ఘజియాబాద్: ఖేలోఇండియా ర్యాంకింగ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో యువ లిఫ్టర్ అకాంక్ష వ్యవహారె మూడు కొత్త జాతీయ రికార్డులతో అదరగొట్టింది. మహిళల 40 కిలోల విభాగంలో బరిలోకి దిగిన అకాంక్ష..స్నాచ్‌లో 60కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 71కిలోలు, మొత్తంగా 131 కిలోలు ఎత్తి వారెవ్వా అనిపించింది. ఈ క్రమంలో మూడు జాతీయ రికార్డులను ఈ మహారాష్ట్ర యువ లిఫ్టర్ తిరుగరాసింది.
కేంద్ర క్రీడాశాఖ తీసుకొచ్చిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీవోపీఎస్)కింద శిక్షణ తీసుకుంటున్న అకాంక్ష.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను మాట్లాడుతూ ‘చాలా మంది అమ్మాయిలకు లీగ్‌లు చాలా కీలకం. దేశంలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్లేయర్లతో పోటీపడటం ద్వారా మంచి అనుభవం వస్తుంది. ఇలాంటి టోర్నీలు భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతాయి’ అని చెప్పింది.