సుఖంగా బతికేస్తున్నా, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కావాల్సినంత డబ్బు ఉన్నా.. చివరికి అతిచిన్న రోగంతో చనిపోయిన వ్యక్తులను ఉద్దేశించిన సామెతే ఇది. ఇంట్లో కష్టపడకుండా తింటూ.. సుకుమారంగా పెరుగుతూ.. చిన్న ఇబ్బందులనూ ఎదుర్కోలేక నానా తిప్పలు పడేవారిని ఉదహరిస్తూ.. ఎదుటివారిని హెచ్చరించే సందర్భంలో ఈ సామెతను ప్రయోగిస్తారు. దీని అర్థం ఏమిటంటే.. ‘సుకుమారమైన శరీరం కలిగిన మనిషి, ఒంట్లో వేడిచేసి చనిపోయాడట’. ఎవరైనా కష్టపడకుండా నీడ పట్టున ఉంటే.. వారిని ‘సుకోశి/సుకాశి’ అంటారు. నాజూకైన ప్రాణం సెగకు విలవిల్లాడటం అన్నమాట. సె(క)గ లేసింది.. అంటే వేడి (చేసింది), చురుకు లేసిందని అర్థం. ‘చురుకు’ అంటే మూత్రంలో మంట. సుకుమారంగా తింటే వచ్చే ఇబ్బందులు ఎన్నో. అదే కష్టపడి పనిచేస్తే పెయ్య చెమట పడ్తది.. ఒళ్లు సల్లవడ్తది.. దినాం హుషారైతది. అందుకే ‘సుకోశి పానం సేగేసి సచ్చిద్ది.. ఏదైనా పనిజేస్కోని హాయిగ బతుకు బిడ్డా’ అంటుంటారు పెద్దలు.