పర్వతగిరి : భారత యువ పారా అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు సత్తాచాటింది. ఇటీవలే పారా అథ్లెటిక్స్ ప్రపంచటోర్నీలో రజతంతో మెరిసిన దీప్తి తాజాగా ఆస్ట్రేలియాలోనూ అదరగొట్టింది. ఆదివారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన వర్టస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల 400మీటర్ల రేసును 55.92సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన ఈ తెలంగాణ అమ్మాయి.. పోడియంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.
అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన దీప్తిని ఆమె తల్లిదండ్రులు ధనలక్ష్మి, యాదగిరితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని దయాకర్రావు ఆకాంక్షించారు. కాకతీయ గడ్డపై దీప్తి ప్రతిష్ట చిరస్థాయిలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.