చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : కాకతి.. అటు అయ్యనవోలు వెళ్లలేదు. ఇక్కడ రేణుక ఇంటికీ చేరలేదు. ఆమెకోసం వెతకసాగాడు జాయపుడు. కానీ, ఆమె వార్త తెలియరాలేదు. కాకతీయ వేగులు, సైనికులు ఆమెకోసం వెతకని చోటులేదు. తిరగని ఊరులేదు. కాకతి కనిపించక పోవడంతో జాయపుడు దాదాపు పిచ్చివాడయ్యాడు. తిండితిప్పలు మాని.. మధుపాన మత్తుడయ్యాడు. అలా.. ఓ మహాయోధుడు జీవితమనే మహా యుద్ధరంగంలో తొలి ప్రవేశంలోనే ఓడిపోయి మూలన ముడుచుకుపోయాడు!!
మళ్లీ మహాయోధుడిలా జాయపుడు.. జాయప గజసాహిణీ! చమూపతి జాయపుడు!! కాకతీయ యుద్ధ సముద్రం!! లక్ష అక్షౌహిణీ సేనకు సమవుజ్జీ.. ఒకే ఒక్కడు!! కారణం కాకతి! అతనిలో కాకతి.. అతని వెంట కాకతి.. సర్వకాల సర్వావస్థలయందు అతని నిలువెల్లా కాకతి!! అతనిలో చురుకు, ఉత్సాహం, అత్యుత్తమ యుద్ధనైపుణ్యం, నాట్యకౌశలం ఆమె! అతణ్ని పూర్తిగా ఆవరించింది.
అప్పుడే కాకతీయసైన్యం యుద్ధభేరి మోగించింది.
గతంలో ఎరువ భీముడు, రాజనాయకుడు, జాయపసేనాని రెండేళ్లపాటు నిర్వహించిన ఉత్తర, ఈశాన్య రాజ్యాల దండయాత్రకు కొనసాగింపుగా.. ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగంగా కొలని రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు. ఎన్నో ఆలోచనలతో ఎంతో చర్చించి తీసుకున్న నిర్ణయాలను, ప్రణాళికలను ఎవరికోసమో వాయిదావేసే చక్రవర్తి కాదాయన.
యుద్ధం నిర్ణయించారు. అది ప్రారంభమై తీరాలి.
ప్రారంభమైంది. రెండు నెలలు కావస్తున్నది. కొలనిపురి సైన్యం చాలా గట్టి ప్రతిఘటన ఇస్తూ.. కాకతీయులకు కొరుకుడు పడటంలేదు. యుద్ధ తంత్రజ్ఞులంతా చింతాక్రాంతులయ్యారు. కాకతీయ యుద్ధశైలి కనిపించడం లేదు. ఏదో లోపం కనిపిస్తున్నది.
ఏదో చెయ్యాలి. ఎలా??
ఈ సమయంలో మల్యాల చౌండ చటుక్కున ఉచ్చరించిన పదం.. ‘జాయపుడు!’.
అందరూ ఉలిక్కిపడి చూశారు.
“ఈ సమయంలో ఉండవలసినవాడు.. యుద్ధగతిని మార్చగలిగినవాడు జాయపసేనాని మాత్రమే! గజసైన్యాన్ని అత్యద్భుతంగా యుద్ధసన్నద్ధం చేసి తను మూలనపడిపోయాడు. అతను లేచి పోరాడితేనే గెలుపు!”.
అందరూ చక్రవర్తి వంక చూశారు.
ఆయన తల దించుకున్నాడు.
“ప్చ్..” అన్నాడు నిస్పృహగా.
అటు యుద్ధం పరాజయ బాట పడుతున్నది. ఇటు ఎంతో ప్రయోజకుడై కాకతీయ సామ్రాజ్యాన్ని మరోస్థాయికి తీసుకు వెళ్తాడనుకున్న జాయపుడు కొరగాని వాడై జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. ఎలా? ఎలా అతణ్ని మళ్లీ మనిషిని చెయ్యడం?
అప్పుడొచ్చిందో ఆలోచన!!
