(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ రోహ తన పరిచారికను మల్లికాగిరికి వెళ్లుమంటుంది. కుసుమ శ్రేష్ఠి తనకు విశ్రాంతి అవసరం లేదని, మల్లసుపర్వతం వద్దకు వెళ్లేందుకు తన సంసిద్ధత ప్రకటిస్తాడు. మాధవుని బోధనలు వింటున్న గుంపులో నుంచి ఒక యువకుడు.. కత్తితో అతని మీద దాడి చేయబోతాడు. తర్వాత..
“నేను ఒక క్షత్రియుణ్ని. నాది ధర్మాగ్రహం! ప్రజలందరికీ పిరికి మందు నూరిపోస్తూ.. పలాయన వాదం ప్రచారం చేస్తున్న మీ అందరి మీద నా పగ. మిమ్మల్ని అందరినీ తెగ నరికితే గానీ నా కోపం చల్లారదు” అంటూ ఖడ్గాన్ని పైకెత్తినాడు.
మరుక్షణం సాధనానంద తల రెండు వ్రయ్యలయ్యేది కానీ..
ఆ క్షత్రియ యువకుని కత్తి.. ఎత్తినది ఎత్తినట్లే గాలిలో ఆగిపోయింది, అతని చేతితో సహా.
పోటిసుడు అక్కడికి ఆ క్షణం ఎలా చేరుకున్నాడో ఎవ్వరికీ తెలవదు. ముఖ్యంగా చంద్రహత్థికి.
క్షత్రియ యువకుని చేయి పోటిసుని చేతిలో ఉంది. అతడెంత గట్టిగా పట్టుకున్నాడో.. ఆ యువకుని మొఖం చూస్తేనే తెలుస్తున్నది.
ఆ దృశ్యం చూసి ఠక్కున గుర్తుకొచ్చి పక్కన చూసుకొని ఉలిక్కిపడింది చంద్రహత్థి. తన పక్కనే కూర్చొని ఉన్న ప్రియుడు పోటిసుడు.. అక్కడ ఎట్లా ఉన్నాడో ఆమె ఊహకు అస్సలు అందడం లేదు. పైగా నడవడానికి ఇబ్బంది పడే ఈ వీరుడు.. ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం కావడం ఆమెకు నిజంగా ఒక కలలా, మాయలా ఉంది. అదే సమయంలో ఆయనకు ఏమైనా అవుతుందేమోనన్న భయం ఆమెను నిలువెల్లా కంపించేటట్లు చేసింది.
మరుక్షణం తేరుకొని మెల్లమెల్లగా దారి చేసుకుంటూ వేదిక వద్దకు వెళ్లసాగింది చంద్ర.
తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ,
అసహనంగా అన్నాడు ఆ క్షత్రియ వీరుడు..
“ఎవరు నువ్వు? నీకు ఇక్కడ ఏం పని? నన్ను ఎందుకు అడ్డుకున్నావ్? వదలకపోతే నీ కథ కూడా ఇక్కడే ముగించేస్తాను” అన్నాడు.
వెన్నెల విరిసినట్లు నవ్వినాడు పోటిసుడు.
“ఎవరి కథ ఎక్కడ, ఎట్లా ముగిసిపోతుందో తెలవదు కానీ, ఎవని ఆవేశం వాని పతనాన్ని శాసిస్తుందనేది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం!” అని పాఠం చెబుతున్నట్లు పలికి, వాని భుజం వెనుక ఉన్న బంతిగిన్నె కీలును ఆనుకొని ఉన్న నరాన్ని వొడుపుగా నొక్కినాడు.
“అమ్మా!” అంటూ చేయిపట్టు వదిలినాడు క్షత్రియుడు. అతని చేతిలో నుంచి ఖడ్గం జారిపోతుంటే.. కింద పడిపోకుండా పట్టుకున్నాడు మరో చేత్తో పోటిసుడు. బాధ తట్టుకోలేక మోకాళ్ల మీద కూలబడ్డాడు ఆ క్షత్రియుడు.
వెంటనే కత్తి మొనను అతని ఎదకు ఆనించి, విలాసంగా నవ్వినాడు పోటిసుడు.
“ఇప్పుడు చెప్పు! ఎవరి కథ ముగిసిపోతుంది?” అన్నాడు పోటిసుడు.. కళ్లు ఎగరేస్తూ.
