భువనేశ్వర్: ఆసియా గేమ్స్ అర్హత టోర్నీ అయిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో తెలుగు యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతి పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల ఫైనల్ రేసును 11.46 సెకన్లలో ముగించిన జ్యోతి టాప్‌లో నిలిచింది.
సర్బానీ నంద (11.59సె, ఒడిశా), హిమశ్రీరాయ్ (11.71సె, హర్యానా) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడ్డ తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గందె(11.79సె) నాలుగో స్థానంతో తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. మహిళల 400మీటర్ల ఫైనల్లో అంజలిదేవి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం సొంతం చేసుకుంది. మహిళల 35కి.మీల రేస్ వాక్‌లో మంజురాణి పసిడి దక్కించుకుంది.