జాయపునికి అత్యంత ఇష్టమైనది ఏది? నాట్యం! నాట్యంతోనే ఆ పిల్ల పరిచయమట. ఇదే బలహీనత మీద దెబ్బకొట్టాలి. మరునాడు బృందనాయకుడు కొండయ.. జాయపుణ్ని పురనివాసంలో కలిశాడు.
మధువు మత్తులో కళ్లుమూసుకుని ఓమూల పడి ఉన్నాడు జాయపుడు.
భైరవ ఆత్మాహుతి తర్వాత గ్రామంలో పరిస్థితిని వివరించాడు. కాకతి కనిపించకపోవడం అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది కానీ.. అందుకు కారణం జాయపుడేనని ఎవ్వరూ అనడం లేదని చెప్పాడు.
“కాకతి మాయమైన ఆ సిద్ధేశ్వరాలయం వద్దే మనం నాట్య ప్రదర్శన చెయ్యాలి. ఆమె తప్పకుండా తిరిగివస్తుంది దేవరా..” చెవిలో నమ్మబలుకుతున్నాడు కొండయ.
“అక్కడే అదృశ్యమైంది.. అక్కడే ప్రత్యక్షమౌతుంది!”.
అతని చెవివద్ద అదే మంత్రం. మళ్లీ మళ్లీ..
సంధ్యవేళకు జాయపుడు నమ్మాడు. కళ్లు తెరిచాడు. లేచి నిలబడ్డాడు. మధు చషకాన్ని విసిరికొట్టాడు.
“నాట్య ప్రదర్శనకు నేను సిద్ధం!”.
మరునాడే నాట్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. సిద్ధేశ్వరాలయం వద్ద తాండవ నృత్తానికి సిద్ధమయ్యాడు జాయపుడు. పక్కన ఉమగా కాకతివచ్చి నాట్యం చెయ్యాలి. వస్తుంది. కాకతి ఇక్కడే అదృశ్యమయ్యింది. ఇక్కడే ప్రత్యక్షం అవుతుంది! తప్పక అవుతుంది!!
అలౌకిక ధ్యానసమాధిలో ఉన్నాడు జాయపుడు. చుట్టూ జనం లేరు. ఉన్నది ఆ దేవదేవుడు సిద్ధేశ్వరుడు.
ఆయనే నాట్యానికి ఉమాదేవిగా కాకతిని ముస్తాబుచేసి పంపిస్తాడు!!
ఆహార్యం ధరించి గజ్జెలు కాళ్లకు కట్టుకుంటూ.. ఒక్కసారి గగుర్పాటుకు గురయ్యాడు జాయపుడు. శరీరమంతా కంపించింది. అతను ఎప్పుడు తాండవ నృత్తానికి సిద్ధమైనా ఇదే గగుర్పాటు. శారీరక కంపన వస్తుంది.
వస్తుంది.. తప్పక వస్తుంది! కాకతి వస్తుంది!! నమ్మకం ఘడియ ఘడియకు పెరుగుతున్నది.
నట్టువాంగం తాళాలు చేతికి తీసుకున్నాడు కొండయ. మృదంగాలు ఉచ్ఛస్వరంతో మారుమోగుతున్నాయి.
గజ్జెలు ఘల్లుమనగానే జాయపునిలో ఉద్వేగపు మూర్చనలు.. కన్నులు అరమోడ్పులవుతూ శరీరం మొత్తం ఓ లయతో నృత్తం ఆవిష్కృతమవుతూ భువన భవనాన్ని కదిలిస్తున్నది..
జాయపుడు శివరూపమెత్తాడు. కుడిచేతిలో సృష్టిశక్తులకు ప్రతీకగా డమరుకం.. ఎడమచేతిలో దుష్టశక్తుల పీచమడచేందుకు అగ్నిజ్వాలలు.. మూడో చేత అభయముద్ర, నాలుగో చేత విజయాన్ని చూపుతూ పతాక హస్తం.. నృత్తం తొక్కుతూ పూర్తి శివరూపమై పక్కకు చూశాడు. పార్వతి కోసం!
అక్కడే.. పక్కనే ఉంది. ఎప్పుడు వచ్చిందో వచ్చేసింది. ఈ శివుని కోసం.. పార్వతి!!
