అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న యువ షూటర్ ఇషా సింగ్.. జాతీయ షూటింగ్ ట్రయల్స్‌లో అదరగొట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల కోసం సోమవారం దేశ రాజధానిలో నిర్వహించిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈ హైదరాబాదీ అగ్రస్థానంలో నిలిచింది. ఒలింపియన్లు మను బాకర్, రాహి సర్ణోబత్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గని ఇషా 589 పాయింట్లతో టాప్ లేపింది. ఈ ప్రదర్శనతో ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించడం పక్కా అంటున్న ఇషా సింగ్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్, రాహి సర్ణోబత్ వంటి సీనియర్ షూటర్లతో పోటీ పడి అగ్రస్థానంలో నిలువడం ఆనందంగా ఉంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగా. తోటి షూటర్ల గురించి ఎక్కువ ఆలోచించలేదు. నా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలనే ఉద్దేశంతో పోటీల్లో పాల్గొన్నా. అభిజ్ఞ గట్టి పోటీనిచ్చింది. మొదట 30 షార్ట్స్‌లో మెరుగైన ప్రదర్శన చేశా.. ఆ తర్వాత 30 షార్ట్స్ ర్యాపిడ్ ఫైర్‌లో ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా.. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా లక్ష్యంపైనే దృష్టిపెట్టా.
ట్రయల్స్ ఆధారంగానే ఈ ఏడాది ఆఖర్లో చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ మెగాటోర్నీ ఎంపికకు వచ్చే నెల 15 డెడ్‌లైన్ కాగా.. ఈ నెలాఖరు వరకు భారత షూటింగ్ బృందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ట్రయల్స్ టాప్‌లో నిలువడంతో ఆసియా క్రీడలకు ఎంపికవడం లాంచనమే. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడకతప్పదు.
నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా.. మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఆసియా క్రీడల్లో తీవ్ర పోటీ ఉంటుంది. దేశానికి వీలైనన్ని ఎక్కువ మెడల్స్ అందించడమే నా లక్ష్యం. ఏషియన్ గేమ్స్, షూటింగ్ వరల్డ్‌కప్‌ల్లో సత్తాచాటి.. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకుంటున్నా.
ప్రస్తుతం గచ్చిబౌలి షూటింగ్ అకాడమీలో కోచ్ వేద్ ప్రకాశ్ సార్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నా. రోజుకు 8 నుంచి 10 గంటల పాటు షూటింగ్ రేంజ్లో కష్టపడుతున్నా. తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతోనే ఈ స్థాయికి చేరుకున్నా.
షూటింగ్ ఒక్కటే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ప్లేయర్లకు సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. ఈ ఉత్సాహంతో వారు మరింత మెరుగ్గా రాణిస్తున్నారు. ప్రభుత్వ సహకారం వల్లే నిలకడగా రాణించగలుగుతున్నా.