“చూడు సోదరా! నీతో నాకు వైరం లేదు. జాతిని నిర్వీర్యం చేస్తున్న వీళ్ల శుష్కోపదేశాలను అడ్డుకోకపోతే సమస్త భారత ధాత్రి పరాయి పాలకుల హస్తగతం అవుతుంది. దయచేసి యథార్థం గ్రహించి, నా ప్రయత్నానికి అడ్డుతగలకు” అన్నాడు ఆ క్షత్రియ యువకుడు బతిమాలుతున్నట్లు.
“మిత్రమా! ఉపదేశాలు, సందేశాలు తప్పుదారి పట్టించవు. మతాలు, అభిమతాలు మనిషిని నిర్వీర్యుణ్ని చేయవు. సిద్ధాంతాలు, వ్యవస్థలు మనిషి పతనాన్ని కోరుకోవు. వాటిని అనుసరించే మనుషుల్లో చిత్తశుద్ధి లోపించి, స్వార్థం మితిమీరినప్పుడే.. అవి గతి తప్పి మానవజాతిని పెడదారులు పట్టిస్తాయి”
పోటిసుడు మాట్లాడుతుండగానే చేతుల్లో రకరకాల ఆయుధాలు ధరించిన మరో నలుగురు మనుషులు ఆ క్షత్రియ యువకునికి దన్నుగా నిలిచినారు.

వాళ్లను పరిశీలనగా చూస్తూ..
“మిత్రులారా! మీరు నలుగురే కాదు, నలభై మంది ఎదిరించినా.. అవలీలగా మట్టి కరిపించగలను నేను. కానీ, ఇది యుద్ధక్షేత్రం కాదు; శాంతి యజ్ఞం. ఇక్కడ జరుగుతున్నది జ్ఞానవితరణ. మీకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోండి; విభేదాలుంటే చర్చించుకోండి; విపరీత ధోరణి ఉంటే మాటలతో ఖండించండి. అంతేగానీ ఈ శాంతికపోతాల మీద అస్త్రాలు ఎక్కుపెట్టి, నెత్తుటి మరకలు అంటించుకొని మానవత్వాన్ని కించపరచకండి!” అన్నాడు పోటిసుడు.
అతని ధైర్యం, సాహసం, వాగ్ధోరణి అందరినీ ఆశ్చర్యపరచడంతోపాటు, అతని పట్ల ఆరాధన భావం
కలిగించినాయి.
అప్పుడు మాధవుడు ఇట్లా అన్నాడు..
“నాయనలారా! ఈ యువకిశోరం ఎంతో పరిణతతో మాట్లాడినాడు. మా మతాన్ని, అభిమతాన్ని ప్రకటించినాడు. అశోకుని వంటి మహా సమ్రాట్టుకే శాంతి మంత్రం ఉపదేశించిన దివ్య శక్తి ఈ బుద్ధ మార్గం. మానవ జీవనాన్ని ఆనందమయంగా, ఆదర్శవంతంగా మలచడమే మా ప్రయత్నం”
“ఇప్పుడు చెప్పండి? మీరంతా ఎవరు? ఏం
కోరుకుంటున్నారు?” సూటిగా అడిగినాడు పోటిసుడు.
చిలుకవాడలో..
“సుందరీ! నీ పేరు చంద్రముఖి కదా!” కన్నార్పకుండా చూస్తూ అన్నాడు వామదేవుడు.
“అందగాడా! నీకు నచ్చిన పేరుతో పిలుచుకో. నీవు ఎట్లా పిలిచినా పలుకుతా!” విరిసీ విరియని నవ్వు విసిరింది సుందరి.
“నిన్ను చూస్తుంటే క్షణానికో పేరు తన్నుకొస్తున్నది లోపల నుంచి. నీ అసలు పేరుతో పిలిస్తే ఆ ఆనందమే వేరు కదా!”
“అయితే, నాతో వస్తావా?”
“అందుకే కదా అడుగుతున్నా!”
కిలకిలా నవ్వింది ఆమె.
“నా పేరు సౌగంధికానందిని. గంధ, గంధిక, సౌగంధిక, ఆనందిని, నందిని, సౌగంధిని.. ఎట్లాగైనా పిలవచ్చు!” అంటూ తన ఇంటివైపు వెళ్లడానికి తిరిగింది.
వామదేవుడు తోలుబొమ్మలా ఆమె వెంటనే అటు తిరిగినాడు.
వాళ్లకు అడ్డుగోడలా నిలబడ్డాడు జయసేనుడు.