కాదు కాదు.. సాక్షాత్తూ కాకతి!!
పూర్తి పార్వతీదేవి ఆహార్యంతో పక్కగా నిలబడిన కాకతి! తనలో కలగలిసిన అర్ధ శరీరం.. నిజమైన అర్ధాంగి!!
ఇద్దరూ తేరిపార చూసుకున్నారు ఒకరినొకరు.. ఒక్కలిప్త కాలం. మరులిప్తలో కాలు కదిపారు లయబద్ధంగా..
క్రీగంటచూస్తూ వయ్యారంగా స్థానకం తీసుకుంది.
ఇద్దరూ మృదంగధ్వనితో కదిలి కలిసి అందెలు కదిపారు జతగా.. జంటగా! పార్వతిగా లాస్యతాండవం సౌమ్యంగా మొదలెట్టి అలవోకగా మరింత ప్రస్ఫుటంగా నర్తిస్తున్నది. నికుంచిత, కుంచిత, అకుంచిత, పార్శ్వ కుంచిత, అర్ధ కుంచిత.. ఎన్నో చోద్యపు లయహొయలు.. జాయపుణ్నే చూస్తూ.. చిద్విలాసపు మోముతో పోటాపోటీ నృత్తం..
ఇద్దరి నృత్తవిన్యాసం అద్భుతంగా ఉచ్ఛస్థాయికి పోతున్నది. జాయపుడు మరింత తన్మయత్వంతో రెచ్చిపోతూ ఊర్ధ్వ తాండవంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇద్దరూ పోటాపోటీగా ఉమాశంకరులై పతాక హస్తాలను పట్టి నిలిచారు.
సర్వదేవతలూ జాయపుడు, కాకతి తాండవం చూడటానికి తరలివచ్చి తలోవాద్యం అందుకున్నారు.
విష్ణువు మృదంగం అందుకుంటే.. బ్రహ్మ వేణువు తీసుకున్నాడు. సరస్వతి వీణ తంత్రులు కదిలించింది. ఇంద్రుడు నాదస్వరం ఊదుతుండగా నారదుడు తంబుర మీటుతున్నాడు.
కిడద్రేత్ ధే దడద్ర కిటతక
కిడద్రేత్ ధే దడద్ర కిటతక
గంటకుపైగా అపూర్వంగా అద్భుతంగా సాగిన ఆ జంట తాండవ లాస్యనృత్తాన్ని కొండయ తన నట్టువాంగంతో సమున్నత స్థాయికి తీసుకెళ్లి ముక్తాయింపులోకి తెచ్చాడు.
ఆ ఉద్వేగంలో జాయపుడు తటాలున ఒక కాలెత్తి తలపై పెట్టుకున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా ద్రుతం నుంచి విలంబితానికి లయ మార్చి ఉధృతంగా నృత్తమాడసాగాడు. అలా తలపై కాలు ఎత్తడం చెయ్యలేక కాకతి తాండవం ఆపింది. సిగ్గుగా తలవాల్చింది..
దేవతలు, ప్రేక్షకుల హర్షద్వానాలతో దేవాలయ ప్రాంగణం మారుమోగిపోయింది.
జటాజూటం విశృంఖలమై విప్పారింది. గంగ గలగలలాడింది. చంద్రరేఖ ఫక్కుమంది. ఆదిశేషుడు కదిలి నవ్వాడు. కాకతి తన ఓటమిని అంగీకరిస్తూ జాయపుని బుగ్గ పొడిచింది. అతని చేతిని తీసుకుని అలసటతో ఎగిరిపడుతున్న తన వక్షస్థలానికి సుతారంగా తగిలించింది. చుట్టూ ప్రదక్షిణలా తిరిగి అతనిలో ఐక్యమైంది.
కైలాసం కదిలి నవ్వినట్లు సింహనాదం చేశాడు జాయపుడు సంతోషంతో.
