Yuzvendra Chahal : భారత జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన ఐపీఎల్ కెరీర్(IPL Career) గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengalore) ఫ్రాంచైజీ తనను వదిలించుకున్న తీరు ఎంతో బాధించిందని అన్నాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఈ లెగ్‌స్పిన్నర్ ఏం చెప్పాడంటే..? ‘2022 మినీ వేలంలో నన్ను కచ్చితంగా కొంటామని ఆర్సీబీ యాజమాన్యం మాట ఇచ్చింది. అందుకు నేను ‘సరే’ అన్నాను.
కానీ, వేలం సమయానికి వాళ్ల నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. నన్ను వేలంలో కొనడం లేదనే విషయం ఎవరూ చెప్పలేదు. అప్పుడు చాలా బాధేసింది. పట్టలేనంత కోపం వచ్చింది. కనీసం ఎవరో ఒకరు నాతో మాట్లాడాల్సింది. ఆర్సీబీకి ఎనిమిదేళ్లలో 114 మ్యాచ్‌లు ఆడాను. ఇప్పటికీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinna Swami Stadium) నా ఫేవరెట్ గ్రౌండ్’ అని చాహల్ తెలిపాడు.
చాహల్ 2011లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఆరంగ్రేటం చేశాడు. ఈ లెగ్ స్పిన్నర్‌ను 2014లో ఆర్సీబీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి నుంచి 2021 వరకు వరకు అతను బెంగళూరు జట్టుకు ఆడాడు. విరాట్ కోహ్లీ సేన ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. 2021 సీజన్లో విఫమైన అతడిని ఆర్సీబీ వదులుకోవాలనుకుంది.
విరాట్ కోహ్లీతో చాహల్
అందుకుని రిటైన్ చేసుకోలేదు. దాంతో, 2022 వేలంలో చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది. పదహారో సీజన్లో చెలరేగిన ఈ లెగ్ స్పిన్నర్ 17 వికెట్లు పడగొట్టాడు. దాంతో, ఐపీఎల్లో అత్యధికంగా 187 వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో నెలకొల్పిన (183 వికెట్లు) రికార్డును అతను బద్ధలు కొట్టాడు.