“ఒరేయ్ దేవా! నీ స్వేచ్ఛను హరించే ఉద్దేశం, ఆనందాన్ని అడ్డుకునే ఆలోచన నాకు లేవు కానీ, వాస్తవం గుర్తుచేస్తున్నాను. దయచేసి విను! ఆపై నీవు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు”.. చేతులు జోడించి గంభీరంగా ఇట్లా అన్నాడు జయసేనుడు.
“నా తండ్రి, అతణ్ని వెతుక్కుంటూ వెళ్లిన పోటిసుని జాడ కనిపెట్టేందుకు మనం బయలుదేరినం. మరికొంచెం సేపటిలో మా నాయన గారు విడిది చేసే
ప్రదేశాన్ని చేరుకుంటాం. ఆయనను కలిస్తే మనకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రయత్నాన్ని అర్ధాంతరంగా ఆపేయడం కన్నా.. పని పూర్తి చేసుకున్న తర్వాత నీకు కావలసినన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు. ఆలోచించుకో! నీవు వస్తావా? ఉండిపోతావా?
ఏదో ఒక సమాధానం చెబితే నేను ఇక్కడి నుండి బయలుదేరుతాను”ఆలోచనలో పడ్డాడు వామదేవుడు.
వామదేవుని మెదడు మొద్దు బారిపోయింది. జయసేనుని ఆలోచన స్పష్టంగా ఉన్నది కానీ ఈ అందమైన సౌగంధినిని వదిలి వెళ్లడానికి మనసు ఎంతమాత్రం అంగీకరించడం లేదు.
“నీ మౌనం నాకు అర్థమైంది దేవా! నీవు ఈ జాణను వదిలి రాలేవు. సరే! నీ ఇష్టం! నేను బయలుదేరుతున్నాను. నీ వద్ద ఉన్న ద్రవ్యమంతా అయిపోయిన తర్వాత.. రావాలనుకుంటే పోదనకు రావచ్చు. ధనం చాలదంటే చెప్పు! నా వద్ద ఉన్నదాంట్లో నుంచి కూడా కొంత నీకు ఇస్తాను” అంటూ తన నడుముకు ఉన్న మూటను విప్పబోయినాడు జయ.
“అక్కరలేదు జయా!” జయసేనుని ప్రయత్నాన్ని అడ్డుకుంటూ అన్నాడు వామదేవుడు.
“నేను ఇక్కడనే ఉండిపోవాలని అనుకోవడం లేదు. అలాగే, ఈ క్షణం సౌగంధినిని వదిలి రాలేను. నీవు వెళ్లు! నేను రేపు ఉదయమే మల్లసు పర్వతానికి చేరుకుంటాను. అక్కడ కలుసుకోలేకపోతే పోదన నగరానికైనా వస్తాను” చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పకనే చెప్పినాడు.
“నీ ఇష్టం! ఇప్పటికే చాలా ఆలస్యమైంది..” అంటూ ఒక్క ఉదుటున గుర్రాన్ని ఎక్కినాడు జయసేనుడు.
“మీరు ఇక్కడి నుంచి వెళ్లలేరు!” అడ్డుకున్నది సౌగంధికానందిని.
“ఏం?” పరిహాసంగా అన్నాడు జయసేనుడు.
“ఎవరైనా చిలుకవాడలోకి రావడానికే స్వతంత్రులు. వెళ్లడం వాళ్ల చేతుల్లో ఉండదు. వచ్చిన వాళ్లు కనీసం ఒక్క రాత్రి అయినా ఇక్కడ గడిపి, పగలు రెండు
జాములలోపు ప్రయాణం చేయవలసిందే!” సౌగంధిక వివరణ.
“అయితే ఇప్పుడు ఏమంటావు? నన్ను కూడా మా దేవాతోపాటు మీ ఇంటికి తోడుకొని పోతావా??” జయ వెటకారం.
“కాదు! నేను ముందే చెప్పినాను. పనులు చెడగొట్టే దాన్ని కానని, మీరేదో అత్యవసరమైన పని మీద వెళుతున్నారని అర్థమయింది. మీరు ఒక్కరు వెళ్లినా, మీ మిత్రుణ్ని మీతో తోలుకొని పోయినా నాకు బెంగ లేదు. కానీ, అర్ధ యోజనం దూరం వరకు మా వాళ్లు మీకు అడుగడుగునా అడ్డు తగులుతుంటారు. వాళ్లను తప్పించుకొని వెళ్లాలన్నా ఇక్కడనే తెల్లారిపోతుంది” అన్నది ఆమె.