ఇన్నాళ్లుగా పడుతున్న బాధ, కుంగుబాటు పూర్తిగా తొలగిపోయాయి. కాకతి తనతోనే ఉంది. తనలోనే ఉంది. లేదని.. ఏటో వెళ్లిపోయిందని బాధపడటం తన భ్రమ! అంతే.. తరవాతేం జరిగిందో తెలియదు. ఏదో మగత.. సుషుప్తి.
ఇద్దరూ ఉమాశంకరులతో కలిసి కైలాసగిరిపై నృత్తమాడుతున్నారు.. ఆనంద తాండవ నృత్తం!
సమస్త హిమశిఖరాలు మార్మోగిపోయేలా పకపకా నవ్వుతున్నది కాకతి. గొంతెత్తి అరుస్తున్నది కాకతి.
“నేనెప్పటికీ నీతోనే.. ఎల్లప్పుడూ నీలోనే!”.
చక్రవర్తి గణపతిదేవుని ఆలోచన పనిచేసింది. నాట్యంతోనే మామూలు మనిషయ్యాడు జాయపుడు.
“ఎవరు ఎన్నిచెప్పినా జాయపునికి అత్యంత ముఖ్యమైంది నాట్యం. నాట్యమే ఆ ఆడపిల్ల. అతనిలో నాట్యాన్ని మేల్కొల్పండి. వాడే మామూలు మనిషవుతాడు. ఆ నాట్యబృందాన్ని పిలిపించండి!”.
అది గణపతిదేవుడు చేసిన సూచన.
జాయపుడు తిరిగి మామూలు మనిషై.. తన బాధకు ఓ ఫలశ్రుతి లభించినట్లు భావించసాగాడు.
కాకతి వచ్చింది. కలిసి నాట్యమాడింది. కాకతి అన్నది ఓ సజీవ వ్యక్తిస్థాయి దాటి.. జాయపునిలోని ఓ భావంగా లోలోపల చిన్నగుడి కట్టుకుని అందులో ప్రతిష్ఠితమైన దైవ ప్రతిమలా వెలిగిపోతూ.. శరీరమంతా వ్యాపించి ఘనీభవించింది.
సుషుప్తి తొలగిన జాయప తిరిగి మామూలు మనిషిలా కనిపిస్తున్నాడు.
చక్రవర్తి జాయపుణ్ని వదలలేదు. ప్రతిరోజూ ప్రతి కొలువు పూర్తయ్యాక వచ్చి మాట్లాడటం.. తర్వాత కొలువుకు జాయపుణ్ని పిలవడం.. అతను హాజరుకావడం. కొలువు అంశాల్లో కలగజేసుకోవడం. కొత్త ప్రధానులు, నియోగాధిపతులతో మాటామంతి.. వృద్ధవీరులు చౌండ, రుద్రసేనానుల గృహాలకెళ్లి పరామర్శలు..
కాస్త కుదురుకున్నాడు అనుకున్నాక.. విషయం ప్రస్తావించారు యుద్ధ తంత్రజ్ఞులు.
కొలనిపురం యుద్ధం ప్రారంభమయ్యిందని.. కానీ, చాలా నిస్పృహగా సాగుతున్నదని అతనికి యుద్ధపరిస్థితులు వివరించారు.
వెంటనే స్పందించాడు. రెండురోజులు సైన్యాధ్యక్షుడు ప్రసాదిత్యతోనూ, సమన్వయకర్తలతోనూ వేగుల ద్వారా చర్చించాడు. వెంటనే వెలనాడు, దివి, చాగి, నతవాడి, కొండపడమటి రాజులకు సైన్య సమాయత్తానికి వార్త పంపమన్నాడు. అంతా చాగిరాజ్య ప్రాంతంలో సైన్య సమ్మిళితం జరపాలని తను తక్షణమే బయల్దేరుతున్నట్లు వార్త పంపాడు.
కవచం ధరించి శిరస్ర్తాణం నెత్తిన దాల్చి.. పూర్తి యోధలా భాసిస్తూ కోట వెలుపలికి వచ్చాడు జాయపుడు. కాకతీయ యుద్ధభేరిలా భాసిస్తున్న జాయపుణ్ని చూసి ఉద్వేగంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు పెద్దలందరూ. దిక్కులు పిక్కటిల్లేలా ‘హరోం హరహర..’ సమరనాదాలతో కదనుతొక్కారు సైనికులు..
