడుందని వెతకాలో చిత్రసేనుడికి ఎలా తెలుస్తుంది?
ఇలా ఉండగా.. ఒకసారి ధారానగరంలో ఒక అపూర్వగాయని ప్రదర్శన ఇస్తున్నదని తెలిసి.. మిత్రులిద్దరితో కలిసి చిత్రసేనుడు వెళ్లాడు. కానీ ఆ గాయని చారుమతి కాదని తెలిసి వెనక్కు వెళ్లిపోయాడు.
మిత్రులిద్దరూ ప్రదర్శన చివరివరకు చూశారు. ఆ గాయని పేరు సువర్ణపదిక. ఆమె మరెవరో కాదు.. దత్తుడు మొదలైనవారితో కలిసి కాశీలో చదువుకున్న సువర్ణనాభుడే. మిత్రులను కలుసుకున్న ఆనందంలో సువర్ణనాభుడు వాళ్లిద్దరినీ తన భార్యకు పరిచయం చేశాడు. ఆమె ఒక యక్షిణి అని, తన అక్కాబావలపై ప్రేమతో వారిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చిందని తెలియచేశాడు.
అప్పుడు దత్తకుడు.. ‘మీ అక్కాబావలు ఉండే చోటు నాకు తెలుసు’ అంటూ, అంతకుముందు తాను చూసిన యక్షుని గుహను వర్ణించి చెప్పాడు. అక్కడికి వెళ్లడానికి కొన్ని గుర్తులు చెప్పాడు.
అంతే.. మళ్లీ ఆడపిల్లగా మారిపోయాడు. ‘మేముండే తావును ఎవరికి చెప్పినా మళ్లీ ఆడపిల్లవై పోతావు’ అంటూ, ఆనాడు యక్షుడు చెప్పిన మాట ఆ క్షణంలో దత్తకుడు మరిచిపోయాడు.
మళ్లీ గతమంతా మరిచిపోయి, ఆడపిల్లగా మారి యథాలాపంగా రుక్మిణి ఉద్యానానికి వెళ్లాడు. అక్కడ చిత్రసేనుడు కనిపించాడు. అతను తన చిరకాలవాంఛను చారుమతి ముందు వెళ్లబోసుకున్నాడు. తాను నిజానికి ఒక మగవాడిని అన్న నిజం మరిచిపోయి.. చిత్రసేనుడితో వలపులో పడింది చారుమతి.
ఆనాటి రాత్రి..
సువర్ణపదిక తన మనసులో మాట భర్తకు చెప్పింది.
“నాథా! నేను మా అక్కాబావలను చూసి మూడేళ్లు దాటుతున్నది. మీ మిత్రుడు దారి చెప్పాడు కదా.. మనమిద్దరం వెళ్లివద్దాం” అన్నది.
“నిజమే! కానీ మా దత్తకుడు కూడా వెంటవస్తే బాగుండేది” అన్నాడు సువర్ణనాభుడు.
“మరేం పరవాలేదు. వెళ్లే దారి చెప్పాడు కదా! పొద్దున్నే మనం ఉత్తమాశ్వాలను అధిరోహించి వెళ్తే సాయంత్రానికి అక్కడికి చేరుకోగలం” అని సలహా ఇచ్చింది సువర్ణపదిక.
వారనుకున్నట్లే మరునాడు దత్తకుడు చెప్పిన గుర్తుల ప్రకారం అడవిలో ప్రయాణించారు. కొంతదూరం గుట్టల్లో, రాళ్లలో ప్రయాణించిన తరువాత చిట్టచివరికి యక్షుని గుహకు చేరుకున్నారు. సువర్ణపదిక గుహద్వారం ఎదుట నిలబడి.. ‘అక్కా!’ అని యక్షభాషలో పిలిచింది. మరునిమిషంలో లోపలినుంచి రత్నపదిక పరుగున వచ్చింది. చెల్లెలిని కౌగిలించుకుంది. భర్తతోపాటుగా ఆమెను లోపలికి తీసుకుపోయింది.
సువర్ణనాభుడు గుహలోని విశేషాలు చూడటంలో మునిగిపోయాడు.
“ఇక్కడికి ఎలా రాగలిగావే?” అడిగింది రత్నపదిక.
