న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. కెరీర్ చరమాంకంలో ఉండి 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న 38 ఏండ్ల సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. స్పెయిన్ నయా బుల్, 22 ఏండ్ల కుర్రాడు కార్లొస్ అల్కరాజ్తో మరో గ్రాండ్‌స్లామ్ పోరులో తలపడనున్నాడు. ఈ ఇద్దరూ యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ మ్యాచ్‌లలో తమ ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ జొకో.. 6-3, 7-5, 3-6, 6-4తో అమెరికా కుర్రాడు టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో 14వ సారి ఈ టోర్నీ సెమీస్ చేరాడు. మొత్తంగా అతడికి ఇది 53వ గ్రాండ్‌స్లామ్ సెమీస్. ఫ్రిట్జ్‌పై ఆడిన 11 మ్యాచ్‌లలోనూ సెర్బియా దిగ్గజానిదే సంపూర్ణ ఆధిపత్యం. ఇక ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఆడుతున్న రెండో సీడ్ అల్కరాజ్.. 6-4, 6-2, 6-4తో జిరి లెహెకా (చెక్)ను మట్టికరిపించాడు. 2023లో యూఎస్ ఓపెన్ గెలిచాక హార్డ్ కోర్ట్లలో స్పెయిన్ కుర్రాడికి ఇదే తొలి సెమీస్ కాగా ఓవరాల్‌గా తొమ్మిదవది. జొకో.. 5-3తో అల్కరాజ్పై ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో స్పెయిన్ సంచలనం అదిరిపోయే ఆటతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుండటంతో శుక్రవారం ఈ ఇద్దరి పోరు రసవత్తరంగా సాగనుంది.
బాంబ్రీ తొలిసారి క్వార్టర్స్‌కు..
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ.. న్యూజిలాండ్ సహచరుడు మైఖెల్ వీనస్‌తో కలిసి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బాంబ్రీ-వీనస్ ద్వయం 6-4, 6-4తో నాలుగో సీడ్ జర్మనీ జోడీ కెవిన్ క్రాయిట్జ్-టిమ్ పుటెజ్‌ను చిత్తుచేసింది. 33 ఏండ్ల బాంబ్రీ.. తన కెరీర్లో ఒక గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ చేరడం ఇదే ప్రథమం. గతంలో అతడు ఫ్రెంచ్ ఓపెన్, వింబూల్డన్‌లో మూడో రౌండ్‌కు చేరడమే ఇప్పటిదాకా అత్యుత్తమం. గంటా 23 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో బాంబ్రీ జోడీ వరుస సెట్లను నెగ్గి క్వార్టర్స్ చేరింది. ఇక జూనియర్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. 16 ఏండ్ల కోయంబత్తూరు అమ్మాయి మాయా రాజేశ్వరన్ రేవతి గర్ల్స్ రెండో రౌండ్లో ఓటమిపాలైంది. బాయ్స్ డబుల్స్‌లో హితేశ్-క్రిష్ జోడీ కూడా రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టింది.
సబలెంకా వర్సెస్ పెగులా
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంకా సెమీస్‌లో యూఎస్‌కే చెందిన నాలుగో సీడ్, గతేడాది రన్నరప్ జెస్సికా పెగులాతో తలపడనుంది. క్వార్టర్స్‌లో పెగులా.. 6-3, 6-3తో చెక్ అమ్మాయి బార్బొర క్రెజికోవాను ఓడించింది. ఇక సబలెంకా.. తన ప్రత్యర్థి వొండ్రుసోవా మోకాలి నొప్పితో వైదొలగడంతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధించింది. సబలెంకా, పెగులా తొలి సెమీస్ పోరు శుక్రవారం జరుగనుంది.