అతని దైవం గణపతిదేవ చక్రవర్తి, అక్క నారాంబ సజలనయనాలతో ఆశీర్వదించారు.
చౌండ కుటుంబం, రుద్రసేనాని కుటుంబం ఆత్మీయంగా దీవించారు. అనుమకొండ నగరం మనసారా జయజయ ధ్వానాలతో సాగనంపింది.
యుద్ధాశ్వం విక్రమ తన దేవుణ్ని ఆప్యాయంగా చుట్టుకుని ఆనందంగా సకిలించింది. ఒక్క ఉదుటన అధిరోహించాడు. మెరుపువేగంతో యుద్ధ శంఖారావంలా పరుగుపెడుతున్నది విక్రమ.
మళ్లీ మహాయోధుడిలా జాయపుడు.. జాయప గజసాహిణీ! చమూపతి జాయపుడు!!
కాకతీయ యుద్ధ సముద్రం!! లక్ష అక్షౌహిణీ సేనకు సమవుజ్జీ.. ఒకే ఒక్కడు!!
కారణం కాకతి! అతనిలో కాకతి..
అతని వెంట కాకతి.. సర్వకాల సర్వావస్థలయందు అతని నిలువెల్లా కాకతి!!
అతనిలో చురుకు, ఉత్సాహం, అత్యుత్తమ యుద్ధనైపుణ్యం, నాట్యకౌశలం ఆమె! అతణ్ని పూర్తిగా ఆవరించింది.
అశ్వంపై ఒడిలో కూర్చుని కబుర్లు చెబుతుంటే.. ఉల్లాసంగా ఉత్సాహంగా దూసుకుపోతున్నాడు జాయపుడు.. యుద్ధక్షేత్రం వైపు!
చాగిరాజ్య సరిహద్దుల అంచుల్లో సామంతరాజ్యాల సైన్యాన్ని ఒక్కచోట సమాయత్తపరచి ఆయా సైన్యాధ్యక్షులతో సమాలోచనచేసి.. సైనికతంత్రం నిర్మించాడు జాయపుడు.
“అటునుంచి నరుక్కురా..” బయల్దేరుతున్నప్పుడు చక్రవర్తి చేసిన తారకమంత్రం.
గణపతిదేవుని వాక్యం జాయపునికి వేదవాక్యం. ఎందుకు అటునుండి నరుక్కు రమ్మన్నాడు??
ఏదో ఉంది. పటాలం నడక పొడవునా అదే అతని మనసులో తిరుగాడుతున్నది. అర్థమైంది. సైన్యాధ్యక్షులకు అనుజ్ఞ ఇచ్చాడు జాయపుడు.
“ప్రస్తుత యుద్ధస్కంధావారానికి పోవద్దు. ముందుకు సాగిపోండి. మనం కొలనిపురిపై దాడి చేయడంలేదు. అటునుండి నరుక్కొద్దాం!”.
సైన్యం కొలనిపురికి చేరకుండా మునుముందుకు వెళ్లడం.. కొలనిపురి రాజ్యవర్గాలకు, అక్కడున్న కాకతీయ సైన్యవర్గాలను కూడా విస్మయపరచింది.
గతం నుంచి గణపతిదేవునికి నిడదప్రోలు పాలకుడు ఇందుశేఖర చోళునితో స్నేహం ఉంది. అక్కడ తన సైనికపటాలాన్ని నిలిపాడు జాయపుడు.
సహాయసహకారాలు అందించాడు ఇందుశేఖరుడు.
గత దండయాత్రలో కొన్ని చిన్నరాజ్యాలను జయించి సామంతరాజ్యాలుగా నిర్ణయించి వెళ్లారు. వారిలో కొందరు విధేయత చూపడంలేదు, కప్పాలు కట్టడంలేదు. అలాంటివారిలో ఉదయగిరి పాలకుడు పడిరాయడు ఒకడు. అతనిపై యుద్ధం ప్రకటించాడు జాయపుడు. సంధివిగ్రహి ధనభూతిని పంపాడు.. యుద్ధ షరతులు వినిపించి రమ్మని.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284