ఆదివారం 12 జూలై 2020
Sports - Apr 26, 2020 , 08:32:56

యువ ఆట‌గాళ్ల‌కు టీ20ల‌పైనే మ‌క్కువ‌: పార‌స్ మాంబ్రే

యువ ఆట‌గాళ్ల‌కు టీ20ల‌పైనే మ‌క్కువ‌:  పార‌స్ మాంబ్రే

ముంబై: క‌్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాల‌నుకుంటున్న యువ ఆట‌గాళ్లు ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌పైనే దృష్టి పెడుతున్నార‌ని జాతీయ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) బౌలింగ్ కోచ్ పార‌స్ మాంబ్రే అంటున్నాడు. మీడియం పేస‌ర్‌గా భార‌త జ‌ట్టుకు సేవ‌లందించిన మాంబ్రే.. గ‌త 15 ఏండ్లుగా అండ‌ర్‌-19, భార‌త్ ఏ జ‌ట్ల శిక్ష‌ణ విభాగంలో ప‌నిచేస్తున్నాడు. 2015-16కు ముందు వ‌ర‌కు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన మాంబ్రే.. రాహుల్ ద్ర‌విడ్ కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో.. బౌలింగ్ కోచ్‌గా మారాడు.

`యువ ఆట‌గాళ్ల‌కు కోచింగ్ ఇవ్వ‌డం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. వారి ఆర్థిక‌, విద్యా, కుటుంబ ప‌రిస్థితుల గురించి క్షుణ్ణంగా ప‌రిశీలించాకే శిక్ష‌ణ ప్రారంభిస్తాం. ఎవ‌రికి ఎలా చెబితే అర్థ‌మ‌వుతుందో వాళ్ల‌కు అలాగే వివ‌రిస్తాం. ఇప్ప‌టి త‌రానికి టీ20 క్రికెట్‌పై ఎక్కువ దృష్టి ఉంది. ఐపీఎల్ వంటి లీగ్‌ల‌తో కోట్ల‌కు కోట్ల డ‌బ్బు వ‌చ్చి ప‌డుతుండ‌టంతో వాళ్లు పొట్టి ఫార్మాట్‌నే ఇష్ట‌ప‌డుతున్నారు. రాహుల్ ద్ర‌విడ్ ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి శిక్ష‌ణ విధానంలో చాలా మార్పులు సంభ‌వించాయి. 2018లో అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన యువ భార‌త్‌.. ఇటీవ‌లి ఎడిష‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. పృథ్వీ షా, శుభ్‌మ‌న్ గిల్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రిష‌భ్ పంత్ వంటి ఎంద‌రో ఆట‌గాళ్లు ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చారు. వీరంతా కెరీర్‌ను స‌రిగ్గా ప్లాన్ చేసుకుంటే సుదీర్ఘ కాలంపాటు దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే చాన్స్ ఉంది` అని మాంబ్రే అన్నాడు. 


logo