భోపాల్ : టోక్యో వేదికగా నవంబర్‌లో జరిగే ప్రతిష్టాత్మక డెఫ్ ఒలింపిక్స్‌కు తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ అర్హత సాధించాడు. ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో శ్రీకాంత్ 634.9, 631.9 పాయింట్లతో ఆకట్టుకుని బెర్తు సొంతం చేసుకున్నాడు. సరిగ్గా మూడేండ్ల క్రితం బ్రెజిల్లో జరిగిన డెఫ్ ఒలింపిక్స్‌లో ఈ బధిర షూటర్ రెండు స్వర్ణాలు సహా ప్రపంచ రికార్డు స్కోరుతో ఆకట్టుకున్నాడు.
వినికిడి సమస్య ఎదుర్కొంటున్న శ్రీకాంత్.. సాధారణ షూటర్లకు ఏమాత్రం తీసిపోకుండా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టాడు. శ్రీకాంత్ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నగదు ప్రోత్సాహం అందించింది.