“అక్కా! నువ్వు, బావ లేని కుబేరుని కొలువులో నేను ఉండలేకపోయాను. అందుకే భూలోకానికి వచ్చేశాను. ఇతణ్ని వరించాను. ఇతని స్నేహితుడైన దత్తకుడు అనేవాడు ఈ గుహ గుర్తులు చెప్పాడు. దాంతో ఎలాగో రాగలిగాను. ఇంతకీ బావ ఎక్కడున్నాడు?” అని ప్రశ్నించింది సువర్ణపదిక.
“కాసేపట్లో వచ్చేస్తారులే! మీరిద్దరూ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి” అంటూ రత్నపదిక లోపలి గదిలోకి తీసుకుపోయింది. సువర్ణనాభుడు అక్కడి వింతలు, విశేషాలూ చూస్తూ ఏదో మాయాలోకానికి వచ్చినట్లు విభ్రాంతి చెందసాగాడు. ఇంతలో సాయంత్రం కావచ్చింది. యక్షుడు ఆకాశమార్గంలో ఒక నెమలిని చేతపట్టుకుని తన నివాసానికి వచ్చాడు. వస్తూనే..
“ఓహో! సువర్ణపదికా! ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? పెళ్లి చేసుకుందా.. మగడిని సంపాదించిందా?” అని భార్యను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మరదలిని లాలనగా ప్రశ్నించాడు.
సువర్ణపదిక అతనికి నమస్కరించి, తమ వృత్తాంతమంతా చెప్పింది.
“అయితే నీ భర్తగారు ఎక్కడున్నారు!? నీతోపాటు తీసుకురాలేదా?” అని ప్రశ్నించాడు యక్షుడు.
“పుష్పవాటికలో ఉన్నారు. ఇప్పుడే తీసుకువస్తాను” అంటూ వెళ్లింది సువర్ణపదిక.
కొద్దిసేపటిలో భార్యాభర్తలిద్దరూ వచ్చారు. సువర్ణనాభుడు ముందుగా యక్షునికి నమస్కరించాడు.
అందుకతను వారిస్తూ..
“మీరు భూసురులు. పండిత ప్రవరులు. మీరు మాకు వందనీయులు. మేము ఆశీర్వచన పాత్రులము” అని పలికాడు.
సువర్ణనాభుడు దానికి అంగీకరించలేదు.
“భూసురులకన్నా దివిజులు ఎక్కువ వారు కాదా? మనుష్యులకు ఎప్పుడూ దేవతలు వందనీయులే!” అని యుక్తియుక్తంగా చెప్పాడు.
ఆ విషయంపై వారిమధ్య మరికొంత సంభాషణ జరిగింది. దానివల్ల సువర్ణనాభుని పాండిత్యం అంతా యక్షునికి తేటపడింది. అప్పటిదాకా అక్కతో కలిసి వేరొకచోట ఉన్న సువర్ణపదిక మళ్లీ వచ్చి..
“బావా! నువ్వు రోజూ ఎక్కడికి వెళ్లి వస్తుంటావు? ఆ నెమలిని ఎక్కడి నుంచి తెచ్చావు? అక్కడి విశేషాలేమిటి?” అని ప్రశ్నించింది.
అప్పుడు యక్షుడు ఇలా సమాధానం చెప్పాడు.
“నేను రోజూ భూమండలమంతా తిరిగి వస్తుంటాను. నేడు ఒక అరణ్యమార్గంలో వస్తుండగా.. ఒకచోట మృగాలను ఆడించే వాడొకడు తారసపడ్డాడు. వాడిదగ్గర ఉన్న ఈ నెమలి కాలికి కట్టిన తాడు ఊడిపోవడంతో చెట్టుపైకి ఎగిరి కూచుంది. దానిని పట్టుకోలేక వాడు రాళ్లు విసిరి నెమలిని చంపబోయాడు. దాంతో దీన్ని రక్షించి తీసుకుచ్చాను. ఇది పెంపుడుదో.. అడవిదో తెలియదు. దీనిని తెచ్చినవేళ మంచిది. మిమ్మల్ని కలుసుకోగలిగాను. ఇదిగో.. ఈ నెమలిని నీకు కానుకగా ఇస్తున్నాను తీసుకో!” అని
సువర్ణపదిక నెమలిని తన చేతుల్లోకి తీసుకుంది.