“మరి ఏది దారి?” తనలో తాను అనుకుంటున్నట్లు పైకే అనేసినాడు జయసేనుడు.
“నేనే!”
మిత్రులిద్దరూ ఆశ్చర్యంగా ఆమె వంక చూసినారు.
“అవును! నేను మాత్రమే మిమ్ములను సురక్షితంగా చిలుకవాడ దాటించగలను!” అంటూ తన పథకం వివరించింది..
“ఇక్కడ ఒక కాంతకు అంకితమైన పురుషుణ్ని ఇంకొకరు ఆశించరు. మీ ఇద్దరినీ నేను వశపరచుకొని తీసుకొని పోతున్నట్లు, మీతో మాట్లాడుతూ ఊరి అవతలివైపు పొలిమేరకు చేరుస్తాను. అక్కడ గుర్రాలను ఎక్కి మీరు వేగంగా వెళ్లిపోవచ్చు!”
మనఃపూర్వకంగా ఆ అతివకు నమస్కరించినాడు జయ.
పునరాలోచనలో పడిపోయినాడు దేవ.
సౌగంధిక వాళ్లను నిరాటంకంగా గ్రామం అవతలివైపు దాకా చేర్చింది.
ఈ సమయంలో వామదేవుని మనసు కూడా మారింది. స్వసుఖం కంటే స్నేహ ధర్మం గొప్పదనిపించింది.
గుర్రాన్ని ఎక్కడానికి ముందు జయసేనుడు వంద కర్షాపణాల మూటను సౌగంధిక చేతుల్లో బలవంతంగా పెట్టినాడు.
“చెల్లీ! ముందు నిన్ను అపార్థం చేసుకున్నాను. ఏమైనా పరుషంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు! పనిచేయకుండా బహుమతి తీసుకోనని ఈ అన్నయ్య చిన్న కానుకను తిరస్కరించకు” అన్నాడు.
మొదటిసారిగా జీవితంలో తనను ‘చెల్లీ’ అని
సంబోధించడం ఆమెను కన్నీటి కడవని చేసింది.
“అన్నా!”.. జయసేనుని భుజం మీద తలపెట్టి జలజలా కన్నీరు రాల్చింది.
మిత్రులిద్దరూ గుర్రాలని ఎక్కినారు.
ఆమె కన్నీరు ఇంకా ఉపశమించ లేదు.
“ఏయ్! సౌగంధీ! బాధపడకు! రేపు రాత్రికి నేను వస్తాను. మీ అన్నను కూడా తెస్తాను. మంచి భోజనం ఏర్పాటు చెయ్!” నవ్వుతూ అన్నాడు వామదేవుడు.
ఆమె ఇంకా జయసేనుని ప్రేమలో నుంచి బయటపడలేదు కానీ, వాళ్ల గుర్రాలు ముందు కదిలినాయి.
అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు.
‘వీళ్లు.. పోదన నగరపు యువకులా? అయితే కుసుమ శ్రేష్టి వీళ్లకు ఏమవుతాడు?..’
“అన్నా! కుసుమ శ్రేష్ఠి గారి గురించి ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలి..” అని గట్టిగా అరిచింది సౌగంధిక.
అప్పటికే వాళ్లు ఆమె పిలుపు తాకనంత దూరం వెళ్లిపోయినారు.
సరిగ్గా అదే సమయానికి.. ఈసాణుడు కుసుమ శ్రేష్ఠిని తోడుకొని మల్లసుపర్వతం వద్దకు చేరుకున్నాడు.
(సశేషం)
“నా తండ్రి, అతణ్ని వెతుక్కుంటూ
వెళ్లిన పోటిసుని జాడ కనిపెట్టేందుకు మనం బయలుదేరినం. మరికొంచెం సేపటిలో మా నాయన గారు
విడిది చేసే ప్రదేశాన్ని చేరుకుంటాం. ఆయనను కలిస్తే మనకు చాలా
ప్రశ్నలకు సమాధానాలు
దొరుకుతాయి. ప్రయత్నాన్ని
అర్ధాంతరంగా ఆపేయడం కన్నా..
పని పూర్తి చేసుకున్న తర్వాత నీకు
కావలసినన్ని రోజులు ఇక్కడ
ఉండవచ్చు. ఆలోచించుకో!
నీవు వస్తావా? ఉండిపోతావా?
ఏదో ఒక సమాధానం చెబితే నేను ఇక్కడి నుండి బయలుదేరుతాను”
దోరవేటి
89788 71961