“ఓ నీలకంఠమా! నీకున్న పేరును బట్టి నువ్వు శంకరునితో సమానమైన దానవు. ఏదీ నీ పింఛం విప్పి తాండవం చేయి!” అని పలుకుతూ దాని మెడ నిమరసాగింది. మెడకు ఏదో తాయెత్తు ఉంటే దానిని సడలించింది. మరుక్షణంలో ఆ నెమలి ఒక సుందరిగా మారిపోయింది. ఆమెను చూసిన రత్నపదిక, సువర్ణపదిక విస్తుపోయారు.
“తల్లీ! నువ్వు ఎవరి ఇల్లాలివి? నీ పేరేమిటి? ఇటువంటి నిగూఢమైన రూపాన్ని ఎందుకు పొందావు?” అని అడిగింది రత్నపదిక. అందుకామె..
“నేను ధారానగరాన్ని పాలించే భోజరాజుగారి భార్యను. నన్ను లీలావతి అంటారు. కొన్ని కారణాంతరాల వల్ల భర్తకు దూరంగా అడవిలో బతకాల్సి వచ్చింది. ఆ సమయంలో దిక్కుతోచక మెడకు ఉరి పెట్టుకోబోతుంటే.. ఘోటకముఖుడు అనే విద్వాంసుడు నన్ను రక్షించాడు. అతనితో కలిసి అడవిలో వెళ్తుండగా ఒక మాంత్రికుడు నన్నిలా నెమలిలా మార్చివేశాడు. ఆ తరువాత నా ముందు జన్మ నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడే గుర్తువచ్చింది” అని చెప్పింది.
ఆ వృత్తాంతమంతా విని యక్షుడు గుండెలపై చేయి వేసుకున్నాడు.
“ఔరా! క్రూరాత్మా! నీ దగ్గరున్న మృగాలన్నీ ఇటువంటివే కాబోలు. నిన్ను వెతికి పట్టుకుని, తగిన బుద్ధి చెప్పకపోతే నేను యక్షజాతిలో పుట్టినవాడినే కాదు. చూడు!” అని ప్రతిజ్ఞ చేశాడు.
లీలావతి వైపు తిరిగి..
“తల్లీ! మహానుభావుడైన కాళిదాసును పాలిస్తున్న భోజభూపతి ఇల్లాలివా? నీ రాకతో మా ఇల్లు పావనం అయింది. నీ పాదధూళి సోకిన చోట్లన్నీ పవిత్రాలే. అమ్మా! నీకొచ్చిన భయమేమీ లేదు. నిన్ను ప్రాణసమానంగా చూసుకుంటాం. నీ భర్తతో కూర్చుతాం” అని ఊరడించాడు. అప్పుడు సువర్ణనాభుడు..
“అమ్మా! మీకు సహాయం చేసిన ఘోటకముఖుడు ఏమయ్యాడో తెలుసా? అతను నా మిత్రుడు” అని
అడిగాడు.
“తెలియదు. అతణ్ని కుక్కలు తరుముకుపోయాయి. దాంతో మేమిద్దరం వేరుపడిపోయాం. నెమలిని అయిపోయిన తరువాత నాకు పూర్వస్మృతి లేదు” అని సువర్ణనాభునితో చెప్పింది. రత్నపదికవైపు తిరిగి..
“మా కాళిదాసుగారు మీకు తెలిసినట్లు మాట్లాడుతున్నారు. వారితో మీకు పరిచయం ఎక్కడ కలిగింది? మీ వృత్తాంతం చెప్పి ఆనందింప చేయండి” అని కోరింది.
అప్పుడు రత్నపదిక..
“మా భార్యాభర్తలిద్దరం కుబేరుని శాపం వల్ల ఏడాదికాలంపాటు వేరుపడి ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన నాకు ఒక మేఘం ద్వారా కొన్ని సందేశాలు పంపాడు. ఆ సందేశాలు కాళిదాసుగారికి ఎలా తెలిశాయో కానీ, ఆయన వాటినే మేఘసందేశం అనేపేరుతో కావ్యంగా రచించాడు. మేము ప్రతిరోజూ ఆ కావ్యాన్ని చదువుకుని ఆనందిస్తుంటాం” అని చెప్పింది.
లీలావతి అప్పుడు యక్ష స్త్రీలిద్దరినీ కౌగిలించుకుని..
“మీరు దేవతలు. మీ దర్శనము చేసిన మనుష్యులు కృతార్థులవుతారు. నేను ధన్యురాలిని” అని పొగుడుతూ..
“భోజుని వృత్తాంతం మీకేమైనా తెలిసిందా?” అని అడిగింది.
“నేను విచారించి తెలుసుకుంటాను. అమ్మా! మీకోసం చక్కని విందు సిద్ధంగా ఉంది” అని లోనికి దారితీశాడు యక్షుడు.
వడ్డన చేస్తూ మధ్యలో..
“మనోహరా! మనం నివసించే ఈ కందరము మనుష్యులెవ్వరికీ తెలియదని చెప్పారు కదా! కానీ ధారానగరంలో వీరి మిత్రుడెవరో దారి చెప్పాడని మా చెల్లెలు చెప్పింది. అతనికెలా తెలిసింది?” అని ప్రశ్నించింది.
అందుకు యక్షుడు..
“ఆనాడు ఒక బ్రాహ్మణుడు మన గుహకు రాలేదా?! అప్పుడే వానిని ఆడదానిగా మారిపోమని శపించాను. పాపం బతిమాలుకోగా.. ఒక సంవత్సరకాలం ఆడదానిగా ఉండి, మళ్లీ పురుషునివి కాగలవని శాపాన్ని సవరించాను. మనం ఉన్న తావు ఎవరికైనా చెబితే మళ్లీఆడదానివి కాగలవు అని కూడా చెప్పాను” అని చెప్పుకొచ్చాడు.
అప్పుడు సువర్ణనాభుడు..
“అయ్యయ్యో! నా మిత్రుడు సంతోషాతిరేకంతో మీరున్న చోటు చెప్పి మళ్లీ ఆడదానిగా మారిపోయినట్లున్నాడు. అయ్యా! దయచేసి మీరే వాణ్ని రక్షించాలి” అని యక్షుని కోరాడు.
“తప్పకుండా!” అని అభయమిచ్చాడు యక్షుడు.
మరునాడు తంత్రజ్ఞుడైన భైరవుడు తిరుగుతున్న తావులకు వెళ్లాడు. అక్కడ ఒక చిలకను చేజిక్కించుకుని, తిరిగి తన గుహకు తీసుకువచ్చాడు.
సువర్ణపదికను పిలిచి..
“మరదలా! ఈ చిలకను కూడా ఆడదానిగా మార్చగలవా?” అని ప్రశ్నించాడు.
సువర్ణపదిక ఇదివరకులాగే చిలక మెడలోని తాయెత్తును లాగిపారేసింది. వెంటనే ఆ చిలుక ఒక నవయవ్వనవతిగా మారిపోయింది.
లీలావతి ఆమెను చేరదీసి..
“అమ్మాయీ! నువ్వెవరు? ఆ భైరవుడి చేతికి ఎలా చిక్కావు?” అని ప్రశ్నించింది. అందుకామె..
“తల్లీ! నాపేరు మల్లిక. బ్రహ్మదత్తుడనే విప్రుని కూతురిని. చారాయణుడనే పండితుని భార్యను. కాశీలో విద్యలు నేర్చిన నా మగడు ధారానగరానికి వెళ్తూ, మా ఇంట బసచేశాడు. మా తండ్రిగారు నన్ను ఆయనకిచ్చి వివాహం జరిపించారు. ఏడాదిలోపుగా వచ్చి నన్ను కాపరానికి తీసుకువెళ్తానని మాటిచ్చిన నా భర్త.. ఎంతకూ తిరిగి రాకపోయేసరికి, నన్ను వెంటబెట్టుకుని మా నాన్నగారు ధారానగరానికి బయల్దేరారు. దారిమధ్యలో ఒక క్రూరుడు అడ్డంగా నిలిచి, మమ్మల్ని అదిలించాడు. ఆ తరువాత ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు” అని చెప్పింది.
“అయ్యయ్యో! మా చారాయణుడు ఏమైపోయాడో కదా! కొంపదీసి వాడుకూడా భైరవుడి పాలబడ లేదు కదా!” అని గుండెలు బాదుకున్నాడు సువర్ణనాభుడు.
“వాడి సంగతి నేను చెప్తా!” అని హామీ ఇచ్చాడు యక్షుడు.
(వచ్చేవారం.. లీలావతి – రుక్మిణి)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